ఏ తల్లి చరణమ్ము లెంత పవిత్రమో
ఆ తల్లి వెలసె నీ అర్కపురిని
ఏ తల్లి గుండెలో ఎనలేని ప్రేమయో
ఆ తల్లి వెలసె నీ అర్కపురిని
ఏ తల్లి చూపులో ఎంత కారుణ్యమో
తల్లి వెలసె నీ అర్కపురిని
ఏ తల్లి వదనమ్ము ఇందు నిభాస్యమో
ఆ తల్లి వెలసె నీ అర్క పురిని
పరమ పూజ్యురాలు భక్త మందారమ్ము
అవని జనుల కావ నవతరించె
అది లేనిది కద! అంతు చిక్కదెపుడు
తల్లి లీల లెంచ తరమె మనకు?
హిమశైల శిఖరాన ఇరవైన శ్రీగౌరి
అర్కపురిని చేరె హైమవతిగ
కొలుచిన వారికి కొంగు బంగారమై
భాసించు నెప్పుడు వరము లొసగు
దివ్య కాంతుల మోము నవ్య శోభల తోడ
దర్శన మిచ్చును తలచినంత
ముగ్ధ మనోహర మోహన దరహాస
చంద్రిక లెల్లెడ సాగుచుండు
నిఖిల జగమునందు నీరజాతేక్షణ
పాద దర్శనమ్మె పాప హరము
జ్ఞాన మొసగుచుండు చదువుల తల్లియై
ప్రేమ కురియుచుండు బిడ్డలందు