- సహస్ర దీపాలంకరణ
నవంబరు 4 వ తేదీ కార్తిక శుద్ధ ఏకాదశి శుక్రవారం నాడు సాయంత్రం 6 గంటల నుండి లింగాకృతిలో సహస్ర దీపాలంకరణ చేసి జిల్లెళ్ళమూడి ఆవరణలోనూ, అనసూయేశ్వరాలయం, హైమాలయం, నవనాగేశ్వరాలయం, ఆలయాలకు వెళ్ళే దారిలోనూ, అన్నపూర్ణాలయం లోనూ దీపాల వెలుగులతో జిల్లెళ్ళమూడి అలయ శోభ ఇనుమడించింది. ఈ కార్యక్రమ పర్యవేక్షణ కుమారి మన్నవ సుబ్బలక్ష్మి, ఆవరణలోని సోదరసోదరీమణులు, కాలేజీ విద్యార్థులు నిర్వహించారు.
- దీపావళి
అక్టోబర్ 24 వ తేదీన జిల్లెళ్ళమూడి అనసూయేశ్వరాలయంలో, హైమాలయం లో దీపావళి సందర్భంగా విశేష పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమంలో శ్రీ యం.వి.ఆర్. సాయిబాబు దంపతులు అమ్మకు, నాన్నగారికి పూజ చేసుకుని కాకర పువ్వొత్తులు, టపాకాయలు సోదరసోదరీమణు లందరితో కలిసి అమ్మ, నాన్నగారి సమక్షంలో వెలిగించి దివ్య దీపావళి ఘనంగా చేసుకున్నారు. పద్మావతి అక్కయ్య తమ భజన బృందంతో కలిసి అమ్మ పాటలతో అమ్మని సేవించుకుని అందరినీ అలరించారు. కాలేజీ విద్యార్థినీ విద్యార్థులు, లెక్చరర్లు, విశ్వజననీ పరిషత్ మేనేజింగ్ ట్రస్టీ గిరిధర్ కుమార్, ఆవరణలోని అక్కయ్యలు, అన్నయ్యలు అందరింటి ముందు టపాకాయలతో, చిచ్చుబుడ్లు మొదలయిన వాటితో సందడి చేశారు.
3.నాగులచవితి
నాగులచవితి సందర్భంగా 29-10-2022 న నాగేశ్వరాలయంలో ఏకాదశ రుద్రాభిషేకం, హెూమశాలలో ఋత్విక్కులచే సర్పసూక్తముతో హెూమం జరిగింది. నవనాగ నాగేశ్వరాలయంలో ఆవరణలోని గ్రామంలోని సోదర సోదరీమణులు అభిషేకాలలోనూ, పాలు పోసుకొనడంలోనూ విశేషసంఖ్యలో పాల్గొన్నారు.
- సమాచారకేంద్ర కార్యాలయ శంకుస్థాపన
6, నవంబర్, 2022 న జిల్లెళ్ళమూడిలో ప్రవేశద్వారం ఎదురుగా ఉన్న ప్రదేశంలో కొత్త సమాచార కేంద్రం (Reception centre) నిర్మాణ శంకుస్థాపన జరిగింది. ఈ నిర్మాణానికి అయ్యే ఖర్చులు శ్రీ చక్కా శ్రీమన్నారాయణ, టెంపుల్స్ ట్రస్టీ వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఏర్పాటు చేస్తున్నారు. శంఖుస్థాపన కార్యక్రమంలో పాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు, SVJP Trust, SVJP Temples, Trust కార్యవర్గసభ్యులు, అందరింటి సోదర సోదరీమణులు, శ్రీ టి.టి. అప్పారావు, శ్రీ M.S.N. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
- శ్రీ హైమవతీదేవి 80వ జయంత్యుత్సవములు
నవంబరు 8 నుండి నవంబర్ 14 వ తేదీ వరకు శ్రీ హైమవతీశ్వరి 80 వ జయంతి ఉత్సవాలు జిల్లెళ్ళమూడిలో ఘనంగా జరిగాయి. 8వ తేదీ గ్రహణం కారణంగా ఆలయాల్లో నిత్యపూజ చేసి ఆలయాలను మూసివేయడం జరిగింది. 9 వ తేదీ నుండి హైమవతీ జనయిత్రీవ్రతాలలో అందరింటి అక్కయ్యలు అన్నయ్యలతో పాటు హైదరాబాద్, బొంబాయి వంటి సుదూర తీరాలనుండి కూడా భక్తులు వచ్చి పాల్గొన్నారు. బొంబాయి నుండి వచ్చిన గిరీష్ కుమార్ దంపతులు తమ సోదరుడు అనిల్ కుమార్ తోపాటు వృద్ధురాలైన చిట్టిపిన్ని (శ్రీమతి ఉప్పులూరి శ్రీ మహాలక్ష్మి) గారిని కూడా జిల్లెళ్ళమూడి తీసుకువచ్చి పూజలలో, హెూమాలలో పాల్గొనడం విశేషం. హైమాలయం లో ఉదయం, సాయంత్రం హైమవతీ జనయిత్రీ వ్రతాలు జరుగగా 13 వ తేదీ ఉదయం శ్రీ పొత్తూరి ప్రేమగోపాల్, కొండముది ప్రేమకుమార్, ధర్మసూరి అన్నయ్యల ఆధ్వర్యంలో అమ్మ, నాన్నగారు, హైమల చిత్రపటాలు అలంకరించబడిన ఎద్దులబండి రధంమీద జిల్లెళ్ళమూడి పురవీధుల్లో ఊరేగించడం జరిగింది. ఊరేగింపు దారిపొడువునా హైమక్కయ్యకు భక్తులు నీరాజనాలు అందించగా మైసూర్ పాక్, పులిహోర ప్రసాదంగా గ్రామం అంతా పంచడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీ పొత్తూరి ప్రేమగోపాల్ అన్నయ్య ధనసహాయం అందించారు. 14 వ తేదీ ఉదయం హైమవతీజయంతి రోజున హైమవతీశ్వరి నూతన సంవత్సర కాలెండర్ రెండు ఆలయాల్లో విడుదల చేయబడినది. నూతన కాలెండర్ ఆవిష్కరణ శ్రీ తంగిరాలు సింహాద్రి శాస్త్రి గారు, ప్రేమగోపాల్ గారు చేయగా పాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు, SVJP Trust & SVJP Temples Trust కార్యవర్గ సభ్యులుకూడా పాల్గొనడం జరిగింది. హైమవతీ దేవి పూజ 15 వతేదీ మంగళవారం అయినందున కొనసాగించి 16 వ తేదీ ఉదయం నిర్మాల్యం ఓంకార మేళతాళాలతో తీసుకుని వెళ్ళి కలపడం జరిగింది. 14 వ తేదీ హైమవతీ జయంతి రోజున లలితాకోటి నామ పారాయణ అత్యంత వైభవంగా జరిగింది. ఈ పారాయణ లో పాల్గొనడానికి విజయవాడ, గుంటూరు హైదరాబాద్, చీరాల, చిలకలూరిపేట, పురుషోత్తమ పట్నం, నర్సరావుపేట, కొండపాటూరు, కాకుమాను, పెదనందిపాడు, సత్తెనపల్లి సాతులూరు, పిడుగురాళ్ళ,నర్సాయపాలెం మొదలైన ప్రదేశాలనుండి వేలాదిమంది భక్తులు లలితాకోటి పారాయణకు బస్సుల్లో, ట్రాక్టర్లలో, జీపుల్లో, వ్యాన్లలో, ఆటోలలో జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను, హైమను దర్శించి పారాయణ దాదాపు కోటి 17 లక్షలు పూర్తిచేశారు. జిల్లెళ్ళమూడి బయట ఊళ్ళల్లో కూడా కొన్ని వందల కుటుంబాలు పారాయణలు చేసి తెలియజేశారు. వాళ్ళ పారాయణ కూడా దాదాపు 10 లక్షల పైన ఉన్నది. ఈసారి హైమవతీ దేవి జయంతికి 3000 మంది యాత్రికులు జిల్లెళ్ళమూడి దర్శించారని ఒక అంచనా. కోవిడ్ కు ముందు కోవిడ్ అనంతరం ఇంతమంది భక్తజన సందోహం, వాహనాలను చూడలేదని జిల్లెళ్ళ మూడి గ్రామస్తులు చర్చించుకోవడం కనిపించింది. వాహనాల వాహిని జిల్లెళ్ళమూడి మాతృశ్రీ మెడికల్ సెంటర్ నుండి పోలేరమ్మగుడి దాకా క్రిక్కిరిసి పోయాయి. ఈ సంఘటన వచ్చే అమ్మ శతజయంతికి వచ్చే భక్తులు ఎంతమేరకు ఉంటారో నని అమ్మ ఇచ్చిన సందేశం లాగా అనిపించింది. ఓం హైమ నమో హైమ శ్రీ హైమ జై హైమ
హైమవతీశ్వరి జయంతి రోజున 80 ప్రసాదాల నివేదన చేయడం, 80 మంది కన్నెపిల్లలకు పసుపు, కుంకుమ, చీరెలు పెట్టి సత్కరించటం జరిగింది.
భాగవత సప్తాహాలు:
నవంబర్ 18-11-2022 నుండి 24-11-2022 వరకు మన్నవ వారి ఆడపడుచు శ్రీమతి గుండవరపు విజయకుమారిగారి ఆధ్వర్యంలో 8 మంది బృందం సంపూర్ణ భాగవత సప్తాహం వాత్సల్యాలయ సభా ప్రాంగణంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వీరు భాగవత సప్తాహాలు 96 చోట్ల నిర్వహించి 97 వ సప్తాహం జిల్లెళ్ళమూడిలో ఉచితంగా నిర్వహించేందుకు ముందుకు రాగా శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్ట్ ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటలనుండి సాయంత్రం 6.30. వరకు మధ్యలో ఒక గంట భోజనం విరామంతో జరిగిన ఈ భాగవత సప్తాహంలో భాగవత ప్రియులు, భక్తులు, విద్యార్థులు పాల్గొని తరించారు.
- రుద్రహోమం
కార్తీకమాసం సందర్భంగా జిల్లెళ్ళమూడి ఆలయాలలో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, ప్రతి కార్తీక సోమవారం రుద్రహవనం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అనేక సోదర సోదరీమణులు పాల్గొన్నారు. ఈ రుద్రహోమంలో సోదరులు వారణాసి ధర్మసూరి, రమేశ్, సాయిబాబు, బ్రహ్మాండం శేషక్కయ్య, కొండముది ప్రేమకుమార్, బూదరాజు వాణి, శివప్రసాద్ మొదలయిన కుటుంబాల వారు తదితరులు పాల్గొన్నారు. ఈ రుద్రహెూమాన్ని ఆలయ పురోహితులు సర్వశ్రీ శ్రీనివాస శర్మ, నవీన్ శర్మ, మరియు వేదపండితులు సందీప్ శర్మ గారు వేదోక్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు .