మానవత్వపు మెరుపుచాటున తన దైవత్వాన్ని దాచుకుంటూ మన సహజ అవసరాలకు అనుగుణంగా భూమిక లేర్పరచి మనకు అలౌకికమైన ఆనందాన్ని కలుగచేస్తుంది ‘అమ్మ’. మన తలపులలో అమ్మ నడయాడినప్పుడు మనకు కలిగే వివశత్వాన్ని ఏ విధంగా వర్ణించగలము? మనలోని అల్పత్వాన్ని తుడిచి పెట్టి వ్యక్తిత్వపు ఔన్నత్యాన్ని వికసింప చేసే ‘అమ్మ’ను కొలవటానికి ఏ కొలబద్ద సరిపోతుంది? విశ్వకుటుంబిని అయిన అమ్మ అందరికీ ‘అమ్మ’గా తోస్తూ వారి వారి ఆర్తిని, దీనతను, వ్యధలను పారద్రోలి ప్రశాంత చిత్తులుగా చేయగలిగే శక్తి ‘అమ్మ’కే కలదు.
ప్రాచీన భారతీయ సంస్కృతి ఎంతో విలువైనది. మన ఆర్షవిద్యను లోకానికి అందించిన కృష్ణద్వైపాయనుడు, దానిని అందరికీ అందుబాటులోకి తెచ్చిన “త్రిమతాచార్యులు” చిరస్మరణీయులు. వారి వల్లనే మన ప్రాచీన భారతీయ సంస్కృతి సజీవమై విరాజిల్లుతోంది. పాశ్చాత్య వ్యామోహంలో కొట్టుకు పోతూ మన సంస్కృతిని కాలదన్నటం అవివేకం. రామతీర్థులు అమెరికాలో ఉపన్యసిస్తూ “భారత దేశాన్ని త్యాగమూర్తులు ఏలుతారని అక్కడ వెలిగే ఆధ్యాత్మిక చైతన్యం ప్రపంచానికి శాంతిని అందిస్తుందని, గొప్ప గొప్ప సన్యాసులు, మహాపురుషులు భారత భూమిపై ఉద్భవిస్తారని” చెప్పారు. ‘అమ్మ’ను చూస్తే ఆ కాలం వచ్చిందనిపిస్తుంది.
ఈ సమాజంలో ఎదిగీ ఎదగక దారీ తెన్నూ తోచక కొట్టుమిట్టాడే ప్రజావళికి ‘అమ్మ’ మాటలు ముత్యాల సరాలు. మన ఆవేదనను తన అనురాగంతో తుడిచి పెడ్తుంది. మన హృదయ వేదనను మనకు తెలిసేటట్లు చేసి దయతో, సానుభూతితో చూచే చూపులో, స్వార్థరహిత ప్రేమ జాలువారుతుండగా మనకన్నీరు తుడిచి ధైర్యం ‘అమ్మే’ ఇస్తుంది. మన మేమిటో మనకు తెలియక, మన గమ్యం ఏమిటో తెలియని, మనకు గమ్యాన్ని చూపి అవ్యక్తానందాన్ని చేకూరుస్తుంది. ఇటు వర్తమానంలో అటు భవిష్యత్లో వూగుతూ సంశయాలతో ఆశయే జీవితంగా జీవిస్తుంటాం. ఒకే రకమైన పరిస్థితులు ఎదురైనా అందరం ఒకే విధంగా తలవంచం. భిన్నమైన ఈ ప్రవర్తనలు చూస్తే వ్యక్తిత్వాల అంతరాలలో ఏదో నిలకడ, హృద్యంగా, పరిస్థితులనుబట్టి చిత్రించు కుంటుందేమోనని పిస్తుంది. భిన్న భిన్న వ్యక్తిత్వాలకు హాయిని, తృప్తిని కలగచేసి, సేద తీర్చి ఒక గమ్యం చూపిస్తుంది. వ్యక్తిత్వాల స్వేచ్ఛను అరికట్టినట్లుగాక వారికి గమ్యం, గమనం తానై, విశ్వకుటుంబినియై, స్వార్థమయ సంకుచితత్వం నుంచి విశాల, సమిష్టి, సమాజ నిర్మాణానికి దారి తీస్తోంది ‘అమ్మ’
‘అమ్మ’ మనకు ఇది చేయండి, అది చేయండని చెప్పదు. కానీ అన్యాపదేశంగా ప్రాచీన సంస్కృతికే నీరాజనం పడుతున్నట్లు వుంటుంది. అమ్మ, ఏ నోములు నోచలేదు. ఏ వ్రతాలు, పూజలు చేయలేదు. “నేనంటూ ఏ సంప్రదాయాన్ని పాటించడం లేదు” అంటూనే నోములు నోచుకునే వారిని అమ్మ, ప్రోత్సహిస్తుంది. నోముల్లోని పరమార్థాన్ని వివరిస్తుంది. అన్ని నోముల లక్ష్యం ఒకటేనంటుంది. ‘అంతా అదే’ నని సోదాహరణగా మనకు బోధించటానికే అన్ని నోములు అంటుంది.
ఆస్తికులకు పరమాత్మగా, నాస్తికులకు భయం కలిగించే ప్రజ్ఞాశాలిగా అన్ని మతాలవారికి, అన్ని కులాలవారికి ఆరాధ్యంగా వున్న ‘అమ్మ’ తనను దర్శించక పూర్వమే కొందరికి సాక్షాత్కరించింది. విశ్వకుటుంబినిగా అందరికీ అమ్మగా తోస్తూంది. అమ్మ దయతో ప్రశాంత చిత్తులౌతారే తప్ప, ఆమె ఎవరికీ మానవిగా తోచదు. అందువల్లే ఎవరూ అమ్మను భోంచేసారా? అని అడగటం జరగదు. అందర్నీ అమ్మ భోంచేసి రండనటమే పరిపాటి.
అమ్మ విధానం, విధియై సృష్టి సహజంగానే వున్నట్లుంటుంది. కానీ ప్రత్యేకత తోచదు. అతీతమైన ఆ మహనీయత, భక్తిని రేపుతూ మూఢతకు తావీయక సునిశితమైన తర్కంతో విజ్ఞాన విషయ వివరణలతో కూడి వుంటుంది. అమ్మ దగ్గర జరిగే నామ సంకీర్తన, పూజలు, ఉత్సవాలు, వేడుకలు, వివాహాలు, ఉపనయనాలు, ప్రాచీన సంప్రదాయానికి ప్రతీకలుగానే నిలుస్తాయి. అమ్మలోని ఆప్యాయత, దయ, ప్రేమ అనురాగానికి కట్టుబడిపోవటమే కాని వేరొక ఆలోచనలకు తావివ్వవు.
రమణ మహర్షి “మహాత్ముల సన్నిధి ఆర్తులకు ప్రయోజనకారి. వారు చిక్కితే వదలకుండా వుంటేచాలు” అన్నారు. మన అదృష్టవశాత్తు ‘అమ్మ’ మనకు లభ్యమయింది. కాని మన ‘అమ్మ’ మనం మరిచినా తాను మరవదు. మనం వదిలినా తాను మనలను వదలకుండా వుంది. మనకు గమ్యం, గమనం తానే ఔతున్నది.
‘అమ్మ తత్వ చింతన సదస్సు’ అన్నాం కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి. అసలు అమ్మతత్వానికి ఆది, అంతం వున్నాయా? లడ్డుని ఎక్కడ కొరికినా ఒకటే రుచి” వున్నట్లు అమ్మను ఎట్లాతలచినా, ఎలా సంభావించినా ఒకటే మహత్తు. నదిలో నీరు మనదగ్గర వున్న పాత్ర మేరకే లభ్యమయినట్లు, అమ్మ దగ్గర ఆ ప్రేమ, ఆ అనురాగాన్ని, ఆ వాత్సల్యాన్ని, ఆ దయని, ఆ కరుణామృతాన్ని మనం పొందగలిగేందుకే కృషి చేయాలి. అమ్మ మాతృత్వం మనందరిమీద పొంగి పొర్లేదే. అందుకే అమ్మ “అందరికీ సుగతే. కొంచెం ముందూ వెనక” అని అభయప్రదానం చేసింది.