ఇది ఒకనాటి మాట. అమ్మ సన్నిధి. అమ్మను తొలిసారిగా దర్శించుకున్న అనుభవాన్ని వ్యాస రూపంలో పెట్టాలని సంకల్పం. అమ్మకు తెలియక పోతే కదా! “వ్రాయి నాన్నా” అని అంటూ ‘మాతృశ్రీ మాస పత్రిక’కి చందా కట్టమంది అమ్మ. వెంటనే ఇంకో మాట కూడా అంది. “రాబోయే అన్నకి తమ్ముడు పెట్టే పెట్టుబడి నాన్నా!” అని. అమ్మ అన్న ఈ రెండో మాట నాకు ఆశ్చర్యాన్ని కలగచేసింది. ఎంత ఆలోచించినా అర్ధం కాలేదు. అమ్మని అడిగే ధైర్యం లేదు.
కాలం గడుస్తోంది. అమ్మ అనేక సార్లు పిలిచింది. మనం ఏమి చేయగలం పరిగెత్తుకుని రావటం తప్ప. కొన్ని నెలల తరువాత ఒక అద్భుత సంఘటన జరిగింది. అదేమిటంటే మా అన్నగారు ఋషీకేష్ లో స్వామి శివానంద ఆశ్రమంలో ఉండేవారు. వారికి అనారోగ్య సమస్య వచ్చి నా దగ్గరకు వచ్చారు. నా దగ్గర అమ్మ గురించి విన్నారు. అమ్మను చూడాలని జిల్లెళ్లమూడి వెళ్ళారు. వారిని అమ్మ ఆదరించింది. సుమారు నాలుగు నెలలు అమ్మ సన్నిధిలో వారు ఉన్నారు. పూర్తిగా ఆరోగ్యం చేకూరింది వారికి. తరువాత వారు జీవితంలో స్థిరపడ్డారు. మరి “అమ్మ మాట జరిగితీరుతుందిగా”! .. ఇది నా స్వానుభవం. ఈ రోజు తొలి ఏకాదశి. ఈ పవిత్రమైన రోజున మనం “అమ్మ నామ స్మరణ”లో పునీతులమవుదాం!… జయహెూమాతా