జయహోమాతాశ్రీ అన
సూయాయని నిను నుతించ సుగతిన్ పొందున్
సాయము సేయ జనులకు వి
జయ మొసగెడి జననివి సతము నుతింతున్
అర్కపురి యందు వెలసియు
కర్కశమగు పాపములను కడతేర్చి యికన్
తార్కాణముగా నిలచియు
నరునియంతటి యశస్సు నందితివమ్మా!
జిల్లెళ్లమూడి యందున
నెల్ల జనుల్మెచ్చ తల్లి! ఈ భువిలోనన్
సల్లక్షణులగు బిడ్డల
తల్లివి నీవంచు నేడు ధాత నుతించున్
లక్షజనుల కొక బంతిన
నక్షయమగు నన్నదాతవైతివి జననీ!
ఏక్షణము జాగుసేయక
తక్షణమే మాత ! మమ్ము దనిపితి వమ్మా!
కారుణ్యామృత ! కృపనె
ల్లరకును చిందించినావు! లాలించితివే
సరిలేరు నీ కవనిలో
నిరుపమ మధురాతి మధుర నిర్మలమూర్తీ!
మన్నవన పుట్టి సర్వుల
మన్నన లందుకుని గొప్ప మానవతాప్తిన్
అన్నమును పెట్టి అందరి
కన్నాకై కాచునట్టి కారుణ్యనిధీ !!