1. Home
  2. Articles
  3. Mother of All
  4. అమ్మ హాస్యంలో రహస్యం

అమ్మ హాస్యంలో రహస్యం

A V R Subramanyam
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 10
Month : April
Issue Number : 2
Year : 2011

అమ్మ అన్నది, “నా హాస్యంలో రహస్యం ఉంది” అని. నాకు తెలిసినంత వరకు వివరిస్తాను సాధ్యమైనన్ని ఉదాహరణలతో.

  1. ఒకసారి రామకృష్ణ అన్నయ్యకి ఒక సోదరుడు అమ్మ ఫొటో ఒకటి అందించాడు. అమ్మ సంతకం చేస్తే పటం కట్టించి పూజా మందిరంలో పెట్టుకోవాలని వారి కోరిక. ‘అమ్మా! ఇందులో ప్రాణప్రతిష్ఠ చేయమ్మా’ అని అన్నయ్య అమ్మను అభ్యర్థించాడు. అమ్మ చిరునవ్వుతో, “అయితే ఇప్పుడు ఇందులో ప్రాణంలేదని అంటావా?” అని ప్రశ్నించింది. అమ్మ ప్రశ్నే సమాధానం. “సృష్టేదైవం” అనీ, “సృష్టి అంతా సజీవమే, చైతన్య తరంగితమే” అని ప్రబోధించిన అమ్మ దృష్టిలో నిర్జీవ పదార్థం అన్నది లేనే లేదు. ప్రాణశక్తి ఉన్నది కాబట్టి ఆ ఫొటో అమ్మ మహనీయ దివ్యరూపాన్ని నయనానందకరంగా వర్ణచిత్రంగా ప్రదర్శిస్తోంది.
  2. ‘నీకు వితండవాదం నచ్చుతుందా, అమ్మా?’ అంటే అమ్మ, “వితండమేమున్నది, నాన్నా? నా దృష్టిలో మీరంతా కోదండపాణులే” అన్నది. ‘నువ్వు రాజరాజేశ్వరివి, అమ్మా!” అని అంటే, “నాన్నా! మీరు కానిది నేనేమీ కాను” అని స్పష్టం చేసింది. “మీరు నా బిడ్డలేకాదు, నా అవయవాలు” అంటూ విశ్వరూప సారాన్ని చాటి చెప్పింది. అమ్మ మాత్రమే ప్రప్రథమంగా సంపూర్ణత్వాన్ని చాటింది. ఆస్తికులూ, నాస్తికులూ, దుష్టులూ – శిష్టులూ, సకల జంతుజాలము, సకల సృష్టికి తాను మాతృమూర్తినని ప్రకటించింది. కనుకనే అమ్మ దృష్టిలో అందరూ కారణజన్ములే, వ్యక్తావ్యక్త పరబ్రహ్మ స్వరూపాలే.
  3. ఒక మహమ్మదీయ సోదరుడు వచ్చి అమ్మ శ్రీచరణాలకు నమస్కరించాడు. రామకృష్ణ అన్నయ్య అమ్మతో, ‘ఇతను ముసల్మాన్, అమ్మా!’ అన్నాడు. అమ్మ చిరునవ్వుతో, “నేనూ ముసలమ్మనే” అన్నది. ముసలమ్మ అనే పదాన్ని అమ్మ ‘ముసల్మాన్క అమ్మ’ అనే అర్థంలో వాడింది. అమ్మ తనను గురించి ఒక సందర్భంలో ‘తల్లి లేని తల్లి’ అంటే ‘తొలి’ అని వివరించింది. ఆద్యంతరహితమైన మూల ప్రకృతి అమ్మ. కావున అమ్మ ‘చాల పెద్దమ్మ’, ‘అమ్మలగన్న అమ్మ’. చిదంబరరావు తాతగారు అమ్మను ‘ఆదెమ్మ’, ‘సోదెమ్మ’ అని పిలిచారు. ఆది + అమ్మ ఆదెమ్మ: సోదెమ్మ అంటే సరస్వతీమాత. శబ్దమూ, శబ్దార్థమూ రెండూ అమ్మే. ‘వాగర్థావివసంపృక్తా అని కాళిదాసు వర్ణించిన అర్ధనారీశ్వర స్వరూపం అమ్మ. దానినే పోతనగారు. ‘పురాణదంపతులు’ అని అభివర్ణించారు. ‘పురా అపినవం పురాణం. నిత్య నూతనత్వమే పురాణత్వం. దీనినే వేదం ‘సద్యోజాతం ప్రపద్యామి’ అంటూ ఈశ్వర స్వరూపాన్ని, మాహాత్మ్యాన్ని వేనోళ్ళ శ్లాఘిస్తోంది.
  4. ఒక సోదరుడు మధురాష్టకాన్ని పఠిస్తూంటే అమ్మ, “నాకు అధరం మధురం కాదు, ఉదరం మధురం” అన్నది. ‘ఉదరం మధురం’ అనే దానికి సామాన్యార్థం. – భోజన ప్రియత్వం; చిన్నినా బొజ్జకు శ్రీరామరక్ష’ అనే కరడు గట్టిన స్వార్థ పరత్వం. కానీ అమ్మ అనటంలో కడుపుతీపిని తెలియజేస్తుంది. కడుపు తీపి అంటే కన్నసంతాన సుఖసౌఖ్యాలు, ఆయుర్భాగ్యాలు. అమ్మ సంతానం మనుష్యులు, పశుపక్ష్యాదులూ, క్రిమికీటకాదులూ సర్వమూను. ఒకసారి అమ్మ బాల్యంలో ఒక కొలనులో స్నానం చేస్తోంది. అక్కడి ఆకులూ, తామరపూలూ, పక్షులూ, సీతాకోకచిలుకలు, మిడతలు వంటి కీటకాలు,. క్రిములూ గుంపులు గుంపులుగా వచ్చి అమ్మను చుట్టుముట్టి కప్పి వేశాయి. అమ్మ వాటిని కౌగిలించుకొని పరవశించిందో, లేక అవి అమ్మ ఒడిలో ఆదమరిచి సేదతీరాయో తెలియని అవ్యక్తమధుర రసవత్తర సన్నివేశం అది. సృష్టితో అవిభాజ్యమైన సంబంధాన్ని కలిగిన అమ్మ నిజస్వరూపాన్ని ఆ దృశ్యం కళ్ళకి కట్టినట్లు చూపిస్తుంది; ‘సృష్టే దైవం’ అనే వాస్తవాన్ని అది అక్షరాలా బోధిస్తుంది. 5. ఒకసారి రామకృష్ణ అన్నయ్య ప్రయాణమై బొట్టు పెట్టించుకొని సెలవు తీసికోవటం కోసం అమ్మ దగ్గరకి వచ్చాడు. అమ్మ, “ఊరికే వెడుతున్నావా?” ||అన్నది. ఔనని అన్నయ్య తలూపాడు. సాయంకాలం తిరిగివచ్చి! అమ్మా!! వెళ్ళిన పన్లేవీ ‘పూర్తి కాలేదు’ అన్నాడు. వెంటనే నేను, “ఉదయం అమ్మ నీకు చెప్పకనే చెప్పింది. ఊరికే వెడుతున్నావా?, కాలక్షేపానికి వెడుతున్నావా? పన్లేవీ జరగవు” అని అన్నాను. అన్నయ్య నిండుగా నవ్వాడు. పనులు జరగటం, జరగకపోవటం… రెండూ మహత్సంకల్పంలో భాగాలే.

ఒకసారి అమ్మతో, ‘సంకల్పమే భగవంతుడు అని అన్నావు కదా! మన సంకల్పాలన్నీ ఎందుకు సఫలం కావటం లేదు? అపజయాలు, ఎదురు దెబ్బలూ, జీవితంలో ఊహించని విధంగా వడగాల్పులు, తుఫానులు ఎందుకు అతలాకుతలం చేస్తున్నాయి?’ అని అన్నాను. ఆ సందర్భంలో అమ్మ ఒక దేవరహస్యాన్ని విడమరిచి చెప్పింది – “సంకల్పం అంటే ఒక ఆలోచన కలిగింది. అనీ, వికల్పం అంటే అది మారిందీ అని. సంకల్ప వికల్పాలు రెండూ వాడివే

(ఆ శక్తివే) నన్న సంకల్పమే సత్సంకల్పం. మనం అనుకున్నవన్నీ జరుగుతూంటే ఆశక్తి ఉన్నదో, లేదో కూడా తెలియదు. తాను (ఆశక్తి) ఉన్నాననే గుర్తు కలిగించటం కోసమే ఇలా అనిపించి కాదనిపిస్తాడని అనిపిస్తుంది నాకు” . అని. పసిపిల్లలు తల్లిని విడిచి దూరంగా పోయి ఆడుకుంటున్నారనుకోండి. వారికేమైనా ఆపద సంభవిస్తుందేమోనని, తన ఒడికి, రక్షణకి దూరమైనారని ఆతల్లి దిగులు పడుతుంది. ఒక్క మొట్టికాయ వేసి దగ్గరకు లాక్కుంటుంది.. ఇదీ అంతే. కనుకనే కృష్ణ పరమాత్మ ‘సుఖేషు విగత స్పృహ:’ అని సూటిగా ఈ వాస్తవాన్నే ప్రకటించారు: “అంతా వాడే (ఆదైవం) చేస్తున్నాడని నమ్ము” అని ఆదేశిస్తుంది అమ్మ.

  1. అమ్మ నరసాపురం వచ్చింది. డా॥ కేశవరావుగారు అమ్మకి వారి ఆస్పత్రి చూపించి, అమ్మను డాక్టర్ కుర్చీలో కూర్చొండబెట్టి, చేతికి Stethoscope అందించి ‘నన్ను పరీక్షించమ్మా’ అని అడిగారు. అమ్మ నవ్వుతూ, “నేను రావటమే నీకు పరీక్ష” అన్నది. అమ్మ నిరాహార. అమ్మ కోసం ఏమీ ఏర్పాట్లు చేసుకోనక్కర్లేదు. పది బిందెల వేడి నీళ్ళు ఉంటే చాలు; అమ్మ స్నానం చేసి దర్శనం ఈయటానికి. అమ్మతో వచ్చిన వారికి ఫలహారాలు, భోజన వసతి సౌకర్యాలు, జనబాహుళ్యానికి అమ్మ దర్శన భాగ్యాం కలిగించటంకోసం ఏర్పాట్లు, ఇవన్నీ కష్టసాధ్యమే. అందుకు అర్థ బలమేకాదు, అంగబలం కూడా ఉండాలి. అంతేకాదు. అసలు అమ్మ వాత్సల్య యాత్రకు బయలు దేరటానికి కారణం అభాగ్యుల్ని, పీడితుల్ని ఆదరించటం కోసం, వారికి పెట్టుకోవటానికి గుడ్డలు, ప్రసాదం దండిగా ముందుగా సిద్ధం చేసుకోవాలి. అవి అమ్మ అనుగ్రహ ప్రసారానికి మాధ్యమాలు కనుక,
  2. అమ్మకు ఆటలు, పాటలు అంటే ఎంతో ఇష్టం. అమ్మ జగన్నాటక సూత్రధారి. అమ్మ సన్నిధిలో క్రికెట్, కబడీ, వాలీబాల్, అమ్మ గదిలో క్యారమ్స్, చైనీస్ చెక్కర్, వైకుంఠపాళి… ఆడేవారు. వైకుంఠపాళి ఆడుతూ సోదరి భవానీ ముందుగా అమ్మను దేవుడి పందెం వేయమని కోరింది. అందుకు అమ్మ, “దేవుడి పందెం ఏముంది? దేవుడే పందెం వేస్తుంటే!” అని చమత్కరించింది.. చిత్రం ఏమంటే అమ్మ యొక్క ఈ అనుగ్రహావతారంలో అరమరికలు లేవు, దాపరికం లేదు; పారదర్శకతకి అమ్మకి అమ్మేసాటి. మరి పోలికే లేదు.

“నేనే అనంతపద్మనాభ స్వామిని, నేనే భువనేశ్వరీదేవిని, నేనే లలితాదేవిని, నేనే సర్వసృష్టి కారిణిని, నేనే జగత్కర్తను, జగద్భర్తను” అని ఆయా సందర్భాలలో స్పష్టం చేసింది. అయినా అలా దర్శించగలిగిన భాగ్యశాలురు ఎందరు?

  1. ఒకసారి నాన్నగార్కి (శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావుగార్కి) అనారోగ్యం చేసింది. బాపట్లలో వైద్యం చేశారు. తగ్గి, కులాసాగా ఉన్న తర్వాత జిల్లెళ్ళమూడి మరలి వస్తున్నాము. డాక్టర్గారు నాన్నగార్కి రోజూ పళ్ళరసం ఇమ్మన్నారు. వెంట నేను ఉన్నాను. మా కారు రైలు గేటు దగ్గర ఆగింది. ప్రక్కనే పళ్ళదుకాణాలు ఉన్నాయి. డజను బత్తాయలు కొందామనుకొని ‘ఎందుకులే. అమ్మ దగ్గరకు రోజు చాల పళ్ళు వస్తాయి కదా!” అని ఊరుకున్నాను. జిల్లెళ్ళమూడి వచ్చాము. భోజనం చేశాక అమ్మ దగ్గరకి వెళ్ళాను. అపుడు మా సంభాషణ ఇలా సాగింది. –

అమ్మ : నాన్నా! డాక్టరు గారు ఏమన్నారు? నేను : రోజూ ఫ్రూట్ జూస్ ఇమ్మన్నారు, అమ్మా.

అమ్మ : బాపట్ల నుంచి వచ్చేటప్పుడు బత్తాయలు కొని తీసుకురాకపోయావా? నేను :

అమ్మ : ఇక్కడికి చాల మంది పళ్ళు తెస్తారు. వాటిని తిరిగి ప్రసాదంగా ఇస్తే బాగుంటుంది. మనం వాడుకుంటే బాగుండదుకదా!

నేను : (దొంగవానికి తేలు కుట్టినట్లు) నీదంతా నాటకం అమ్మా! నా మనసులో మాట తెలిసే అంటున్నావు. 

అమ్మ : (నవ్వుతూ) ఇదేమీ భౌ భౌ కాదు; ఏకపాత్రాభినయం కాదు, నాన్నా! మీరు పాత్రధారులే.

ఈశ్వర లీలాకల్పిత విశ్వమానవ రంగస్థలంపై నాటక కర్త అయిన దైవం కూడా ఒక పాత్ర ధరించి వచ్చాడు. దానినే మనం అవతారం అని అంటున్నాం. దైవం అవతారం ఎత్తటానికి కారణం: “ఇంత అని తాను పెట్టుకున్న నిర్ణయం పూర్తయి రావటమే ” అని వివరించింది అమ్మ, (మాతృశ్రీ, ఫిబ్రవరి ’67) దీనిని బట్టి అవతారమూర్తి లక్ష్యమైనా విధి విధానాల పాలన, పర్యవేక్షణ, మూల్యాంకనము (Evaluation) కాలానుగుణంగా సమయానుకూలంగా విధాన నిర్ణయ పూర్వక ధర్మ పరిపాలన అని అర్థమౌతుంది. ‘నీవు భూమిపై నిలిచిన తరినే జీవించితి కడు ధన్యుడ నమ్మా’ – అని డా॥ పన్నాల రాధాకృష్ణశర్మగారు అమ్మ అవతారకాలంలో జీవించటం పురాకృత పుణ్యఫలం అని చాటారు.

(సశేషం)

 

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!