24.12.2011 : గుంటూరు వాస్తవ్యులు శ్రీ పి.రమణరావుగారి కుమారుడు పి. ప్రశాంత్ (యు.యస్.ఎ) అమ్మ హైమక్కలను దర్శించుకొని పూజలు చేసుకున్నారు.
29.12.2011 : రమణాశ్రమము నుండి వచ్చిన శ్రీ ఉపహర్ శ్రీమతి వీణ (విదేశీయులు) అమ్మ సేవా కార్యక్రమములో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం “క్రిస్మస్” పండుగకు జిల్లెళ్ళమూడిలో వుండాలని కోరుకుంటున్నామని తెలిపారు. వీరు చాలా సంవత్సరముల నుండి అమ్మను దర్శించుకుంటున్నారు.
31.12.2011 : తిరుపతి ఏడుకొండలు నడిచి ఎక్కినట్లుగా అమ్మబిడ్డలు ఉదయం 8-30 బాపట్లలో రవి అన్నయ్యగారి ఆతిధ్యం స్వీకరించి “అమ్మ కుంకుమ ధరించి” భక్త బృందం బాపట్ల నుండి జిల్లెళ్ళమూడివరకూ నడకసాగించారు. ఈ కార్యక్రమములో సోదరి శ్రీమతి వారణాసి భగవతి, శ్రీమతి రాచర్ల కమలక్కయ్య శ్రీ రవి అన్నయ్య కొంత కొంత దూరం నడిచారు. శ్రీవారణాసి ధర్మసూరి, శ్రీ వఝ మల్లిఖార్జునరావు, శ్రీ మన్నవకృష్ణశర్మ జిల్లెళ్ళమూడి నడచివచ్చారు. ప్రతి సంవత్సరం డిశంబరు 31 నాడు బాపట్ల నుండి జిల్లెళ్ళమూడి నడచివచ్చి అమ్మ దర్శనం చేసుకోవాలని కొంత మంది అమ్మ బిడ్డలు ఉవ్విళ్ళూరు తున్నారు.
శ్రీ వై.వి.సుబ్రహ్మణ్యంగారు (బుద్ధిమంతుడు అన్నయ్య – చీరాల) గత 40 సంవత్సరాలుగా డిసెంబరు 31 తేది అమ్మకు నివేదన ఇవ్వటానికి రస్కులు, బిస్కట్లు తెచ్చినట్లుగానే ఈ సంవత్సరము కూడా తెచ్చారు. రాత్రి 12 గంటలకు అమ్మకునివేదన చేసి అందరికీ పంచారు.
ఉదయం శ్రీ ఋలుసు సోమసుందరరావుగారు, శ్రీమతి సీతామహలక్ష్మి వారి పెళ్ళి రోజు సందర్భముగా అమ్మకు పూజ చేసుకొని అన్నపూర్ణాలయంలో అందరికీ విందుభోజనం ఏర్పాటు చేశారు.
మధ్యాహ్నం సర్వవిద్యాధిదేవత అయిన అమ్మ దివ్యాశీస్సులతో మాతృశ్రీ సంస్కృత కళాశాల, పాఠశాలల దినదినాభివృద్ధికోరుతూ, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది సామూహికంగా హైమాలయంలో లలితా పారాయణంలో విశేష పూజ నిర్వహించి అన్నపూర్ణాలయంలో అన్నప్రసాదవితరణగావించారు.
శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తిగారు అమ్మ సన్నిధిలో శ్రీ లలితాసహస్రనామ పారాయణ చేయటంలోని అంతర్యాన్ని వివరించారు.
మాతృశ్రీ తత్వచింతన సదస్సులో పాల్గొని అమ్మ సేవను గావించుకొన్న విద్యార్థినీ, విద్యార్థులకు జ్ఞాపికలను కరస్పాండెంట్ శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ గారి సౌజన్య, (ఆర్థిక) సహకారాలతో శ్రీమతి వసుంధర, శ్రీ రమేష్, శ్రీ లక్ష్మణరావుగారు బహుకరించారు.
సాయంత్రం 6 గంటలకు ఆవరణలోని వేదిక వద్ద శ్రీమతి బ్రహ్మాండం వసుంధర అక్కయ్య, శ్రీమతి నాదెండ్ల భ్రమరాంబ అక్కయ్య కుమారి ఎమ్.వి.యస్. సుబ్బలక్ష్మి గారు ఆధ్వర్యంలో సందెగొబ్బెమ్మ పేరంటము జరిగింది. పాఠశాల విద్యార్థినులు, ఇంటర్, డిగ్రీ 2సంవత్సరం విద్యార్థినులు కన్నుల పండుగగా కోలాట నృత్యాన్ని ప్రదర్శించి అందరినీ ఆనందపరిచారు. డా॥ ఝాన్సీలక్ష్మి, శ్రీ సుబ్రహ్మణ్యంగారు శ్రీ కొండముది రవిగారు, తమ గాత్ర వాద్య సహకారమును అందచేశారు. శ్రీ హనుమబాబుగారు ఈ గొబ్బి పండుగ ప్రాధాన్యతను వివరిస్తూ “ద్వాపరయుగములో గోపకాంతలు కాత్యాయని వ్రతము చేశారని దానిని అనుసరించి గోదాదేవి శ్రీరంగనాధుని సేవించినదని అదే విధానములో ఈ గొబ్బెమ్మల సందడి కూడా ఏర్పడి వుండవచ్చునని, ప్రధానంగా కన్నెముత్తయి దువులు తమ కోర్కెలు తీర్చి, మంచి జీవితాన్ని ప్రసాదించమని గొబ్బెమ్మను గౌరీదేవిగా భావించి చేసే పండుగ అని తెలియచేశారు.
అర్ధరాత్రి 12 గంటలకు శ్రీ అనసూయేశ్వరా లయంలో శ్రీ విశ్వజననీపరిషత్ ఉపాధ్యక్షులు శ్రీ కె.బి.జి. కృష్ణమూర్తిగారు తెరలాగి 2011వ సంవత్సరమునకు వీడ్కోలు పలికి 2012వ సంవత్సరమునకు స్వాగతం పలికారు. శ్రీ వఝ శివరామకృష్ణ, శ్రీమతి భూమిక ప్రసన్నల పుత్రుడు (మల్లన్నయ్య మనుమడు) చి|| ఆర్యనాధవంశీకృష్ణ కేక్ కట్ చేశాడు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సోదరీ సోదరులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. 2012 అమ్మ కాలెండరు ఆవిష్కరించి అమ్మకు సమర్పించారు.
1.1.2012 : విశేష పూజా కార్యక్రమాలు నిర్వసించ బడినాయి. సాయంత్రం 6 గంటల నుండి శ్రీ హనుమబాబు గారి ఆధ్వర్యంలో అమ్మ నామ సంకీర్తన, అమ్మ పాటలు అందరినీ ఆనందపరిచాయి.
నూతన సంవత్సర సందర్భముగ బాపట్లలో డాక్టర్ శ్రీమతి ఎ. ఇనజకుమారి గారి (పాపక్కయ్య) స్వగృహములో డాక్టర్ ఇనజకుమారి, డాక్టర్ జస్వంత్, డాక్టర్ రమాదేవి అనసూయా వ్రతముజరుపుకున్నారు. శ్రీ పి.యస్. ఆర్ ఆంజనేయప్రసాద్గారు, శ్రీ రావూరి ప్రసాద్లోరు, నిర్వహించారు. శ్రీ విశ్వజననీపరిషత్ అధ్యక్షులు శ్రీ ఎమ్. దినకర్ పాట్రన్ శ్రీ బ్రహ్మండం రవి కార్యవర్గ సభ్యులు, ఇనజకుమారిగారి (పాపక్కయ్య) బంధుమిత్రులు, జిల్లెళ్ళమూడి సోదరీసోదరులు పాల్గొన్నారు.
4.1.2012 : శుద్ధ ఏకాదశి సందర్భముగా అనసూయేశ్వరాలయములో వసుంధర అక్కయ్య, రాచర్ల కమల అక్కయ్య, లక్కరాజు లక్ష్మి, తులసి, కుమారి మౌనిక, కుమారి ఎమ్.వి.సుబ్బలక్ష్మి, పింగళి స్వరాజ్యలక్ష్మి అనసూయావ్రతము చేసుకున్నారు.
5.1.2012 : ముక్కోటి ఏకాదశి సందర్భముగా తెల్లవారుజామున 5 గంటలకు అమ్మాలయములో ఉత్తర ద్వారదర్శనము జరిగినది. శ్రీ బ్రహ్మాండ రవీంద్రరావు దంపతులు, శ్రీమతి రాచర్ల కమలక్కయ్యం శ్రీ ఎ.వి.ఆర్. సుబ్రహ్మణ్యం దంపతులు. మహావిష్ణురూపిణిగా అమ్మను అర్చించుకున్నారు. అన్నయ్యలు, అక్కయ్యలు, శ్రీ విష్ణుసహస్ర నామ పారాయణ చేశారు. సోదరుడు రావూరి ప్రసాద్, సోదరి ఝాన్సీలక్ష్మి, కుమారి ఎమ్.వి. సుబ్బలక్ష్మి, శ్రీ హనుమబాబు గారు అమ్మ నామ సంకీర్తన చేశారు.
6.1.2012 : శ్రీమతి వంగల వెంకటలక్ష్మి (గుంటూరు) శ్రీమతి ఓరుగంటి వెంకటలక్ష్మి, సీతారావమ్మ (చీరాల) శ్రీమతి పురాణం ధనలక్ష్మి (గణపవరం) అమ్మకు, హైమక్కలను పూజించి వస్త్రములు సమర్పించారు.
9.1.2012 : గుంటూరు వాస్తవ్యులు శ్రీ మన్నవ ప్రేమకిరణ్, శ్రీమతి లక్ష్మీస్ఫూర్తి దంపతుల ప్రధమ పుత్రిక నామకరణోత్సవము అనసూయేశ్వరాలయములో వారి బంధుమిత్రుల సమక్షములో జరిగింది. “చిన్నారికి శ్రీ శివనాగసాయిహన్సిత”గా నామకరణము చేశారు. అన్నపూర్ణాలయములో అందరికీ విందుభోజనము ఏర్పాటు
చేశారు.
12.1.2012 : మస్కట్ వాస్తవ్యులు శ్రీ చక్కా సత్యనారాయణగారు, శ్రీమతి మేఘన, వారి కుమారుడు చి|| సాయి జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను దర్శించుకున్నారు.
అమెరికా వాస్తవ్యులు చి॥లోకేష్ నాగప్రవీణ్, శ్రీమతి అనుహారిక, శ్రీ చక్కా శ్రీమన్నారాయణ గారి కూతురు, అల్లుడు జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను దర్శించుకొని అర్చనచేశారు.
13.1.2012 : శ్రీ బుద్ధిమంతుడు అన్నయ్యగారి కుమారుడు, కోడలు శ్రీరాజా ప్రభాకర్, శ్రీమతి భారతి, వీరి కుమారుడు చి||సాయినాధ్ (హైదరాబాద్) అమ్మకు హైమకు కుంకుమార్చన చేసుకొని వస్త్రములు సమర్పించారు. వీరు 5 కిలోల పసుపు, 5 కిలోల కుంకుమ, 2 మోడాల గాజులు, అమ్మకు, హైమ అక్కయ్యకు సమర్పించారు. శ్రీమతి భారతిగారి అమ్మ కలలో కనిపించారట. కలలో అమ్మ ఇంటి మధ్యలో కుర్చీలో కూర్చున్నారు. ఎఱ్ఱ చీర కట్టుకొని ఉన్నారు. ఇంటిలో వున్న అందరినీ పిలవమన్నారు. సేమ్యా పాయసం చెయ్యమన్నారు. కుర్చీలో నుండి తనను లేపమన్నారు. తన ఒక్కదానికి అమ్మలేవలేదు. రాణా ప్రభాకర్ గారిని కూడా పిలిచి తనకు సాయం చేయమన్నారు. మర్నాడు ఉదయం నిదురలేవగానే భారతిగారికి చేతులు, భుజాలు చాలా నొప్పిగా అనిపించాయి. అందువల్లే వీరు అమ్మకు పూజలు చేసి సేమ్యాపాయసం నివేదన ఇచ్చారు. అమ్మకు పూజ చేసి, నివేదన ఇచ్చి వచ్చిన శ్రీ రాణాప్రభాకర్కు చాలా నీరసంగా అనిపించిందట. చాలారోజులుగా వేధిస్తున్న షుగర్ ఈ రోజు (13.1.2002) కంట్రోల్లో వుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీ బుద్ధిమంతుడు అన్నయ్య, వారి కుటుంబసభ్యులు అందరూ పాల్గొన్నారు.
హోమశాలలో సంకష్టహర గణపతి హోమము జరిగింది. శ్రీ యస్.మోహనకృష్ణగారు, శ్రీమతి రుక్మిణి గారు తదితరులు పాల్గొన్నారు. శ్రీ రంగల పవన్కుమార్ (యు.యస్.ఎ.) నిర్వహించారు.
14.1.2012 : అమ్మ ఆలయంలో ధనుర్మాసము మొత్తము తెల్లవారుజామున 4 గంటలకు శ్రీమతుకుమల్లి రాము, శ్రీ వఝమల్లు అన్నయ్యలు వూరి చెరువునుంచి బిందె తీర్థము తీసుకొనిరాగా “అమ్మ” స్నానము నిమిత్తము వినియోగించారు. తెల్లవారుఝామున 5 గంటలకు శ్రీ సుబ్రహ్మణ్యం గారు, శ్రీ హనుమబాబుగారు, శ్రీ గోపాలన్నయ్య మొదలైనవారు సంకీర్తన చేయగా, ఎమ్.వి. సుబ్బలక్ష్మి, బి. వరలక్ష్మి తదితరసోదరీమణులు పూజలలో పాల్గొన్నారు.
ఈ నెలరోజులు అన్నపూర్ణాలయములో తెల్లవారు ఝామున ఆలయములలో నివేదన నిమిత్తము, శ్రీ చలపతిరావు వారి సతీమణి శ్రీమతి రమాదేవి, రుచికరమైన ప్రసాదాలు తయారుచేసి అందజేశారు.
భోగిపండుగ సందర్భముగా సాయంత్రము 6 గంటలకు అమ్మాలయములో, హైమాలయములో పూజలు, భోగిపండ్ల కార్యక్రమంలో ఆవరణలోనివారు గ్రామస్థులు, ఇతర ప్రాంతముల నుంచి వచ్చిన, సోదరీ సోదరులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతములలో వున్న గోపాలన్నయ్య కుమారులు, కోడళ్ళు, మనుమలు అందరూ అమ్మకు పూజ చేసుకొని ఈ వేడుకలో పాల్గొన్నారు. ఆలయములో జరిగిన సంకీర్తనలో శ్రీమతి భ్రమరాంబ అక్కయ్య, డాక్టర్ ఝాన్సీలక్ష్మి, శ్రీ హనుమబాబు, శ్రీ సుబ్రహ్మణ్యగారలు ఈ కార్యక్రమాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో శ్రీ రమేష్ అన్నయ్య (కార్యదర్శి) పాల్గొన్నారు. విజయవంతముగా నిర్వహించారు.
15.1.2012 : హోమశాలలో శ్రీ అవ్వారిదీక్షితులు గారి ఆధ్వర్యంలో సౌరహోమము జరిగింది. ఈ కార్యక్రమములో శ్రీ మోహనకృష్ణ, శ్రీమతి రుక్మిణి మొదలైన వారు పాల్గొన్నారు.
సంక్రాంతి సందర్భముగ ఆలయములలో పూజలు, సంకీర్తనా కార్యక్రమము జరిగింది. ఆవరణలోని వారు గ్రామస్తులు పాల్గొన్నారు.
18.1.2012 : హైదాబాదు నుండి వచ్చిన సోదరులు శ్రీ మేళ్ళచెరువు వెంకటరామసాయిబాబు, శ్రీమతి
అనంతసీతాలక్ష్మి హోమశాలలో అమ్మ మూలమంత్ర హోమము జరుపుకున్నారు.
సోదరులు శ్రీ విశ్వజననీపరిషత్ ట్రెజరర్ శ్రీ లక్కరాజు రామకోటేశ్వరరావుగారు షష్టిపూర్తి కార్యక్రమము జరిగింది. శ్రీరామకోటేశ్వరరావుగారు, శ్రీమతి లక్ష్మి రుద్రహోమము, ఆయుష్ హోమము చేసుకున్నారు. అనసూయేశ్వరాలయంలో, హైమాలయములలో అభిషేకము పూజ చేసుకున్నారు. అనంతరము అందరికీ విందు భోజనము ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకు అన్నపూర్ణాలయ వేదిక మీద శ్రీరామకోటేశ్వరరావు, శ్రీమతి లక్ష్మిగారలకు వేద ఆశీస్సు జరిగింది. బంధుమిత్రులు ఆవరణలోని అన్నయ్యలు, అక్కయ్యలు సందడితో కార్యక్రమమంతా ఆనందంగా, ఆహ్లాదకరంగా జరిగింది.
16.1.2012 నుండి 18-1-2012: శ్రీ మన్నవ బుచ్చిరాజు శర్మ (రాజుబావ) గారి సతీమణి కీ॥శే॥ శ్రీమతి ప్రభావతిగారి జ్ఞాపకార్థము అమ్మ, హైమాలయములలో అర్చనలు, అభిషేకములు జరిపారు. శ్రీరాజుబావగారు, వారి కుమారుడు, కోడలు, కుమార్తె, అల్లుడు, బంధుమిత్రులందరూ పాల్గొన్నారు.
19.1.2012 : శ్రీ మన్నవ బుచ్చిరాజుశర్మ (రాజుబావ) గారి సతీమణి కీ॥శే॥ శ్రీమతి ప్రభావతిగారి సంస్మరణసభ జరిగింది. శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ గారి సభా నిర్వహణలో శ్రీ బ్రహ్మాండం రవి, శ్రీ మన్నవదత్తు, శ్రీ వై. వి. శ్రీరామమూర్తి, శ్రీరావూరి ప్రసాద్, శ్రీ ఎమ్. దినకర్లు అక్కయ్యగారితో వారికి గల అనుబంధము, ఆమె అమ్మకు చేసిన సేవ గుర్తుచేసుకున్నారు.
22.1.2012 : కె.వి.యల్.పవిత్ర (ఆక్స్ఫర్డ్ స్కూల్, గుంటూరు) 10వ తరగతిలో స్టేట్రంకు వచ్చిన సందర్భంగా జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను ఆరాధించుకున్నారు.