అనసూయదేవియే అందరకును తల్లి
అన్నమ్ము పెట్టులే ఆదరముగ
‘అమ్మ బోధ’ యిదియె – ఆచరింప వలెను
ప్రేమను పంచిన – ప్రేమ నిలుచు
ద్వేషభావములేక – వైషమ్యములు వీడు
మానవత్వ మొకటె – మంచిదౌను
కోపమ్ము హేయమ్ము – కోరకు సౌఖ్యమ్ము
సంతృప్తి యన్నదే – స్వర్గమౌను
మంచిమాట పలికి మనుగడ సాగించు
చెడును విడిచి నపుడె – చిత్తశాంతి
స్నేహ మధురిమలను చిందింపగా వలె
అమ్మ సూక్తులెల్ల అద్భుతములు.
హైమనామము జూడ – అసమాన మైనది
కరుణ జూపు నెపుడు – కనులనిండ
అభయ మొసగి మమ్ము – ఆదుకొనెడు తల్లి
భాగ్యమ్ము లొసగెడు – పంకజాక్షి
మల్లె జాజి పూల – మాలల నర్పింతు
విడువ వల దటంచు వేడుకొందు.