‘ఒక్కసారి మా వైపు చూడు
నీ చూపులే ఇహపరమల తోడు ॥
కొండంత ధైర్యంబుతో వచ్చినాము
కోటివేల కోరికలతో నిన్ను కొలిచినాము..’
అంటూ కారుణ్యావతారమూర్తి అనుగ్రహదీప్తి అయిన అమ్మను అభ్యర్ధిస్తాం. దుఃఖ నివృత్తికి, శాంతి సంతోషప్రాప్తికి అమ్మనే ఆశ్రయిస్తాం. అది సబబు. మన గోడు అమ్మకి కాక మరెవరికి చెప్పుకుంటాం? అది మానవ సహజం.
కానీ అవతారమూర్తుల తత్త్వం ఇందుకు పూర్తిగా భిన్నం. వారి మాటలు చేతలు అగ్రాహ్యమే. కొన్ని ఉదాహరణలు
- అమ్మ తన బాల్యంలో బ్రాహ్మణకోడూరు శ్రీవాసుదాసస్వామివారి ఆశ్రమాన్ని సందర్శించింది. సందర్భవశాన స్వామివారు అమ్మను “నీకేమి కావాలో చెప్పు”అని అడిగినపుడు అమ్మ “ఏమన్నా కావాలి అనేది అక్కర్లేకుండా కావాలి”అన్నది. అక్కర అంటే అవసరం. అక్కర లేకుండా అంటే ఈ వస్తువు, ఈ వ్యక్తి, ఈ సందర్భం … కావాలి అనేది అవసరం లేకుండా కావాలి. సమయానికి ఏది లభిస్తే దానిని సంతోషంగా స్వీకరించడం – పన్నీరైనా, కన్నీరైనా. దీనినే అమ్మ “సరే” మంత్రం అంటుంది. అమ్మకు ‘ఇది లేదు’ అన్నది లేదు. ఒక ఉదాహరణ –
రోజూ అమ్మ ఓంకారనదికి వెళ్ళి స్నానం చేసి మడినీళ్ళు తెస్తూ దారిలో కనిపించిన ఏవో కొన్ని చెట్ల ఆకులను కోసుకువచ్చి వాటితో కూరో, పప్పో, పచ్చడో, పులుసో వండేది. “చాలా మొక్కలు మనకి ఉపయోగపడేవే. కొన్ని మొక్కల ఆకులే విషపూరితాలు” అంటుంది. అంతేకాదు. ‘నా దృష్టిలో Waste అన్నది లేదు’ అంటుంది. అమ్మ కరకమలాల్లో ప్రతి ఒక్కటీ సార్ధకతను పరిపూర్ణతను సంతరించుకుంటుంది.
- 15-08-1958 న అమ్మ జిల్లెళ్ళమూడిలో అన్నపూర్ణాలయాన్ని ప్రతిష్ఠించింది. ‘ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించరాదు; కడుపునిండా తినాలి’ అనే మహత్సంకల్పం చేసి గాడిపొయ్యిలో నిప్పురాజేసింది. విశ్వజనని కడుపుతీపే అందుకు హేతువు. ఆ రోజు భారతీయులకు భారమైన బానిసత్వబ్రతుకు నుంచి విముక్తి లభించిన పర్వదినం. ఆ రోజుననే అమ్మ అన్నపూర్ణాలయాన్ని స్థాపించటంలో మరొక్క పరమార్థం ఉంది. యుగయుగాలుగా జీవకోటి జనన మరణ రూప దుర్భర సంసార బంధనములనుండి విముక్తి (మోక్షం) పొందజాలక – పాహి! పాహి!! త్రాహి! త్రాహి!! అంటూ దయదలచే దైవీశక్తి కరావలంబం కోసం అర్రులు చాస్తున్న నిస్సహాయ స్థితిలో అనుగ్రహ స్వరూపంగా అమ్మ ఆవిర్భవించింది. ‘అందరూ నా బిడ్డలే, ‘అందరికీ సుగతే’ అని ప్రకటించి నిర్నిబంధంగా బేషరతుగా చరిత్ర ఎరుగని ఒక అమోఘ వరాన్ని అనుగ్రహించింది అమ్మ. అంతటితో నిఖిలజీవాళి మొదటిసారిగా తృప్తిగా స్వేచ్ఛావాయువులను పీల్చుకున్నది నిండుగా.
అంతేకాదు. మరొక్క విశేషం ఉంది. The Preamble to Indian Constitution లో నిర్దేశించిన లక్ష్యాలు Secularism, Socialism, Justice, Liberty, Equality, Fraternity అర్థం తాత్పర్యం జిల్లెళ్ళమూడిలో అలవోకగా ప్రశాంతంగా ఆచరణాత్మకంగా దర్శింప జేసింది.
- శ్రీమద్రామాయణంలో ఒక సందర్భం. శ్రీరామ పట్టాభిషేక అనంతర కాలంలో శ్రీరామచంద్రుడు ఆంజనేయస్వామి నుద్దేశించి అన్నారు ‘మయ్యేవ జీర్ణతాం యాతు యత్ త్వయా ఉపకృతంహరే! ప్రాయః ప్రత్యుపకారార్థీ విపత్తిం అభికాంక్షతి ||’ అని.
‘నాయనా! హనుమా! నువ్వునాకు మహోపకారం చేశావు. కనుక నీకు ప్రత్యుపకారం చేయాలనే కోరిక నాలో పొంగి పరవళ్ళుతొక్కుతోంది. కాని, ఆ వాంఛ నాలోనే అణగారిపోవాలి’ అని శ్లోక పూర్వార్థం. ‘ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ’ అన్నారు. సుమతీ శతక కర్త; అంతేకాదు అపకారికి కూడ ఉపకారము నెపమెన్నక చేయాలన్నారు. మరి ఇదేమిటి? శ్రీరామచంద్ర ప్రభువు ఇంత కృతఘ్నులా! ప్రత్యుపకార వాంఛ తనలోనే అణిగి పోవాలన్నారు – అని అనిపిస్తుంది. పైపైన.
శ్లోక ఉత్తరార్థంలో అందుకు హేతువుని అద్భుతంగా వివరించారు – ప్రత్యుపకారం చేయాలను కునేవారు ఉపకారం చేసిన వారికి అంత విపత్తు (ఆపద) వాటిల్లితేకద ఉపకారం చేసే అవసరం. అంటే అంతర్లీనంగా భాసించే వాస్తవం ఏమంటే – శ్రీరాముడు హనుమకి తిరిగి ఉపకారం చేయాలి అంటే హనుమకి అంత ఆపద రావాలి కదా! హనుమ ఆపదలపాలు కాకూడదు; నిత్యం సుఖసంతోషాలతో హాయిగా ఉండాలి 1 అని. అది వాచా ఆవిష్కరించిన సత్యం. మరియు మనస్ఫూర్తిగా శ్రీరాముడు హనుమను ‘నవమ బ్రహ్మ’గా ఆశీర్వదించాడు.
అంతేకాదు. అశోకవనంలో శోక సంతప్త అయి కొన ఊపిరితో శ్వాసిస్తూ నిస్సహాయ స్థితిలో ఆత్మహత్యకు పూనుకొన్న సీతాసాధ్వి హనుమ తెచ్చిన శ్రీరామ క్షేమ సమాచారాన్ని అభిజ్ఞానాన్ని అందుకుని ఊపిరిపోసికొని అన్నది.
‘రవి కుల వార్ధి చంద్రుడగు రాముని సేమము చాలవింటి నా
వివిధములైన పాట్లు పృథివీపతికిం దగ జెప్ప గల్గె నే
డవిరళభంగి నీ వలన నచ్చుగ నే నుపకార మేమియుం
దవిలి యొనర్పలేను వసుథాస్థలి వర్థిలు బ్రహ్మకల్పముల్!”
అని. అది మహదాశీర్వచనం.
అవతారమూర్తుల మాటలు చేతలు అగ్రాహ్యములు, అత్యుత్తమములు కదా!
“లోకోత్తరాణాం చేతాంసి కోహి విజ్ఞాతు మర్హతి?”