(గత సంచిక తరువాయి)
6. “ఏమిటిరా మీ గొప్పతనం?”
1975 ప్రాంతంలో నేను ప.గో.జిల్లా తిరుమలంపాలెం గ్రామంలో అప్పర్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టారుగా పనిచేస్తుండేవాడిని. నా వద్ద ఒక పనిమనిషి ఉండేది; ఆమెకు భర్త, నలుగురు (4) పిల్లలు. ఊరు చివర చెరువుగట్టున ఒక గుడిసెలో కాపురం. కటుంబ పోషణ కోసం బుట్టలు తట్టలు అల్లేది, పందుల్ని మేపేది, పాచిపని చేసేది, ఇంకా ఎన్నో.
ఒకనాడు ఆమె భర్త నా వద్దకు వచ్చి ‘నా భార్య తాగి రోజూ నన్ను కొడుతోంది. మీరు దానికి భయం చెప్పండి’ అని అభ్యర్థించాడు. నేను అవుననలేదు, కాదనలేదు.
అది అలా ఉండగా నేను ఒకసారి జిల్లెళ్ళమూడి వచ్చాను. అమ్మ సన్నిధిలో చర్చ జరుగుతోంది భార్యా భర్తల ధర్మాలు, పాతివ్రత్యం, ఎన్నో. అన్నపూర్ణాలయంలో వడ్డన, హైమాలయ దగ్గర నామం…. అలా నా దినచర్యలో నేను నిమగ్నమై ఉన్నాను. అమ్మ దర్శనార్ధం వెళ్ళి వస్తూంటే కొన్ని మాటలు నా చెవిని పడ్డాయ్. ముఖ్యంగా మాన్యసో॥ శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావుగారి పలుకులు – ‘అమ్మా! స్త్రీ పురుషులకి Independence కాదు, Interdependence కావాలి’- అని.
నేను జిల్లెళ్ళమూడిలో ఉంటే రాత్రిళ్ళు అమ్మ మంచం ప్రక్కనే చాపవేసుకుని పడుకోవటం అలవాటు. ఒకసారి అలా జరగలేదు. మర్నాడు అమ్మ “నాన్నా! అమ్మ దగ్గర పడుకోవటం మానేశావా?” అన్నది. అపుడు నా వయస్సు 24 ఏళ్ళు. కానీ అమ్మ దృష్టిలో రెండేళ్ళే. చాపమీద పడుకున్నా తనగుండెలకు హత్తుకుని పడుకున్న పసిబిడ్డనే. ప్రేమైక రసామృతమూర్తి అమ్మ. మనస్సు ఎక్కడికో పోయింది.
సరే. మళ్ళీ సంఘటనలోకి వద్దాం. నాటి రాత్రి అమ్మ వచ్చి మంచం మీద కూర్చున్నది. పాదుకలను తీసి కళ్ళకి అద్దుకుని లోపల పెట్టాను. అవకాశం దొరికిందికదా అని నా అనుభవాన్ని అమ్మ ముందు పెట్టాను. ‘మా పనిమనిషి రోజూ తాగి భర్తని కొడుతోంది’ – అంటూ పకపకా నవ్వాను. అపుడు అమ్మ (గంభీరంగా నిర్దుష్టంగా వర్ణించటానికి వివరించటానికి మాటలు రావటం లేదు నాకు అది ఆవేశమూ కాదు, ఆవేదనా కాదు; ఒక అంధవిశ్వాసాన్ని రూపుమాపటం, ఒక దురాచారాన్ని తూర్పారబట్టటం, ఒక వాస్తవాన్ని యధార్థాన్ని ఎలుగెత్తి చాటడం; ఇంకా ఏమో! ఏమో!!) “అంటే నీకు నవ్వు వస్తోంది. మీరు (పురుషులు) కొడితే వాళ్ళు (స్త్రీలు) పడాలి; కానీ అక్కడ భిన్నంగా ఉంది అని. ఏమిటిరా మీ గొప్పతనం? వాళ్ళు (స్త్రీలు) మీతో సమానంగా ఉద్యోగాలు చేయటం లేదా? – పిల్లల్ని ఇంటిని చక్కబెట్టుకుని. ఇద్దరూ కష్టపడితేకానీ ఇల్లు గడవదు కదా! అయినా అది (పురుషాధిక్యత – Masculine) మీ రక్తంలో జీర్ణమై పోయింది” అని అన్నది.
అమ్మ విసిరిన ఆ గదాయుధ ప్రహారానికి నా తల దిమ్మెత్తిపోయింది. మారు మాటాడలేదు. నిజానికి అది ఒక సంస్కారాస్త్రం. అమ్మ నాతో అలా అనటానికి కారణం నాలోని లోపమే. ‘న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి’ – స్త్రీకి స్వాతంత్య్రం అనవసరం) స్త్రీ శారీరకంగా మానసికంగా బలహీనురాలు, మారీచుడు సీతాదేవిని మోసం చేయగలిగాడు కానీ శ్రీరామునికాదు, క్రైస్తవమతం ప్రకారము Satan అనే ఒక దుష్టశక్తి EVE అనే స్త్రీని మోసగించిందికానీ Adam అనే పురుషుని కాదు – అని కొన్ని దురభిప్రాయాలుండేవి. ఇలాంటివన్నీ పరిసరాలు, సమాజం నూరిపోసినవే.
వాస్తవం ఏమంటే – అమ్మ పాతివ్రత్య మార్గాన్నే నడిచింది అక్షరాలా. కానీ అనుక్షణం అడుగడుగునా స్త్రీ పురుష సమానత్వాన్నే చాటింది. లింగ వివక్ష (Gender bias) ను రూపుమాపి, స్త్రీ సాధికారత (Woman Empowerment) ను స్త్రీ పురుష సమానత్వాన్ని అమ్మ ఎలుగెత్తి చాటిన వివరణలు సంఘటనలు కోకొల్లలు. దానిని సమగ్రంగా వివరించాలంటే అది ఒక పెద్ద వ్యాసం అవుతుంది. “భార్యకు భర్తదేవుడు, భర్తకు భార్యదేవత” అనే ఒక్క అమ్మ వాక్యం ద్వారా స్పష్టంగా చెప్పొచ్చు. అయినా రెండు ఉదాహరణలు: పాలకొల్లు ఆడిటర్ శ్రీకాశీనాధుని రాజగోపాల కృష్ణమూర్తిగారిని అమ్మ ముద్దుగా ‘గోపి’ అని పిలుచుకుంటుంది. వారి రెండవ కుమార్తె చి.ల.సౌ. శారద C.A. చదువుతున్న రోజులలో జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మతో ‘అమ్మా! C.A. చదవటం కష్టంగా ఉంది’ అని అంటే అమ్మ “చదవాలమ్మా. ఆడపిల్లలు కూడా Doctor, Engineer, Auditor లు కావాలి కదా!” అన్నది. శ్రీ కొమరవోలు గోపాలరావుగారి అమ్మాయి చి.ల.సౌ. శేషప్రభావతిని వేదమంత్రాలు – క్రియ నేర్చుకుని హైమాలయంలో ఏకాదశ రుద్రాభిషేకాలు చేయడానికి ప్రోత్సహించింది, చేయించింది.
అనాదిగా స్త్రీ నిరాదరణకి నిర్లక్ష్యానికి గురి అవుతోంది; అనుమానాలకి అవమానాలకి బలి అవుతున్నది ప్రపంచవ్యాప్తంగా – అనే వాస్తవాన్ని ‘A Room of her one’s own’ అనే గ్రంథంలో సుప్రసిద్ధ రచయిత్రి Virginia Woolf వివరించారు.
అలా సమాజంలో పాతుకుపోయిన దురభిప్రాయాలపై గొడ్డలి పెట్టు వేసిన అమ్మ సంఘ సంస్కర్త; సముద్ధరణి.
7. “ఎవరినీ ఇంతగా అలవాటు చేసుకోకూడు”
ఇది అమ్మ ప్రయోగించే ఒక సమ్మోహనాస్త్రం. ఇది చక్ర గద ఖడ్గ త్రిశూల పాశ అంకుశాలకు భిన్నంగా ఉంటుంది. తన అలౌకిక మాతృత్వమమకార పారవశ్యంతో బిడ్డల్ని సమ్మోహితుల్ని చేసి సన్మార్గ గాముల్ని చేస్తుంది.
మా అమ్మకి నేను టీచర్ని. వేసవి సెలవులకి వచ్చి జిల్లెళ్ళమూడిలో ఉన్నాను. ఒకనాడు నరసాపురం నుంచి మా నాన్నగారు నాకు ఉత్తరం వ్రాశారు పక్షవాతం వచ్చి ఆస్పత్రిలో ఉన్నది – అని. ఆ ఉత్తరం నా జేబులోనే ఉన్నది. గుండె దడదడలాడుతున్నది. అమ్మకి ఈ సంగతి నివేదించాలని అమ్మవద్దకు వెడుతున్నాను, వస్తున్నాను. నోటమాట రావటంలేదు. అమ్మకి తెలియనిదేమున్నది?
“నాన్నా ! నరసాపురం వెడతావా?” అని అడిగింది. ‘అవునమ్మా. ఇదీ విషయం’ అన్నాను. “ఎప్పుడు బయలుదేరుతావు?” అని అడిగింది. నా అనుభవాన్ని పురస్కరించుకొని ‘రేపు ఉదయం’ అన్నాను. “సరే” అన్నది. అలా అనటంలో నా ఉద్దేశమేమంటే – పరిస్థితి విషమిస్తే “అలా కాదు, నాన్నా! వెంటనే బయలుదేరు అని అమ్మ అంటుంది. అమ్మ ‘సరే’ అన్నది కాబట్టి మా అమ్మకి ప్రాణాపాయంలేదు అని అర్థమైంది.
అలవాటు చొప్పున రాత్రి అమ్మ మంచం దగ్గరే పడుకున్నా. తెల్లవారింది. ప్రయాణానికి హడావిడిగా సిద్ధమౌతున్నా. మా అమ్మకోసం అందరమ్మ ప్రసాదం తను కట్టుకునే చీర, జాకెట్, కుంకుమ పొట్టాలు, పువ్వులు – పళ్ళు, పటిక బెల్లం – ఎన్నో ఇచ్చింది. వాటిని భద్రపరచుకొని వచ్చాను. వసుంధర అక్కయ్య ఇడ్లీ పెట్టి, కాఫీ, ఇచ్చింది. అమ్మ చెంతకు చేరి ‘అమ్మా! బొట్టు పెట్టు. వెళ్ళివస్తా అన్నాను. అమ్మ నా వైపు చూడటం లేదు. ఎటో సుదూర సీమల్లోకి చూస్తోంది. నా ప్రయాణం ఎలా సాగుతుందోనని నాకు ఆందోళన..
అమ్మ పావన పాదపద్మాలు రెండు చేతులతో పట్టుకుని నమస్కరించి, నా నుదుటిని అమ్మ శ్రీచరణాలకు తాకించి రెండవసారి ‘అమ్మా! బొట్టుపెట్టు’ అన్నాను. నా పలుకులు అమ్మ చెవిని సోకలేదు, నా ఆందోళన అమ్మ హృదయాన్ని తాకలేదు.
అమ్మ నావైపు ఎందుకు చూడటం లేదో! ఆస్పత్రిలో మా అమ్మ పరిస్థితి. ఏమిటో!! మనస్సు పరిపరివిధాల పోతోంది. మూడవసారి ‘అమ్మా! బొట్టు పెట్టు’ అన్నాను. అమ్మనావైపు తిరిగింది. నా ముఖంలోకి చూస్తోంది. అమ్మ వదన మండలం కందిపోయి ఉంది, కళ్ళు నీటి కుండలను తలపిస్తున్నాను. అమాంతం నన్ను తన ఒడిలోకి లాక్కొని “ఎవరినీ ఇంత అలవాటు చేసుకోకూడదు” అన్నది. తనతో తను జలజలా కన్నీటి భాష్పాల్ని రాలుస్తూ.
తర్వాత నేను విజయవాడ వెళ్ళి రైలు మీద సాయంకాలానికి నరసాపురం చేరుకున్నాను. ఆసత్రిలో మా అమ్మకోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నది. అమ్మ మహాప్రసాదాన్ని ఇచ్చాను. ఆమె రక్షణ బాధ్యత అమ్మ వహించింది.
మళ్ళీ నా మహనీయస్మృతి వద్దకి వస్తున్నాను., “ఎవరినీ ఇంత అలవాటు చేసుకోకూడదు” అనుకుంటూ బెంగతో దిగులుతో తనను తాన సముదాయించుకోలేని స్థితిలో అమ్మ ఉన్నది. నా ప్రయాణం, మా అమ్మ అస్వస్థత గురించి ఆందోళన మినహా అమ్మను విడిచి వెడుతున్నాను అనే బెంగ, ఆర్ద్రత నాకేమాత్రమూ లేదు. అమ్మ ప్రేమకీ ఈ అల్పుని ప్రేమకీ పోలిక ఏమిటి?
అసలు ముక్క: “ఎవరినీ ఇంత అలవాటు చేసుకోకూడదు” అని అమ్మ అనటంలో ఈ సుబ్రహ్మణ్యం ప్రత్యేకత ఏమీలేదు. అమ్మ హృదయ మందిరంలో ఎవరిస్థానం వారిదే. ఆ సమయంలో సన్నివేశంలో ఆ నా స్థానంలో ఎవరున్నా అమ్మ అలాగే స్పందిస్తుంది. అమ్మ ప్రేమ నిర్మలము, అజరామరము, నిత్యము, సత్యము, సార్వత్రికము, ప్రతిఫలాపేక్ష రహితము, రాగ సహితము త్యాగభరితము. ‘ప్రేమ’ అనే పదంలో రెండు Syllables ఉన్నాయి. వాటిని మరొక విధంగా వ్రాయాలనుకుంటే ‘అమ్మ’ అని వ్రాయాల్సి ఉంటుంది.
కనుకనే ‘తచ్చుఖ సుఖిత్వం ప్రేమ’ అని ఆర్షవాణి ఎలుగెత్తి చాటింది.
– (సశేషం)