అమ్మ అమృతహస్తాలలో వరదాభయ ముద్రలతోపాటు శంఖ చక్ర త్రిశూలాది ఆయుధాల్ని ధరించటం మనం కళ్ళతో చూశాము. భౌతిక నేత్రాలకి కనిపించని పాశము, గద, అంకుశము మొదలైన ఆయుధాలూ ధరించేదేమో! ఏమో కాదు; అవును – ధరించేది. కారణం – అమ్మ మాతృధర్మం కోసం వచ్చింది, నిల్చింది. అందులో లాలన, పాలన, పోషణ, రక్షణలు ఉన్నాయి; అంతేకాదు – శిక్షణ, క్షాళన వంటివీ ఉన్నాయి. “బిడ్డ బురద (మనోమాలిన్యాల్ని) పూసుకు వస్తే కడిగి శుభ్రం చేస్తాను, నా ధర్మం” – అన్నది అమ్మ. అంతేకానీ మురికి వాడల్లో ఆడి వచ్చిన బిడ్డని అమాంతం గుండెలకు హత్తుకుంటానని, ఎగరేసి ముద్దుపెట్టుకుంటానని అనలేదు.
అంతర్ముఖులు, యోగులు, మునులు, తపస్వులకు మాత్రమే తత్వతః పరాత్పరి శ్రీచరణాల వద్ద స్థానం ఉన్నది. కానీ పతితోద్ధారణ తత్పరత్వ మతియైన అమ్మ జాలి దలచి కన్నీరు చిలికి సకల జీవకోటిని సముద్ధరించటానికి అవతరించింది. ‘వినాశాయ చ దుష్కృతాం’ అని కృష్ణపరమాత్మ కఠినంగా ప్రబోధించిన పరమ సత్యాన్ని అమ్మ మృదువుగా “దుష్టసంహారం అంటే దుష్టులను సంహరించటం కాదు, దుష్టత్వాన్ని సంహరించడం” అని ఆచరణాత్మకంగా విస్పష్టం చేసింది. ఈ విధానాన్ని వివరిస్తూ శ్రీ బృందావనం రంగాచార్యులుగారు’ – సత్కారుణ్యమ్మున పావనుల్ పతితులేకమ్మై తరింపంగ నూత్నారంభమ్మొనరించినట్టి అనసూయా మాతకున్ మ్రొక్కెదన్’ అన్నారు. సంస్కరణ సముద్ధరణ క్రమంలో అమ్మ విధానంలో నా అనుభవంలో కొన్ని సందర్భాలు – వివరిస్తాను.
- “నువ్వు ఏం చదువుకున్నావు నాన్నా! వేదం?”
1970 సంవత్సరము జిల్లెళ్ళమూడి 3వసారి ఒంటరిగా వచ్చాను. నేను అమ్మకీ వసుంధర అక్కయ్యకీ మాత్రమే తెలుసు. అమ్మకి జ్వరం. 103° పైనే; నేను అమ్మ పాదాలు ఒత్తుతూ కూర్చున్నాను. అమ్మకి జ్వరం వచ్చిందని దుఃఖిస్తున్నాను. అమ్మ కళ్ళు తెరచి నాతలని తన పొట్టకు ఆన్చి “తగ్గిపోతుంది, నాన్నా! ఏడవకు” అన్నది. అంతలో నాన్నగారు వచ్చారు అక్కడకు. “ఎవరీ అబ్బాయి?” అని అమ్మని అడిగారు. నేను రవి అన్నయ్య కంటి రెండేళ్ళు. చిన్న. కనుక సహజంగా అబ్బాయిగానే చూశారు. అమ్మే పరిచయం చేసింది – ‘నరసాపురం డాక్టర్ కేశవరావుగారి మేనల్లుడు’ – అని. నేను ఒక క్షణం ఆగి అన్నాను ‘అమ్మా! వారిని మామయ్య అని పిలుస్తాను; వారు మాకు బంధువులు కాదు. వాళ్ళు నియోగులు, మేము వైదీకులం’ అని.
వెంటనే అమ్మ “వాడే నీకు నిజంగా మేనమామ, నువ్వేం చదువుకున్నావు, నాన్నా! వేదం?” – అని ఒక చురక వేసింది. అమ్మ మాటలు అక్షర సత్యాలు. డా॥ కేశవరావు మామయ్య గారు నన్ను – మా కుటుంబ సభ్యుల్ని ఎన్నో విధాల ఆదుకున్నారు. “నువ్వేం చదువుకున్నావు వేదం ?” – అనే ప్రశ్న రామ బాణంలా నా హృదయాన్ని చీల్చుకుంటూ పోయింది. నిజమే నేను B.Sc. (M.P.C.) చదువుకున్నాను. వైదిక బ్రాహ్మణ కులంలో పుట్టి ఏ మాత్రం వేద విద్య నభ్యసించలేదు. ‘జన్మనా జాయతే శూద్రః, కర్మణా జాయతే ద్విజః’ వేదవిహిత కర్మల్ని ఆచరించ లేదు. ఇక నేను వైదీకి నని చెప్పుకోవటంలో ఔచిత్యమే ముంది?
ఇదంతా నా అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేయటానికి అమ్మ సుదర్శన చక్ర ప్రయోగం చేసిందని అంటే – అది వాస్తవమే అవుతుంది. సుదర్శన చక్రం అంటే పీకల్ని కత్తిరించే ఆయుధం కాదు; సత్స్వరూప సమ్యగ్దర్శనం చేయించేది.
- “చెంపలు పగులకొడతా”
ఒకసారి నాన్నగార్కి (Pleurisy) అనారోగ్యం చేసింది. బాపట్లలో వారం రోజులుండి చికిత్స చేయించుకున్నారు. రుగ్మతా తగ్గింది. వారికి తోడుగా నేనూ వెళ్ళాను. తర్వాత ఇరువురం జిల్లెళ్ళమూడి వచ్చాం. ఆ మర్నాటి ఉదయం ప్రస్తుత వాత్సల్యాలయంలో అమ్మ మంచానికి ఒక ప్రక్కగా కూర్చున్నాను. సోదరి శాయమ్మగారు వచ్చి ‘నాన్నగార్ని అష్టమి పూట ప్రయాణం చేయించి తీసుకు వచ్చారు – అని అంటున్నారమ్మా’ – అన్నది. ఆ మాట విన్నంతనే నాకు ముచ్చెమటలు పట్టాయి. అమ్మ విషయంలో ఏమరుపాటుగా ఉన్నా ఫరవాలేదు; అమ్మ బాధ పడదు. కానీ అమ్మ ఆరాధ్యదైవం నాన్నగారి విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే అది అమ్మని అమితంగా బాధిస్తుంది. ఆ రోజు అష్టమి – దుష్టతిథి జబ్బుపడి కోలుకున్న నాన్నగార్ని బయలుదేరదీయటం మంచిది కాదని నిజంగా నాకు తెలియదు: ఆ పరిజ్ఞానం లేదు. అలా అయోమయంలో పడి గిలగిలలాడుతున్నా, నోట మాట పెగలటం లేదు.
అమ్మ ఏమంటుందోనని గుడ్లు అప్పగించి చూస్తున్నా – బిక్కమొహం వేసుకుని. ఆ క్షణంలో అమ్మ ఖంగున సూటిగా అడిగింది శాయమ్మగారిని – “ఎవరు అలా అన్నది; ఇలా తీసుకురా! చెంపలు పగులకొడతా” అని. సమయంలో అమ్మ మనలా ముఖం ఎఱ్ఱగా చేసుకోలేదు. ఆవేశంతో ఊగిపోలేదు, తొట్రుపాటు పడలేదు
సంప్రదాయ బద్ధ ఛాందస అర్ధరహిత భావాల (sentiments) మీద కొరడా (పాశం) ఝుళిపించింది. పాశఘాతం అంటే చర్మం చిట్లి రక్తధారలు స్రవించేలా ప్రహారాన్ని చేయటం కాదు అర్ధం. దారి తప్పిన దృక్పధాన్ని మనః ప్రవృత్తిని దారిలో పెట్టటం. ఒక్కమాటలో చెప్పాలంటే – సంస్కరించటం. ఆ క్షణంలో క్షణకాలం బిత్తర పోయాను, నాకన్నులు ఆనందాశ్రువుల్ని జలజలా రాల్చాయి; అవి పూజా పుష్పాలై అమ్మ పదపీఠినలంకరించాయి. అన్ని తిథులూ శుభతిథులేనని అమ్మ ఆచరణాత్మకంగా ప్రబోధిస్తోంది. అనుదినం దేవతార్చన సమయంలో, తెలిసో తెలియకో, సంకల్పం చెప్పేటప్పుడు, నాడు ఏ తిథి అయినా సరే ‘శుభతిధౌ’ అనే చెబుతున్నాం. కానీ మనస్సు కుక్కతోక వలె వంకర; customs die hard.
- “తోలు ఒలుస్తాను”
ఒకరోజు నేను అన్నపూర్ణాలయంలో మహాప్రసాదాన్ని స్వీకరించి మేడపైకి వెళ్ళాను. అదృష్టం; వైకుంఠద్వారాలు తెరిచే ఉన్నాయి. అమ్మ గదిలోకి అడుగుపెట్టా. అమ్మ కిటికీ ప్రక్కన నిలబడి ఉన్నది; తోలుతో సహా ఒక చక్కెర కేళి అరటి పండు కొరుక్కుని తింటున్నది. నన్ను చూసి మందహాసం చేసింది. నేను ‘అమ్మా! అదేమిటి? నీకు diabetes కదా? అరటిపండు తినవచ్చా? పైగా తోలుతో సహా తింటున్నావేమిటి?’ అని ప్రశ్నల వర్షం కురిపించాను. అమ్మ పకపకా నవ్వుతూ “తోలు ఒలుస్తాను” అని, ఒలిచి, మిగిలిన పండు నా నోటికి అందించింది. “అసలు తినాల్సిన విధానం ఇదే, నాన్నా! అందులో శరీరానికి అవసరమైన పోషక పదార్థాలు ఉంటాయి అన్నది. నాకు బాగా దగ్గరగా వచ్చి నా చెంప మీద చిన్నగా కొట్టింది. ఒక వైపు ‘ఇదేమిటా!’ అనుకుంటున్నాను; మరొకవైపు ఆ వదనారవిందంలో దీపించే విశ్వసమ్మోహనకర వాత్సల్య ప్రభల్ని కంటున్నాను. “ముద్దు వచ్చి కొట్టాను నాన్నా!” అన్నది వాత్సల్య గంగ.
ఈ సంఘటన అనల్పమైనది, అద్భుతమైనది. ‘తోలు ఒలుస్తాను’ అనే మాట చాల విలువైనది. జీవుల అంతరాంతరాళాల్లో రాశీభూతమై కరడు కట్టిన పాపపంకిలాన్ని ఎలా వదల్చాలి? అవిద్యను ఎలా అంతం చేయాలి? జన్మాంతర సంచిత వాసనాతతిని ఎలా భస్మీపటలం చేయాలి? అనంతకాల సాగరగర్భంలో మరుగున పడియున్న వికృత రత్నాల్ని వెలికి తీసి ఎలా మెరుగు పెట్టాలి? ఇందుకు సర్వసమర్థ విశ్వజననియే: అన్యధా శరణం నాస్తి, అదే సంస్కరణ పథం. “Spare the rod and spoil the child’ – అని ఆంగ్ల భాషలో ఒక సామెత ఉన్నది. శిక్షణ / క్రమ శిక్షణ అత్యంత ఆవశ్యకం. ఆ క్రమంలో బిడ్డ నలిగి పోతాడేమో, కందిపోతాడేమోనని విలవిలలాడితే ఆ బిడ్డ మనుష్యత్వం నుండి దైవత్వానికి ఎదగడానికి బదులు దానవత్వంలోకి దిగజారిపోయే ప్రమాదం ఉన్నది.
అమ్మ విశాలహృదయంలో అనేక అరలు; అనేక విభాగాలు (Departments). కనుకనే వెంటనే దగ్గరకు తీసుకుని ‘ముద్దువచ్చి కొట్టాను, నాన్నా!” అన్నది. అది దివ్య మాతృప్రేమ సంజనిత వాత్సల్య తరంగం. “తోలు ఒలుస్తాను” అనే మాట ‘ఉద్ధరిస్తాను’ అనే హామీ. దానిని పాశం / అంకుశం ఏదైనా అనుకోవచ్చు.
కాగా నిర్హేతుక ప్రేమామృతరసవాహిని కనుక అమ్మ “తోలు ఒలుస్తాను” అంటే మనస్సుకి బాధ లేదు. అమ్మ కాబట్టి మందలించినా ముద్దు చేసినా అవ్యక్తమధురంగానే ఉంటుంది. ఈ రహస్యాన్ని వేదం ‘రసో వై సః’ అని విస్పష్టం చేసింది. అంటే – సర్వోత్కృష్టమైన ఆ పరాత్పరియే అందరినీ ఆదుకునేది, ఆదరించేది, సంరక్షించేది, దిక్కు, దిక్సూచి – అని అర్థం.
సకల జీవాళి జీవన నావకి తెరచాప, చుక్కాని, అనన్యశరణ్యం ‘అమ్మ’.
– (సశేషం)