1. Home
  2. Articles
  3. Mother of All
  4. అమ్మ హస్తాల్లో ఆయుధాలు

అమ్మ హస్తాల్లో ఆయుధాలు

A V R Subramanyam
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 17
Month : October
Issue Number : 4
Year : 2018

(గత సంచిక తరువాయి)

  1. “ఇక్కడ మనవాళ్ళు ఎందరున్నారు?”

లక్షమందికి ఒక్క పంక్తిలో అన్నప్రసాదం పెట్టిన అమ్మ, కోటి మందికి దర్శనం అనుగ్రహించాలని ‘వాత్సల్యయాత్ర’ చేసింది. అందులో భాగంగా భాగ్యనగరం (హైదరాబాదు) విచ్చేసింది సపరివారంగా. గోల్కొండ, చార్మీనార్, సాలార్ జంగ్ మ్యూజియం, బిర్లా మందిరం వంటి ప్రముఖ దర్శనీయ స్థలాలకు పోలేదు.

“ఇక్కడ మనవాళ్ళు ఎందరున్నారు?” అని అడిగింది అమ్మ – సన్నిహితులని. మన వాళ్ళంటే – వారికి అర్థం కాలేదు. అమ్మతో వచ్చిన వారిని, అమ్మను దర్శింప వచ్చే వారిని లెక్కింప సాగారు. మనం అయోమయ స్థితిలో ఉంటే మన ప్రశ్న అమ్మే వేసుకుంటుంది, తనే సమాధానం ఇస్తుంది. వాస్తవంగా మన మనస్సులోని ప్రశ్నను శాబ్దికంగా వ్యక్తీకరించటమూ తెలియదు. ఒకనాడు నా అశక్తతను గుర్తించి అమ్మ అన్నది “సుబ్రహ్మణ్యం ఇలా అడిగాడు. అని అనుకుందాం” – అంటూ నా సంశయాన్నీ దానికి సమాధానాన్నీ అమ్మే, చెప్పింది.

సరే. ప్రస్తుతాంశానికి వద్దాం. చుట్టూ ఉన్నవారి కూడికలు, తీసివేతలు, గుణకార భాగహారాలకి తెరవేసి కృపతో అమ్మ అన్నది “మన వాళ్ళంటే పుట్పాత్ల మీద, మురికి వాడలలో తిండికి లేక వీధి వీధికి తిరిగి భిక్షాటన చేసే వాళ్ళు. వాళ్ళకి పులిహోర, దధ్యోదనం, చక్రపొంగలి, వంటివి కడుపునిండా పెట్టి చలికి దుప్పట్లు ఇవ్వాలి” – అని. అక్కడ ఉన్న మన సోదరీ సోదరులు క్షణ కాలం అవాక్కయ్యారు; తక్షణం తేరుకున్నారు – అమ్మ అవ్యాజానురాగం, అకారణకారుణ్యం, విచక్షణ లేని వీక్షణ – బాగా తెలుసుకనుక; అది అమ్మకి సహజం మనకి విశేషం కనుక.

నేటి సమాజంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ ‘మనవాళ్ళ’ అనే పదం అనర్థాలకి, హింసకి, దానవ ప్రవృత్తికి హేతువు అవుతోంది. మన ప్రాంతం/ మన కులం/మన జాతి మతం; వాళ్ళకే త్రాగునీరు, సేద్యం నీరు, విద్యా – వైద్యం, పౌరసత్వం అనే స్వకీయతత్వం మహమ్మారి (Virus) లా దినదిన ప్రవర్ధమాన మౌతోంది. ఈ సంఘ విద్రోహక లక్షణంపై అమ్మ పరోక్షంగా కొరడా పించింది.

ఈ సందర్భంగా మనం దృష్టి సారించాల్సిన ప్రధానమైన అంశం ఏమంటే తిండి లేక పుట్పాత్ల మీద, మురికి వాడలలో జీవచ్ఛవాల్లా బ్రతుకు లీడుస్తున్న వారికి ఒక్కపూట పంచభక్ష్య పరమాన్నాలతో విందు భోజనం పెట్టినంత మాత్రాన వాళ్ళ జీవితాలు తెల్లవారుతాయా? అని.

అవును. వాళ్ళ జీవన అమవసనిశిలో దినకర ప్రభలు వెల్లి విరుస్తాయి. అదే జరిగింది. అమ్మ అనుదినం కార్లలో జీపుల్లో తినుబండారాల్ని సమకూర్చుకుని నిరాశ్రయులు బాధితులను అక్కున చేర్చుకుని స్వయంగా ప్రసాదం పెట్టింది. తదనంతర కాలంలో ప్రభుత్వం వారు వారికి ఆనాడు కాలనీలు కట్టించారు, నేడు double bed room flats నిర్మిస్తున్నారు. జగన్మాత అమ్మ దర్శన మహిమ, ప్రసాద మహిమ అంత ఉత్కృష్టమైనవి. ఈ సందర్భంలో ‘జన్మకర్మచ మే దివ్యం’ అనే గీతాచార్య ప్రవచనాన్ని అవశ్యం స్మరించాలి.

  1. “నువ్వు ఈ ఉత్తరీయం వేసుకుని కులుకుతూ తిరగమని కాదు”

అది మాతృశ్రీ స్వర్ణోత్సవ నిర్వహణ కోసం విరాళ సేకరణకి శ్రీకారం చుట్టిన రోజు. రామకృష్ణ అన్నయ్య, గోపాలన్నయ్య, Dy. S.P. సత్యనారాయణ అన్నయ్య ఒక బృందంగా బయలుదేరనున్నారు. వారికి అమ్మ ఆశీః పూర్వకంగా నూతన వస్త్రాల నిచ్చింది. అపుడు గోపాలన్నయ్య ధోవతి తీసుకుని ఉత్తరీయాన్ని అమ్మ మంచం మీద ఉంచాడు. అమ్మ అడిగింది” ఏమిటి? దాన్ని ఇక్కడ పెట్టావు?” – అని సమాధానంగా అన్నయ్య “అమ్మా! నేను ఉత్తరీయం వేసుకోను కదా! ఎవరికైనా పెట్టవచ్చు” – అని అన్నాడు.

వెంటనే అమ్మ “నీకు ఈ ఉత్తరీయం ఇవ్వటంలో ఉద్దేశం – నువ్వు ఈ ఉత్తరీయం వేసుకుని కులుకుతూ తిరగమని కాదు. నువ్వు ఒక పనిమీద బయటికి పోతున్నావు. నువ్వు ఒడి పట్టడానికి వెడుతున్నావు. వేసేవాళ్ళు ఏం వేస్తారో! 1116లు ఇస్తారో, 10 వేలు ఇస్తారో, 1 రూపాయి ఇస్తారో, చద్ది అన్నం పెడతారో, గుప్పెడు బియ్యమే పెడతారో – వాళ్ళు ఏం పెట్టినా నువ్వు ఒడి పట్టాలి. వేసుకో” అన్నది.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గోపాలన్నయ్య అన్నాడు “అమ్మ మాటలు మాకు మహత్తర సందేశం. తర్వాత మా అనుభవాల్లో అలాంటివి అనేకం జరిగినయ్. ముందుగానే అమ్మ మాకు శిక్షణ నిచ్చింది కాబట్టి మేము బాధ పడలేదు” – అని.

ఒకరి ముందు నిలబడి విరాళం / చందా అడగాలంటే ఆత్మాభిమానాన్ని చంపుకుని చేయిచాపాలి. అందుకు గొప్ప మనస్సు, అమ్మయందు నిరవధికమైన ప్రేమ, విశ్వాసం ఉండాలి. ఆ ప్రయత్నంలో ఎన్నో సన్మానాలు – అవమానాలు, సత్కారాలు – ఛీత్కారాలు అనుభవించాలి. ఒక మహత్తర లక్ష్యసాధనకి ఒక పావన యజ్ఞం జయప్రదం కావటానికి దీక్షతో నడుంబిగించి కదలాలి.

వారి పావనలక్ష్యం ఏమిటి? పది మంది హితంకోరి పదిమంది హృదయాల్ని కలుపుకు పోవటం. సంకల్పరహిత సంకల్ప సహిత అమ్మ సంకల్పిస్తే కోట్లాది సొమ్ము – అమేయ ధనరాశులు ఆ తల్లి పాదాల చెంత మోకరిల్లుతాయి. అసలు ఈ యజ్ఞఫలాన్ని అనుభవించే వారెవరు? లక్షల మంది మనుషులూ కోట్లాది జీవులూను.

ఈ సందర్భంలో ఒక సన్నివేశం గుర్తుకు వస్తోంది. లోకమాన్య బాలగంగాధర తిలక్ మహాశయుడు తక్షశిల విశ్వవిద్యాలయ స్థాపనకి విరాళాల్ని సేకరిస్తూ ఒక కోటీశ్వరునికి ఇంటికి వెళ్ళారు. వారు హిందువులు కాదు. విషయం తెలిపి దోసిలి పట్టారు. ఆయన కోపోద్రిక్తుడై దోసిట్లో ఉమ్మి వేశాడు. అందుకు తిలక్ మహాశయుడు చిరునవ్వుతో “సరే. ఇది తమరు నాకు ఇచ్చిన బహుమతి. మరి విశ్వవిద్యాలయానికో!” అన్నారు. తక్షణం ఆ శాంత స్వభావానికి కరిగిపోయి ఆ ధనికుడు పశ్చాత్తాపపడి కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఘనంగా విరాళాన్నిచ్చి సాగనంపాడు. నిస్సంగత్వం – నిష్కామకర్మ ప్రతిఫలాపేక్ష ఎరుగని కర్మకి అది నిలువెత్తు రూపం: వెర్రి తలలు వేసిన అహం కారంపై విసిరిన గొడ్డలిపెట్టు. తొలిరోజుల్లో ఆ విధంగా ఆత్మార్పణ చేసుకుని సోదరీ సోదరులెందరో అందరింటి పునాదిరాళ్ళుగా నిలిచి ధన్యులైనారు; ఆదర్శప్రాయులైనారు.

ఇక్కడ “కులుకుతూ తిరగటం” అనే మాటలు కడుప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కులుకుతూ తిరిగే వారు ఎవరు? నాకు తెలిసినంత వరకు గృహస్థాశ్రమంలో కుటుంబ పోషణ నిమిత్తం నాలుగు రాళ్ళు సంపాదించుకోవటం, ఉన్నంతలో తృప్తితో జీవిస్తూ తృప్తితో తిరగటం ఒక రకం. అవసరాలకు మించి అత్యాశతో 10 తరాలకు సరిపడు సంపదను కూడబెట్టి ఐశ్వర్యమదాంధకారంతో “నేను లక్ష్మీపుత్రుడను కాను లక్ష్మీపతిని’ అనే గర్విత ఉన్నతస్థాయికి ఎదిగి మిడిసి పడుతూ విర్రవీగుతూ కులుకుతూ తిరగటం రెండవ రకం. బాధ్యతా రహితంగా తిరగటం మూడవ రకం. కాగా ధార్మిక పథంలో కులుకుతూ తిరగటానికి అమ్మ ఒక చక్కని ఆచరణ సాధ్యమైన సూత్రాన్ని ఆవిష్కరించింది. “నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకో, అంతా వాడే (ఆ శక్తి) చేస్తున్నాడని నమ్ము’ అనే సందేశాన్ని ఇచ్చింది. తృప్తిగా తినటం – అంటే కులుకుతూ హాయిగా జీవించమని. అమ్మ సందేశంలో ఒక ఆదేశం ఉన్నది, శాసనం ధ్వనిస్తుంది; ‘నలుగురికి ఆదరణగా పెట్టుకో’ అనే దానిలో. “నీకు రెక్కలు ఇచ్చింది. ఎగిరిపోవటానికి కాదు – రాని వాడిని ఆదుకోవటానికి” అని ఒక హెచ్చరిక (Warning) కూడా జారీ చేసింది. అందుకు కారణం (Reason) కూడా తనే వివరించింది; “అంతా వాడే చేస్తున్నాడని నమ్ము” అనే వాక్యం ద్వారా. అంతా ఆశక్తే చేస్తున్నపుడు ప్రపంచ సంపద అంతా వాడిదే. ఏ వ్యక్తి ఖాతా లోనూ స్వార్జితం అనేది చిల్లు కానీ ఉండదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఏ ఐశ్వర్యం అయినా జీవి కష్టార్జితం కాదు, ఈశ్వర కృపాలబ్ధం. 

  1. “నేను మీ అమ్మను కానా?”

తొలిసారి సోదరి మన్నవ సుబ్బలక్ష్మి జిల్లెళ్ళమూడి వచ్చినపుడు అమ్మ ఆమె చేయి పట్టుకుని ఆప్యాయంగా తలనిమురుతూ “బాగా చిక్కి పోయావు” అంటూ తన హృదయాంతరాళాల్లో పెద్ద పీట వేసి కూర్చుండ బెట్టింది. అమ్మ దర్శన స్పర్శన సంభాషణాదులచే ఆమె హృదయం ద్రవించింది. అవ్యక్తానందం చోటు చేసుకున్నది. అకారణంగా కన్నీరు ధారలుగా స్రవించింది. ఆమెకు బొట్టుపెట్టి చీర పెట్టింది అమ్మ. వాత్సల్య మహోదధి పొంగులు వారగా “నువ్వు ఇక్కడ ఉండిపో అన్నది.

‘లౌకికానాం హి సాధూనాం అర్ధం వాక్ అనువర్తతే |

ఋషీణాం పునరాద్యానాం వాచం అర్థః అనుధావతి||’ అన్నారు. భవభూతి మహాకవి; సాధువుల మాటలు అర్ధాన్ని అనుసరిస్తాయి; కానీ ఋషుల మాటల వెంబడి అర్థం పరుగులు దీస్తుంది – అని. అంటే అమ్మ మాటలు అమోఘములు. భవిష్యత్తులో ఆమె జిల్లెళ్ళమూడిలో స్థిర నివాసం చేస్తుందనే దృశ్యాన్ని అమ్మ చూస్తూ ఆ మాట అన్నదా? అమ్మ అన్నందువలన ఆమెకు జిల్లెళ్ళమూడిలో స్థిరనివాసం చేస్తూ అమ్మసేవ చేసుకునే యోగ్యత, యోగం వచ్చాయా? రెండూ సత్యమే ననిపిస్తుంది. దీనికి అనుబంధంగా మరొక సంగతిని జ్ఞప్తియందుంచుకోవాలి.

“నువ్వు ఇక్కడ ఉండిపో” అనే మాట అమ్మ అసంఖ్యాకులతో అన్నది డా॥ పొత్తూరి వెంకటేశ్వరరావుగారితో, డా॥ ఎ. కేశవరావుగారితో, డా॥ పన్నాల రాధాకృష్ణశర్మగారితో, డా॥ కె.ఎస్.ఎన్. మూర్తి (సత్యం అన్నయ్య) తో, నాతో… మరి ఎంతోమందితో.

భౌతికంగా మనం ఎక్కడున్నా అమ్మ మనల్ని చూస్తూనే ఉంటుంది. కానీ, ఆ వాత్సల్యామృత పరిపూర్ణ మాతృహృదయం కోరుకుంటుంది- “మీరం తా నా కళ్ళముందే ఉండాలి” అని. ప్రస్తుతాంశానికి వద్దాం.

“నువ్వు ఇక్కడ ఉండిపో” అని అమ్మ అన్నపుడు సోదరి సుబ్బలక్ష్మి కంగారు పడి పోయి” అమ్మో! నేను ఇక్కడ ఉండిపోతే మా అమ్మ దిగులు పడుతుంది” – అన్నది. ఆమె అలా అనటానికి బలీయమైన కారణముంది. అతఃపూర్వం వారి తండ్రి శ్రీ మన్నవ నరసింహారావు పరమపదించారు. నాటి నుండి కన్నతల్లికి తోడుగా నీడగా ఉంటోంది.

అమ్మకి సర్వం తెలుసు. సుబ్బలక్ష్మి సమాధానం వినీవిననట్లుగా “నేను మీ అమ్మను కానా?” అని రామబాణం వంటి ప్రశ్న వేసింది. “నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోతే నేను దిగులు పడనా?” అనే ప్రశ్న కూడా అందు ధ్వనిస్తోంది. దానికి తన వద్ద సమాధానం లేక మౌనంగా ఉండి పోయింది. సోదరి.

‘మీ అమ్మను కానా?’ అనటంలో – ‘మీ’ అనటంలో అర్థం ‘నీకు, మీకు, అందరికీ…’ అని. అంటే కోట్లాది జీవరాశికి ఒకే అమ్మ ఉంటుందా? ఎవరు అందరికీ అమ్మ? ఎవరు నిజమైన అమ్మ? ఈ ప్రశ్నలకి సరియైన సమాధానం పూజ్యసద్గురు శ్రీ శివానన్దమూర్తిగారు ఇచ్చారు – పసివాళ్ళకి పామరులకి సైతం అర్ధం అయ్యేట్లు –

ఇంటి తల్లి ఉన్నది. జిల్లెళ్ళమూడిలో తల్లి ఉన్నది. ఇంటి వద్ద తల్లి జన్మనిచ్చింది; కన్నది అంతే. వాళ్ళ రాతల్ని కనలేదు. వాళ్ళరాతల్ని కన్నతల్లి జిల్లెళ్ళమూడిలో ఉన్నది; అమ్మ.

ఇంటి వద్ద తల్లి నీకు ఆకలివేస్తే అన్నం పెడుతుంది. జిల్లెళ్ళమూడిలో కూడా అమ్మ ఆకలిగొన్న బిడ్డలకి “రా, నాన్నా!” అంటూ పిలిచి అన్నం పెడుతుంది. అయితే అది అన్నం మాత్రమే కాదు; మహాప్రసాదం.

కొందరు అంటారు ‘అమ్మ నాకు అన్నం పెట్టింది. నా కూతురు వివాహం అయింది, నేను ఇల్లు కట్టుకున్నాను, నాకు Promotion వచ్చింది’ – అని. అలా అయితే అయి ఉండవచ్చు. కానీ అమ్మ అన్నం పెట్టింది అందుకోసం కాదు.

ఆ అన్నం ముద్ద తింటే జన్మాంతర కర్మఫలం నశించి, మోక్షం ప్రాప్తిస్తుంది. అమ్మ కాలస్వరూపిణి కాళి. ‘శ్రీమాత్రే నమః’- అని అనుకోండి. చాలు” – అని.

“నేను మీ అమ్మను కానా?” అని అమ్మ సుబ్బలక్ష్మి గారిని ప్రశ్నించినా అది అందరికీ వర్తిస్తుంది. త్రికరణశుద్ధిగా అమ్మ శిశుభావనతో ప్రేమించినట్లు అమ్మను ఎందరు ‘మాత’గా ఆరాధిస్తున్నారు? ఆ ప్రశ్న శ్రీ మహావిష్ణువు కౌమోదకీగదా ప్రహార సదృశమైనది. ‘అమ్మే నా నిజమైన అమ్మ’ అనే నిశ్చయాత్మకమైన విశ్వాసం కలిగితే వైకుంఠపాళీ ఆటలో పండిపోయినట్లే. “నీ యందు అచంచల భక్తి విశ్వాసాలు కలిగేట్టు ఆశీర్వదించమ్మా’ అని డా॥ పన్నాల రాధాకృష్ణ శర్మగారు అంటే అమ్మ “నాన్నా! అది అంత తేలిక కాదు” అన్నది.

(సశేషం)

 

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!