(గత సంచిక తరువాయి)
ఇక కావ్యకంఠ గణపతి ముని, చెప్పనక్కరలేదు, వాగ్ధాటి, వాగ్ధారణి ఆయన సొత్తు. సంస్కృత వాఙ్మయం ఆయన వెనుక పరిగెత్తుకు వచ్చింది. మంత్ర శాస్త్రాన్ని ఔపోసనం చేశారాయన. మంత్రాలలో ఉన్న బీజాక్షరాల వెనుక దాగిన అధిష్ఠాన దేవతలని దర్శనం చేశారు. ఐనా చిత్తశాంతి కలగలేదు. కారణమేమిటి? అంటూ వెతుక్కుంటూ రమణ మహర్షి దగ్గరికి వచ్చారు. అప్పటికి ఆయన ఇంకా రమణ మహర్షి కాదు. ఆయన వెంకటరామన్. “నేను 14 ఏళ్ళు చిర తపస్సు చేశాను. ఐనా నాకు చిత్తశాంతి లేదు. అసలు తపస్సంటే ఏమిటి?” అని ఒక ప్రశ్న వేసినప్పుడు “నేను అనే ఆలోచన ఎక్కడ ప్రారంభమౌతున్నదో, అది ఎక్కడెక్కడికో వెళ్ళి మళ్ళీ ఏ నేనులో అది మునిగిపోతున్నదో తెలుసుకోగలిగితే దాని పేరు తపస్సు” అని చెప్పారు. అర్థమైంది. ఆయన రెండో ప్రశ్న వేశారు, “నేను తపస్సులో దీనిని సాధించాను అని నాకు అర్థమయ్యేది ఎట్లా?” అని అడిగారు. “తపస్సు సాగినంత వరకూ మీరు ఈ ప్రపంచంలో ఉంటారు. తపస్సు పూర్ణమయి పోయిన తర్వాత ప్రపంచం మీలో ఉంటుంది” అని అన్నారు. అప్పుడు ఈ వెంకటరామన్ సామాన్యమైన వ్యక్తి కాదు అని అనుకుంటుండగానే దక్షిణ దిక్కు నించి, ఆరు కాంతి కిరణాలు రమణ మహర్షి యొక్క ఆజ్ఞా చక్రాన్ని తాకినప్పుడు, ఒక భావావేశంతో, భావోద్వేగంతో, భావ పరవశంతో కావ్యకంఠులడిగారు ‘మీరు స్కందులా?’ అని. అంటే “మీరు సుబ్రహ్మణ్య స్వామా?” అని అడిగారు. “మేమెవరో తెలుసుకునేకంటే
ఆ ప్రశ్న మీకై మీరు వేసుకొని మీరెవరో తెలుసుకోండి” అన్నారు. గణపతి మునికి సమాధానం దొరికింది, బయట తెలుసుకోవటమంతా వెతుకులాట. లోపలకి వెళ్ళటం వెతుకులాట కాదు. అది అనుభవం. ఒక స్వాత్మానంద స్థితి అక్కడ కలుగుతుంది. అందుకనే వారు ఆయనకు ‘భగవాన్ శ్రీ రమణ మహర్షి’ అని పేరు పెట్టారు. ఒక ‘వెంకటరామన్’ని ఈ లోకానికి ‘రమణ మహర్షి’గా పరిచయం చేసిన కావ్యకంఠ వాశిష్ఠ గణపతిముని మన ఆంధ్రదేశంలో తెలుగు నాట విజయనగరం జిల్లా కలువరాయి దగ్గర, లోగిత అగ్రహారంలో జన్మించారు.
చందోలు రాఘవనారాయణ శాస్త్రి గారు పొన్నూరు దగ్గర. ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాలి. అంటే వాళ్ళందరూ పెట్టిన భిక్ష, వాళ్ళందరూ మనకి వదిలి పెట్టిన ఆధ్యాత్మిక వారసత్వానికి మనం వారసులమై జన్మ ఎత్తాం. అది ఒక అదృష్టం. వారి కాలంలో జన్మించటం ఒకటి, వారితో కలిసి జీవించగలగటం రెండవది. వారి కాలానికి చెందకపోయినా వారి నుంచి స్ఫూర్తి పొందటం మూడవది. కాబట్టి ఈ ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని చూపించారు.
‘జిల్లెళ్ళమూడి అమ్మ’, ఆమె పేరు ‘అనసూయ’, ఇంటి పేరు బ్రహ్మాండం. కాబట్టి ఆ బ్రహ్మాండం అంతా వచ్చి అనసూయ అనబడే ఒక అతి పవిత్రమైన ఒక మూర్తిలో, స్త్రీమూర్తిలో ప్రవేశించి ఈ జాతిని, పరమాద్భుతమైన స్థాయిలో నడిపించింది. 99 ఏళ్ళ నాటి పట్టుమని పదిళ్ళు లేని ఒక కుగ్రామాన్ని ఊహించినట్లయితే, ఆ ఊరు ‘జిల్లెళ్ళమూడి’ అయి నట్లయితే, జిల్లెళ్ళమూడిలో మనుషులు తక్కువ, ఇళ్ళు తక్కువ, నీళ్ళు అసలే లేవు. పంటలే పండవు. ఊషర క్షేత్రంగా ఉన్నది. అక్కడ, విద్యాధికులైన వాళ్ళు లేరు. చదువు సంధ్యలు తక్కువ. కాబట్టి, ఆకలికై, అన్నానికై, డబ్బుకై, సంపదకై, పోరాటాలు, ఆరాటాలు, కామాటాలు పెరిగిపోయి, పగలు, వగలు రాజ్య మేలుతున్న ఒక దురదృష్టకర, దుష్కర సన్నివేశంలో ‘జిల్లెళ్ళమూడి అమ్మ’ జిల్లెళ్ళమూడిలోకి ప్రవేశించింది. ఆమె భర్త ఆ ఊరి కరణం గారు. ఊహించండి! వంద ఏళ్ళనాడు కరణం గారి జీతం ఎంత ఉంటుంది అని. అసలు జీతమేనా అని. కాని ఈ అవతారమూర్తు లందరూ, బాగా డెవలప్ అయిన ప్రదేశాలలో అవతారం ఎత్తరు. ఇటువంటి ప్రదేశాలలో జన్మయెత్తి ప్రపంచాన్ని అధ్యాత్మికమయం చేస్తారు. అక్కడికి వచ్చి నెమ్మది, నెమ్మదిగా, అందరికీ అన్నం వండి పెట్టటం ప్రారంభించింది అమ్మ. ఆకలికి ఒక ముద్ద దొరికితే చాలన్న వారందరూ అమ్మ దగ్గరకి వచ్చారు. సరే, నెమ్మదిగా ప్రశస్తి చుట్టుప్రక్కలంతా పాకింది. అమ్మ, ఒక సౌందర్య మహా సముద్రం, లలిత పల్లవమైన ఒక కోమల దేహంతో! కానీ దివ్య కాంతి పుంజీభూతమైన స్థితిలో, తనను తాను నిలబెట్టుకుని సాధారణ గృహిణి వలె ఉంటూ, గృహస్థాశ్రమాన్ని ఆలంబనం చేసుకున్నది. శిరిడీ బాబాకు గృహస్థాశ్రమం లేదు, వివేకానంద స్వామికి లేదు, అరవిందులవారికి వివాహమయినా, ఆయన భార్య ఎక్కడో వంగ దేశంలో ఉంది, ఇక మిగతా వారంతా పరివ్రాజకులు. రమణ మహర్షి సంగతి సరేసరి. సత్యసాయి బాబావారి సంగతి మరీ సంగతి. ఏమీ లేనివారు, ఎవ్వరూ లేనివారు! కానీ అందరికీ చెందినవారు.
కానీ అమ్మ ఎంచుకున్నది గృహస్థాశ్రమ ధర్మం. సన్యాసి, గృహస్థు మీద ఆధారపడే జీవించాలి. గృహస్థు, సన్యాసి మీద ఆధారపడి జ్ఞానాన్ని సంపాదించాలి. సృష్టిలో ఉన్న ఒక అద్భుతమైన యోగమిది. సన్యాసి దగ్గరకెళితే మనకేం లభిస్తుందయ్యా అంటే రెండు ముద్దలు కూడా దొరక్కపోవచ్చు. కానీ జ్ఞానముద్ద దొరుకుతుంది. కాని, జిల్లెళ్ళమూడి అమ్మ గృహస్థాశ్రమాన్ని స్వీకరించి, సంతానాన్ని కూడా కని, ఈ కనిన సంతానము మాత్రమే కాదు, ఏ తల్లి కన్నా సరే, ఆ బిడ్డ కూడా నా బిడ్డేనని ప్రకటించింది. అంటే నేనే ఆ పిల్లలను కని ఆయా తల్లులకు ఇచ్చానని ఒకసారి ప్రకటన చేసింది. అంటే ఏమిటి? ఏ గర్భం నుంచి ఏ బిడ్డ వచ్చినా, వాళ్ళందరూ నాకు చెందిన వారే, వాళ్ళందరికీ నేను తల్లిని, అని ప్రమాణపూర్వకమైన ఒక పరిసత్యాన్ని ప్రపంచానికి చెప్పింది. ఇది స్థూలంగా అమ్మ చేసిన తొలినాటి ప్రయత్నం గురించిన విషయం.
అంతేకాదు, ఎన్నాళ్ళు ఉన్నది? అని ప్రశ్న వేస్తే కేవలం 62 ఏళ్ళు మాత్రమే అవనీ సంచారం చేసింది. మూడవ ఏట శాంభవీ మహాముద్రని, అంటే ఆమె ఒక ముద్ర వేసుకుని కూర్చుంది 3 ఏళ్ళ పిల్ల, ఎవరో వచ్చి ఏంటి అలా కూర్చున్నావు అన్నారు. ‘ఇది శాంభవీ ముద్రలే’ అన్నది. ఇక అక్కడి నుంచి తనలో ఉన్న ఆ యోగ స్వరూపమే అయిన అమ్మ ఎవరెవరిని ఆదరించింది అని మనం విచారణ చేసినట్లయితే, నిమ్నజాతులు, దళితులు, వాడు క్రిస్టియనా, వాడు ముస్లిమా, వాడు బ్రాహ్మణుడా, అబ్రాహ్మణుడా, హిందువా, కాదు ఆమెకు కావల్సింది. వాడు మానవుడా? కాదా? అంటే, కేవలం, మానవులయందే ప్రేమ ఉన్నదా అంటే సమస్త జంతుజాలం పట్ల, అమ్మకు అదే అపేక్ష ఉన్నది. ఇది జ్ఞాని లక్షణం. నిజానికి దైవీ లక్షణం. జ్ఞానికి స్పర్థలూ, యుద్ధాలూ ఉండవు. దైవానికి యుద్ధం చేయటం ఉంటుంది చేయించటం ఉంటుంది.
కాని అమ్మను జ్ఞాన స్వరూపిణిగా చూసినట్లయితే ఇవాళ ఆమె చూపిన మార్గమేమిటి? మిగతా వాళ్ళంతా ఏయే మార్గాలు చూపారో చెప్పుకున్నాం. ఆమె ఏం చెప్పింది అంటే, భారతీయమైన శాస్త్ర విజ్ఞాన సమస్తాన్ని అచ్చ తెలుగులో చెప్పింది. శ్లోకాలు లేవు, పద్యాలు లేవు, కల్పనలు లేవు, కవిత్వాలు లేవు, తీవ్రమైన విచారణ చేయటానికి కావలసిన సంక్లిష్టమైన భాష లేదు. ఎవరికీ అర్థం కాని ఎక్స్ ప్రెషన్స్ లేవు. తీవ్రమైన కథా, కథనాలు లేవు. ఉపన్యాసాలు లేవు, ప్రవచనాలు లేవు, కాని, ఆమె నోటి నుంచి ఒక్క మాట బయటికొస్తే అది బ్రహ్మవిద్యా ప్రమాణంగా బయటకొచ్చింది. ఇది విశేషం. ఆశ్చర్యపోతాం. మనకి బ్రహ్మ విద్య తెలియదు కాబట్టి, అమ్మేదో, మనలాగా మాట్లాడుతోంది మన భాషలో అనుకుంటాం. బ్రహ్మ విద్యా రహస్యాలను, వేదశాస్త్రాలను తెలిసినవాడికి అమ్మ ఏమి చెప్తున్నదీ దీని మూలమేమిటో అర్థమై ఒక్క నిమిషంలో కనెక్ట్ అయిపోతాడు.
అయితే, “ఏం లేదు నాన్నా, అంతా వాడే చేస్తున్నాడనుకో” అని అంటుంది. ఇది ఎవరైనా జ్ఞానులు వాడే భాషేనా? కాని, భగవద్గీతలో కృష్ణుడు ఈ మాటని పదే పదే “అంతా నేనే చేస్తున్నా” అన్నాడు. “అంతా నా వల్లనే జరుగుతున్నది” అన్నాడు. “నువ్వు నిమిత్త మాత్రుడివి” అన్నాడు. ఆ అంతా నేనే అనటం, నేనే అంటే అక్కడ అనసూయ కాదు, జిల్లెళ్ళమూడి అమ్మగా కనిపిస్తున్న దేహధారిణి కాదు, ఎవరు? అంటే, అఖండమై, చిదనమై, సర్వవ్యాపకమైన, సమస్త సృష్టిని ఆవరించి, ఆవహించి, ఆవేశించి, ఉన్నటువంటి ఒక పరమాత్మ! మాట్లాడుతున్న నేను, వింటున్న మీరు, కనిపిస్తున్న ఈ ప్రపంచము, కంటికి కనపడుతున్నాయి. నాకు నేను కనపడుతున్నాను. మన చుట్టూ, ఉన్న ప్రపంచం కనిపిస్తున్నది. కాని, ఈ మాట్లాడిస్తున్నది ఎవడు? ఈ కనిపిస్తున్న ప్రపంచాన్ని సృష్టించింది. ఎవడు? వాడు కనబడడు. కాబట్టి, మీకు నాకు కాక, లేదా, మిమ్మల్ని, నన్ను, నడిపిస్తున్న, థర్డ్ డైమన్షన్ ఏదో ఉంది. దానికి ‘వాడు’ అని పేరు. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు మూడు, మనో, బుద్ధి, చిత్, అహంకారాలు నాలుగు కలిపితే, ఏడు శరీరాలు! ఈ ఏడు దాటిన వాడికి మాత్రమే ఎనిమిదవ శరీరం అనుభవంలోకి వస్తుంది. వాణ్ణి ఏమనాలి? ‘వాడు’ అనాలి. లేదా ‘అదే’ అనాలి. కాబట్టి ఆ “తత్ ఏదైతే ఉన్నదో, అదే చేయిస్తున్నది అనుకో నాన్నా.” అంతా వాడే అనగానే మనకర్థం కాదు.
అలాగే, ఎవరో “జీవితంలో పైకొస్తే బాగుండు, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది అని ఎవరో ఒకాయన వచ్చారనుకుందాం. ఆయన్ని పిలిచి డైరెక్ట ఏమీ చెప్పదు. ఈయన మనసులో కలుగుతున్న ఆలోచనలకు అనుగుణంగా ఒక్క మాట చెబుతుంది.” “ఏది లభిస్తున్నదో దానితో తృప్తిగా ఉండు నాన్నా” అని సందేశం. ఇది ఎక్కడినుంచి చెప్పింది? భగవద్గీతలో నించి చెప్పింది. అందుకనే, అమ్మ ఎన్ని మాటలు చెప్పినా, ఎన్నెన్ని వాక్యాలు ప్రపంచంలో ప్రింట్ అయి ఉన్నా, ఆమె “భగవద్గీత దాటి నేను ఏం చెప్పాను నాన్నా” అంది. అమ్మ నిజానికి భగవద్గీత చదివిందా? అమ్మ ఉపనిషత్తులు చదివిందా? అమ్మ ఉపనిషత్తుల మీద అనేక వ్యాఖ్యానాలు చేసిందా? తర్కం చేసిందా? వ్యాకరణం తెలుసా? ఈ తెలుగు భాషను, పరమాద్భుతంగా ఎవరి దగ్గరైనా నేర్చుకున్నదా అంటే, అమ్మకు గురువే లేదు.
(సశేషం)
(శ్రీ వి.యస్.ఆర్.మూర్తి గారి గ్రంథం ‘అంఆ తత్త్వదర్శనమ్’ నుండి గ్రహింపబడినది)