అమ్మ “విరామం లేనిది రామం” రామశబ్దాన్ని నిర్వచించింది. తనను గురించి ‘తల్లి’ అన్నది; తల్లి అంటే తొలి (Origin) అనీ, ‘తరింప జేసేది’ అనీ దయతో వివరించింది.
‘విరామం లేనిది’ ఆది మూలమైన శక్తి; దీనినే ‘సద్యోజాతం ప్రపద్యామి, సద్యోజాతాయ వై నమో నమః ‘ అంటుంది రుద్ర నమకం.
‘దేనికి విరామం లేదు?’ అని ప్రశ్నించినపుడు అమ్మ “సృష్టికి లేదు, కదలికకు లేదు. విరామం లేకుండా జరుగుతున్న ప్రతి పనీ రాముడే. మనలోని ఉచ్ఛ్వాస నిశ్వాసలు విరామం లేకుండా ఉన్నాయి. వ్యష్టిగాగానీ, సమష్టిగా గానీ విరామం లేకుండా ఉండే ప్రతి ఒక్కటీ రామమే” అని స్పష్టం చేసింది.
సృష్టికి విరామం లేదు (ప్రధమంలో ఏర్పడే స్పందనలు) కదలికకు విరామం లేదు- అంటే సృష్టికీ, సృష్టికర్తకీ విరామం లేదు అని అర్థం. సూర్యోదయ అస్తమయాలు, గ్రహాలూ గ్రహరాజుల గతులు, జనన మరణాలు, సుఖదుఃఖాలు … ద్వంద్వాలూ, రక్తప్రసరణ, హృదయస్పందన, సంకల్ప వికల్పాలు ఒక్కమాటలో సృష్టి స్థితి లయాలు విరామం లేనివి.
మాతృశ్రీయే శ్రీరాముడు; అందుకు కొన్ని విశేషాంశాలు – శ్రీరాముడు తాను దైవమని ఎన్నడూ. అనలేదు; ‘ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం’ అన్నాడు. “నేను జిల్లెళ్లమూడి కరణం గారి భార్యను” అన్నది అమ్మ.
‘నువ్వు రాజరాజేశ్వరివి అమ్మా!’ అని అంటే “నాన్నా! మీరు కానిది నేనేదీ కాదు”, “నేనూ మీలాంటి దాననే” అని అన్నది.
శ్రీరామునితో చతుర్ముఖ బ్రహ్మ ‘సీతాలక్ష్మీ భవాన్ విష్ణుః’ అనీ, ‘వథార్థం రావణస్యేహ ప్రవిష్ణో మానుషీం తసుమ్” అనీ అన్నారు. (అంటే ‘రామా! నువ్వు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, సీతా సాధ్వి మహాలక్ష్మీదేవి. రావణ కుంభకర్ణాది ఘోర రాక్షస సంహరణార్థం నువ్వు అవతరించావు’ అని)
అమ్మతో శ్రీ చిదంబరరావు తాతగారు “అమ్మా! నువ్వు సకల కార్యాలకూ కారణమై, అకారణంగా సకల కార్యాలను నడిపే సగుణమూర్తివి” అంటే, అమ్మ “నేను అమ్మను. మాతృధర్మం కోసం వచ్చాను” అన్నది.
హరిగుణమణిమయ మగు సరములు గళమున ధరించాలనే ప్రయత్నం చేస్తా. –
వాల్మీకి మహర్షి శ్రీరాముని కల్యాణగుణాల్ని ఏకరువు పెడుతూ అంటారు – గుణవంతుడు, పరాక్రమ వంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవాక్పరిపాలకుడు, దృఢవ్రతుడు, ప్రియదర్శనుడు… అని.
అమ్మ అంత కళ్యాణ గుణపరంపరలో ఒక్కదానిని అభివర్ణిస్తాను – త్యాగగుణం. అది చరిత్ర ఎరుగనిది, అనితర సాధ్యమైనది.
క్షీరసాగరమధనంలో ప్రభవించిన సర్వసంహార కారకమైన హాలాహాలాన్ని పరమేశ్వరుని మ్రింగమని కోరింది పార్వతీదేవి.
‘మ్రింగెడివాడు విభుండని
మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ
మంగళసూత్రంబునెంత మది నమ్మినదో!’
శ్రీరాముని (పతి) ఆనతి తలదాలిచి అగ్నిదూకె సీత
కాగా అగ్ని కంటే భయంకరమైన ఆత్మహత్యా సదృశ్యమైన పతిదేవుని ఆజ్ఞని అమ్మ శిరసావహించింది. నాన్నగారు (అమ్మ పతిదేవులు) అమ్మను ఒక కోరిక కోరారు, పరోక్షంగా ఆజ్ఞాపించారు. అమ్మకంటే ముందుగా అంగీకరించింది. దాటిపోవాలని. అమ్మ
స్వహస్తాలతో నాన్నగారిని అనసూయేశ్వరులుగా ఆలయప్రవేశం చేయించింది. “సుమంగళి అంటే- భర్త కంటె ముందుగా దాటిపోవడం కాదు; భర్తకు చివరిక్షణం వరకూ ఏ లోటూ లేకుండా సేవలనందించడం” అని ఒక విశిష్ట సత్యాన్ని ఆచరణాత్మకంగా ప్రబోధించింది. ఇది అమ్మ దృష్టిలో త్యాగం కాదు, పతివ్రతా ధర్మం. తన మంగళసూత్రాలనే జగత్కళ్యాణ సూత్రాలుగా ఆవిష్కరించింది.
శ్రీరాముడు ఒక వ్యక్తి కాదు; మహనీయ మానవీయమూర్తి. హిందువులకు మాత్రమే ఆదర్శ ప్రాయుడు, ఆరాధ్యమూర్తి కాదు; విశ్వమానవాళికి, మహత్తర సంస్కృతికి, సంస్కారానికి ప్రతీక. అమ్మ వాత్సల్యపయోనిధి; ఆశ్చర్యకర అనుగ్రహప్రద; నర నారాయణ నరకాసురులను కన్న అనసూయమాత; త్రిశక్తిరూపిణి.
రాముడు ఏకపత్నీవ్రతుడు; అమ్మ పతివ్రతా శిరోమణి.
రాముడు ధర్మస్వరూపం; అమ్మ రాశీభూతమైన రాగం, త్యాగం.
రాముడు చక్రవర్తి; అమ్మ నిత్య సత్యదీప్తి.
రామునికి రెండు నాల్కలు లేవు; ఒకటే మాట, ఒకటే బాణం.
అమ్మ వాక్కు వేదవాక్కు, ఆప్తవాక్కు, అమోఘ వాక్కు. మాతృశ్రీ – శ్రీరాముడు ఇరువురూ ప్రతిఫలాపేక్ష ఎరుగని సేవాభావం.
‘రామాయణం’ అంటే శ్రీరాముడు నడిచిన మార్గం- ధర్మపథం. ‘అమ్మత్వం’ అంటే దివ్యమాతృ తత్వం – అనురాగబంధం, రక్త సంబంధం.
శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః
శ్రీ అనసూయా మహాదేవ్యై నమః
(5-8-2020న అయోధ్యలో భారత ప్రధాని మాన్యులు శ్రీ నరేంద్రమోడీ శ్రీ రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయటం అందరికీ గర్వకారణం, మహ దానంద దాయకం)
‘సత్యమేవ జయతే, నానృతం;
సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ.’