(గత సంచిక తరువాయి)
- “పప్పు ఉడక బెట్టినట్లు blade ని ఎంతసేపు ఉడకబెడతారురా?”
1975 ఏప్రియల్ నెలలో అమ్మ చట్టమీద గడ్డ (రాచకురుపు) లేచింది. 3 నెలలు అమ్మను అమితంగా బాధించింది. తాటికాయ ప్రమాణంలో ఉంది. అయినా ఆ బాధను అమ్మ లెక్క చేయక బిడ్డలకు దర్శన స్పర్శన సంభాషణాదులను ఎప్పటిలాగే కొనసాగించింది. గడ్డ పక్వస్థితికి వచ్చింది.
18-7-1975న అమ్మ బిడ్డలు డా॥ఎస్.వి.సుబ్బారావుగారు, డా||ఎ.కేశవరావు గారు, డా|| ఆర్.జానకీదేవిగారు హుటా హుటిన జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మ ఆదేశానుసారం గడ్డకు శస్త్ర చికిత్స చేయ సంసిద్ధులైనారు.
Operation చేయటానికి అక్కడ అన్ని అంశాలూ ప్రతికూలంగానే ఉన్నాయి. అమ్మ గదిలో నిత్యం పదిమంది మసలుతూ ఉంటారు. అది disinfectant theatre కాదు: దానికి క్రిమి సంహారక లక్షణం లేదు. సరే అమ్మ నిద్రించే, దర్శనం ప్రసాదించే పట్టె మంచమే operation table పైన Focus lights లేవు కదా, కరెంటు లేదు, సాధారణ విద్యుద్దీప సౌకర్యం కూడా లేదు; Torch light వెలుగులో చేయాలి. Surgery కి అవసరమైన knives, scissors ఏమీ లేవు. అమ్మ సూచన, సలహామేరకు ఒక blade తీసుకున్నారు. ఇంతకూ అతిముఖ్యమైనదేది? మత్తుమందు (anaesthesia) అదీ లేనేలేదు.
ఇక డాక్టర్లు చేతుల్లో ఉంది అనుకుంటున్న ఒకే ఒక జాగ్రత్త – blade ని (sterilize) ఉడక బెట్టడం. కనుక వారు అదే పనిగా blade ని ఉడక బెడుతూ ఉన్నారు. ఆ సమయంలో అమ్మవారితో “పప్పు ఉడక బెట్టినట్లు blade ని ఎంత సేపు ఉడక బెడతారు”? అన్నది. అలా అన్యాపదేశంగా అమ్మ సకల మానవాళినీ ప్రశ్నిస్తోంది. blade ని గంటల తరబడి ఉడక బెడితే ఒరిగే దేమిటి? అంటే “నువ్వు ఎంతగా చేస్తున్నానని అనుకున్నా, ఆ శక్తి అనుకోనిదీ చేయించనిదీ నువ్వు అనుకోలేవు చేయలేవు” అంటూ ఒక పారమార్ధిక సత్యాన్ని ఆవిష్కరించింది.
“ఎంతసేపు ఉడక బెడతారు?” అనే ప్రశ్నకు ఎన్నో అర్థాలు చెప్పుకోవచ్చు. సర్వసాధారణంగా ప్రతివ్యక్తీ ‘నన్ను ఎవరూ అర్థం చేసుకోరు’ అని పదే పదే వాపోతాడు. వాస్తవానికి ఏ వ్యక్తి తనకి తాను అర్ధం కాదు. కాగా ‘తాను మునిగింది గంగ, తాను వలచింది రంభ’ అనే సహజ వికృత మనస్తత్వమే సమస్యలు అనే సర్పాలకు ఆలవాలం, పెద్ద పుట్ట. దీనిలోంచి బయట పడటానికి ఒక సరళ మార్గంలో నడిచి ప్రబోధించింది ‘సరే’ అనే పదాన్ని. శాంతి సౌఖ్యాలకి పట్టుకొమ్మ సర్దుబాటుతనం (adjustment). “వంకాయలో పుచ్చు ఉంటే పుచ్చుతీసివేసి వాడుకుంటాము.” అని సోదాహరణంగా వివరించింది. దీని నంతా ప్రక్కన పెట్టేసి ‘అమ్మా! జీవితమంతా బాధల తోరణాలేనా? అని విలపిస్తే “బాధల తోరణం కాదు, నాన్నా!, బాధలతో రణం” అని నిజ జీవితంలో కురుక్షేత్ర సమరాంగణంలో కాని, దేవ దానవ క్షీర సాగర మధనంలో కాని మడమ త్రిప్పని వీరునిలా పోరాడాలి అని వెన్నుతట్టి ధైర్యాన్నిస్తుంది.
పిరికితనం, భయం, అకర్మణ్యత్వం అనేవి అమ్మ నిఘంటువులో లేవు. “సీత, సావిత్రి, హరిశ్చంద్రుడు.. కధల నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము? వాళ్ళతో పోలిస్తే మనం ఏం బాధలు పడుతున్నాం? బాధలు పడటానికి సిద్ధంగా ఉండాలి, నాన్నా!” అనే సూనృతవాక్యాన్ని వినిపిస్తుంది.
“ఎంతసేపు ఉడకబెడతారు?” అనే ప్రశ్న పారా హుషార్, మేలుకొలుపు. ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు గడిచినా అరిగిపోయిన ఒకే గ్రామఫోన్ రికార్డు వినిపిస్తాం మనం – ‘ దేవుని కేం హాయిగ ఉన్నాడు, ఈ మానవుడే బాధలు పడుతున్నాడు’ అని. లోతుగా ఆలోచిస్తే మానవ రూపంలో/ సకల సృష్టి రూపంగా కష్టసుఖాలు అనుభవిస్తున్నది వాడే / ఆ శక్తి / భగవంతుడు. కందకి లేని దురద మరి కత్తిపీటకి ఎందుకో!
“ఎంతసేపు ఉడకబెడతారు?” అనే ప్రశ్నకి పోతన గారు ప్రహ్లాదుని పలుకులద్వారా ఇలా సమాధానం ఇచ్చారు – ‘అచ్చపు జీకటిం బడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికిన్ చెచ్చర పుట్టునే పరులు జెప్పిననైన నిజేచ్ఛమైన ఏమిచ్చిననైన కానలకు ఏగిననైన హరిప్రబోధముల్’ అని.
కాగా జగన్మాత అమ్మను ఆశ్రయించిన వారికి కొండంత అండ ఉందని గుండెల మీద చేయి వేసుకుని హాయిగా శ్వాసిస్తారు. ‘లడ్డు అవటం కంటే లడ్డు తినటం హాయి’ అని వారు గ్రహించారు కనుక, మమతల పందిరి నీడలో అనురాగ భరిత ఏకోదర రక్త సంబంధ బంధానికి ముడివడి యున్నారు కనుక.
(సశేషం…)