(గత సంచిక తరువాయి)
(ఈ వ్యాసంలో ప్రకటితమైన అమ్మ హస్తాల్లోని ఆయుధాలు శంఖము/ చక్రము / ఖడ్గము / త్రిశూలము / గద / బాణము / పాశము / అంకుశము అని స్పష్టం చేయలేదు. కారణం – అలా వర్గీకరించటం కష్టం.)
- “నేను నిర్లేపను” (ఇది లలితా సహస్రనామాల్లో ఒక నామం)
ఒక సంవత్సరము జనవరి నెల – శీతాకాలం. చర్మం పొడి ఆరిపోతుందని ముఖానికి Cold Cream రాసుకుని, జిడ్డుగా ఉన్నదని పైన Powder కూడా రాసుకుని సోదరి M.V. సుబ్బలక్ష్మి అమ్మ గదిలోకి వెళ్ళారు. లోపల అడుగుపెట్టగానే అమ్మ, “నేను నిర్ణేపను, నాకు ఏ లేపనాలు అక్కరలేదు” అన్నది.
జీవుల కర్మ సంబంధమైన మాయకు ‘లేపమ’ని పేరు. అమ్మ కర్మలకు, కర్మఫలాలకు అతీతురాలు. అంతేకాదు. అనంత జీవకోటిని కర్మబంధాల నుండి శాశ్వత విముక్తిని అనుగ్రహించటానికి వచ్చింది.
‘మాయ’ని అర్థం చేసుకోవాలంటే శ్రీమద్రామాయణంలో మాయామృగం గుర్తు చేసుకోవాలి. సీతామాత హనుమంతునితో ‘బొంకుల దేహము – పోదిది. వేగమె; జింకవేట ఇటుసేసె’ అని అన్నది (అన్నమాచార్య కీర్తన). బంగరు మృగముపై వ్యామోహము అంతటి దురవస్థని క్లేశాన్ని కలిగించింది.
లేపనాలు అంటే జిడ్డు – సంచిత కుసంస్కారం; వదలదు. మరింతగా ఊబిలోకి దించేస్తాయి. “ఆకారమే వికారంతో వచ్చింది” అన్నది అమ్మ. క్షుత్ పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీ….. అంటే ఆకలిదప్పులు, వికారాలు, దరిద్రం, అజ్ఞాన అహంకారాలు… అన్నీ అమ్మ కృపతో అంతరిస్తాయి.
ఒక విశేషాంశం “నేను నిశ్లేషను” అని అమ్మ తన ఒక లోకోత్తరమైన గుణాన్ని ఒక సందర్భాన్ని పురస్కరించుకుని ప్రకటించింది. సిద్ధులు, యోగులు, అవతారమూర్తులు అలా బయట పడరు. కానీ అమ్మ కృపతో ‘తాను ఆది, అంతము లేని దానననీ, అన్నిటికి ఆధారమైన దానననీ, సర్వసృష్టికారిణిననీ,
సర్వసిద్ధాంత సార్వభౌమననీ, తొలి అనీ, జగత్కర్త – జగద్భర్తననీ ఎన్నో రీతుల విశదపరచింది.
అమ్మ వాక్యాలు ఎన్నడూ ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు; జనబాహుళ్యానికి వర్తించేవి. అవి సార్వత్రికములు: సకల జీవాళి సముద్ధరణ కారకములు.
- “కాయకల్ప చికిత్స చేయించుకోమంటావా, నాన్నా !”
ఒకనాడు శ్రీరాజు బావగారు “అమ్మా! కాయకల్ప చికిత్స అనేది ఒక వైద్యశాస్త్ర ప్రక్రియ. దాని వలన 60/80 సం.ల పాటు శరీరం దృఢంగా ఉంటుంది. 60 ఏళ్ళ తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు” – అని అన్నారు.
అందుకు అమ్మ “ఉంటాను, నాన్నా! దాని దేముంది? ఏం చేయాలి ఉండి? రోజూ ఇదే పని కదా! – ప్రొద్దున్నే లేవటం, కాలకృత్యాలు తీర్చుకోవటం, భోజనం చేయటం, మళ్ళీ పడుకోవటం – దీనికి 200 సం.లు కావాలా ? ఇదే పని కదా !
అప్పటికి మీరంతా ఉండరు, పోతారు. కొత్తవాళ్ళు వస్తారు. వాళ్ళూ పోతూంటారు. వాళ్ళకోసం వీళ్ళ కోసం ఏడ్వాలా? ఇలా ఏడుస్తూ ఉండటం ఇదే(నా) పని? చెప్పు, నాన్నా! దాని వల్ల ఉపయోగం ఏమిటో చెప్పు. ఏదైనా ఒక పని చేస్తే దాని వల్ల ఈ కష్టం ఉంది, నష్టం ఉంది, లాభం ఉంది, ఇది మంచీ ఇది డూ అని ఉంటాయి కదా!
మీరు ఎవరూ ఉండరు కదా, నాన్నా! మీరు లేని తర్వాత నేనెందుకు? నేనుండి మీరు లేకపోతే ఆ కడుపుకోత భరించలేను.
ఇలాంటి పిచ్చి ఆలోచనలు ఎందుకు వస్తాయి రా నీకు? అన్నది. ఇక్కడ రెండు ముఖ్యాంశాలు ఉన్నాయి
- అమ్మ నిరుపమాన మాతృప్రేమ 2. జీవన విలువలు (Values of Life). కష్టపడి చదువుకుని ఉద్యోగం చేస్తున్నాం. బిడ్డల్ని కని పెంచి పోషిస్తున్నాం. తింటున్నాం తిరుగుతున్నాం. ఏదో ఒకనాడు కన్ను మూస్తాం. కాగా ఈ పనులన్నీ అత్యంత అల్పప్రాణులూ చేస్తున్నాయి.
వ్యక్తి తన జీవితాన్ని మూల్యాంకనం (evaluate) చేసుకోవాలి. Modern mechanical monotonous aimless life 33 T.S. Eliot (The Waste Land) లో అన్నారు
“What shall we do tomorrow ?
What shall we ever do?
The hot water at ten.
And if it rains, a closed car at four.
And we shall play a game of chess.
Pressing lidless eyes and waiting for a knock upon the door’ అని.
(Here ‘a knock upon the door’ refers to the death’s knock at the doorstep.)
- “అదేమిటి, నాన్నా!”
ఒకనాటి ప్రాతఃకాలంలో అమ్మ అందరింటి పై అంతస్థులో మాన్యసోదరులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావుగారి చేయి ఆధారంగా నడుస్తోంది. సర్వానికీ ఆధారమైన అమ్మకి ఆధారం ఎందుకో! భవనంపై నుంచి క్రిందికి రోడ్డు వంక చూచింది. అక్కడ నల్లగా ఒక వస్తువు ఉన్నది. “అదేమిటి, నాన్నా? అని అడిగింది. అమ్మకి తెలియక కాదు; మనకి తెలియజేయటం కోసం. విశ్వవిఖ్యాత తత్వవేత్త SOCRATES ఉపన్యాసాలు ఇచ్చేవాడు కాదు, ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టే వాడు. నాకు తెలిసి అమ్మ చాల సార్లు ఈ SOCRATIC METHOD ని ఆదరించింది.
‘పేడ, అమ్మా !’ – అని సమాధానం ఇచ్చారు అన్నయ్యగారు. రెండు రోజులు గడిచాయి. మూడవరోజు ఇంచుమించుగా అదే దృశ్యం అదే సమయంలో అదే ఫక్కీలో అవే మాటలు – “అదేమిటి, నాన్నా?” అని; “పేడ, అమ్మా?” – అదే సమాధానం, అదే స్వరస్థాయిలో. వెంటనే అన్నది “ఇది. (అందరిల్లు) నాది అనే భావం ఎవరికైనా ఉంటే అది అక్కడ ఉండదు కదా!”
“అవును” అన్నారు వెంకటేశ్వరరావుగారు. వెంటనే నాలిక కరచుకున్నారు. బాధపడ్డారు ‘ఏం! నేను తీసెయ్యొచ్చు కదా! వేరొకరు చెయ్యాలనుకోవటం ఎందుకు? నేనేం గొప్పవాడినా? చేస్తే గొప్పవాడినే. అయినా మనపని మనం చేసుకోవటంలో ఎక్కువ తక్కువ ఏముంది?’ అని అకర్మణ్యత్వాన్ని, సోమరితనాన్ని అమ్మ ఎన్నడూ ఉపేక్షించదు. పదిమందితో కలసి ఉండటం, పదిమంది కోసం పదిమందితో కలసి పని చేయడం – ఇదే అమ్మ మనకి నేర్పింది.
“అదేమిటి?” – అనే ప్రశ్నలో ‘ఆ వైఖరి ఏమిటి?’ ఆత్మపరిశీలన చేసుకోవాలనే హెచ్చరిక ఉంది.
- “ఇప్పుడు డాక్టర్ల తెలివి తేటల వల్లే జరిగిందా?”
శ్రీ మధు అన్నయ్యగారి భార్య శ్రీమతి లలిత. వారమ్మాయి రజని గర్భంలో ఉన్నప్పుడు ఆమె ఆరోగ్యం బాగాలేదు. అనుదినం ఔషధసేవ చేస్తూ Bedrest తీసుకోవాలన్నారు వైద్యులు. ప్రసవ సమయానికి ఆమె పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. కాగా దైవానుగ్రహం వలన ఆమె సుఖంగా ప్రసవించి ఆడపిల్లను కన్నది. ఇక్కడ ‘దైవానుగ్రహం’ అనే మాట గమనార్హం. చదవండి మీకే తెలుస్తుంది.
ఆ రోజే డాక్టరు గారు మధు అన్నయ్యని పిలిచి ‘మరొకసారి ఆమె గర్భం ధరిస్తే తల్లిప్రాణానికే ముప్పు. మారు మాట్లాడకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించండి. ఎల్లుండి ఉదయం చేస్తాను’ అన్నారు. అన్నయ్య నిర్ఘాంతపోయి చేసేదేమీ లేక అంగీకార సూచకంగా తలూపారు. కానీ వారి మనస్సు ఎదురు తిరిగింది, ప్రతిఘటించింది, వద్దని వారించింది, హెచ్చరించింది, కుదిపేసింది. అందుకు బలీయమైన కారణం ఉంది. ‘పున్నామ నరకం నుంచి పుత్రుడు రక్షిస్తాడు’ – అనే సంప్రదాయ మూఢ విశ్వాసం కాదు.
శ్రీ మధు అన్నయ్య, వారి తండ్రి శ్రీ లక్ష్మీనరసింహశర్మ గారికి ఒకే ఒక్క కుమారుడు; అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు లేరు. ఏకాకి. అదే కారణం కాదు. తన 1/ సం.ల చిరుప్రాయంలో తండ్రిని కోల్పోయారు. ‘నాన్నా!’ అనే మమకార 2 సంబోధన మాధుర్యాన్ని శాశ్వతంగా కోల్పోయారు. అది వారి హృదయంలో ఒక వెలితి, అఖాతం, అగ్నిపర్వతం. వారు ఎదిగి జిల్లెళ్ళమూడి వచ్చిన తర్వాత నాన్నా (శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావు) గారిని ‘నాన్న గారూ!’ అని పిలిచినపుడు వారి సర్వేంద్రియాలు పులకరించాయి. మోడుబారిన జీవన లత చిగిర్చింది. ‘నాన్నా!’ అనే పిలుపు వారి పెదవులపై నిత్యం లాస్యం చేయాలని తపన అంటే ఒక్క తనయుడు కావాలి – అని.
కానీ వాస్తవ పరిస్థితి అందుకు పూర్తిగా ప్రతికూలంగా ఉంది. విధిని ఎదిరించగల వారెవ్వరు? ఉన్నారు. అది జగజ్జనని అమ్మ మాత్రమే; విధాత వ్రాతని చెరిపి తిరిగి వ్రాయగలిగిన ఘటనాఘటన సమర్ధ. కనుకనే తక్షణం బయలుదేరి ఆఘమేఘాల మీద అమ్మ దరిచేరారు.
వాచా ఏమీ అమ్మకి విన్నవించుకోలేదు. అమ్మకి తెలియక పోతేగా చెప్పటానికి. అమ్మది ‘తెలిసీ తెలియని స్థితి; అంటే సర్వం తెలిసి కూడా తెలియనట్లు ఉంటుంది అది అవతారమూర్తి లక్షణం – దివ్యవిభూతి. కనుకనే మధు అన్నయ్య కడుదైన్యంతో కన్నీటితో అమ్మ పాదాలను అభిషేకించారు. కరుణామయి అమ్మ స్పందించింది; క్షిప్రప్రసాదినికదా!
కుశల ప్రశ్నలు వేసి సోదరి శ్రీమతి లలిత ఆరోగ్యస్థితి గతుల్ని విచారించింది. ‘కుటుంబ నియంత్రణ ఆపరేషన్ తప్పదన్నారు డాక్టరుగారు. తల్లి ప్రాణానికి ముప్పు అన్నారమ్మా’ అని అంజలి ఘటించారు. వెంటనే అమ్మ సూటిగా ప్రశ్నించింది వారి అంతఃకరణని “ఇప్పుడు డాక్టర్ల తెలివితేటల వల్లే జరిగిందా?” – అని. ఒక్క క్షణం ఆగి, “ఒక్క మగబిడ్డను పుట్టనియ్యి” అని ఒక వరాన్ని ప్రసాదించింది; అడగకుండానే.
మానవుని పరిమిత శక్తి, యుక్తి, సామర్థ్యాలు ఏపాటివి? “లోపలికిం పీల్చుగాలి విడువంబడునో తెగి అంతరించునో తెలియదు’ అన్నారు. ఉమర్ ఖయ్యాం. ఉచ్ఛ్వాసరూపంలో గాలి పీల్చాం, దాన్ని నిశ్వాసరూపంలో వదులుతాం అని నమ్మకం లేదు. అదే ఆఖరి శ్వాస కావచ్చు – అని అర్థం.
విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త Albert Einstein చనిపోయే ముందు ఒక చిన్న సంఘటన; సంఘటన చిన్నదే కానీ సందేశం అద్వితీయం. వారి attendant nurse వారిని wheelchair లో కూర్చోబెట్టి ఆస్పత్రి గది కిటికీ వద్దకు తీసుకు వెళ్ళింది. ఆమె అడిగింది “Professor Einstein, do you think God made the garden?” అని. అందుకు ఆ శాస్త్రవేత్త “Yes, God is both the gardener and the garden” అన్నారు. ఆ మహాశయుని వాక్యం
‘బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ర్బహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ | బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా॥’ అనే శ్రీ కృష్ణ భగవానుని దివ్య ప్రబోధసారమే.
“ఇప్పుడు డాక్టర్ల తెలివితేటలవల్లే జరిగిందా?” అని అమ్మ ప్రశ్నించింది. నిజం. నాడు ఆందోళనకరంగా మారిన ప్రసవం అనాయాసంగా జరిగింది. తర్వాత కాలంలో ఏ చికిత్సతో నిమిత్తం లేకుండానే సుఖంగా మగబిడ్డను కన్నది. శ్రీమతి లలిత.
అమ్మ సంధించిన ప్రశ్న అందరికీ ఒక Shock-treatment; మానవుని అతి తెలివిపై అమ్మ ప్రయోగించిన వజ్రాయుధ ప్రహారం; అది పదునైన తెలివి విచికిత్స – సర్వకాల సర్వావస్థలలో జ్ఞప్తి యందుంచుకోవాలి. ఆ ప్రశ్న అందరికీ అన్ని వేళలా వర్తిస్తుంది. ‘చేతులు మనవి – చేతలు ఆశక్తివి’ – అనే మానవ సహజ ధోరణికి స్వస్తి చెప్పి ‘చేతులూ, చేతలూ ఆ శక్తివే’ – అని విశ్వసించి అవ్యాజకరుణామయి అనంతశక్తి స్వరూపిణి అమ్మ శ్రీచరణాల్ని సమాశ్రయించటమే ఏకైక మార్గం, గమ్యం.
(సశేషం)