అమ్మ జన్మనక్షత్రం ఆశ్లేష, అమ్మ నివసించిన గృహం అందరిల్లు. అమ్మ “అందరమ్మ”. అమ్మకు సంబంధించిన వన్నీ అకారంతో ఆరంభమయ్యేవే. సర్వవేదోపనిషత్ సారమయినట్టి శ్రీమద్భగవద్గీతలో పదవ అధ్యాయమైన విభూతియోగంలోని ముప్పదిమూడవ శ్లోకంలో “అక్షరాణాం అకారస్మి” అని శ్రీకృష్ణ పరమాత్మ తన వైభవాన్ని చాటి చెప్పాడు. అటువంటప్పుడు అకారమయమయిన అనసూయమ్మ ఆదిశక్తి అపరావతారంగాక మరేమవుతుంది? అట్టి అమ్మను ఆరాధించటంలోగల ఆనందాన్ని ఏమని వర్ణించగలము?
మానవత్వపు చాటున తన దైవత్వాన్ని దాచుకుంటూ మన సహజావసరాలకు అనుగుణంగా భూమికలేర్పరచి మనకు అలౌకికమైన ఆనందాన్ని కలుగచేస్తోంది. ‘అమ్మ! మన తలపులలో ‘అమ్మ’ నడయాడినప్పుడు మనకు కలిగే వివశత్వాన్ని ఏవిధంగా వర్ణించగలము? మనలోని అల్పత్వాన్ని తుడిచిపెట్టి, వ్యక్తిత్వపు ఔన్నత్యాన్ని వికసింపచేసే ‘అమ్మ’ను కొలవటానికి ఏ కొలబద్ద సరిపోతుంది? విశ్వ కుటుంబిని అయిన అమ్మ అందరికీ అమ్మగా తోస్తూ, వారి వారి ఆర్తిని, దీనతను, వ్యధలను పారద్రోలి ప్రశాంత చిత్తులుగా చేయగలిగిన శక్తి ‘అమ్మ’కే వుంది.
హృదయమనే క్షేత్రంలో మంత్రం అనే విత్తనాన్ని సద్గురువు అనే తోటమాలి నాటాలి. మంత్రం మననం చేయటం వల్ల ప్రాపంచిక వాసనలు పోగొట్టుకోవటానికి మార్గం ఏర్పడుతుంది. దీనికి విధ్వంసక పద్ధతి, విధాయక పద్ధతి అని రెండు పద్ధతులున్నాయి. విధ్వంసక పద్ధతి అంటే ఉన్న మాలిన్యాన్ని పోగొట్టాలి. గోడకు సున్నం కొట్టాలంటే బూజులను దులిపి సున్నం వేస్తాము. విధాయక పద్ధతి అనగా పాత్రలకు కళాయి పెట్టేవాడు ముందు గిన్నెకు మకిలి పూసి కళాయి పెడ్తాడు. అద్దంలో మన ముఖం కనిపించాలంటే అద్దం వెనకాల పూతపూయాలి లేకపోతే మన ముఖం కనిపించదు. ఉన్న మాలిన్యాన్ని పోగొట్టే శక్తి పద్మాలకుంటుంది. పద్మం బురదలో పుట్టినా దానికి ఆ బురద అంటదు. ఎండలో నడచినవాడికి, తాపంగా ఉన్నవాడికి తామరాకువేస్తే చల్లదనం కలుగుతుంది. తాపాన్ని పోగొట్టి శాంతిని కలిగించే గుణం పద్మానికి వుంది. చంద్రుడు తాపాన్ని హరిస్తాడు. గంగ పాపాన్ని పోగొడ్తుంది. ఈ రెంటినీ ధరించిన పరమశివునీ సేవిస్తే తాపం పాపం రెండూ పోతాయి. మనశ్శాంతి కావాలనుకున్న భక్తులు దేవి అనుగ్రహానికి తపిస్తారు.
మన భాగ్యవశాన ఆ పరమేశ్వరి జిల్లెళ్ళమూడి అమ్మగా మన కాలంలో అవతరించి పాపాలను తాపాలను మన దరిచేరకుండా మన కవసరమైన శాంతిని కలుగచేస్తోంది. దేవి సందర్శనం చేసినప్పుడు పాదాల మీదే మన దృష్టిని నిలపాలి. పాదాలకే నమస్కరించాలి. “గూఢగుల్ఫా కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా” అన్న విధంగా అమ్మ పాదాలు మనలను ఉద్ధరిస్తాయి అమ్మవారి పాదాల తరువాత ముఖాన్ని దర్శించమని, “ఓ లలితాదేవి! ఉదయాస్తమానాలు నీ నామాన్ని స్మరిస్తానని” మనకు ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రసాదించారు శంకరాచార్యులవారు.
ఈ సమాజంలో ఎదిగీ, ఎదగక దారీతెన్నూ తోచక కొట్టుమిట్టాడే ప్రజాళికి “అమ్మ మాటలు ముత్యాలసరాలు”. మన ఆవేదనను తన అనురాగంతో తుడిచిపెడ్తుంది. మన హృదయ వేదనను మనకు తెలిసేటట్లుచేసి దయతో, సానుభూతితో చూచే చూపులో స్వార్థరహిత ప్రేమ జాలువారుతుండగా మన కన్నీరు తుడిచి ధైర్యం ‘అమ్మే’ చెప్తుంది. మనమేమిటో మనకు తెలియక మన గమ్యం ఏమిటో తెలియని మనకు గమ్యాన్ని చూపి అవ్యక్తానందాన్ని చేకూరుస్తుంది. ఇటు వర్తమానంలో అటు భవిష్యత్లో వూగుతూ సంశయాలతో ఆశయే జీవితంగా జీవిస్తుంటాం. ఒకే రకమైన పరిస్థితులు ఎదురైనా అందరం ఒకే విధంగా తలవంచం. భిన్నమైన ఈ ప్రవర్తనలు చూస్తే వ్యక్తిత్వాల అంతరాలలో ఏదో నిలకడ, హృద్యంగా, పరిస్థితులను బట్టి చిత్రీకరించుకుంటుందేమోననిపిస్తుంది. భిన్నభిన్న వ్యక్తిత్వాలకు హాయిని, తృప్తిని కలుగజేసి సేదతీర్చి ఒక గమ్యం చూపిస్తుంది. వ్యక్తిత్వాల స్వేచ్ఛను అరికట్టినట్లుగాక వారికి గమ్యం, గమనం తానై, విశ్వకుటుంబినియై, స్వార్ధమయ సంకుచితత్వం నుంచి విశాల, సమిష్టి సమాజ నిర్మాణానికి దారితీస్తోంది ‘అమ్మ’.
యజ్ఞం చేసేటప్పుడు అగ్నిహోత్రుని ద్వారా మనం సమర్పించుకునే హవిస్సులను అగ్నిహోత్రుని భార్య అయిన స్వాహాదేవి ద్వారా దేవతలకు అందిస్తున్నాము. అమ్మ దగ్గర మన ఆవేదన ఆర్తులే అమ్మను కదిలించి మనకు యజ్ఞ ఫలాన్ని అందిస్తున్నాయి.
పితృదేవతలకు ఆబ్దికం పెట్టాలన్న దానికి నవీన కాలంలో పితృదేవతలే వాటిని స్వీకరిస్తారా! అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనకు 365 రోజులైతే పితృదేవతలకు ఒక రోజు, స్వధాదేవి ద్వారా పితృదేవతలకు మనం పెట్టే ఆ సాధారణంగా మానవులం తాత్కాలిక సుఖాలనే కోరుకుంటాం.. అవి అందించే స్వర్గం కోరకూడదు. పైకి వెళ్ళిన తరువాత తిరిగిరావటం వుండని అనగా మళ్ళీ జన్మ ఎత్తకుండా ముక్తిని పొందటానికే కృషి చేయాలి. అమ్మ మనకు ఇది చేయండీ, అది చేయండని చెప్పదు. కాని, అన్యాపదేశంగా ప్రాచీన సంస్కృతినే నీరాజనం పడుతున్నట్లు వుంటుంది. అమ్మ ఏ నోములూ నోచలేదు. ఏ వ్రతాలు పూజలూ చేయలేదు. “నేనంటూ ఏ సాంప్రదాయాన్ని పాటించలేద”ంటూనే నోములు నోచుకునే వారిని ప్రోత్సహించింది. నోముల్లోని పరమార్థాన్ని వివరిస్తుంది. అన్ని నోముల లక్ష్యం ఒకటే నంటుంది. అంతా అదేనని సోదాహరణంగా మనకు బోధించటానికే అన్ని నోములూ’ అంటుంది.
ఆస్తికులకు పరమాత్మగా, నాస్తికులకు భయం కలిగించే ప్రజ్ఞాశాలిగా అన్ని మతాల వారికి ఆరాధ్యంగా వున్న అమ్మ తనను దర్శించక పూర్వమే కొందరికి సాక్షాత్కరించింది. విశ్వకుటుంబినిగా అందరికీ అమ్మగా తోస్తుంది. ‘అమ్మ’ దయతో ప్రశాంత చిత్తులౌతారే తప్ప ఆమె ఎవరికీ ‘మానవి’గా తోచదు. అందువల్లే ఎవరూ అమ్మను భోంచేసారా? అని అడగటం జరగదు. అందర్నీ ‘అమ్మే’ భోంచేసిరండని అనటమే పరిపాటి.
అమ్మ విధానం విధియై సృష్టి సహజంగానే వున్నట్లు వుంటుంది కాని ప్రత్యేకతతోచదు. అతీతమైన ఆ మహనీయత భక్తిని రేపుతూ మూఢత్వానికి తావీయక సునిశితమైన తర్కంతో విజ్ఞానవిషయ వివరణలతో కూడి వుంటుంది. అమ్మ దగ్గర జరిగే పాదపూజలు, ఉత్సవాలు, వివాహాలు ప్రాచీన సంప్రదాయానికి ప్రతీకలుగానే నిలుస్తాయి. అమ్మలోని ఆప్యాయత, దయ, ప్రేమ, అనురాగానికి కట్టుబడి పోవటమేకాని వేరొక ఆలోచనకు తావివ్వవు.
భవసాగరాన్ని దాటటానికి ఈ కలియుగంలో నామసంకీర్తన అన్న పడవను ఆశ్రయించాలి. అందుకే అమ్మ జిల్లెళ్ళమూడిలో అఖండనామ సంకీర్తనను ఏర్పాటు చేసింది. జన్మవాసన, కర్మవాసన, భోగవాసనలను పోగొడ్తుంది భగవన్నామం. భగవంతుని ప్రార్థించేటప్పుడు ముందు మనకు మంచి బుద్ధిని ప్రసాదించిన తరువాతే ఆ దేవదేవుని ప్రవేశింపజేయమని కోరుకోవాలి.
జయహోమాతా