(గత సంచిక తరువాయి)
- “ఎందుకు నవ్వుతావు?”
ఒకనాడు అమ్మ ప్రత్యక్ష సన్నిధిలో ఉన్నాను. అమ్మ ఒక ఆత్మీయ సంభాషణ చేస్తోంది. అమ్మ పలుకుల్లో ఒక్క పొల్లు మాట కూడా ఉండదు. అవి భూత భవిష్యద్వర్తమానాలను అనుసంధానం చేస్తూ విధి విధాన దివ్యప్రణాళికను అనుసరించి ఉంటాయి. మా మామయ్య నరసాపురం డా|| ఆచంట కేశవరావుగారి ప్రస్తావన వచ్చింది. వారి అనారోగ్య పరిస్థితిని అమ్మ సమీక్షిస్తోంది. కాగా నాకు వారియందలి చనువు వలన ఏదో వ్యంగ్యంగా మాట్లాడి నవ్వేను లోకంలో, సాధారణంగా, ఇద్దరు వ్యక్తుల మధ్య కాలక్షేపంగా సాగే కబుర్లలో అక్కడలేని మూడవ వ్యక్తి గురించి విమర్శించి తద్వారా ఆనందం పొందుతూంటారు. అది ఒక దురలవాటు కనుకనే వాటిని పిచ్చాపాటి కబుర్లు అన్నారు. ఆ విధంగా మామూలుగా నవ్వేశాను.
వెంటనే అమ్మ “ఎందుకు నవ్వుతావు?” అని అడిగింది, ఆ మాటలు సన్నగా మృదువుగా పలికినా ఉరిమినట్లే ధ్వనించింది. పూర్వాపరాలు వివరిస్తాను. అందరి మనస్సులపైన అమ్మకి అప్రతిహతమైన అధికారం ఉంది. అమ్మ సన్నిధిలో ఉన్నపుడు ఆయావ్యక్తుల మనోభావాలు. ఆలోచనా రీతులు మాటల మీద వారికి ఏమీ అధికారం పట్టు ఉండవు. ఆ సంగతి నాకు పలుసార్లు అనుభవమైంది. అంతేకాదు. అమ్మ ఎవరితో ఏమి మాట్లాడినా ఒక సమాధానాన్ని ఆశించి మాట్లాడదు. అసలు అమ్మ ప్రశ్నించేది ఒక పాంచభౌతిక శరీరాన్ని (The little Seeming substance – అంటారు Shakespeare) కాదు. బుద్ధిని వ్యక్తిత్వాన్నీ ప్రశ్నిస్తుంది. జాగృతం చేస్తుంది. అది సమాధానం చెప్పలేదు కానీ అర్ధం చేసుకుని పద్ధతి మార్చుకుంటుంది. అదే విశేషం. అంటే అమ్మ మానవ మనో ప్రవృత్తిని బుద్ధిని ప్రచోదనం చేస్తుంది, సక్రమమైన దారిలో పెడుతుంది, సంస్కరిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ‘అంకుశ కశాః శుభ్రం కపాలం గదాం’ ఆయుధ విశేషాల్ని ధరించి గాయత్రీదేవియై ‘ధియో యోనః ప్రచోదయాత్’ అనే ప్రార్ధనను మన్నించి అనుగ్రహిస్తుంది.
అసలు ముక్క చెపుతాను -“ఎందుకు నవ్వుతావు?” అని అమ్మ ప్రశ్నించినపుడు వెంటనే ‘ఏడవలేక’ అని నేను సమాధానం పలికాను. అదినేను ఆలోచించి అన్నమాట కాదు. అప్రయత్నంగా అన్నది. ఒక విషయ ప్రస్తావన జరిగినపుడు బాధ పడాల్సిన సందర్భంలో నవ్వితే – దాని అర్ధం ఏమిటి? ‘ఏడవ లేక నవ్వటమే కదా! అలా సమాధానాన్ని నా నుంచే అమ్మ రాబట్టింది, చెప్పించింది, నా చేత్తోనే నా చెంపలు వాయించింది, “తనను తాను విమర్శించుకోవటం వివేకం నాన్నా!” అని హెచ్చరించింది, ఒక ఆప్త వాక్యాన్ని ప్రబోధించింది – అనిపించింది.
ఇంతా చేసింది నా మంచికోసమే. అలా వాసనా క్షయం నిమిత్తం పంచాయితీలు న్యాయ స్థానాలు అవసరం లేదు. అమ్మ పవిత్ర సన్నిధే న్యాయస్థానం (COURT), అమ్మే న్యాయమూర్తి (JUDGE). “ఎందుకు నవ్వుతావు?” అనే ప్రశ్న మరేదైనా అమ్మ ప్రశ్న Yes/No type కానీ, Information seeking question కానీ కాదు. అది ఒక విచారణ, ఆత్మవిమర్శ, మార్గదర్శనం, పరిణామం, సంస్కరణ, సముద్ధరణ, ఆధ్యాత్మికరూప విక్రియ (spiritual Metamorphosis) కి నాంది పలికే మమతామృతమూర్తి అమ్మ కృపా విశేషం.
- “అవిటి అమ్మాయిని చేసుకుంటావనుకున్నాను”
1972 సంవత్సరములో, నాకు 21 ఏళ్ళ వయస్సులో, ఉపాధ్యాయునిగ ప్రభుత్వోద్యోగం వచ్చింది. మన బాధ్యతల్ని అమ్మే వహిస్తుంది, మనల్ని అమ్మే భరిస్తుంది. అనేది వాస్తవం. ప్రత్యక్షంగా మనం చూశాం. ఎన్నో బలహీన కుటుంబాల్ని ఆదుకున్నది, వారి పిల్లల్ని ఉన్నత చదువులు చదివించింది, సంబంధాలు కుదిర్చి వైభవంగా వివాహాలు చేసింది, వాడిపోయిన జీవన లతలపై అమృతపు జల్లుని కురిపించింది.
తరచు జిల్లెళ్ళమూడి వస్తుండే వాడిని. మధురోక్తులతో అమ్మ మనల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. “నాన్నా! నల్లజర్ల (గ్రామం)లో నువ్వు లేచినది మొదలు రోజూ ఏం చేస్తావో చెప్పనా?” అన్నది నవ్వుతూ. అమ్మ సర్వజ్ఞ, విశాలాక్షి. అమ్మ దృష్టి ప్రసారానికి ఏదీ నిరోధకం కాదు. గుణాలకి, ధర్మాలకి, కాలానికి అతీతురాలు. అన్నీ అయి ఉన్నది, అదే సమయంలో దేనికీ కట్టుబడిలేదు.
“నాన్నా! వంట చేసుకుంటూ ఉద్యోగం చేస్తున్నావా!” అంటూ కుశల ప్రశ్నలు వేసేది. నా సమస్యలు నాకంటే అమ్మనే అమితంగా బాధించాయి. నన్ను ఒక ఇంటివాడిని చేయాలని ప్రయత్నించింది. ఒక తల్లిగా. విధి అనుల్లంఘనీయము అనే సత్యం నా కంటే అమ్మకి బాగా తెలుసు – అమ్మే, బ్రహ్మ కనుక. కాగా అమ్మ చర్యలు ఆశ్చర్యాన్నీ ఆనందాన్నీ కలిగిస్తాయి. ఒకనాటి (సాయం సమయంలో – ‘తవ శుభనామస్మరణం తాపత్రయ హరణం’ అంటూ సంధ్యావందనము చేశారు. ఆ సమయంలో దరహాస భాసుర వదనంతో అమ్మ సో॥ శ్రీ చాగంటి వెంకట్రావుగారిని “నాన్నా! తాపత్రయం నాకు పోలేదు. మీకేం పోగొడతాను?” అని ప్రశ్నించింది. అమ్మ ఛలోక్తికి అందరూ కడుపుబ్బ నవ్వుకున్నారు. అమ్మ మాట నిజం, కానీ అమ్మ హాస్యంలో రహస్యం ఉంది. అమ్మ కోరుకుంటుంది – 2 లారీల బియ్యం, 4 బస్తాలు కందిపప్పు, 10 బస్తాలు చింతకాయలు గోంగూర – ఉసిరికాయలు కావాలి అని. ఒక్క మెతుకు కూడా అమ్మ తినదు. మరి ఆ తపన ఎవరికోసం? అమ్మకి పరమార్థమే స్వార్ధం. అందరినీ తన బిడ్డలు అనుకోవటంతో తన స్వార్ధం పరమార్థం అయింది.
సరే. ఒకరితో నా వివాహ ప్రస్తావన చేస్తూ “సుబ్రహ్మణ్యం అంటే నాకు ఇష్టం. మీ అమ్మాయిని వాడికిచ్చి చేయండి” – అని చెప్పింది. ఆ సంగతి ఒక సోదరి నాతో ప్రస్తావించింది, వాళ్ళు నన్నేమీ అడగలేదు. కారణాలు ఏమైనా
రెండు సంవత్సరములు ఆగి వాళ్ళమ్మాయిని వారి బావమరిదికిచ్చి చేశారు. 1972లో ఉద్యోగం వస్తే – 1980లో నా వివాహం అయింది. గోత్రం నామం – నక్షత్రం – రూపురేఖలు – సంప్రదాయం మొదలగు అంశాల్ని పరిగణించి బి.ఏ. చదువుకున్న ఒక అమ్మాయిని నాకు నిశ్చయించారు మా తల్లిదండ్రులు. సరే – వివాహం అయిన తర్వాత జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మ- నాన్నగార్ల ఆశీస్సులు పొందాము.
కొన్నేళ్ళ తర్వాత సందర్భం గుర్తు లేదు, ఒకనాడు అమ్మ అన్నది” నువ్వు ఒక అవిటి అమ్మాయిని చేసుకుంటావని అనుకున్నాను” అని. విధి వంచితయై అంగవైకల్యంతో తన కాళ్ళమీద తాను నిలబడలేని ఒక అసహాయురాలికి జీవన పర్యంతం ఆధారంగా నిలబడతానని అనుకున్నది. ఒక వ్యక్తి సంస్కారం గురించి అమ్మ హృదయంలో ఎంత సమున్నత స్థానం ఉంటుందో! అది విశ్వజనని హృదయ గీతి – రీతి.
వెంటనే నాకు – T.S. Flit రచించిన “The waste land’ పద్యంలో ‘What the Thunder said నందలి మాటలు ‘London Bridge is falling down, what have we given? My friend….. Datta, Dayadhvam, Damyata (Give, Sympathize, control) – w.r.t Brihadaranyaka Upanishad -‘ – గుర్తుకు వచ్చాయి. ‘న కర్మణా ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానశుః’ అంటూ వేదమంత్రాల్ని పఠిస్తున్నాను. ఆచరణ శూన్యం. నేనేమి విడిచిపెట్టాను? ఏం త్యాగం చేశాను? నేను కేవలం మాటల వరకే పరిమితం, చేతలలో కాదు – అని అర్థమైంది.
అమ్మ మాట నా జీవన చదరంగపు ఆటలో చేసిన ఒక హెచ్చరిక check.
ఇంకా మరెన్నో అమ్మ హస్తాల్లో ఆయుధాలు!!!
– (సశేషం)