యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత !
అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహం !!
అంటూ యోగీశ్వర కృష్ణుడు, ఈ ప్రపంచంలోకి భగవంతుడు రావడానికి గల కారణం చెప్పాడు. ఎప్పుడైతే ధర్మగ్లాని జరుగుతుందో, ఆయా సందర్భాలను బట్టి, ఆయా దేశ కాల పరిస్థితులను బట్టి, నన్ను నేను సృష్టించుకుంటూ వస్తూనే ఉంటాను అన్నాడు. ఇది ‘సత్యం’! ఎందుకంటే ఈ అఖండ భారతావని మాత్రమే పొందిన ఒక సౌభాగ్యమేమిటంటే మహా సత్పురుషులు, మహాత్ములు, మునులు, తత్త్వజ్ఞులు, తత్త్వవేత్తలు, జ్ఞానులు, జ్ఞానార్థులు, ముముక్షువులు, అవతారమూర్తులు అందరూ వచ్చిన ప్రదేశం. ఆసేతు శీతాచలం, అదే మన భారతదేశం. ప్రపంచంలో, అంటే సృష్టిలో ఈ దేశం తప్ప ఇంతటి సౌభాగ్యాన్ని మరొక దేశం పొందలేదు. ప్రధానంగా భారతదేశంలో ధర్మగ్లాని జరుగుతూ వస్తున్నది. ఇది సత్యం. ధర్మానికి గ్లాని జరగలేదు. ధర్మగ్లాని జరిగింది.
అంటే, మానవుడు తాను ఆచరించవలసిన ధర్మాన్ని, అనుసరించవలసిన ధర్మాన్ని మరచి పోయినప్పుడు ఏర్పడే ఒక శూన్యత, దాని పేరు ధర్మగ్లాని. మరి ఆ శూన్యాన్ని చైతన్యవంతమూ, ఫలవంతమూ, ఫలప్రదమూ, పరిపూర్ణమూ, పవిత్ర భావనామయమూ చేయటానికి, మహా చిచ్ఛక్తి స్వరూపమైన ఒక శక్తి మానవ దేహాన్ని తీసుకుని మళ్ళీ ఈ జగత్తులోకి రావాలి. అట్లా వస్తూనే ఉన్నది.
శ్రీ మహావిష్ణువు అవతారాలుదాల్చే ఒక కార్యక్రమంలో కేవలం మానవ దేహమే కాదు, శ్రీ మత్స్య, కూర్మ, వరాహ, వటు, నారసింహ… ఇట్లా వరుసగా అనేక రూపాలలోనూ, కొన్ని కారణా వతారాలుగా వచ్చి, అప్పటికప్పుడు ఉద్ధారణ చేసి, వేదోద్ధరణ, ధర్మోద్ధరణ, దీనజనోద్ధరణ. ఇవన్నీ కూడా తాను సంకల్పించుకుని వచ్చి, చేసి, మళ్ళీ ఒక పూర్ణమయిన అవతారంగా రావటం మనకి తెలుసు. పురాణ వాఙ్మయంలో ఇవన్నీ స్పష్టంగా ఉన్నాయి. ఐతే, 19వ శతాబ్దాన్ని మనం గమనించినట్లయితే, అది గొప్ప శతాబ్దం. ఈశాన్య భారతంలో అప్పుడే రామకృష్ణ గురుదేవుల నిష్క్రమణ, వివేకానందుల ఆవిర్భావం. 1918లో షిరిడీ మహాస్వామి అవతారం పరిసమాప్తి అయిపోయింది. నాథ ఖండోబా, విఠోబా అనబడే అనేక అంశాలు ఒక్కటిగా ఏర్పడి ఒక పరిపూర్ణమైన దత్తావతారంగా వచ్చిందే, షిరిడీ మహాస్వామి! అది మధ్య భారతం. పైగా సంత్ దేశమైన మహారాష్ట్రలో వారు రావటం, మత సమన్వయం చేయటం, భావ సమన్వయం చేయటం ప్రధానం. ముందు అజ్ఞానమంటే ఏమిటో తెలుసుకోండని అజ్ఞానం గురించి బోధ చేసి, అజ్ఞానము అనబడే ఒక చీకటిని, అవిద్యని, అనాచారాన్ని, అస్పష్టతని తొలగించి, మేధావులమనుకున్న వారందరికీ కనువిప్పు కలిగించి, దైవీశక్తిని ప్రదర్శితం చేసి, మానవాతీతమైన అనేక మహిమలు ప్రదర్శించి, మానవుడిలో దయని, త్యాగాన్ని, సేవాభావాన్ని, అన్నిటినీ సమన్వయపరచి ‘అల్లా మాలిక్ ఏక్” అంటే ఏమీ లేదు “ఏకం సత్ విప్రాబహుధావదన్తి” అని ఒకటి, ఏకో హం బహుశ్యామ్ అని రెండోది. అంటే ‘ఉన్నది ఒకటే’, అతడు ఈశ్వరుడు. ఉపనిషత్తులు చెప్పినదిదే. వేదాలు ఘోషించింది ఇదే, మనం అనుకుంటున్నది అదే. జాతిని ప్రభావితం చేసిన మహిమా స్వరూపుడు ఎవరంటే మహాస్వామి.
ఇటు పాండిచ్చేరి వైపునకు వెళ్ళినట్లయితే, అరవింద మహాయోగి ఐసియస్ చదవాలని అనుకుని, కాలేక, తండ్రి ఆజ్ఞ ప్రకారం మళ్ళీ వెనక్కొచ్చేసి ఏదో చెయ్యాలి, ఏదో నిర్ణయించుకోవాలి అని అనేక షెడ్యూల్స్ వేసుకొని, జీవితాన్ని తనకు తాను నిర్వచనం చేసుకుని, రూపకల్పన చేసుకుని, అందులో ఏదీ జరగనప్పుడు, ఇలా జరగకపోవటానికి కారణమేమిటి అని అన్వేషణ చేసి, భారతదేశ దాస్య శృంఖలాలన్నీ తెగిపోవాలని ఆశించి, ఆగస్టు 15 నాటికి, అది ఆయన జన్మదినం, ఈ దేశం విముక్తం కావాలని, ధ్యాన తపోనిష్ఠాగరిష్ఠుడై, వంగదేశం నించి, పాండిచ్చేరికి చేరుకుని, ధ్యానంలో, ధారణలో ఒక పరమాద్భుతమైన స్థాయికి వెళ్లి ‘సావిత్రి’ మహాకావ్య నిర్మాణం చేసి, ఇంటెగ్రేటేడ్ యోగాని ప్రతిపాదించి, జాతిని ప్రభావితం చేసిన ఒక సందర్భమే పాండిచ్చేరిలో అరవిందయోగి.
శృంగేరీలో చంద్రశేఖర భారతీస్వామివారు, పీఠ పాలనా వ్యవహారాలలో ఏనాడూ జోక్యం చేసుకోకుండా శృంగేరీ మహాసంస్థానాన్ని కేవలము తమ ధ్యానశక్తి చేత పరమాద్భుతంగా నడిపించిన ఒక అద్భుతమైన పీఠాధిపతి.
అక్కడనించి కాస్త ఇటువస్తే, కంచి మహాస్వామివారు. చంద్రశేఖర ఇంద్ర సరస్వతీ స్వామి వారు. మనం పెద్దస్వామి వారు, మహాస్వామి అని పిలుస్తాం. కంచి పెద్ద స్వామివారిని లోకమంతా నడిచే దేవుడంటే, నేను మాత్రం లోకాన్ని నడిపించిన దేవుడు అని అనుకున్నాను.
మళ్ళీ కొద్దిగా కేరళ వైపు వెళితే సమాజం ప్రధానమనీ, బ్రహ్మసమాజము మాత్రమే కాదని, సమాజమే బ్రహ్మము అని ప్రతిపాదన చేసి, అధివాస్తవిక స్థితిలో నడిపించిన నారాయణగురు. ఒళ్ళు పులకరించి పోతుంది ఆయన్ని తలచుకున్నప్పుడు. అలాగే కాస్త మళ్ళీ వెనక్కొస్తే అరుణాచలంలో భగవాన్ శ్రీ రమణ మహర్షి ‘నేను ఎవరు?’ అన్న ప్రశ్న వేసుకో, అది వేసుకోనంత కాలం నిన్ను నీవు తెలుసుకోలేవు, నిన్ను నీవు తెలుసుకోక పోయినట్లయితే, శాస్త్రాలు అన్నీ తెలిసినా ప్రయోజనం ఏమీ లేదని చెప్పి, మానవుణ్ణి అంతర్ముఖుణ్ణి చేసే ప్రయత్నం చేసిన అరుణాచల రమణులు, ఒకవైపు!
‘స్మరణ మాత్రముననే పరముక్తిఫలద !
కరుణామృత జలధి అరుణాచలమిది !!’
అని ప్రబోధం చేసి, ‘అరుణాచల శివా’ అనుకోండి, మీకు కలుగుతుంది, ఆ ఆనందం భౌతికానందం కాదు. అది సుఖసంతోషాలకు అతీతమైన స్వాత్మానుభూతి. అది ఎవరికి వారే సంపాదించుకోవాలి, అని వారొక మార్గం చూపించారు.
వీటన్నింటితో పాటు ఒక సనాతనమైన, వైదికమైన, ఆర్షమైన భారతీయ ధర్మాన్ని, తాను కదలకుండా, సమస్త ప్రపంచాన్ని భారతదేశం వైపు ఒక్కసారి దృష్టి మరల్చి, ప్రేమ-సేవ అనే రెండు భావాలతో మానవుడు ఉతీర్ణుడు కాగలడు, తన జీవితాన్ని పారమార్థికమైన స్థాయిలో సంచారం చేసుకోగలడు అని, చేయించగలడు అని, సుమారుగా 188 దేశాలకు పైగా జాతి, మత, వర్ణ, వర్గాలకు అతీతంగా ప్రబోధం చేసి, ప్రభావితం చేసిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు 1926, నుండి 2011 వరకు సనాతన ధర్మ సారధి అయినారు.
వారికంటే ముందొచ్చిన అవతారమే జిల్లెళ్ళమూడి అమ్మ. 1923లో అతి కుగ్రామమై బాపట్లకు 12 కి.మీ. దూరంలో ఉన్న జిల్లెళ్ళమూడిలో అమ్మ తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. వీరు మాత్రమే కాక ఆంధ్రదేశంలో మరికొందరిని మనం స్మరించాలి. వీరంతా అంశావతారాలుగా వచ్చిన అవతారమూర్తులు.
అందులో కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని. మహాతపస్వి. అసాధారణ ప్రజ్ఞాశీలి. ఆయన ధారణకు అంతులేదు. ధ్యానంలో ఆయనను అందుకో గలిగినవారు లేరు.
మళ్ళీ, ఆంధ్రదేశంలోకి వస్తే, చందోలు రాఘవ నారాయణశాస్త్రిగారు. వీళ్ళందరూ కూడా జాతిని ప్రభావితం చేస్తూ ఒక్కొకళ్ళూ ఒక్కొక్క మార్గంలో నడిపించే ప్రయత్నం చేశారు.
జన్మాద్యతీతాని కియంతి మే హెూ
ఉచావచత్వం యదభూత్ సుఖదుఃఖహేతో
ఆజీవదాస్య తమతా మభివద్య పుణ్యాత్
బాలే, త్వదీయకరుణా తవసుప్రభాతమ్
అని కనురెప్ప వాలే సమయం వరకూ ఏకచింతనతో జీవించి, కంచి పెద్ద స్వామివారిచే, “చందోలు శాస్త్రిగారు మీకు దగ్గరలో ఉండగా మీరు కంచి దాకా రావటమెందుకు? వారి వాకిట్లో ఉన్న బావి, వారణాశిలో ప్రవహిస్తున్న గంగకి కనెక్ట్ అయ్యింది. అక్కడికి వెళుతూ ఉండండి” అని అనిపించు కున్న మహాతపస్వి.
ఈ నేపథ్యంలో ఇంతవరకూ అనేక పేర్లు విన్నాం. కాని ఒకే ఒక అవతారిణి, స్త్రీ రూప ధారిణియై, మన్నవ అనే గ్రామంలో పుట్టి జిల్లెళ్ళమూడిలో మెట్టి, అక్కడి నుంచి తన అవతార ప్రస్థానాన్ని కొనసాగించి, అలౌకికమైన, అనిర్వచనీయమైన, అనుపమానమైన దైవశక్తులనన్నిటినీ, తన మూడవ ఏటనుండే ప్రపంచానికి ప్రదర్శిస్తూ, మానవాతీతమైన శక్తులను పరిచయం చేస్తూ, అనేకమైన వర్గాలను, సమాజంలో ఉన్న వారందరినీ వయోభేదం లేకుండా, లింగభేదం లేకుండా, స్త్రీయా, పురుషుడా, బాలుడా, వృద్ధుడా, జ్ఞానా, అజ్ఞానా, ఆరోగ్యవంతుడా, భాగ్యశాలా, అనే ఏమీ వివక్ష లేకుండా అందరినీ, తన ఒడిని చేర్చుకొని లాలించి, ఆలించి, అదలించి, పాలించి, ప్రేమించి, మహోన్నతమైన మానవీయ స్థాయిని, మాధవీయమైన స్థితికి నడిపించిన మహామానవి ‘మాతృశ్రీ’ జిల్లెళ్ళమూడి అమ్మ!
అమ్మ అనగానే ఆధునిక కాలంలో మనం ఎందరో అమ్మలను చూస్తున్నాం. జిల్లెళ్ళమూడి అమ్మని మరిచిపోయే సమయం. ఇవాళ అమ్మ అంటే, కేరళ నుంచి వచ్చిన అమ్మ ఇవాళ అమ్మగా ప్రచారంలో ఉన్నది. ఈ జిల్లెళ్ళమూడి అమ్మ తెలుగు నాట, అమ్మగా పిలువబడింది. అమ్మగా తలచబడింది. అమ్మగా ఆరాధింపబడింది. అమ్మగా గౌరవింపబడింది. అమ్మగా పూజింపబడింది. ఇక మరికొద్ది నెలల్లో శతజయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. దైవ నిర్ణయాలు విచిత్రంగా పరమాద్భుతంగా ఉంటాయి. వాటిని మనం మహిమలు అంటాం. మహిమలు కావవి. అనుగ్రహాలు.
మనందరం ఆమె గురించి మాట్లాడుకోవాలి. కాబట్టి ఈ నేపథ్యంలో అమ్మను తలచుకున్నప్పుడు, వీళ్ళంతా శరీరంలో ఉన్నంత వరకే ఉంటారా, శరీరాన్ని వదిలి పెట్టిన తర్వాత కూడా వారి ప్రభావం ఉంటుందా? అని ప్రశ్న వేసుకున్నట్లయితే, శరీరంలో ఉన్నప్పుడు వారి ప్రభావం చాలా ప్రాదేశికంగా, చాలా పరిమితంగా, చాలా మరుగున ఉన్నట్లుగా, తెలిసీ, తెలియనట్లుగా, ఎక్కువ మందికి తెలియనట్లుగా, బహుకొద్ది మందికి మాత్రమే తెలిసినట్లుగా ఉంటుంది. ఇది ఒక విచిత్రం.
రాముడి విషయం అంతే! కృష్ణుడి విషయం అంతే! షిరిడీ సాయి బాబా విషయం అంతే. కాని, అమ్మ… ఈవేళ, ఒక చైతన్యస్పూర్తిగా ఈ ప్రపంచానికి ఎప్పుడో పరిచయమైపోయిన ఒక పెద్ద ముత్తైదువు. వైదిక భాషలో, వేదకాలం అంటారు కాని, వేదకాలం అంటూ లేదు, వేదం కాలాతీతమైనది అంటే బహు పురాతనమైనది. ఒక చిచ్ఛక్తి, మళ్ళీ, ఒక స్త్రీరూపాన్ని ధరించినట్లయితే ఆమె ఏం చేస్తుంది. ఎందుకొచ్చింది? ఆమె చూపిన మార్గం ఏమిటి? ఎంచుకున్న మార్గం కాదు. ఆమె చూపిన మార్గమేమిటి? ఇవాళ మనం మాట్లాడుకోవాలి. ఇందాక అనుకున్నాం మనం. వివేకానందస్వామి ఉపనిషత్ వాక్యాలని ప్రపంచానికి చెప్పి, ఇవ్వాళ ఉపనిషద్వాణికి, వివేకానంద వాణికి భేదం లేని స్థితికి తీసుకు వచ్చారాయన. ఉపనిషత్తులని అంత బలంగా నమ్మారాయన. ఇక వారికంటే కొద్దిగా ముందు, రామకృష్ణ గురుదేవులు భక్తియోగాన్ని తీసుకుని వచ్చారు. ఆయన కంటే చాలా ముందు చైతన్య మహాప్రభు, ఇదంతా వంగ దేశ ప్రభావం, మధ్య భారతంలో శిరిడీ బాబా వారెంచుకున్న మార్గమేమిటో మనం చెప్పుకున్నాం. అది శ్రద్ధ, సబూరి, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉండాలి ఏ పనికైనా. నీకు జ్ఞానం కావాలి అంటే ముందు నీకు శ్రద్ధ ఉంటే జ్ఞానం వైపు నడిచే ప్రయత్నం చేయగలుగుతావు. తర్వాత, ఏది సాధించాలన్నా, ఏది పొందాలన్నా, దేనిని సాధించుకుని పది మందికి పంచి పెట్టాలన్నా, సహనం ఉండాలి. శ్రద్ధ ఉండాలి. దానికోసం ఎదురు చూస్తూ, చూస్తూ, దానిలోనే మనం ఏకాగ్రమైన స్థితిలోకి వెళ్ళాలి. శిరిడీ బాబా, అరవిందయోగి, ఆయనతో పాటు శ్రీమాత, అరవింద యోగి ధారణా శక్తితో సావిత్రి మహా కావ్యాన్ని చేసి, All Life is Yoga అనే ఒక పరమాద్భుతమైన పరసత్యాన్ని లోకానికి మరొక్కమారు పరిచయం చేశారు, వేదాలపై వారు చేసిన కృషి, దాని మీద వారు చేసిన వ్యాఖ్యానాలు పరమాద్భుతం. ఇవి అతిమానుషమైన కార్యకలాపాలు.
అలాగే చంద్రశేఖర భారతీస్వామి! ఒక అద్భుతమైన అలౌకిక వాతావరణాన్ని తన చుట్టూ పరివేష్టింప చేసుకుని, ఆ ఆవరణలో అనేక మంది జిజ్ఞాసువులను జ్ఞానులుగా మార్చే ప్రయత్నం చేశారు. అంటే జ్ఞానులుగా మారే మార్గాన్ని చూపించారు. ఇక పెద్ద స్వామి వారా, నడిచే దేవుడు. అంటే సనాతన ధర్మానికి ఒక స్వరూపమై ఈ ప్రపంచానికి, మౌలికమైన సత్యాలన్నిటినీ, అనేక స్థాయిలలో పరిచయం చేసి, సనాతన ధర్మాన్ని ఆచరణీయం చేసిన మహాస్వామి వారు పర శివావతారంగా మనందరం కొలుస్తాం. ‘నారాయణ గురు’, సమాజంలో ఉన్న ప్రతి విషయాన్ని వాస్తవికంగా చెప్పి సమాజాన్ని ఆలోచనలవైపు నడిపించిన సర్వోన్నతమైన వ్యక్తి.
(సశేషం)