అమ్మ కళ్యాణోత్సవం
మే నెలలో జరిగిన ముఖ్యమైన కార్యక్రమం అమ్మ, నాన్నగార్ల కళ్యాణ మహోత్సవం. ప్రతి సంవత్సరం మే 5వ తారీకున అమ్మ కళ్యాణోత్సవం మనం జరుపుకుంటాము. అదే విధంగా ఈ సంవత్సరం కూడా మే 5న అమ్మ, నాన్నగార్ల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది..
ఆరోజు ఉదయం 9.30 గం.లకు వసుంధర అక్కయ్య ఇంటి వద్దనుండి అమ్మ, నాన్నగార్ల విగ్రహాలను ఊరేగింపుగా ఆలయాలకు తీసుకువచ్చి, అక్కడ నుండి మేళతాళాలతో కళ్యాణ వేదిక వద్దకు చేర్చారు.
వరుని తరపున శ్రీ కోన సుబ్బారావు శ్రీమతి విజయలక్ష్మి దంపతులు, వధువు తరపున శ్రీ చక్కా అనసూయేశ్వర గుప్త, శ్రీమతి అంజనీ శృతి దంపతులు కళ్యాణ కార్యక్రమం నిర్వహించారు. జగజ్జనని, జగత్పితలైన అమ్మ, నాన్నగార్లకు తల్లి దండ్రులుగా.. కళ్యాణకర్తలైన ఆ దంవతులు ఎంత అదృష్టవంతులో కదా!
తరువాత అత్యంత ఉత్సాహభరితమైన కార్యక్రమం ఎదురుకోలు. అందరూ ఎంతో ఆసక్తితో వీక్షించే ఈ కార్యక్రమాన్ని సోదరులు శ్రీ దేశిరాజు కామరాజు, శ్రీ కొండముది సుబ్బారావు, అమ్మ || నాన్నగార్ల విశేష కళ్యాణ గుణగణాలను, ప్రతిభా పాటవాలను పోటా పోటీగా, రసరమ్యభరితంగా వర్ణిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మంగళసూత్ర ధారణ, తలంబ్రాలు మొదలైన శాస్త్రోక్త విధి విధానాలతో కార్యక్రమం ముగిసింది. సోదరుడు శ్రీ పాతూరి ప్రేమగోపాల్ ప్రతి సంవత్సరంలాగే ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సకల శ్రేయోదాయకము, శుభప్రదము అయిన ఈ ఉత్సవాన్ని తిలకించటానికి ఎందరో జిల్లెళ్ళమూడి రావడం చాలా ఆనందకరమైన విషయం.
ఈ ఉత్సవంలో భాగంగా – తెనాలి వాస్తవ్యులు శ్రీ సి.హెచ్.సాంబశివరావు, శ్రీమతి మాధవి దంపతులు కుమారుడు చి|| అమనా నాథ్ కి; హైదరాబాదు వాస్తవ్యులు శ్రీ బి. నరేంద్ర, శ్రీమతి నీలిమ దంవతుల కుమారుడు చి॥ నిత్యానంద్ కార్తీక్ కి బావట్ల వాస్తవ్యులు శ్రీ రాధాకృష్ణమూర్తి, శ్రీమతి రాధాదేవి దంపతుల మనుమడు చి|| వి. కృష్ణవంశీ లకు ఉపనయన కార్యక్రమములు జరిగినవి.
పిమ్మట రకరకాల వంటకాలతో కొత్త ఆవకాయతో పెళ్ళి భోజనం (అన్నపూర్ణాదేవి అమ్మ ప్రసాదం) ఎంతో రుచికరంగా అందరినీ సంతృప్తి పరచింది.
సాంస్కృతిక కార్యక్రమాలు : మే 5వ తేదీన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య ముని మనుమరాళ్ళు, శ్రీ కొండముది సుబ్బారావు మనుమరాళ్ళు శ్రీ దొడ్డవరపు వెంకటేశ్వర సూర్య ప్రశాంత్, శ్రీమతి నాగేంద్రదీప్తి దంపతుల కుమార్తెలు చిరంజీవులు హన్సిక, శ్రీనిధి నృత్యగానాలతో అమ్మను అర్చించారు. అందరినీ అలరించారు. చి॥ హన్సిక రామకృష్ణ అన్నయ్య రచించిన ‘అమ్మ కల్యాణం’ గీతాన్ని గానం చేసింది. చి|| శ్రీనిధి ‘చూడరమ్మ సతులాలా’ అన్నమయ్య కీర్తనను, ‘శబ్ద’ అనే ఐటెమ్ ను భరతనాట్య ప్రదర్శన ద్వారా అభినయించింది. అలరించింది.
మే 8 న చిరంజీవులు శ్రీనిధి, హంనిక సంయుక్తంగా ‘పుష్పాంజలి’, ‘శబ్దం’ అనే అంశాలను నాట్యప్రదర్శన కావించి ఆనందింపజేశారు.
అనుదినం నామసంకీర్తన, నగర సంకీర్తన, సహస్రనామ పారాయణలు ఇత్యాది కార్యక్రమాలు వైభవంగా నిర్విఘ్నంగా జరగటం కేవలం అమ్మ కృపావిశేషం.
జయహోమాత.