25-09-2022: అమ్మ శతజయంతి ఉత్సవములలో భాగంగా గుంటూరు వాస్తవ్యులు శ్రీ పెరవలి నందకుమార్ గారి ఆధ్వర్యములో శ్రీ అన్నపూర్ణాలయ వేదికపై జరిగిన సంగీత కచేరీ కార్యక్రమము శ్రోతలను అలరించింది. పెరవలి లక్ష్మీజయతి గారు, పెరవలి నాగలక్ష్మీ మహతి గారు, M.V.S.L.యశస్వీ గారు, చిల్లర రమగారు తమ సుస్వరగాన మాధుర్యముతో అందరినీ అలరించారు. శ్రీపెరవలినందకుమార్ గారు శ్రీ B.సురేష్ బాబు గారు వాద్య సహకారముల నందించారు. కార్యక్రమానంతరం కళాకారులందరికీ “అమ్మ” ఆశీఃపూర్వకముగ నూతనవస్త్ర బహూకరణ జరిగింది.
26-09-2022 నుండి 05-10-2022 శరన్నవరాత్రి ఉత్సవములు శ్రీవిశ్వజననీ పరిషత్ ఉభయ ట్రస్టుల ఆధ్వర్యములో శరన్నవరాత్రి మహెూత్సవములు సుప్రభాతసేవలతో మంగళ వాద్యములతో వేద పఠనముతో త్రికాలపూజలతో శుభప్రదముగ వైభవంగా ప్రారంభమయినాయి.
అమ్మ జగన్మాత శ్రీ అనసూయాదేవి, శ్రీబాలా త్రిపురసుందరీ దేవి, శ్రీగాయత్రీదేవి, శ్రీ అన్నపూర్ణాదేవి, శ్రీలలితా త్రిపురసుందరీదేవి, శ్రీమహాలక్ష్మీదేవి, శ్రీసరస్వతీదేవి, శ్రీదుర్గాదేవి, శ్రీమహాకాళీదేవి శ్రీరాజరాజేశ్వరీ దేవిగా దివ్యరూపదర్శనములతో భక్తులను అనుగ్రహించారు. ఆవరణలోని వారూ గ్రామస్థులు ఇతరప్రాంతముల నుండి వచ్చిన సోదరీ సోదరులు శ్రీఅనసూయేశ్వరాలయములో “అమ్మ”ను విశేషమైన అలంకరణలతో సర్వాలంకార శోభితురాలై కిరీటధారిణియై శోభిల్లిన “జగమేలు తల్లిని” అశేషజనవాహిని మనసు నిండుగ ఉప్పొంగిన భక్తి శ్రద్ధలతో, కనులపండుగగ దర్శించుకొని అర్చించుకొని హర్షపులకితులైనారు. శ్రీ హైమాలయములో దివ్యాలంకృతమైన కరుణామయి కారుణ్యమూర్తి శ్రీహైమవతీదేవిని దర్శించుకొని, సోదరీసోదరులందరూ త్రికాల పూజాకార్యక్రమములలో పాల్గొన్నారు.
శరన్నవరాత్రుల పూజాకార్యక్రమములలో పాల్గొన్నవారికి శ్రీవిశ్వజననీ పరిషత్వారు “అమ్మ” ఆశీఃపూర్వకముగ శేషవస్త్రములను బహూకరించారు, ప్రత్యక్షంగా పాల్గొనలేని సోదరీసోదరులు పరోక్షంగా అర్చించుకున్నారు. వారందరికీ సంస్థవారు “అమ్మ ప్రసాదమును” శేషవస్త్రములను పోస్టుద్వారా అందజేస్తున్నారు.
శరన్నవరాత్రుల ఉత్సవములు వైభవంగా ప్రారంభమై “అమ్మ” ఆశీస్సులతో శుభప్రదముగ ముగిసినాయి. “అనుదినం ఈ విశేష అర్చనా వైభవములను” యూ ట్యూబ్ ప్రత్యక్షప్రసారంలో వీక్షించి దూరప్రాంతములలో ఉన్న సోదరీసోదరులందరూ పరవశులైనారు.
05-10-2022: శరన్నవరాత్రుల పూజా కార్యములనంతరము ఉదయము మంగళవాద్యము లతో ‘అమ్మ’ నామసంకీర్తనతో నిర్మాల్య నిమజ్జనోత్సవము జరిగినది. విద్యార్థినులు సోదరీసోదరులు కార్యక్రమములో పాల్గొన్నారు.
శరన్నవరాత్రులలో అమ్మకు వివిధ అవతారములలో నిత్యాలంకరణగావించిన ఆలయముల ప్రధాన అర్చకులు శ్రీ చుండి నవీన్ శర్మ గారు, వేదవిద్యార్థులు వారికి సహాయ సహకారముల నందించిన సోదరీసోదరులు అభినందనీయులు.
03-10-2022: అనంతపూరు వాస్తవ్యులు శ్రీ ప్రభాకర్ బాబు-శ్రీమతి గీత దంపతులు వారికుమారుడు చి॥జయాంషిబాజ్జీ అక్షరాభ్యాసము శ్రీఅనసూయేశ్వరా లయములో జరుపుకున్నారు.
06-10-2022: శుద్ధ ఏకాదశి – శ్రీ అనసూయా వ్రతము – అమ్మనామసంకీర్తన జరిగినవి.
09-10-2022: 2వ ఆదివారము హెూమశాలలో సౌరహోమము జరిగినది.
09-10-2022: పూర్ణిమ శ్రీహైమనామ ఏకాహము జరిగినది.
12-10-2022: వాత్సల్యాలయములో రాత్రి 9 గం.కు అమ్మ నామసంకీర్తన, మహాహారతి జరిగినవి. 13-10-2022: బహుళ చవితి హెూమ శాలలో సంకష్టహరగణేశ హెూమము జరిగినది.
14-10-2022: హైదరాబాదు వాస్తవ్యులు శ్రీరామమారుతి గారు, శ్రీమతి రమ్యసాయిదంపతులు శ్రీహైమాలయములో వారి కుమార్తెకు పూజ్య శ్రీఅనఘ అని నామకరణము చేసుకున్నారు. అందరికీ అన్నప్రసాదవితరణ గావించారు.
15-10-2022: బహుళషష్ఠి – శ్రీహైమవతీ వ్రతము, అమ్మనామ సంకీర్తన జరిగినవి.
17-10-2022: సుప్రభాత సేవలతో, సోదరీసోదరుల నగరసంకీర్తనతో మంగళవాద్యములతో అమ్మ పతిదేవులు శ్రీనాన్నగారి (శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావు గారు) 110 వ జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయినాయి.
ఉదయం శ్రీ అనసూయేశ్వరాలయములో శ్రీనవ నాగ నాగేశ్వరాలయములో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు జరిగాయి. “అమ్మ- నాన్నగారల కళ్యాణమూర్తుల ఊరేగింపు కార్య క్రమములో నామ సంకీర్తనతో సోదరీసోదరులు పాల్గొన్నారు.
ఉదయం గం10.30 ని.కు శ్రీఅనసూయేశ్వరా లయములో శ్రీఅంబికా సహస్రనామ పారాయణ కార్యక్రమము జరిగినది. ఉదయం 11 గం.కు శ్రీనాన్నగారికి అర్చన కార్యక్రమములు జరిగినవి. సోదరీసోదరులు నాన్నగారి నామ ఏకాహము నిర్వహించారు. సాయంత్ర 5 గం. శ్రీవాత్సల్యాలయ సభామందిరములో జరిగిన కార్యక్రమములో సోదరులు శ్రీ M. దినకర్ గారు, శ్రీరావూరి ప్రసాద్ గారు, శ్రీ.M.V.R. సాయిబాబు గారు, శ్రీT.T. అప్పారావు గారు, శ్రీA.V.R. సుబ్రహ్మణ్యం గారు “నాన్నగారితో తమకు గల అనుబంధము, దివ్యానుభవములను హృద్యంగా వివరించారు. కార్యక్రమములో శ్రీబ్రహ్మాండం రవీంద్రరావు గారు, ఆవరణలోని సోదరీసోదరులు పాల్గొన్నారు. నాన్నగారి జయంతి సందర్భముగ శ్రీవిశ్వజననీపరిషత్ టెంపుల్ ట్రస్ట్వీరు గ్రామస్థులకు పులిహెూర, లడ్డూ ప్రసాద వితరణగావించారు. ప్రసాద వితరణ కార్యక్రమమునకు, కళాశాల విద్యార్థినీ విద్యార్థులు తమ సహాయ, సహకారముల నందించారు. శ్రీనాన్నగారి జయంతి ఉత్సవములు విజయ వంతముగా పూర్తి అయినవి.
‘అమ్మ’ శతజయంతి ఉత్సవములు, మరియు నాన్నగారి 110 వ జయంతి సందర్భముగ జిల్లెళ్ళమూడి వాస్తవ్యులు, కుమారి నందమూరు వెంకటరమణ గారు ఆవరణలోని వారికి గ్రామస్తులకు, పసుపుకుంకుమలు, గాజులు, స్టీలుబాక్సులు స్వీట్స్ అందజేశారు.
19-10-2022: అశ్లేషా నక్షత్రము అమ్మనామ సంకీర్తన జరిగినది.
21-10-2022: బహుళ ఏకాదశి శ్రీ అనసూయా వ్రతము ‘అమ్మ’నామ సంకీర్తన జరిగినవి.
23-10-2022: హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ మల్లాప్రగడ ఉమాశంకర్ గారు, శ్రీమతి రాధిక దంపతులు శ్రీ ఉమాశంకర్ గారి షష్టి పూర్తి సందర్భముగ ‘అమ్మ’కు, నాన్నగారికి, శ్రీహైమవతీదేవికి పూజలు గావించి, అందరికీ అన్న ప్రసాదవితరణ గావించారు.