ప్రాతఃకాల తుషార బిందువు ప్రభాకరుని గాంచిన మొదలు తన ప్రతి అణువునందు ఆ దివాకరుని తలపు నింపుకొని ఆ దీప్తిచే కరిగి అతనిలో అదృశ్యమై పోతుంది. అట్లే అమ్మను చూచిన క్షణంలో మన హృదయాంతరాళాల్లో మెరిసిన అమ్మ రూపు, మెరుపు మన అణువణువున వ్యాప్త మౌతుంది. మన మనస్సులు అమ్మను గూర్చిన మధుర మధురమైన తలపులతో నిండిపోతాయి. అమ్మ రూపే మనకు ఆరాధ్యమై, అమ్మ ధ్యాసే ఆహారమై అమ్మ పలుకే బంగారమై మన కోరికలన్నీ తీర్చు కల్పవల్లైన అమ్మ సన్నిధిలో విహరిస్తాం.
అమ్మ సందర్శనంతో మన కోరికలన్నీ మటుమాయమై జీవిత చరమాంకంలో ‘అమ్మలోనే ఐక్యమవ్వాలనే ఒక్క కోరికా మిగిలేట్టు చేయమని అమ్మనే వేడుకుందాము.
అమ్మ రూపం చాలా అద్వితీయంగా వింత వింత శోభలతో విలసిల్లు తుంటుంది. అమ్మను చూచిన ప్రతివ్యక్తి ఇదీ అని వర్ణించటానికి అలివికాని ప్రత్యేకత, ఆకర్షణ, దైవత్వంతో పరవశించిపోతాడు. అమ్మ పొట్టిగా, అవయవాలు పొందికగా, కళ్ళు, ముక్కు, నోరు, చేతులు, పాదాలు అంతా తీర్చి దిద్దినట్లుంటాయి. ఆ అలౌకికత, మన కళ్ళనేగాక మనస్సునూ ఆకట్టుకునే దివ్య సౌందర్యం, స్ఫురద్రూపి అమ్మ, ఆదృష్టిలో ఎంతో చురుకుదనము, దయా, శాంతి, లాలన అన్నీ కలగాపులగమైవుంటాయి. కనుబొమ్మల మధ్య వుండే పెద్దకుంకుమ బొట్టు చూడగానే ఆమె ఎవరో తెలియక పోయినా ‘అమ్మ’ అనే పదం హృదయానికి హత్తుకుంటుంది. అమ్మ ముంజేతులు, అరచేతులు, వేళ్ళు, పాదాలు అన్నీ ఆమెలోని దివ్యత్వాన్ని చాటుతాయి.
అమ్మ సాన్నిధ్యంలో అనుభవించిన శాంతి, ఆనందాలపై పడే తీవ్రమైన తపనే ఆవేదన. అమ్మ మన ఆర్తి ఆవేదనలకే పలుకుతుంది. ఈ శాంతి, ఆనందాలే ముక్తి స్వభావాన్ని విశదపరుస్తాయని పెద్దలు చెప్తారు. ముముక్షత్వమే మోక్షమన్నారు శంకరులు అమ్మ సన్నిధిలో వుండాలన్న ప్రగాడ భావమే మన మనస్సులను ఇతర కోర్కెలను అధిగమించేటట్లు చేస్తుంది. వ్యక్తిత్వం వినయశీలమై స్వీయ అసమగ్రత కళ్ళకు కట్టినట్లుగా మనిషి శ్రద్ధాళువుగా మారుతాడు.
ఏసుక్రీస్తు “ముక్తి, పొందేది కాదు. నిర్ణీతమైన తరుణంలో దైవసంకల్పము చేత అనుగ్రహింప బడుతుంది” అని అన్నారు.. ఆ తరుణం తటస్థించినపుడు ముక్తిని పొందేందుకు కావలసిన అర్హత కూడా దానంతటదే వస్తుంది. అర్హత అనేది పొందేది కాదు. ఈ విషయం తెలియని వారు మానవ ప్రయత్నం వల్లనే ఇది సాధ్యపడుతుందను కుంటారని అమ్మ వివరించింది.
అమ్మ దర్శనమైన తరువాత మనలో విచిత్రమైన ఔన్నత్యం తోస్తుంది. సందర్శనలో ఈ బ్రతక్కు ఒక అర్థం స్ఫురిస్తుంది. హృదయం విప్పి అమ్మ ముందు పరుచుకోవటంలో, మనస్సు విప్పి మాట్లాడుకోవటంలో ఎంతో గొప్ప తృప్తిని, శాంతిని పొందుతాము. మన బ్రతుకులు నిండుగా అనుభవించడానికి ఏదో అనిర్వచనీయమైనదీ, పొందదగిందీ వేరే వుందని తెలుస్తుంది.
అహర్నిశలు అమ్మకోసం తపించే ప్రేమబంధుర హృదయస్పందనానికీ తల్లీ బిడ్డల మధ్య అలరారే మధుర మధుర మహనీయ మమతానుబంధం అవగతమౌతుంది. ఆ పరమ కారుణ్యమూర్తి మృదు హృదయాంతర్గత లలిత లలిత భావలహరిలో ఒక వాత్సల్యరసామృత బిందువునైనా చవి చూడగలిగితే జన్మ ధన్యత చెందుతుంది.
మనం యోగసాధన గురించి వింటుంటాం. యోగమంటే ఏమిటి ? ద్వంద్వాతీత స్థితియే యోగం. అదే స్థితప్రజ్ఞత్వం. గీతలోకూడా “సమత్వం యోగ ఉచ్చతే” అని చెప్పబడింది. లాభాలాభాలలో, జయాపజయాలలో, రాగద్వేషాలలో, సుఖదుఃఖాలలో సమానస్థితి యోగం. భక్తి యోగమైనా, కర్మయోగమైనా, మరి ఏ ఇతర యోగికైనా పరమార్థమిదే. ఈ మహాయోగాన్ని అమ్మ ఆచరణరూపంలో అలవోకగా, హాస్యోక్తులతో రంగరించి మధుర మధురంగా బోధించి సుసాధ్యం చేసింది. అమ్మ దర్శనానంతరం మనకేది అవసరమో అది సంపూర్ణంగా లభిస్తుంది. మనం ఎక్కడనుండి చేసే సాధనలకైనా సాధ్యం అమ్మే కదా!
అమ్మవారి పాదుకలకు పూజ చేస్తే అమ్మవారిని పూజించినట్లే. అమ్మ రెండు పాదాల్లో ఒకటి సగుణం, రెండవది నిర్గుణం. ఒకటి అం. రెండవది ఆ. అనగా అంతులేనిది. ‘ఆ’ అనగా ఆధారమైనదీ, అంతటా ఆవరించి వున్నది అని, ఆది అంతము లేనిదని అర్థం. అమ్మ అనే మాటను మన జిల్లెళ్ళమూడి అమ్మ “అంఆ” అని వ్రాసేది. ఆ అక్షరద్వయమే భక్త కోటికి అభయాలై బీజాక్షరాలైనవి. ఆర్తుల పాలిట కల్పవృక్షాలైనవి. ఉపాసనా పరులకు యోగ్యములై ప్రశాంతి దాయకములై సూక్ష్మ మోక్షోపాయాలైనవి.