1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అర్కపురి విశేషాలు

అర్కపురి విశేషాలు

Kumari Visali
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 14
Month : December
Issue Number : 5
Year : 2014

24-10-2014 : కార్తీకమాసము సందర్భముగ 24.10.2014 నుండి 21.11.2014 వరకు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, పాఠశాలల హాస్టల్ విద్యార్థినులు వారి వార్డెన్ శ్రీమతి నాగమణిగారి ఆధ్వర్యంలో సాయం సమయములలో ఆలయ ప్రాంగణములో అన్నపూర్ణాలయ నూతన భవనము వేదికవద్ద వాత్సల్యాలయము మొదలైన ప్రాంతములో సభక్తిపూర్వకముగా అత్యంత సుందరముగా ప్రమిదలతో దీపాలంకారణములు చేశారు.

27-10-2014 : నాగులచవితి సందర్భముగ శ్రీ నవనాగేశ్వరాలయములో వేదవిద్యార్థుల వేదపఠనముతో శ్రీ నాగేశ్వరస్వామికి క్షీరాభిషేకము, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము శివసహస్రనామార్చన, షోడశోపచార పూజాకార్యక్రమములు నిర్వహించబడినవి. ఈ కార్యక్రమములలో ఆవరణలోనివారు, గ్రామస్తులు ఇతర ప్రాంతముల నుండి వచ్చిన సోదరీసోదరులు పాల్గొన్నారు.

2-11-2014 : మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీమతి బి. లక్ష్మీ సుగుణ, అధ్యాపకులు డాక్టర్ శ్రీ కె.వి.కోటయ్య, శ్రీనాగరాజు, శ్రీ త్రయంబకం, శ్రీ కొండముది ప్రేమకుమార్, శ్రీనాగరాజు వార్డెన్ శ్రీ మురళీధరరావు గారల ఆధ్వర్యములో కళాశాల విద్యార్థులు “స్వచ్ఛభారత్” కార్యక్రమము నిర్వహించారు. కళాశాల పరిసరములు, ఆలయములు, అందరిల్లు, అన్నపూర్ణాలయ పరిసరములను శుభ్రపరిచారు.

3-11-2014 : క్షీరాబ్దిద్వాదశి సందర్భముగ అందరింటి సోదరీమణులు, శ్రీ అనసూయేశ్వర ఆలయ ప్రాంగణములో, తులసి, ఉసిరిక చెట్లకు పూజా విశేష దీపారాధనలు చేశారు. అనంతరము అందరికీ ప్రసాదములు పండు తాంబూలములు ఇచ్చారు.

బాపట్ల రైల్వేస్టేషన్లో ప్రయాణీకుల సందర్శనార్థము అమ్మ చిత్రపటమును ఏర్పాటుచేయటం జరిగింది. జిల్లెళ్ళమూడి మార్గం తెలియచేసే బానర్ కట్టారు.

6-11-2014 : కార్తీక పౌర్ణమి సందర్భముగా శ్రీ అనసూయేశ్వరాలయములో అభిషేకములు, లక్షబిల్వార్చన కార్యక్రమము నిర్వహింపబడింది.

***

కార్తీక పౌర్ణమి సందర్భముగ శ్రీ హైమవతీదేవికి ఉదయం 6 గం.30 ని.లకు క్షీరాభిషేకము జరిగింది. ఉదయం 10 గంటల నుండి శ్రీ హైమవతీదేవి జయంతి ఉత్సవముల సందర్భముగ శ్రీ హైమాలయములో 6.11.2014 నుండి 12.11.2014 వరకూ హైమవతీ జనయిత్రి వ్రతములు నిర్వహింపబడినవి. త్రికాలములలో జరిగిన ఈ వ్రతములలో ఆవరణలోని సోదరీమణులు, గ్రామస్తులు, కళాశాల విద్యార్థిను ఇతర ప్రాంతముల నుండి వచ్చినవారు పాల్గొన్నారు.

***

ప్రఖ్యాత ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ వి.యస్.ఆర్. మూర్తిగారు శ్రీవిద్యానిలయ ప్రాంగణమునందు 3-11-2014 నుండి 6-11-2014 వరకూ ప్రతిరోజు సాయంత్రం సత్సంగము నిర్వహించారు. ఈ కార్యక్రమములో అనేక ఆధ్యాత్మిక అనుభములను తెలియ జేశారు. శ్రీ హైమాలయ విశిష్టతను సోదాహరణముగా వివరించారు. హృద్యంగా సాగినవారి వివరణాత్మక ప్రసంగములు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమమును సోదరులు శ్రీ చక్కా శ్రీమన్నారాయణ సమర్థవంతముగ నిర్వహించారు.

9-11-2014 : హోమశాలలో సౌరహోమము జరిగింది.

10-11-2014 : హోమశాలలో సంకష్టహర గణపతి హోమము జరిగింది.

9-11-2014 : విజయవాడ వాస్తవ్యులు శ్రీ మువ్వావెంకట ఆదినారాయణ కృష్ణప్రసాద్ – శ్రీమతి శేషుమణి దంపతులు, వేద అధ్యాపకులకు, వేదవిద్యార్థులకు పరుపులు, దిండ్లు అందజేశారు.

10-11-2014 : శ్రీ వెంకట ఆదినారాయణ కృష్ణప్రసాద్, శ్రీమతిశేషుమణి దంపతులు (విజయవాడ) శ్రీ హైమాలయములో 5 గురు దంపతులకు దంపతి పూజ చేసుకొని నూతన వస్త్రములు అందజేశారు.

11-11-2014 : శ్రీ హైమవతీజనయిత్రి 72వ జయంతి ఉత్సవముల సందర్భముగ శ్రీ విశ్వజననీపరిషత్ వారు 24.9.2014 నుండి 12.11.2014 వరకు ఏర్పాటు చేసిన సప్తసప్తాహములలో పాల్గొని అమ్మనామ గానము చేసిన జిల్లెళ్ళమూడి గ్రామస్తులు మరియుజమ్ములపాలెం 6వ మైలు తదితర ప్రాంతముల నుండి వచ్చిన సోదరీ సోదరులందరికీ వారణాసి ధర్మసూరి శ్రీమతి భగవతి దంపతులు (హైదరాబాదు) నూతన వస్త్రములు అందజేశారు. ఈ కార్యక్రమములను ఆద్యంతము సమర్థవంతముగా నిర్వహించటానికి సాయపడిన సోదరుడు శ్రీ కొండముది రవిబాబుకు అందరు అభినందనలు తెలియజేశారు.

12-11-2014 : 24.9.2014 నుండి 12.11.2014 వరకూ నిర్విరామంగా జరిగిన “అమ్మ” నామ సప్తసప్తాహములు. ఈ రోజు శ్రీమతి భ్రమరాంబ అక్కయ్య శ్రీరవి, శ్రీ ఎమ్.దినకర్ తదితరులు, అమ్మకు, శ్రీ హైమవతీదేవికి నారికేళములు సమర్పించి హారతి ఇవ్వటముతో విజయవంతముగా ముగిశాయి.

శ్రీ హైమవతీ జనయిత్రి 72వ జయంతి వేడుకలు వేకువనే మంగళవాద్యములతో అభిషేకములు, అర్చనలు, వేదపఠనముతో, సోదరీసోదరుల సందడితో వైభవంగా ప్రారంభమయినాయి. శ్రీ లలితాకోటి పారాయణ నూతనముగా నిర్మించి అన్నపూర్ణాలయ భవనము నందు ప్రారంభమయినది. ప్రత్యేకముగా ఏర్పాటు చేసిన వేదికమీద “అమ్మ హైమవతీదేవి” చిత్రపటములకు పూజా కార్యక్రమము జరిగినవి. శ్రీశ్రీశ్రీ వాసుదేవానందగిరిస్వామి వారు (శ్రీ లలితాపీఠము – పెదపులిపాక) జ్యోతి ప్రజ్వలన చేసి, శ్రీ లలితా సహస్రనామవిశిష్టతను తెలియజేసి

కార్యక్రమమును ప్రారంభించారు.

కళాశాల ప్రిన్స్పాల్ డాక్టర్ శ్రీమతి లక్ష్మీసుగణ, అధ్యాపకులు మరియూ విద్యార్థినీ విద్యార్థుల హాస్టల్ వార్డెన్స్ శ్రీ మురళీధరరావు శ్రీమతి నాగమణి ఆధ్వర్యములో విద్యార్థులు ఎంతో క్రమశిక్షణతో వచ్చిన వారందరికీ తమ సహాయ సహకారములను అందజేశారు. సోదరులు శ్రీ టి.టి. అప్పారావుగారు కార్యక్రమ నిర్వహణ గావించారు. సాయంత్రం 6-30 ని.లకు కోటి నామపారాయణ “అమ్మ” ఆశీస్సులతో నిర్విఘ్నంగా పూర్తి అయింది.

శ్రీశ్రీశ్రీ సాయిదాస్ స్వామివారు (హైదరాబాద్) విద్యార్థినీ విద్యార్థులకు జ్ఞానస్వరూపిణి లలితాదేవి గురించి తెలియజేసి అందరిచేత గురువందనం గానము చేయించారు.

సోదరులు శ్రీ పొత్తూరి ప్రేమగోపాల్ శ్రీ హైమావతీదేవి క్యాలండర్లను అందజేయగా శ్రీ బ్రహ్మాండ రవి అన్నయ్య శ్రీ అనసూయేశ్వరాలయములో ఆవిష్కరిం చారు. పారాయణకర్తలకు, శ్రీ ప్రేమగోపాల్ అన్నయ్య క్యాలండర్లను అందించారు.

సాయంత్రం శ్రీ హైమాలయములో శ్రీ హైమవతీదేవి దివ్యసన్నిధిలో చిన్నారులు చి. అర్కేష్, చి. శరణ్య కేక్ కట్ చేశారు. సోదరీసోదరులు శ్రీ హైమవతీ జనయిత్రికి 72 రకముల పిండివంటలు నైవేద్యమిచ్చారు.

విజయవాడ వాస్తవ్యులు శ్రీ మువ్వా వెంకట ఆదినారాయణ శేషుమణి దంపతులు 72 మంది కన్యలకు లంగా ఓణీలు బహుకరించారు.

13-11-2014 : శ్రీ హైమవతీదేవికి జయంతి ఉత్సవముల సందర్భముగా చేసిన పూజా నిర్మాల్యమును ఓంకారనదిలో నిమజ్జనము చేశారు. కళాశాల విద్యార్థినులు నిర్మాల్యమును పళ్ళెరములలో వుంచి శిరస్సున ధరించి మంగళవాద్యములతో నడువగా అందరూ వారిని హైమవతీదేవిగా భావించి నారికేళములను సమర్పించి పసుపు కుంకుమలిచ్చి హారతులిచ్చారు. “అమ్మ హైమ” నామములతో బయలుదేరిన వూరేగింపులో ఆలయ అర్చకులు శ్రీశివ, శ్రీ సంతోష్ మరియు శ్రీ కార్తీక్ ఆనందంగా వుత్సాహంగా నృత్యం చేశారు. భక్తిశ్రద్ధలతో కార్యక్రమంలో నిర్వాహకులు శ్రీ వల్లూరి రమేష్బాబు తదితరులు ఉత్సాహంతో పాల్గొన్నారు.

14-11-2014 : జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో విద్యాభ్యాసము చేసి (2005 సం॥) ప్రస్తుతము వివిధ ప్రదేశములలో ఉద్యోగములలో వున్న పూర్వవిద్యార్థులు, శ్రీ హైమారావు, శ్రీ అప్పారావు, శ్రీ నరసింహ, శ్రీ లక్ష్మీనారాయణ, శ్రీ సుబ్బారావు, శ్రీ కామేశ్వరశర్మ, శ్రీ దుర్గాప్రసాద్, ప్రతి సంవత్సరమువలెనే ఈసారి కూడా జిల్లెళ్ళమూడి వచ్చి మాజీ ప్రధాని దివంగత నెహ్రూజీ జయంతి సందర్భముగా విద్యార్థిని విద్యార్థులకు అందరికీ అన్నప్రసాదవితరణగావించారు.

17-11-2014 : కార్తీకమాసము సోమవారము సందర్భముగా, వేదవిద్యార్థులు, ఆలయ అర్చకులు శ్రీ సంతోషశర్మ, మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల – విద్యార్థులు సాయంసమయములో శ్రీ హైమాలయ ప్రాంగణము నందు శివలింగాకారములో అత్యంత ఆకర్షణీయముగా ప్రమిదలతో దీపాలంకారణ ఈ కార్యక్రమము ప్రతి ఒక్కరినీ ఎంతో ఆకర్షించింది.

***

అన్నపూర్ణాలయ నూతన భవమనమునకు సింహద్వారం కార్తీకమాసం బహుళదశమి, సోమవారం ఉదయం ఉత్తర నక్షత్రయుక్త మకరలగ్న పుష్కరాంశమందు 11 గం.21ని॥లకు శుభసమయములో ముఖద్వారము ఏర్పాటు చేయబడ్డది. వేద అధ్యాపకులు, విద్యార్థులు వేదపఠనము చేయుచుండగా సోదరులు శ్రీ వల్లూరి రమేష్బాబు, శ్రీ వై.వి. శ్రీరామమూర్తి, శ్రీ నాదెండ్ల లక్ష్మణరావు, శ్రీమతి వసుంధర అక్కయ్య, తదితరులు ఆవరణలోని సోదరీసోదరులు అమ్మను అర్పించుకొని కొబ్బరికాయలు కొట్టి హారతి ఇచ్చారు.

***

శ్రీ రాఘవ మహేష్ కుమార్ – శ్రీమతి ఉషశ్రీ దంపతులు (బెంగుళూరు) వారి వివాహవార్షికోత్సవము సందర్భముగా శ్రీ అనసూయేశ్వరాలయములో అనసూయా వ్రతము చేసుకొని అందరికీ అన్నప్రసాదవితరణ గావించారు.

19-11-2014 : శ్రీ అనసూయేశ్వర ఆలయ ప్రాంగణములో శ్రీ విశ్వజననీ పరిషత్ వారు కార్తీకమాస వనభోజనములు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమములో అందరింటి సోదరీ సోదరులు, శ్రీ విద్యానిలయమందలి సోదరీసోదరులు, కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

22-11-2014 : సోదరుల శ్రీవారణాసి ధర్మసూరి తన షష్టిపూర్తి సందర్భముగా జిల్లెళ్ళమూడి వచ్చి సతీసమేతముగా ఆయుష్యహోమం చేసుకొని అమ్మను, నాన్నగారికి, శ్రీ హైమవతీదేవికి పూజ చేసుకొని అందరికీ అన్నప్రసాదవితరణ గావించారు. ఆవరణల వారికి నూతన వస్త్రములు అందజేశారు. కార్యక్రమమునకు వచ్చిన వారు శ్రీధర్మసూరి శ్రీమతి భగవతి దంపతులకు శుభాశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ విశ్వజననీపరిషత్ వారు “అమ్మ” ఆశీఃపూర్వకముగా ధర్మసూరి దంపతులకు నూతన వస్త్రములు అందజేశారు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!