1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అర్కన్

అర్కన్

N Ramadevi
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : March
Issue Number : 8
Year : 2013

ఈ అనంతకోటి బ్రహ్మాండంలో, చిన్నదైన, సూక్ష్మాతి సూక్ష్మంగా, పరమాణువుగా యున్న విషయాన్ని ఎలా చిత్రీకరించడం, ఏమని, ఎందుకని, అన్పిస్తోంది. కాని వ్రాయాలి. పరమాణువుగా నున్నదే – విస్తరించిన అంశం ఐంది. ఐన్స్టీన్ కనుగొన్న ఆటంబాంబు – పరమాణువే- దాని విషయంలోకి అడుగిడినపుడు. అది చేసే విస్ఫోటనం సృష్టినే మాడ్చి వేస్తుంది. మసిగా మారుస్తుంది. ఆ విధంగా ఈ చిన్ని కాపురంలో వున్నది పరమాణువే – ఇది చేసేది – సృష్టిని చిగురింపజేసి ఆహ్లాదపరిచేది. తప్పకుండా విస్తరింపచేయాల్సిన అవసరం ఏర్పడింది.

ఎందుకిలా వ్రాసిందే వ్రాసి, చెప్పిందే చెప్పి, పరమార్ధం ఏమిటి? మనిషిగా మనల్ని ఒక రూపానికి ప్రత్యేకమైన అందమును దిద్దింది. పెళ్ళి కూతురు వలె ముస్తాబుచేసింది. ఎందుకూ పనికిరాని, ప్రయోజనమే లేని- ఎవరైన ఎదురుపడినపుడు మనలను చూసి పల్కరించ వలసిన అగత్యం ఏర్పడు తుందని తప్పుకొని పోయేరీతిలోని వారలము – ఇది అందరికి తెలిసిన విషయమే. అంతకంటే గొప్ప వారలం ఐనచో అమ్మ తరుపున నేనే మీకు పాదాభివందనాలను అర్పించు కొంటాను.

అమ్మను గురించి వ్రాయాలనే అంశంలో అందరకు ప్రత్యక్షప్రమాణంగా కనపడేది అన్నపూర్ణాలయం గుండిగలు – దీనికేమీ వ్యాఖ్యానాలు – భాషా పరిజ్ఞానంతో వివరించే అగత్యం ఏర్పడదు. రెండో విషయం అమ్మ తన కొనగోటితో నుదుటిపై ముద్దిడిన కుంకుమ చందనాల గుర్తులు- జీవన గమ్యాన్నే మార్చివేసిన అద్భుతమైన – ఆశ్చర్యం కొలిపే – పరిణామం – ఛార్లెస్ డార్విన్ కనుగొన్న జీవ పరిణామక్రియ. మానవ శరీర భాగాల్లో అనవసరమైన భాగాలు నశించి పోవడం. అవసరం ఐన భాగాలు మాత్రమే వుంటాయని సిద్ధాంతీకరించాడు. ఆ విధంగానే అమ్మ మనిషి యొక్క శరీర రుగ్మతలను రూపుమాపేశింది. కోరికలు, దుఃఖ, దుర్మార్గత్వం, బలహీనతలు, అహంకారం, కోపం, వైరాగ్యం, దుర్భలత్వం దీనివల్ల ప్రయోజనం లేదు అవసరం లేనివి. వీనికి స్థానభ్రంశం కల్గించి శుభ్రంగా తుడిచివేసి, వెన్నుతట్టి జీవితంలో ముందడుగు వేయించింది. సైన్సు ప్రకారమే అమ్మ జీవనగమ్యం సాగించింది. అనేది ఎటువంటి సందేహంలేని సమాధానమే.

ఇక మూడవ అంశం- విశ్వాసమే భగవంతుడు. ఇది కూడా నిజంగా నిజం. జగదీష్ చంద్రబోస్ మొక్కలకు ప్రాణం వుంది కనుకనే ఆకులు, కదలాడుతున్న చెట్లు చిగిర్చి పూలు, కాయలు, ఫలాలు ఇస్తున్నాయి. చివరకు చచ్చిపోతున్నయ్ అని సిద్దాంతీకరించాడు. మనలోని సౌభాగ్యసంపదలు, ఈర్ష్య, కుట్రలు కుతంత్రాలు, కోపం, అహంకారం, ఇవి మనిషి ఎదుగుదలకు అవరోధాలే. ఇవి మనల్ని వదలవు. మాతృచరణాలను ఆశ్రయించినపుడు ఈ గుణాలు మననుండి భయపడి పారిపోతాయి. భూలోకానికి ఏ తెంచిన ఓ పుణ్యమూర్తి – ఓ పద్మముఖీ, ఓ మీనాక్షీ, ఓ కన్యాకుమారీ! మాకింక భయమేలనే- మధుర మీనాక్షీ – 

భౌతికమైన నిత్యం జరిగే వ్యవహారం- చిన్నప్లేట్-10, 15 టాబ్లెట్సు, తక్కువ కాకుండా మందులు వేసుకోవడం అమ్మవంతు – ఇవ్వడం నావంతు – జరిగే విషయం నాకేమీ తెలీదు. నే చూసిన అమ్మలో శారీరక బాధలే ఎక్కువగా వుండేవి. వైద్యం ఏమీ జరగడం లేదనే చెప్పొచ్చు. వాళ్ళ పరిధిలో వాళ్ళు ఏదో చేశామంటే చేశారు అని తృప్తి పడటం కన్పిస్తుంది. ఈనాటి టెక్నాలజీ ఆనాడు లేదు.

ప్రముఖ శాస్త్ర వైద్యులు డా. కొడాలి పాపారావు గారు యమ్. బి. బిస్. చెరుకుపల్లి మండలం, గుంటురుజిల్లా ఆంధ్రాలోనే అగ్రగామిగా పేరొందిన వారు. రోగనిర్ధారణ. వారు అవును అంటే అవును. కాదు అంటే కాదు. ఇప్పటికి 80-90 వయస్సు మధ్యలో వుంటారు. చిరునవ్వుతో అందర్నీ పల్కరిస్తారు. వారి దగ్గర కూడా ఈనాటి టెక్నాలజీ ఆనాడు లేదు. అమ్మకు వైద్యం జరిగిందా ఐనా చేశారా – చేయించరా– సమయానికి వచ్చారా – ఏదో ఎలాగో కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని వచ్చినా పాదాభివందనాలు, ఆత్మసాక్షాత్కారాలు మొదలైన అంశాలతో మొదలై, సాష్టాంగ నమస్కారాలాను ఆచరిస్తూ- నీవే తగ్గించుకోవాలమ్మా అనే ప్రార్ధనలు చేస్తూవున్నారో లేదో – అంత జబ్బుతో వున్న అమ్మ గుటుక్కున లేచి, గోరుముద్దలెట్టి, నుదుటున వారికి పట్టిన చెమటను తుడిచివేసి, నొసటన కుంకుమను దిద్ది, శ్రమపడ్డారనే జాలితో వీడ్కోలు చేసి పంపేది. ఇదండీ ఆనాడు అమ్మకు జరిగిన వైద్యం.

మాతృదేవోభవ అన్న వేద వాక్యం – అమ్మగా పుడమిపైకి వచ్చి-ఆసేవకు మనల్ని రప్పించుకొని- అహంకారంతోనో, విసుకొంటూనే- ఏదో ఒకటి లే చేశామంటే చేశాం- తల్లికి బిడ్డయందు తప్పే కన్పించదు.

డబ్బుకు దాసోహంగా వున్న శుభసమయాన, మానవతా విలువలు మంట కలిసిన శుభరాత్రిలో, ఒక అబల ప్రచండ జ్వాలాగ్ని కీలలతో అగ్ని గుండంగా మారి, వీరభద్రుడు జన్మించిన చందాన, కారడవిలో జన్మించి, సంసార జీవనయాత్రను కొనసాగించి, అంతం లేని గుండిగల భాండాగారానికి అగ్ని దేవుడ్ని బాధ్యులను గావించి-ఇదే అసలైన ఆధ్యాత్మికత – ఇంతకు మించింది ఏదైనా వుంటే మీకు తెలిస్తే నాకు తప్పకుండా చెప్పండి ఆచరిస్తా నంటూ దేహాన్ని వీడింది.

ఆనాటి రమ చిన్నది- ఈనాడు అనుభవంతో అప్పటి క్షణాలను నెమరువేసుకుంటూ చప్పరిస్తూ పిప్పర్మెంటు యొక్క సువాసనతో అది చేసే అల్లరితో జాలువారిన పొగడ పూల సుమధుర పరిమళాలు – ఒక్కటి నిజంనిజం అమ్మ నాచే – వ్రాయించుకొంటున్న సుగంధసుమాలు నేనేమిటో నాకే తెలీదు-ఆమె చెప్తుందిలే అప్పటి వరకు బి వేయిట్-వెయిట్-వేయిట్ అందరికి శుభాక్షాంక్షలు. మనందరి ఇల్లున సొంతయిల్లైన – అందరింటికి ప్రణామాలు పల్కుదాం

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!