(గత సంచిక తరువాయి)
రాగద్వేషాసూయలను పారద్రోలే అనసూయ మన అమ్మ. అమ్మ చేసే శంఖ ధ్వానం అంటే అరిషడ్వర్గ వినాశన నామ సమర శంఖారావం; విశ్వకళ్యాణ మంగళ తూర్యారావం. నాకు అందినంత వరకు వివరిస్తాను.
8. “అభయం అంటే ఫోటో కాదుగా, నాన్నా!
నరసాపురం డాక్టర్ ఆచంట కేశవరావుగారు అమ్మ యెడల అచంచల భక్తి విశ్వాసాలు కలవారు. వారు శ్రీరామ నవమి నాడు జన్మించారు. కావున ఏటా శ్రీరామనవమి నాడు అమ్మను కళ్యాణ గుణాభిరామునిగా పూజించుకునే వారు.
వాత్సల్య యాత్రలో భాగంగా అమ్మ నరసాపురం డాక్టర్గా గారి ఇంటికి వెళ్ళింది. వారు అమ్మను తమ ఆస్పత్రికి ఆహ్వానించారు. అమ్మ (Stethoscope) ధరించి డాక్టర్ కుర్చీలో consultation room లో కూర్చున్నది. డాక్టరు గారు రోగి కూర్చునే స్టూలు మీద కూర్చుని “అమ్మా! నన్ను పరీక్ష చెయ్యి” అంటూ చేయి చాపారు. అమ్మ వారి చేయినందుకుని నాడి (pulse) ని పరీక్షిస్తూ “నిన్ను పరీక్ష చేయటమేముంది, నాన్నా! నేను రావటమే నీకు పరీక్ష” అన్నది. అందరూ కడుపుబ్బ నవ్వారు.
“నేను రావటమే నీకు పరీక్ష” అనే అమ్మ వాక్యానికి ఎన్ని రకాలుగానైనా అర్థం చెప్పుకోవచ్చు. నాకు తోచినది – ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రక్షసాం అన్నట్లు పరాత్పరి అమ్మ మన మనోమందిరంలోకి ప్రవేశించాలంటే మనలోని ఆసురీ సంపత్తి ముందుగా నశించాలి. కనుకనే అది పరీక్షా సమయం.
డాక్టర్ గారింట్లో అమ్మ మూడు రోజులున్నది. పిమ్మట గోదావరీ నది దాటి రాజోలు పుల్లేటికుర్రు మున్నగు పట్టణాలలో పర్యటించాలి. అందుకు అమ్మకు వీడ్కోలు చెబుతూ, కూతురిని అత్తవారింటికి పంపుతున్నట్లు – పసుపు, క సా చీరె పెట్టారు. కొంగు పట్టి అమ్మ అదే మమతానుబంధంతో స్వీకరించింది. అంతలో డాక్టర్గారు కెమెరా తీసికొని ‘అమ్మా! అభయహస్తంతో నీ ఫొటో కావాలమ్మా’ అంటూ అంతలోనే కన్నీటితో అమ్మ పాదాలను అభిషేకించారు. ఆప్యాయంగా వారిని అనునయిస్తూ అమ్మ ‘అభయం అంటే ఫోటో కాదుగా, నాన్నా!” అన్నది. అసలు మనిషికి భయం ఎందుకు? – జన్మ మృత్యు జరారోగములంటే భయం; పునరపి జననం పునరపి మరణం అంతులేని కథ అంటే భయం. ఆ భయాన్ని అమ్మ ఏనాడో పారద్రోలింది – “మీరంతా నాలో పుట్టి నాలో లయం అవుతారు. అందరికీ సుగతే” – అని ప్రకటించింది. అదే అభయం సకల జీవకోటికీ. అది అపూర్వం; పాంచజన్య శంఖారావం. చరిత్ర ఎరుగని విధాత శాసనం.
9. “నీ కడుపున పుట్టటమే అదృష్టం, నాన్నా!”
ఒక సోదరుడు తన పసిబిడ్డను ఎత్తుకుని అమ్మ దరిచేరి ఆ పాపను అమ్మకు అందించారు. ఆ పాప (premature delivery) నెల తక్కువ పిల్ల. అమ్మ ఆ బిడ్డను తన పొత్తిళ్ళలో పొదివి పట్టుకుని తన గుండెలకు హత్తుకుని ముద్దు పెట్టుకుని తిరిగి వారికి అప్పగించింది. ప్రక్కనే ఉన్న రామకృష్ణ అన్నయ్య ‘నెల తక్కువయినా వెల తక్కువ కాదు’ – అని అమ్మ సహజ దివ్యమాతృత్వ మాధుర్యాన్నీ కొనియాడాడు.
అంతలో ఆ తండ్రి “అమ్మా! మా పాపకి ఎడమ కన్ను మెల్ల; అదృష్టం అని అంటున్నారమ్మా” అన్నారు. వెంటనే అమ్మ “నీ కడుపున పుట్టటమే అదృష్టం, నాన్నా! అన్నది. మనం అప్రయత్నంగా ఆయా సందర్భాల్లో అదృష్టం; ‘దురదృష్టం’ అనే పదాల్ని వాడతాం అనుకోకుండా శుభం, అశుభం కలిగినప్పుడు.
అమ్మ దృష్టిలో అందరూ కారణ జన్ములే – అమృతస్య పుత్రాః. వాస్తవానికి ఆ బిడ్డకే కాదు మనందరికీ నిజమైన తల్లి అమ్మయే – అని గుర్తు పెట్టుకోవటం అదృష్టం. మనల్ని ఉద్ధరించేది అమ్మ – అనే ఎరుక లేకపోవటం దురదృష్టం. సర్వసృష్టికారిణి అమ్మ విశ్వనాటక రచనలో రంగస్థలంపై ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్ర నిచ్చింది; ఆ పాత్రకి న్యాయం చేయగలటం అదృష్టం – తత్త్వతః “అమ్మ కడుపున పుట్టటం అదృష్టం.
10. “నా దగ్గరకి రాని వాళ్ళు నా బిడ్డలు కాదా?”
శ్రీ మన్నవ బుచ్చిరాజు శర్మ (రాజు బావ) 1950 నుంచీ అమ్మ వద్దకు తరచు వస్తూ అమ్మకు అత్యంత సన్నిహితంగా మెలిగిన అదృష్టవంతులు. వారు అమ్మను కీర్తిస్తూ, తత్వాన్ని చాటుతూ, సహస్ర కోణాల అమ్మ అవతారపరమార్థాన్ని తేటతెల్లం చేస్తూ ‘అనుభవసారం’ పేరిట రచించిన పాటలు ‘రాజా పాటలు’ (Royal Songs) గా అమ్మచే ఆమోదించ బడ్డాయి.
వారు తొలుత (ILTD) కంపెనీలో సీజనల్ ఉద్యోగిగా పని చేశారు. ఉద్యోగం లేని కాలాన్ని సద్వినియోగం చేసుకున్నారు – అమ్మ ప్రత్యక్ష సన్నిధిలోనే ఉంటూ ఎన్నో అలౌకిక అనుభూతులు, దర్శనాలు పొందారు.
1957లో కంపెనీ వారు కొందరు తాత్కాలిక ఉద్యోగుల్ని స్థిరీకృతం (Permanent) చేయ సంకల్పించారు. రాజుబావ కంటే కొందరు Seniors ఉన్నారు. కాగా అమ్మ కరుణిస్తే అసంభవం సంభవం అవుతుందనే విశ్వాసంతోనూ, ఉద్యోగంలో స్థిరత్వం అంటే జీవితంలో స్థిరత్వం అనే భావంతోనూ, ముఖ్యంగా బంధుమిత్రుల బలవంతం మీద తన ఉద్యోగం permanent విషయం అమ్మకు విన్నవించుకున్నారు. అందుకు అమ్మ “నాన్నా ! రాజూ !! నువ్వు నా దగ్గరకు వస్తున్నావు కనుక నీ కోరిక తీర్చాలి కదా! నా దగ్గరకి రాని వాళ్ళు నా బిడ్డలు కాదా? ఆ బిడ్డ కొచ్చే అవకాశం తప్పించి నీకు ముందు ఇప్పించమంటావు. నువ్వు కావాలంటే అలాగే చేస్తాను. నన్ను ఏం చేయమంటావు? చెప్పు, నాన్నా!” అన్నది. రాజు బావగారికి తల దిమ్మెత్తి పోయింది. వారిలోని స్వార్థం, అపార్థం, అజ్ఞానం అన్నీ నశించాయి. కనుకనే ‘కోరికలు కోరేటి కోరికే లేనట్టి మనసుండునట్లుగా వరదోభవ’ అని చిత్తశుద్ధితో ప్రార్థించారు. సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, సర్వశక్తిమత్వం ఒక మూర్తిలో పోత పోసినట్లు దీపిస్తుంది అమ్మ. ఒక్కక్షణం ఆగి అమ్మ చిరునవ్వుతో రెండు సంవత్సరాలు ఆగు నాన్నా! అదే permanent అవుతుంది” అన్నది. అమ్మ అన్నట్లుగానే జరిగింది. అప్రమేయ స్వరూప అమ్మ. కానీ అమ్మ ప్రమేయం, సత్సంకల్పం మేరకే ఏదైనా సంభవిస్తుంది. కారణం – సంకల్ప రహితమైన సంకల్పం అమ్మది.
అమ్మ అవతార పరమధర్మం మాతృధర్మం: జిల్లెళ్ళమూడి వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకీ, నమస్కరించిన వారికీ నమస్కరించని వారికీ అందరికీ సుగతిని ప్రసాదించటం.
11. “రేపు మీ ఇంటికి వస్తున్నాను, నాన్నా!”
మా నాన్నగారు శ్రీ ఆకెళ్ల సూర్యప్రకాశం భాషాప్రవీణ; నరసాపురం Taylor High School లో ఉపాధ్యాయునిగా పని చేస్తుండేవారు. వారు సామగానంలో దిట్ట. వారి వేదనాదం విని అమ్మ ఎంతగానో ఆనందించేది. వారు నిత్యానుష్ఠానంలో భాగంగా పంచాయతనం (ఆదిత్యం అంబికం విష్ణుం గణనాథం మహేశ్వరం) సాలగ్రామార్చన చేసేవారు. వారు తనువు చాలించిన తర్వాత నేను కొనసాగిస్తున్నాను.
వాత్సల్య యాత్రలో భాగంగా అమ్మ నరసాపురం డా॥ ఆచంట కేశవరావు గారింటికి వచ్చింది. శ్రీ కె. రామకోటయ్యగారు, శ్రీ పోతరాజు నారాయణగారు, శ్రీ టేకుమళ్ళ రామారావుగారు ఇంకా ఎందరి ఇళ్ళకో వెళ్ళి వారినందరిని ఆనందపరిచింది.
అమ్మ దర్శనార్థం మా బంధువులు చాలా మంది మా ఇంటికి వచ్చారు; వారెవరూ జిల్లెళ్లమూడి వెళ్ళినవారు కాదు. సామూహిక దర్శనం చేసుకున్నారు; మరింత సన్నిహితంగా అమ్మ దర్శన స్పర్శనాదుల భాగ్యం కోరుకున్నారు. “నువ్వు ఎప్పుడూ జిల్లెళ్ళమూడి వెడుతూంటావు; అమ్మ! అమ్మ!! – అని అంటూంటావు. అమ్మను మనింటికీ ఆహ్వానించవచ్చు కదా!” అని మా బంధువులు నాపై ఒత్తిడి తెచ్చారు. ‘నా గురించి అమ్మను శ్రమపెట్టడం నాకు ఇష్టం లేదు’ అన్నాను.
ఆ మర్నాడు అమ్మతో సోదరీసోదరులందరం రెండు లాంచీలలో ఉల్లాసంగా అంతర్వేది వెళ్ళాం. అక్కడ సముద్రతీరంలో ఉన్న పల్లెవాళ్ళకి పులిహోర పంచింది అమ్మ; అది అమ్మకి ఎంతో సంతోషాన్ని కలిగించే కార్యక్రమం.
తిరుగు ప్రయాణంలో లాంచీ పైభాగాన అమ్మ కూర్చున్నది. అమ్మ ప్రక్కనే నేను కూర్చున్నాను. నింగిలో పూర్ణచంద్రుడు ప్రశాంత శీతల జ్యోత్స్నలను కురిపిస్తున్నాడు. “చూడు, నాన్నా! చంద్రుడు ఎంత అందంగా ఉన్నాడో! అన్నది అమ్మ. “చంద్రుని కంటే నువ్వే అందంగా ఉన్నావు” – అన్నాను. నేను. తత్వతః అమ్మ ఆహ్లాదజనని, సౌందర్యలహరి.
అంతలో అమ్మ నా గడ్డం పట్టుకుని “రేపు మీ ఇంటికి వస్తున్నాను, నాన్నా!” అన్నది. మనసెరిగిన తల్లి, కోరనిదే వరాలిచ్చే కొండంత దేవత అమ్మ. ఆశ్చర్యం, ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాను. మాటలలో కృతజ్ఞత చెప్పలేక అంజలి ఘటించాను.
మర్నాడు మా ఇంటికి అమ్మ నాన్నగారలు వచ్చారు. మా చెల్లెళ్ళు శ్రీసూక్తం పఠిస్తూ సజల నేత్రాలతో పార్వతీ పరమేశ్వరులకు స్వాగతం చెప్పారు. అందరం అమ్మను అర్చించుకున్నాం. మా నాన్నగారు సాలగ్రామ పేటికను అమ్మ హస్తాల్లో ఉంచారు. అమ్మ సర్వమంగళ కదా! “నాన్నా! ఇది నిన్ను తరింపజేస్తుంది” అని ఒక హామీని, ఒక వరాన్ని ఇచ్చి ఆశీర్వదించింది. అన్ని మతాలను అందరి అభిమతాల్ని ఆదరిస్తుంది అమ్మ.
1972లో అమ్మకు రూ. 30ల నేత చీర పెట్టాను. అదేమీ పట్టుచీరకాదు. నా స్తోమత అంత; పెట్టుకోవాలని కోరిక. అమ్మ నిండు మనస్సుతో స్వీకరించింది. అమ్మ బొట్టు పెట్టి ప్రసాదం ఇచ్చింది. బయలు దేరటానికి సిద్ధమౌతున్నాను. “కట్టుకుని వస్తాను, ఉండు నాన్నా!, చూద్దువుగాని” – అన్నది అమ్మ. “అమ్మా! నువ్వు తీసుకున్నావు. అంతేచాలు నాకు. నా కోసం పనిగట్టుకుని లేచి వెళ్ళి చీర కట్టుకుని శ్రమ పడవద్దు” అని బ్రతిమలాడాను. అవే మాటలు మా మధ్య రెండు మూడుసార్లు అటు ఇటు కదిలాయి. “అలా కాదు, నాన్నా!” అంటూ అమ్మ లేచి లోపలికి వెళ్ళింది. ఆ ప్రక్కనే ఉన్న రామకృష్ణ అన్నయ్య “అదేమిటి, సుబ్రహ్మణ్యం ! అందరూ అమ్మను కట్టుకుంటే గాని వీలులేదు అని పట్టుబడతారు. నువ్వు వద్దంటావు ఏమిటి అన్నాడు.
నేను పెట్టిన చీర కట్టుకుని అమ్మ వచ్చింది. నాకు నిజంగా సంతోషం కల్గింది. నా సంతోషం చూసి అమ్మ సంబరపడి పోయింది.
‘దేవులాడినా దొరకని వాడే దేవుడు’ ఈ సత్యం అమ్మ పరంగా అసత్యం. నిరంతరం మన మనోమందిరాల్లో కొలువై ఉంటుంది. ప్రతిఫలాపేక్షలేనిది ప్రేమ. ఆ ప్రేమే అమ్మ – తన మాతృధర్మ నిర్వహణకోసం తత్త్వతః వస్తుతః ఎన్ని మెట్లైనా దిగివస్తుంది; వంగి అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడు బిడ్డను అమాంతం లేవదీసి చంకన వేసుకుంటుంది. కనుకనే నేను ప్రార్థించకుండానే “రేపు మీ ఇంటికి వస్తాను, నాన్నా!” అని అనుగ్రహించింది, వచ్చింది. అది అమ్మ విలక్షణ విశిష్ఠ వాత్సల్య శంఖారావం. మాతృహృదయం స్పందించేది బిడ్డ అవస్థ ఆవేదనలను చూసి, ప్రార్థనలు వినికాదు.
– (సశేషం)