జిల్లెళ్ళమూడి అమ్మ సన్నిధిన నిత్య కళ్యాణం పచ్చ తోరణం. ఎప్పుడూ ఏదో ఒక ఉత్సవం. అయితే కొన్ని ఎంతో ప్రత్యేకత సంతరించుకున్న ఉత్సవాలు ఉన్నాయి.
అటువంటి ఉత్సవం ఏప్రియల్ 12, 2022న ప్రారంభం అయింది. అమ్మ అవతరించి వంద సంవత్సరాలు పూర్తి అవబోతున్న సందర్భంలో సంవత్సరం పాటు జరుపుకునే వేడుక ఇది.
నేను ఎన్నో సంవత్సరాలుగా అమ్మ దగ్గరికి వెళ్తున్నాను. ఎప్పుడూ కార్తీక మాసంలో గానీ, మాఘ మాసంలో గానీ, వాతావరణం చల్లగా ఉండే సమయంలో వెళ్ళేదాన్ని. ఎండలు తట్టుకోవడం కష్టం కదా! ఈ సారి మా అన్నయ్య వి.వి.యస్.యస్.మూర్తి, వదిన శ్రీమతి విజయలక్ష్మి వాళ్ల కారులో జిల్లెళ్ళమూడి వెళుతూ నన్ను కూడా రమ్మన్నారు.
అమ్మ దగ్గరికి వెళ్ళాలి అంటే ముందు అమ్మ అనుమతి కావాలి కదా! ఎందుకంటే అమ్మ అన్నది కదా ‘నేను మిమ్మల్ని చూడాలి అనుకుంటేనే మీరు ఇక్కడికి రాగలరు అని. సరే అమ్మ ఆజ్ఞ అయింది అని ప్రయాణం అయ్యాను.
శ్రీరామనవమి జరుపుకుని మరునాడు ఉదయం ఏడున్నరకు కారులో బయలుదేరాము. నిదానంగా హడావిడి లేకుండా సాయంత్రం నాలుగు గంటలకు జిల్లెళ్ళమూడి చేరాము. వసతి కల్పించారు. అన్నపూర్ణ ఆలయంలో ఎప్పుడు వెళ్లినా లేదనరు, కాదనరు కదా, ఆప్యాయంగా వడ్డించారు. అప్పటికే అందరింటి ఎదురుగా ఉన్న దారి మొత్తం ఆలయం దాకా షామియానాలు వేసేశారు. అంతటా ఉత్సవ వాతావరణం. ఆలయంలో మరునాడు ఉత్సవం కోసం ప్రత్యేకమైన అలంకరణ చేస్తున్నారు. 12వ తేదీ ఉదయం. అదొక మహోదయం. ఒక అవతార మూర్తి అవనిపై అవతరించిన శుభోదయం. ఉదయం వాత్సల్యాలయం దగ్గర కొత్తగా ఏర్పాటు చేసిన జేగంటను శత జయంతి ఉత్సవ ప్రారంభ సూచికగా 100 సార్లు మోగించటంతో కార్యక్రమాలు ప్రారంభం అయినాయి. అనంతరం సుప్రభాతం జరిగింది. తరువాత అందరింటి వేదిక దగ్గర నుండి నగర సంకీర్తన ప్రారంభం అయి గ్రామంలో తిరిగి అమ్మ గుడిలో సమాప్తం అయింది.
ఆ తరువాత ఆలయంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం. అమ్మకు క్షీరాభిషేకం. వేద పండితులు ముక్తకంఠంతో మంత్రాలు పఠిస్తూ ఉంటే వేద ఘోషతో ఆ ప్రాంతమంతా పులకించి పోయింది. భక్తులు అందరూ వెళ్లి స్వయంగా తమ చేతులతో అమ్మకు అభిషేకం చేసుకుని ఆనంద పారవశ్యంలో మునిగి తేలారు. అది ఒక అరుదైన అదృష్టం కదా!
అభిషేకం ముగిసిన తర్వాత హైమాలయంలో అంబికా సహస్ర నామ స్తోత్ర పారాయణ జరిగింది. అందరం పారాయణ చేశాం. వెంటనే అందరింటి మేడ మీద అనసూయా వ్రతాలు. నేల మీద కూర్చోలేనివారి కోసం బల్లమీద ఏర్పాటు చేశారు. అంతమంది వ్రతం చేసుకుంటూ ఉంటే కన్నుల పండుగగా ఉంది. తరువాత భోజనాలు. అమ్మకు ఎంతో ప్రియమైన కార్యక్రమం అది.
అమ్మ ప్రసాదం స్వీకరించేందుకు వందల సంఖ్యలో జనం వచ్చారు. బారులు తీరారు. లడ్డు, కాజా, పులిహోర, వంకాయ కూర, దోసకాయ పప్పు, గోంగూర పచ్చడి, పులుసు, పెరుగు అమృతంలా ఉన్నాయి పదార్థాలు.
సాయంత్రం 6 గంటలకు ఆలయానికి వెళ్ళాను. బయటికే మల్లెల గుబాళింపు, ఒకటి, రెండు కాదు, వంద కిలోల మల్లె మొగ్గలు ఆలయం లోపల సిద్ధంగా వున్నాయి. ఆరున్నర గంటలకు పూజ ప్రారంభం అయింది.
అందరూ దోసిళ్ళ కొద్దీ మల్లెపూలతో అమ్మని పూజించుకున్నారు. అనంతరం అమ్మకు కిరీట ధారణ. మల్లెలతో నిలువెల్లా మునిగిపోయి కిరీట ధారిణి అయిన అమ్మరూపం వర్ణించటానికి మాటలు చాలవు. నిలువెల్లా కనులు చేసుకుని అమ్మను చూసి అపరిమితమైన ఆనందానికి లోనయ్యాను. ఆ రోజు రాత్రి 9.00 గం.లకు వాత్సల్యాలయంలో అమ్మ నామ సంకీర్తన, మహా హారతి ఇవ్వటంతో ఆనాటి కార్యక్రమాన్ని నిర్వహించిన కార్య నిర్వాహకులకు అభినందనలు, కృతజ్ఞతలు అందజేయాలి.
మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీ విద్యార్థులు ప్రముఖ పాత్ర వహించారు. సైన్యం లాగా పనిచేశారు. తరువాత అన్నపూర్ణ ఆలయంలో భోజనం చేసి ఆ రాత్రి అక్కడే వుండి మరునాడు పొద్దున అమ్మ దర్శనం చేసుకుని బయలుదేరి వచ్చేశాం. అమ్మ శతజయంతి ఉత్సవంలో పాల్గొనడం నా పూర్వ జన్మ సుకృతం.