గత సంచిక తరువాయి…
- అమ్మ ప.గో.జిల్లా పాలకొల్లు వచ్చింది. ఆ పట్టణం గొప్ప వాణిజ్య కేంద్రం. కనుకనే లాభనష్టాలు, పాపపుణ్యాలు… అంశాల్ని బేరీజు వేసుకొని సోదరుడు ఆడిటర్ గోపిగారు ‘పాపాల కొల్లు వచ్చావమ్మా’ అన్నారు. నవ్వుతూ అమ్మ, “పాపాలకొల్లు కాదు, నాన్నా! పాపలకొల్లు” అన్నది. ఆశ్చర్యం. నాటి సాయంకాలం ‘బాల విహార్ ‘ని అమ్మ తన సువర్ణ హస్తాల మీదుగా ప్రారంభించింది. మన గుణదోషాలను ఎంచటానికి తాను రాలేదని అమ్మ స్పష్టం చేసింది. పురుషకారాన్ని పూర్వపక్షం చేసింది. “నువ్వు ఎంతగా చేస్తున్నానని అనుకున్నా, ఆశక్తి అనుకొనిదీ, చేయించనిదీ నువ్వు అనుకోలేవు చెయ్యలేవు” – అనీ, “చేతలు చేతుల్లో లేవు” అనీ విస్పష్టంగా ప్రకటించిన అమ్మకి అవ్యాజకరుణా రసార్ణవకి పాపులు కూడా పాపలుగా, కంటి పాపలుగా కనిపిస్తారు.
- ‘దయ్యాలు ఉన్నాయా, అమ్మా?’ అని అడిగితే, “లేకేమమ్మా – దయలేని వాళ్ళంతా దయ్యాలే” అని నిర్వచించింది అమ్మ. భర్తృహరి సుభాషితాల్లో ‘తమకై అన్యహితార్థ ఘాతుక జనుల్ దైత్యుల్, వృధాన్యార్థ భంగముగావించెడివారలు ఎవ్వరో?’ – అని అర్థోక్తిలో ఆగిపోయారు. తమ ప్రయోజనం కోసం పరులను కొల్లగొట్టే వారు రాక్షసులు; పరుల కన్నీటిని తమ పన్నీటిగా భావించే వారు – పిశాచములు. “కరుణారస భరిత హృదయ స్పందనమే దైవత్వం” అని ప్రబోధించింది అమ్మ. దయకు మారుపేరు దైవం. అమ్మ దయాస్వరూపిణి.. కనుకనే విశ్వజనీన మాతృవాత్సల్యం కట్టలు త్రెంచుకొని ప్రవహించగా “అందరికీ సుగతే” అని అమ్మ మాత్రమే చరిత్రలో ప్రప్రథమంగా బేషరతుగా నిఖిల జీవరాశికి అపూర్వవరాన్ని అనుగ్రహించింది.
- ఒకరోజు ఒక సోదరి తన కోపదారు కుమారుణ్ణి అమ్మ వద్దకు తీసుకు వచ్చింది. “అందరిమీదా కోప్పడతాడా?” అని అమ్మ ప్రశ్చించింది. “లేదమ్మా! ఇంట్లో వాళ్ళ మీదే కోప్పడతాడు” అని ఆ తల్లి విన్నవించుకున్నది. అమ్మ నవ్వుతూ ‘కుంకుమ పొట్లాల్ని ప్రసాదంగా ఇస్తూ, “నాకంటే వాడే నయం. వాడికి ఇంట్లో వాళ్లని బయటి వాళ్ళనీ తేడా తెలుస్తోంది. నాకు అదీ తెలియడం లేదు ” అన్నది. అమ్మకి స్వపరభేదం లేదు. సర్వత్రా పరివ్యాప్తమైన మమకారం కల మాధవత్వమే అమ్మతత్త్వం, అమృతత్వం. కనుకనే “నేను అమ్మను. నీకు, మీకు, అందరికీ… పశుపక్ష్యాదులకూ… క్రిమికీటకాదులకు…” అని విస్పష్టంగా ప్రకటించింది. అమ్మ ఒడిలో ధీరులూ-భీరులూ, కలవారూ-ఆస్తిక్యత కలవారూ, పండితులు – పండిత మన్యులు… సర్వులూ; రోగాలూ, విషసర్పాలూ – సర్వసదృశ మనస్తత్వాలూ… తలదాచుకున్నాయి, సేదతీరాయి. ‘ఆత్మ సంహననోద్యుక్త పుత్రప్రేమ ప్రవర్షిణ్యై నమః” అని స్తుతించారు శ్రీ శర్మగారు అమ్మను.
- ‘నిద్ర పోకుండా పని చేస్తున్నావా?’ అని అడిగితే అమ్మ, “నిద్రపోయింది. కనుకనే పని చేస్తున్నాను” – అని అన్నది. బాధ్యత, ఆసక్తి, తప్పని సరి పరిస్థితుల్లో శక్తి ఉన్నా లేకపోయినా నడుం వంచి, తలవంచి పని చేయాల్సివస్తుంది. అపుడు నిద్రరాదు; ఎక్కడికో పోతుంది. అపుడు నిద్ర తేలిపోయిందని అంటూంటాం. అది శరీరంలో దైవం చేసిన అద్భుతమైన ఏర్పాటు; Sympathetic and Parasympathetic యొక్క విద్యుక్త ధర్మం అది.
- బ్రహ్మాండం రవి అన్నయ్య పెళ్ళికి నేను రాలేదు. నన్ను “రవి అన్నయ్య పెళ్ళికి ఎందుకు రాలేదు?” అని సూటిగా ప్రశ్నించింది అమ్మ. ‘ప్రమోషన్ వచ్చిందమ్మా, అందుకని’ అన్నాను. వెంటనే అమ్మ “నీకు ప్రమోషన్ రాలేదు. ఇమోషన్ వచ్చింది” అన్నది. నిజమే. యు.పి. స్కూల్ హెడ్మాస్టర్గా వెస్ట్ గోదావరి జిల్లా పరిషత్, సెక్రటరీగారు ఆర్డర్స్ ఇచ్చారు. కానీ వాటిని నిర్లక్ష్యం చేసి, భీమడోలు బి.డి.ఓ.గారు ఆర్డర్స్ ఇవ్వలేదు. ఆ విషయమై ఫిర్యాదు చేసి ఎదురు చూడటంతో కాలం గడిచి పోయింది. నెలలు పట్టింది పని సానుకూలం కావటానికి. అదీ సంగతి.
- ఒక సందర్భంలో అమ్మ, “తెలివిని దేనితో కొలుస్తారు?” అని ప్రశ్నించింది. ‘తెలివితో’ అని సమాధానం వచ్చింది. “మరి వెర్రిని దేనితో కొలుస్తారు?” అని అనుబంధ ప్రశ్నవేసింది. దానికి సమాధానం రాలేదు. “వెర్రితో అని సమాధానపడాలి. ఇందుకు సరియైన ఔషధాన్ని అమ్మ విజ్ఞులకు అందించింది; “తనను తాను విమర్థించుకోవటం వివేకం, ఇతరులను విమర్శించటం అవివేకం” అని. ‘ఆత్మశ్లాఘాంచ పరనిందాం చ నకుర్యాత్ ఉత్తమః క్వచిత్’ – అనేది ఆర్యోక్తి కదా!
- ‘బర్త్ కంట్రోల్ గురించి నీ అభిప్రాయం ఏమిటమ్మా?’ అని ప్రశ్నిస్తే అమ్మ., “బర్త్ కంట్రోల్ ఎందుకు, నాన్నా? భర్త కంట్రోల్ అయితే చాలదా?” అని ప్రశ్నించింది. కామము (కోరిక) అనే ఏరును దాటాలనే కోరికతో ఒక నావ సహాయం తీసుకున్నాం. తీరా నావ కదలగానే లక్ష్యాన్ని మరిచిపోయి నీళ్ళల్లో కెరటాల మధ్య కేరింతలు కొడుతూ చెక్కర్లు తిరుగుతున్నాం. సర్వాన్నీ అనుభవిస్తూ సర్వాన్నీ విడిచి పెట్టేదే వివాహం” – అని అమ్మ వివరించింది. The art of living is the art of leaving. ఈ సత్యాన్ని విస్మరించి సర్వాన్నీ అనుభవించటమే జీవిత లక్ష్యం అని భావిస్తున్నాం. ఇక్కడ ఒక సున్నితమైన అంశం ఉన్నది. శ్రీ విద్యను స్త్రీ విద్యగా అపార్థం చేసికొని, భార్యను తల్లిగా చూడాలనే తపనలో తల్లిగా చూడాల్సిన పరస్త్రీని భార్యగా చూసే ప్రమాదం ఉంది. ఒకసారి ఒక ఆసామి గోళ్ళలో సెంటును పూసుకొని నారింజపండు వలిచి తొనలు పంచాడు. అవి సువాసనలు వెదజల్లుతున్నాయి. ఆ సందర్భంలో అమ్మ, “ఎందుకీ అవస్థ? నారింజ పండుకి నారింజ పండు వాసనే సువాసన” అని గుర్తు చేసింది. ఆ విధంగా భార్యను భార్యగా చూడటమే సబబు.
- ఒకసారి అమ్మ గర్భస్థ శిశువు చనిపోయి రెండు రోజులైంది. డాక్టర్లు దిగ్భ్రాంతి చెందారు. అమ్మ బ్రతకదని తేల్చి చెప్పారు. చిదంబరరావు తాతగారు వచ్చి అమ్మ ప్రక్కలో కూర్చున్నారు. వారి కళ్ళు జలజలా వర్షించాయి, దుఃఖంతో గొంతు పూడిపోయింది. అతి కష్టం మీద అన్నారు; అమ్మా! నువ్వు బ్రతకవట. ఏమిటి నీ కోరిక?’ – అని. తడుముకోకుండా అమ్మ, “బ్రతకాలని ఉంది, తాతగారూ?” అని అన్నది. ఏడిచే వారల్లా పగలబడి నవ్వారు, ‘ఇప్పుడు కూడా ఇలాంటి మాటలేనా?’ అంటూ. ‘ధనం మూలం ఇదం జగత్’ అనే లోకోక్తిని సవరించి, “తను మూలం ఇదం జగత్’ అని అమ్మ స్పష్టంగా చెప్పింది. వ్యక్తి తనకోసమే భార్య, భర్త, సంతానము, ఇల్లు, బంధుమిత్రుల…. ని ప్రేమిస్తాడు. తానే లేనపుడు దేనితోనూ అవసరం లేదు. దీనినే అర్షవాక్యం ‘ఆత్మను కామాయ సర్వ ప్రియం భవతి’ అని వివరిస్తోంది. కొన ఊపిరితో ఉన్న వానిని ‘ఏమిటి నీ అంతిమ కోరిక?’ అని అడిగితే ‘బ్రతకాలని’ అనటం యదార్థం కదా! యక్షప్రశ్నలలో ఒకటి- ‘ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి?’ అనేది. అందుకు ధర్మరాజు ‘ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి తనకు మాత్రం. మరణం లేదని విశ్వసిస్తాడు. ఇదే ఆశ్చర్యకరమైనది’ అని సమాధానం ఇస్తాడు..
కానీ అమ్మ బ్రతకాలని కోరుకోవటంలో పరమార్థం ఉంది. మనకి స్వార్థమే పరమార్థం అయితే అమ్మకి పరమార్థమే స్వార్థం. మనకోసమే మనం జీవిస్తాం, కాని అమ్మ శ్వాసించేది ఒకరికి, పదిమందికి ఊపిరిపోయటం కోసం; నడుం విరిగి కూలబడిన వాళ్ళని నిలబెట్టడం కోసం, అంటే విశ్వకళ్యాణం కోసం, జీవకోటి సముద్ధరణ కోసం, కొడిగట్టే జీవితాలలో అమృతధారల్ని నింపటం కోసం, సర్వజీవ జీవన సంజీవనిని అనుగ్రహించడం కోసం. అందుకోసం కన్నబిడ్డను సమాధి చేసింది; తన పతిదేవునితో సహా ఆలయ ప్రవేశం చేసింది. ప్రకృష్టేన తిష్ఠతి ఇతి ప్రతిష్ఠా. అనుగ్రహస్వరూపిణిగా, కారుణ్య రసాధి దేవతగా సుప్రతిష్ఠిత అయింది.
- డా॥ కేశవరావుగారు అమ్మకు గుండె పరీక్ష చేసేందుకు గుంటూరు తీసుకువచ్చారు. ఆ సందర్భంగా సుప్రసిద్ధ కార్డియాలజిస్టు శ్రీ లక్ష్మణరావుగారు అమ్మతో, ‘అమ్మా! కేశవరావు చెయిన్ స్మోకర్ అయ్యాడు. ఎంత చెప్పినా వినటం లేదు, మానటం లేదు -‘ అని అన్నారు. అందుకు అమ్మ నవ్వుతూ, “నాన్నా! సిగరెట్లు కాల్చటం నాకూ ఇష్టమే. ఐదు, ఐదు, ఐదు అనే సిగరెట్లు ఉంటాయి అవి తీసుకురండి” అన్నది. అందుకు అక్కడ ఉన్న వారంతా ఫక్కున నవ్వారు. ఆశ్చర్యం. ఆ మర్నాటి నుంచి కేశవరావు గారు సిగెట్టు ముట్టుకోలేదు. అమ్మ (దైవం) ఇష్టాఇష్టాల మేరకే మన ఇష్టాఇష్టాలు రాజ్యమేలుతాయ, జీవనరధాన్ని పరుగెత్తిస్తాయి. ఆ రోజు వరకు అమితంగా ప్రేమించిన గోల్డ్ ఫ్లేక్ సిగిరెట్లంటే మర్నాటి నుంచి అంత విముఖత, విరక్తి ఎందుకో మరి? ఘటనా ఘటన సమర్థ అమ్మ.
18.ఒకసారి అమ్మ నిద్రలో కలవరిస్తున్నది. ‘ఏమిటమ్మా?’ అని అడిగితే కళ్ళు తెరవకుండానే; “అరవిందాశ్రమం మదర్ మాట్లాడుతున్నాను” అన్నది. అతి మానుష శక్తి సంపన్న అమ్మ దృక్కులు, వాక్కులు, చర్యలకు భాష్యం చెప్పటం అసాధ్యం.
ఒకసారి నేను కంచి వెళ్ళి చిన్నస్వాముల వారిని, కలదై వెళ్ళి పరమాచార్యులను, తిరువణ్ణామలై వెళ్ళి శ్రీరమణాశ్రమాన్ని, చలం గారిని దర్శించుకొని జిల్లెళ్ళమూడి వచ్చాను. నన్ను చూడగానే అమ్మ, “మా అబ్బాయిలు ఎలా ఉన్నారు?” అని ప్రశ్నించింది.
తర్వాత వాత్సల్యయాత్రలో భాగంగా మద్రాసు వెళ్ళి ఇంజనీరు తాతగారి కుమారుడు సో॥ అచ్యుత్ ఇంట్లో 22 రోజులు అమ్మ బస చేసింది, కంచి, కలవై, తిరువణ్ణామలై వెళ్ళి తన బిడ్డల్ని కళ్ళారా చూసుకున్నది, ప్రేమతో పలకరించింది. తత, గుండెలకు హత్తుకున్నది.
ది. 14.4.1975 తేదీ, అమ్మ మద్రాసు నుండి జిల్లెళ్ళమూడి బయలుదేర బోతున్నది. మమకార రూపిణీ అమ్మ ఎడబాటు భరించ లేక అచ్యుత్ ‘అమ్మా! నువ్వు వీలైనంత త్వరగా మా ఇంటికి రావాలమ్మా’ అని విన్నవించుకున్నారు. “తప్పకుండా, నాన్నా!” అంటూ వీడ్కోలు పలికి అమ్మ వెళ్ళి ఇంటి ముందు లాస్ లో కుర్చీలో అసీన అయింది. అపుడు నేపధ్యగాయని శ్రీమతి జానకి తన గాత్ర మాధుర్యాన్ని నివేదన చేసింది. దానిని స్వీకరిస్తూనే అమ్మ చకాచకా తిరిగి అచ్యుత్ ఇంట్లోకి వెళ్ళింది. గబగబా అచ్యుత్ కుటుంబం ఇంటిలోపలికి అమ్మను అనుసరించారు. అమ్మ వారి వంక చిరునవ్వులు చిందిస్తూ, “మళ్ళీ త్వరగా మా ఇంటికిరా అమ్మా ॥ అన్నావుగా, త్వరగా వచ్చేశా, నాన్నా!” అన్నది అమ్మ. అమ్మ వాక్చమత్కకృతికి అచ్చటి వారంతా ఆశ్చర్యమూ, ఆనందమూ పొందారు. వాస్తవానికి అమ్మ శారీరకంగా వస్తేనే వచ్చినట్లుకాదు. ఇదే అమ్మలో ప్రస్ఫుటంగా కనిపించే విలక్షణమైన అగ్రాహ్యమైన ప్రేమతత్వం. తనకు నాలుగు గోడలు అడ్డు కావని, త్రికాలములు లేవు అంతా వర్తమానమేనని అమ్మ స్పష్టం చేసింది. అయినా తన పిల్లలంతా తన కళ్ళముందే ఉండాలని కోరుకుంటుంది. “ఇక్కడ కాలేజి పెడతాను నువ్వు ప్రిన్సిపాల్” (డా॥ రాధాకృష్ణశర్మగారితో); “ఇక్కడ హాస్పిటల్ పెడతాను. నువ్వు డాక్టర్ (సత్యం అన్నయ్యతో); “ఇక్కడ హైస్కూల్ పెడతాను నువ్వు హెడ్మాస్టర్ (నాతో)” – అని ఆశించింది. ‘ఆదరణాలయం కట్టాలమ్మా’ అని కేశవరావుగారు అంటే, “నాన్నా! నువ్వు ఇక్కడ ఉండు. వచ్చి చూసుకో” అన్నది. కనుకనే అమ్మను ‘ప్రేమరూపిణి, ప్రేమభాషిణి, ప్రేమవర్షిణి’ అని కీర్తిస్తూ “ప్రేమోన్మాదిని” అంటేనేగానీ తనివి తీర లేదు శ్రీ శర్మగారికి. అమ్మప్రేమ అలౌకికం, అమ్మ కారుణ్యం నిరుపమానం, అమ్మ సంకల్పం అమోఘం, అమ్మ శక్తి పరమాద్భుతం.
హాస్య సల్లాప పండిత అమ్మ శ్రీ చరణాలకు శతసహస్రాధిక వందనములు. సమాప్తం