‘విద్యాదదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం |
పాత్రత్వార్ధన మాప్నోతి ధనాద్ధర్మం తతస్సుఖం ॥’
విద్యవలన వినయము, వినయము వలన పాత్రత (qualification) పాత్రతవలన ధనం, ధనము వలన ధర్మం, ధర్మము వలన ఐహికాముష్మిక సుఖములు కలుగుతాయి. ‘అర్థం’ అంటే meaning అనీ, money అనీ రెండు అర్థాలు ఉన్నాయి.
ఒక సందర్భంలో అమ్మ “నాన్నా! మనం తినటానికి పుట్టామా? పుట్టినందుకు తింటున్నామా? ” అని ఒక విచికిత్స చేసింది. అమ్మ సత్యశోధనని మనం అర్థం చేసుకుంటే జీవితం యొక్క Meaning, జీవించటానికి ఊపిరి ఉన్నంతకాలం అహరహం శ్రమించి సంపాదించే Money (ధనం) యొక్క Meaning స్పష్టం అవుతాయి. ఒక పరిమితి వరకు ఉంటే అర్థం (ధనం) సర్వార్థదాయకం; హద్దు మీరితే సర్వఅనర్థదాయకము.
మరి కొంచెం లోతుకు వెళ్ళి వివరించే ముందు అమ్మ దివ్య సన్నిధిలో రెండు సన్నివేశాల్ని ముచ్చటించాలి.
జిల్లెళ్ళమూడిలో ఒక రోజు మండు వేసవి సమయం. అమ్మ ఉండే గదికి పై అంతస్థు లేదు. (అమ్మ స్థితికి అతీతంగా ఏ శక్తీ, ఏస్థితీ లేదు). కావున గ్రీష్మ తాప ప్రభావమంతా అమ్మ గదిలోనే ఉంటుంది. కిటీకలకు వట్టివేళ్ళ తడకలు కట్టాం; గదిలో జానెడు ఎత్తున నీరు నిల్వ చేశాం. పంచాగ్నుల మధ్య పార్వతీ దేవిలా ఉంది అమ్మ. చేతనైన శైత్యోపచారాలు చేస్తున్నాం. “నాన్నా! తలనెప్పిగా ఉంది. గట్టిగా పట్టుకో” అన్నది అమ్మ. ‘తస్యయజురేవ శిరః’ – విరాట్పురుషుని శిరస్సు అంటే యజుర్వేదం. అమ్మ సేవాభాగ్యం కలిగినందుకు ఉప్పొంగిపోతూ అమ్మ తలను, కణతలను గట్టిగా పట్టి ఉంచాను. రెండు నిముషాలు గడిచాయి. “నాన్నా! నీకు ఎన్ని వేలు అయినా ఇస్తాను” అన్నది. అమ్మ. అమ్మ అనుగ్రహించిన వరానికి కృతజ్ఞతాంజలి ఘటించాను. శ్రీకృష్ణునికి కుచేలుడు గుప్పెడు అటుకులు ఇస్తే అతులిత భోగమోక్షాల్ని అనుగ్రహించాడు. ‘ధన్యోస్మి, అమ్మా! నా అదృష్టవశాత్తూ ‘వేలు’ అన్నావు. ‘లక్షలు’ అని ఉంటే నా పతనం ఆ రోజే ప్రారంభం అయి ఉండేది’ – అని అనుకున్నాను.
హద్దు మీరిన సంపద, గర్భైశ్వర్యత్వం అనర్ధ హేతువులు. ఐశ్వర్య మదాంధకారాన్ని, దాని దుష్ప్రభావాన్ని వివరిస్తూ శుకనాసోపదేశంలో బాణకవి ‘ఇయం సంవర్ధన వారి ధారాతృష్ణా విషవల్లినాం, వ్యాధి గీతిరింద్రియ మృగణాం, పరామర్శ ధూమలేఖా సచ్చరిత్ర చిత్రాణాం, విభ్రమ శయ్యా మోహదీర్ఘనిద్రాణాం, ఆవాసదరీ దోషాసీ విషాణాం, అకాల ప్రావృట్ గుణ కలహంసకస్య, ప్రస్తావనా కపట నాటకస్య, రాహు జిహ్వ ధర్మేందు మండలస్య,’ అని ఒక రూపకాలంకార మాలికను ప్రయోగించారు. (అంటే లక్ష్మీదేవి – కోరికలు అనే విషవృక్షాలకి జీవనధార; ఇంద్రియాలు అనే సర్పాలకి బోయవాని నాదస్వరం, ఉత్తమ చరిత్ర చిత్రాలకి మచ్చ, దుర్గుణములనే విషసర్పాలకి పుట్టినిల్లు, కపటనాటకానికి ప్రస్తావన, ధర్మానికి గ్రహణం… అని అర్థం)
మరొక సన్నివేశం. ఒకసారి ఏలూరు సోదరులు శ్రీ టి.టి. అప్పారావు గార్కి అమ్మ తన మాతృత్వమమకారామృతాన్ని రంగరించి అనుగ్రహరూపమైన అన్నాన్ని గోరుముద్దలు చేసి పసిబిడ్డకి వలె తినిపిస్తోంది. ఆ సందర్భంలో అన్నయ్య, ‘అమ్మా! నువ్వు పెడుతూంటే ఎంతో హాయిగా ఉంది” అన్నారు. వెంటనే అమ్మ, “తినే వారికి ఇంత ఆనందంగా ఉంటే, పెట్టే వారికి ఎంత ఆనందంగా ఉంటుందో” అన్నది. మరొక సందర్భంలో, “పెట్టుకోవటానికి కాకపోతే (ధనం) ఉండటం ఎందుకు?” అని ప్రశ్నిస్తూ సుప్తమానసాలకి ఒక చురక వేసింది; అర్థం యొక్క పరమార్థాన్ని గుర్తు చేసింది. లక్ష్యం ధర్మకర్మాచరణ. ధనం యొక్క
Robert Frost అనే ఆంగ్లకవి అంటారు. “If all the berries that grow wild is for him, He finds he is mistaken” – అని. ఈ ధర్మ సూక్ష్మాన్ని వివరిస్తూ అమ్మ”, నీకు రెక్కలు ఇచ్చింది ఎగిరి పోవటానికి కాదు, రాని వాళ్ళని ఆదుకోవటానికి” అని హెచ్చరిస్తుంది.
అర్థం అంటే డబ్బు, ధనం అనేకాదు. ఈశ్వరానుగ్రహ లబ్ధ శక్తి, వస్తువు, ఐశ్వర్యం. అమ్మ అందరికీ కుంకుమ పొట్లాన్ని ప్రసాదంగా ఇస్తుంది. అది సర్వార్ధ ప్రదాయిని. మన యోగ్యతా యోగ్యతలను, సందర్భమ సందర్భాలను పట్టించుకోకుండా తరచు బిడ్డలకు గుడ్డలు పెట్టి ఆనందించేది అమ్మ.
ఒకసారి చీరాల నుంచి కాటన్ షర్టు, పాంటు గుడ్డలు తానులు తెప్పించింది అమ్మ. వసుంధర అక్కయ్య సుమారు 4 చొక్కాలు, 2 పాంట్లకు సరిపడు గుడ్డలు కత్తిరించింది. బొట్టుపెట్టి నాకు గుడ్డలు పెడుతూ, గడ్డం పట్టుకుని, “తప్పకుండా కుట్టించుకో, నాన్నా!” అని ముమ్మారు చెప్పింది. నాకు కళ్ళ నీళ్ళ పర్యంతం అయింది. “అమ్మా! నువ్వు పెడితే కుట్టించుకోకుండా ఉంటానా? అది మహాప్రసాదం కదా! అన్నిసార్లు బ్రతిమలాడతా వెందుకు?” అన్నాను. 40 ఏళ్ళ క్రితం అమ్మ పెట్టిన ఆ బట్టలు safe లో భద్రంగా నేటికీ ఉన్నాయి. అవి కేవలం నూలు పోగులుకావు, రక్షక కవచాలు. కంఠం మీద కత్తి పెట్టే విషమ పరిస్థితుల్లో – అంటే – Election Officer duty, confidential work, acquisition of higher responsibilities, critical and challenging times that invite court cases, అనారోగ్య సమయాల్లో ఆ బట్టలు కట్టుకుంటే నన్ను ఎదిరించే శక్తి, బాధించే వ్యక్తి ఉండనే ఉండవు.
ఇపుడు అసలు విషయానికి వస్తాను. ‘సర్వే గుణాః కాంచన మాశ్రయంతి’, ‘డబ్బుకు లోకం దాసోహం’ అనేవి సుప్రసిద్ధ లోకోక్తులు. ‘ధనం మూలం ఇదం జగత్’ అనేది జగమెరిగిన నానుడి. దీనిని అమ్మ నిర్ద్వంద్వంగా ఖండించింది. ఎవరో సమయానికి అవసరానికి చేతిలో డబ్బులేని వ్యక్తి అన్న మాట అది. ప్రతి వ్యక్తి జీవితంలో ఉన్నరోజూ, లేనిరోజూ వస్తూనే పోతూనే ఉంటాయి. ‘న హితం పశ్యామి యోహ్యపరిచితయా అనయా ననిర్భర ముపగూఢః యోనాన విప్రలబ్ధః’ అంటారు బాణకవి – అంటే చంచల స్వభావం గల లక్ష్మి ప్రతి ఒక్కరిని గాఢంగా కౌగలించుకుంటుంది, అలాగే ఓ రోజు నమ్మించి దగా చేస్తుంది అని.
‘ధనం మూలం ఇదం జగత్’ కాదు, “తను మూలమిదం జగత్” అని లోకోక్తిని అమ్మ సవరించింది. వ్యక్తి అంటూ ఉంటేనే భార్య/భర్త, పిల్లలు, జీవితము, స్నేహితులు. తాను లేనినాడు ఎవరితోనూ దేనితోనూ పనిలేదు. వ్యక్తి తన కోసమే తన అవసరాల కోసమే భార్య/భర్తని, బిడ్డల్ని, ఇంటిని, అవసరమైతే కత్తిని, విషాన్ని ప్రేమిస్తాడు. ‘ధనం మూలం ఇదం జగత్” అనేది శాస్త్ర సమ్మతం కాదు. అమ్మవాక్యం వేదసారం. ‘ఆత్మ నస్తు కామాయ సర్వం ప్రియం భవతి’ – అనేది శృతి ప్రమాణ వాక్యం. అంటే తన కోసమే అయితే అన్నీ ఇష్టమే; తన కోసం కానివి అన్నీ నిరర్ధకములు, రసవిహీనములు. పూర్వకాలంలో నేటి కరెన్సీ కానీ, నాణెములు కానీ వాడుకలో లేవు. వస్తువినిమయ పద్ధతి (Barter Method) ఉండేవి. ధాన్యం ఇచ్చి పప్పులు, నూనె, చింతపండు ఖరీదు చేసేవారు. వస్తువుకే విలువకాని, ధనానికి విలువ లేదు. జేబులో రు. 1000లు నోటు ఉంటుంది. హార్ట్ ఎటాక్ను నిరోధించే 20 పైసల Sorbitrate Tablet ను తెచ్చే శక్తి దానికి లేదు.
భగవద్దత్తమైన ఐశ్వర్యానికి ఏ వ్యక్తి అయినా ధర్మకర్త (Trustee) మాత్రమే. ఐశ్వర్యవంతులందరూ దేవుని ప్రతినిధులుగా తెలుసుకోవాలి. “నీ కిచ్చింది తృప్తిగా తిని, నలుగురికి ఆదరణగా పెట్టుకో” అనే అమ్మ మహత్తర సందేశంలోని ధర్మ సూక్ష్మం ఇదే. ‘శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా అదేయం, శ్రియా దేయం, ప్రియాదేయం, సంవిదా దేయం’ – అని మానవకర్తవ్యాన్ని ఆర్షధర్మం కఠినంగా నిర్దేశిస్తోంది.
ధర్మకార్యాచరణకు వినియోగించబడే అర్థం సర్వార్ధదాయకం: అదే కామ మోక్షాల్ని ప్రసాదిస్తుంది.
“నేను మీకు పెట్టుకోవడం మీ చేత పెట్టించడం కోసమే” అని మానవ ధర్మం ‘పెట్టుకోవడం’ అని అమ్మ ఆచరణాత్మకంగా ప్రబోధిస్తోంది. అమ్మ అమృతహస్తాలతో పెట్టిన అన్నం, పూలూ, పండ్లూ, గుడ్డలూ, ఆ కమనీయ నేత్రాల నుండి అనవరతం వర్షించే మాహిమాన్విత అనుగ్రహశీతల జ్యోత్స్నలు, ఆ మాతృహృదయం నుండి ప్రసృతమయ్యే దివ్య ఆశీః పూర్వక మధుర మమకార తరంగాలు… ఇవే – నిజమైన అర్ధం, సొమ్ము, ఐశ్వర్యం, విబూతి. ఆ అర్థమే సర్వార్థ దాయకమైనది. మనం ఆర్జించాల్సింది దానినే; కనకాన్నీ currency నీ కాదు.