1.శ్రీ శంకరులు ఉమామహేశ్వర స్తోత్రంలో –
‘నమశ్శివాభ్యాం నవయౌవనాభ్యాం
పరస్పరాశిష్ట వపుర్ధరాభ్యాం
నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం
నమో నమశ్శంకర పార్వతీభ్యాం’ అని ప్రారంభించి శివపార్వతుల, ప్రకృతి పురుషుల, పురాణ దంపతుల అవిభాజ్యమైన అర్థనారీశ్వర తత్త్వాన్ని స్తుతించారు.
- కాళిదాస మహాకవి రఘువంశ కావ్యారంభంలో –
‘వాగర్థావివ సంపృక్తా వాగర్థ ప్రతిపత్తయే ||
జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ ॥
శ్లోకంలో పార్వతీ పరమేశ్వరులు, జగత్తుకి తల్లిదండ్రులు. వారుభయులు శబ్దము, అర్థము (word and its meaning) వలె ఏకమై అవిభక్తమై యున్నారు – అని కీర్తించారు.
- విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త Albert Einstein భౌతికశాస్త్ర రీత్యా E=mc2 (Mass – Energy – equivalence – పదార్థం, శక్తిల సమానత్వ సూచక సమీకరణము) ను కనుగొన్నారు. E అంటే Energy (శక్తి), m అంటే mass (పదార్ధం), C అంటే కాంతి వేగం. ఈ అద్భుత సూత్రమే పదార్థ నిత్యత్వ, శక్తి నిత్యత్వ (conservation of mass and energy) సూత్రాలకు ఆధారం. అంటే పదార్థానికి, శక్తికి రూపాంతరమే కాని నాశనం లేదు అని; పదార్ధం శక్తిగానూ, శక్తి పదార్ధంగానూ పరిణామం చెందుతాయి. కనుకనే అమ్మ “సృష్టి పరిణామ శీలం కలది, నాశనం లేదు” అని నిర్వచించింది. ఇందుకు స్పష్టమైన ఉదాహరణ – మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ (photosynthesis) ద్వారా శక్తిని పదార్థంగా మారిస్తే, జీవులు శ్వాసక్రియ (Respiration) ద్వారా పదార్ధాన్ని శక్తిగా మార్చుకుని మనుగడ సాగిస్తున్నాయి.
శంకరులు, కాళిదాసు, Einstein మూర్తిత్రయం ప్రబోధించిన సత్యాన్నే వివరిస్తూ అమ్మ ఒక అద్భుత సమన్వయాన్ని ఆవిష్కరించింది –
ఒక సందర్భంలో చిదంబరరావుగారు అమ్మతో అన్నారు, “వస్తూరూపం పురుషుడనీ, దానిలో ఉన్న శక్తి స్త్రీ అనీ ఇదివరకే అన్నావు కదమ్మా. రెండింటినీ విడదీయలేని స్థితే శ్రీ విద్య అనీ పుస్తకాలు చెపుతూనే ఉన్నాయి” – అని అంటే, అమ్మ ” విడదీయలేని స్థితికాదు. ఆ రెంటి సంయోగంలో ఉండే సంధికాలమే. అదే – అవాజ్మానస గోచరము” – అన్నది. అమ్మ వాక్యం సృష్టి ఆవిర్భావ మూల సూత్రాన్ని వివరిస్తుంది – ‘తత్ సృష్ట్వా తదేవాను ప్రావిశత్’ (బ్రహ్మ పదార్ధం తాను అనేకంగా పుట్టవలెనని కోరుకుని, జగత్తును సృష్టించి అందే ప్రవేశించెను) – అని వేదం వివరిస్తోంది. ఈ వాక్యార్థాన్నే అమ్మ మరింత స్పష్టంగా “జగత్తే మాత. సృష్టే దైవం” – అని అన్నది. సృష్టి వేరు, సృష్టికర్త వేరు కాదని తెలుస్తోంది.
ప్రకృతి – పురుషుడు, సృష్టి – సృష్టికర్త, పదార్ధము – శక్తి విడదీసి చూపలేము, చెప్పలేము. అనంత సృష్టిలో గ్రహాలూ, గ్రహరాజులూ ఒక అద్భుతమైన అదృశ్యమైన శక్తి (Gravitational Force) గురుత్వాకర్షణ వలననే పరస్పరం ఆధారపడి సంచరిస్తున్నాయి.
సాధారణంగా మనం వస్తురూపం అంటే పదార్థం (mass) అనే భావిస్తాం. ఈ సందర్భంగా అమ్మ మరొక కీలకాంశాన్ని ప్రకటించింది- “భావానికి అందే దంతా రూపమే” అని.
భౌతికశాస్త్ర (physics) రీత్యా శక్తి అంటే – కాంతి శక్తి, ఉష్ణశక్తి, అయ స్కాంత శక్తి, విద్యుచ్ఛక్తి, స్థితి శక్తి, గతి శక్తి మున్నగునవి అని పేర్కొంటాం. భావానికి అందేదంతా రూపమే అన్నప్పుడు మన ఆలోచనలు, సంకల్పాలు కూడా పదార్ధమే.
పదార్ధం భౌతిక రూపం అయితే, సంకల్పాలు బౌద్ధిక రూపం. పరతత్త్వ సంకల్పమే సృష్టిగా ఆవిర్భవించింది. ఈ సూక్ష్మాన్ని అమ్మ, “సంకల్ప రహితు అసంకల్ప జాత:” అనీ, “సృష్టికి కారణం అకారణం” అనీ ప్రబోధించింది. అంతే కాదు.
అర్థనారీశ్వర తత్త్వం అంటే – పురుషుడు, ప్రకృతి/ రూపం, శక్తి యొక్క సంయోగంలో ఉండే సంధికాలమట. అంటే అవస్థాంతర ప్రాప్తి (Transitional State). ఇది ఒక నిత్య సత్యం. సకల సృష్టిలో – జీవుల శరీరాల్లోనూ, అచేతన పదార్ధములు అని పిలువబడే కొండలు, గుట్టలు, నదీ నదాలు ఇత్యాదుల్లోనూ అనుక్షణం నూతన (జీవ) కణాలు పుడుతున్నాయి, పాతవి లయమవుతున్నాయి. – సృష్టి స్థితి లయాలు నిరంతరం సంభవిస్తూనే ఉన్నాయి. కాగా – వస్తు రూపము (matter), శక్తి (energy) శాశ్వతం. ఆ రెండూ పరిణామమే కానీ నాశనము లేని అక్షర పరబ్రహ్మ తత్త్వం. ఈ పరమార్ధాన్ని అమ్మ “అంతా అదే” అనే ఒక్క మాటలో అలవోకగా అనాయాసంగా ప్రబోధించింది.
‘సద్యోజాతం ప్రపద్యామి। సద్యో జాతాయ నమో నమః’ ఆ పరతత్త్వం నిత్యనూతనం, పురాణం (పురా అపి నవం) – అని వేదాలు ఈ సత్యాన్నే అభివర్ణించాయి.
అర్థనారీశ్వర తత్త్వానికి అలా అమ్మ ఒక శాస్త్రీయమైన భాష్యాన్ని సాధికారికంగా ఆవిష్కరించింది. ‘అవాజ్మానస గోచరము’ అన్నది. అట్టి సృష్టి వైచిత్రికి అర్ధం చెప్పాలని కేవలం శాస్త్రజన్య జ్ఞానంతో ప్రయత్నిస్తే సాధ్యం కాదు. అందుకు అంజలి ఘటించి జ్ఞాన స్వరూపిణి అమ్మనే ఆశ్రయించాలి. ఈ భావాన్ని ప్రస్ఫుటం చేస్తూ డా॥ ప్రసాదరాయ కులపతి అన్నారు –
“అంతములేని సృష్టికథ కర్థము చెప్పగ పూనుకొన్న వే
దాంతులు తర్క కర్కశ హృదంతరు లెందరొ నేడు నీ పదా
క్రాంతులు భేదవాదముల గాధ లెరుంగని నిన్ను జూచి వి
భ్రాంతులు వీరలో పరమ పావని! సత్యమెరుంగ జేయవే!” అని.
శివ శక్యైక్య రూపిణి అమ్మ శ్రీ చరణాలకు శత సహస్రాధిక వందనములు.