1. Home
  2. Articles
  3. Mother of All
  4. అమ్మ – 2

అమ్మ – 2

A. Kusuma Chakravarthy
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 7
Month : July
Issue Number : 3
Year : 2008

భక్తి జ్ఞాన తృష్ణలతో అమ్మదరి చేరిన వారికి దొరకని నిధిలేదు. అమ్మయే గొప్ప నిధి నిక్షేపం అమ్మ దగ్గరికి చేరటమే నిధి నిక్షేపాలను పొందటం వంటిది. అపారమైన, అనూహ్యమైన కరుణా వృష్టిలో వారి వారి కోరికలు పుష్పించి, ఫలవంతమవుతాయి. మనస్సుకు అందని, తోచని అవ్యక్తానందాన్ని పొందుతాము. ప్రపంచంలో ప్రేమ మొత్తం గూడుకట్టుకొని ప్రేమైక మూర్తి అమ్మగా రూపొందిందేమోననిపిస్తుంది. సర్వజ్ఞ అయిన అమ్మను చూచిన ఎవరి హృదయం పులకరించదు? అట్టి అమ్మ మన హృదయాలలో చోటు చేసుకున్నప్పుడు మనలోని ఔన్నత్యాలు వాటంతటవే బహిర్గతమవుతాయి.

భగవంతునికై వెదుకులాడు భక్తుడు ఆ భగవదర్శన భాగ్యమునకు పరితపించి పోతాడు. అట్టి భక్తికి జ్ఞానానికి, ప్రేమకు మారుపేరు ‘అమ్మ’. సర్వాత్మగా అమ్మను నమ్మిన వారికి భక్తి జ్ఞానములు కరతలామలకములే కానీ ఇప్పటి నాస్తిక సమాజం అమ్మను ఏపాటి గ్రహించగలదు?

సృష్టిలోని పూర్ణత, తుష్టి, సంతోషం, ఆనందం అంతా అమ్మేననిపిస్తుంది. దేశకాలాతీతమైన ప్రేమతో అమ్మ మనలను అక్కున చేర్చుకుంటుంది. మన ఆలోచనలలో అమ్మ నడయాడినప్పుడు పరిసరాలను, కాలాన్ని గమనించలేము. మన వ్యక్తిత్వాలను అవతలకు నెట్టి మనలను నిమిత్తమాత్రులుగా చేసి సృష్టి, స్థితి, లయాలకు తానే హేతువుగా గోచరిస్తుంది. అమ్మ సన్నిధిలో అనిర్వచనీయమైన శాంతితో మన హృదయం నిండి పోతుంది. ఆది, అనాది అయిన అమ్మ కొరకు మన హృదయం తపిస్తుంది.

భక్తులయిన వారు ఆనందంతో నృత్యం చేస్తారు. ప్రశాంత చిత్తంతో అమ్మ మహిమలను వేనోళ్ళ ప్రవచిస్తారు. అంతూ, అడ్డూ లేని ఆనంద స్వరూపాన్ని అర్థం చేసుకోవటానికి మనం అశక్తులమే. కానీ అమ్మదయ వల్ల మనం తెలుసుకోవటమే కాక అందులో కరిగిపోతాము.

షిర్డీసాయీశుడు “పక్షి కాలికి దారం కట్టి లాగినట్లుగా మిమ్మల్ని నా సన్నిధికి చేర్చుకుంటాను” అన్నాడు. అట్లాగే మన అమ్మ తన అసాధారణ ప్రజ్ఞతో సమాజం నుంచీ, మనందర్నీ ఎక్కడున్నా తన అధీనంలోకి తీసుకొని నెమ్మది మీద వారిలో మార్పును తెస్తుంది. ఈ నాటి సమాజంలో ఇమడలేక, అసంతృప్తితో వ్యధ చెందుతూ జీవిత పరమార్థం గోచరించని స్థితిలో ఆధ్యాత్మికత మన మనస్సుకు వూరట కలిగిస్తుంది. అవ్యక్తమైన ఆనందంలో దైవ సంబంధమైన ఆలోచనలతో మనస్సు హాయిని, శాంతిని, తుష్టిని పుష్టిని పొందుతుంది. అప్పుడు సృష్టి అంతా భగవత్స్వరూపంగా తోచి భక్తిభావం జనించి జ్ఞానయుతమై ఆనందప్రదమైనిలుస్తుంది. ఆ ఆనందం ఇతర సుఖాలకన్నా వేరుగా వున్నప్పుడు అందుండి విరాగం జనిస్తుంది.

అదియే ఆధ్యాత్మిక ప్రగతి. ఆధ్యాత్మికమైన అనుభూతికి అమ్మ దగ్గర మంత్రోపదేశం వుండదు. సర్వం త్యజించవలసిన పని లేదు. ఆశ్రమ స్వీకారం . “నీకు తోచింది చేయి, తపించేవాడు వాడే కదా!” అని “సాధ్యమైనదే సాధన” అని అంటుంది. “ఆచారాలు వేరైనా ఆధ్యాత్మికత ఒకటే” అని నాకు అమ్మ కలలో చెప్పింది. ఏమతానుసారం అర్చించినా తనకే చెందుతుందని అమ్మ ఘంటాపథంగా చెప్పనే చెప్పింది కదా!

“మొదట భగవంతుని కనుగొనిన తరువాత సంపదను ఆర్జింపుము. అంతేగాని దానిని తలక్రిందులు చేయవద్దు. ఆధ్యాత్మికను సాధించుకొనిన తరువాత ప్రాపంచిక జీవితమును గడిపినను నీవెన్నడును మనశ్శాంతిని గోల్పోవని” రామకృష్ణులు అన్నారు. కాబట్టి ఇహలోక సౌఖ్యముల కొఱకు ముందుగా వెంపర్ల ఆడక ఆధ్యాత్మికత సాధించటానికి కృషి చేయాలి.

“మనం ఎందుకు జన్మించామో ఎందుకు జీవిస్తున్నామో తెలుసుకోకుండానే ఈ ప్రపంచం నుంచీ నిష్క్రమిస్తామని శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అన్నారు. కానీ అమ్మలాంటి కొండంత అండ నిండుగా మనకుండగా మన జీవితాల్లో వెలుగు నిండి తప్పకుండా మన జీవితానికి అర్థం, ధ్యేయం ఏర్పడుతుంది.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!