(గత సంచిక తరువాయి)
కనుక అమ్మ ఈ అన్నము అనే అన్నపు మెతుకుకి అంత ప్రాధాన్యత నిచ్చింది. ఉపనిషత్తు యొక్క భావనే అమ్మ అన్నం పెట్టటం వెనుక దాగిన మార్మికత. అదేమిటంటే అన్నపు మెతుకులోంచి అన్నమయ కోశం ఏర్పడుతుంది. మనం తిన్నప్పుడు దాని నుంచి ప్రాణమయం, దాని నుంచి మనోమయం, ఆ పైన విజ్ఞానమయం, ఆపైన ఆనందమయ కోశం ఏర్పడతాయి. అంటే పంచకోశాలు ఏర్పడటానికి మూలం ఏది అంటే, అన్నం. ఆ అన్నానికి అమ్మ చాలా ప్రాధాన్యతనిచ్చి, అందరినీ అక్కున చేర్చుకున్నది.
అలాగే, వివాహ వ్యవస్థకి అమ్మ పెద్ద పీట వేసింది. గృహస్థాశ్రమం, వివాహ వ్యవస్థ, రెండూ భిన్నం కావు. ఈ వివాహ వ్యవస్థలో అనేకమైన సున్నితమైన విషయాలన్నిటినీ, ఒక దానికొకటి అల్లుతూ, తన చుట్టూ ఉన్నవారందరినీ కూడా ఏరికోరి, కూర్చి, వాళ్ళందరికీ, భద్రతమమైన జీవితాన్ని ఇచ్చి, వివాహం ఇలా చేసుకోవాలి, వివాహ ప్రశస్తి ఇది, అని చెప్పింది. మహర్షులంతా వివాహితులే. వివాహమయిన వాళ్ళే. గృహస్థాశ్రమంలోనే ఉన్నారు. అందులో బ్రహ్మచారులు తక్కువ, గృహస్థాశ్రమంలో ఉన్నవారు ఎక్కువ. గార్గి, మైత్రేయి, ఇటువంటి వారు. అరుంధతి, అనసూయ వీళ్ళంతా కూడా. అత్రిమహాముని, అనసూయ, వసిష్ఠులవారు, అరుంధతి, గౌతమముని, అహల్య, ఇట్లా ఋష్యాశ్రమంలో ఉన్నప్పటికీ మునిపత్నులందరూ ఉన్నారక్కడ. ఎందుకని అంటే, ఒక పురుషుడు తన కార్యసాధనకై, అది భౌతికం కావచ్చు, లౌకికం కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు. లేదా, సంసారాన్ని వదిలిపెట్టి, సన్యాసంలోకి వెళ్ళవలెనన్నా, భార్య అనుమతి తీసుకోవాలని ఒక మాతృస్వామ్య వ్యవస్థలో ఉన్న పరమాద్భుతమైన, బలీయమైన సందర్భాలని, సన్నివేశాలని, అంశాలని అమ్మ ప్రాక్టికల్ ఫిలాసఫీగా మార్చింది. అనుష్ఠాన వేదాంతం అని మనం చెప్తూ ఉంటాం. అనుష్ఠాన వేదాంతం ఒట్టి నోటిమాట కాదు.
వివాహ వ్యవస్థలో ఎవరైనా వస్తే, ఇద్దరినీ కలిపి చూసుకోమంది. చాలా మంది అద్వైతమంటే ఏమిటంటే, 40 ఎపిసోడ్స్, 200 ఎపిసోడ్స్ మాట్లాడుతున్నారు. అమ్మ, “అద్వైతమంటే ఏం లేదు నాన్నా, అసలు రెండున్నాయని కాదు, ఉన్నది ఒకటే! రెండున్నయ్ అనటంలోనే ద్వైతముంది. అసలు ఉన్నది ఒక్కటే అనుకో. ఆ ఉన్నది ఒక్కటే! అనటంలో రెండనేది లేదు. అంతేకాదు, నీకింకా అర్ధమయ్యేట్లుగా చెబుతా. ఏ కూతురైనా తన అత్తగారిని తల్లిగా చూడగలిగితే అదే అద్వైతం” అన్నది. ఇది అద్వైతం. ఈ అధ్యాత్మ, అద్వైతం అనే పదాలు వేరు వేరుగా గోచరించినా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నయ్ గనుక, అమ్మ ఆ చూపిన ఆ దారిలో ఉపనిషత్తులు కోట్ చెయ్యలేదు, ఉపనిషత్తుల మీద వ్యాఖ్యానం చెయ్యలేదు. తనను తాను మరుగుపరచుకుని, నిలకడ చెందింది.
అమ్మ ఆ ప్రదేశాన్ని ఆ రోజులలోనే డాక్టర్ని పిలిచి వాళ్ళందరితో గ్రామీణ ప్రాంతంలో ఉన్న వారందరికీ వైద్య సౌకర్యాలందించి ఒక అద్భుతమైన ధన్వంతరీ మహా యోగాన్ని, ఆ ప్రదేశానికి ఒనగూర్చింది అమ్మ. 1958 నాటికి, అన్నపూర్ణాలయము అనే పేరు విశ్వజనని మీద, అక్కడ ఆమె పేరు పెట్టుకోలేదు, అమ్మాలయము, అన్నాలయము, లేకపోతే ఇంకో ఆలయము పెట్టలేదు. అన్నపూర్ణ అంటే ఆహారానికి, కాశీ అన్నపూర్ణే, అన్నపూర్ణే ఇక్కడ మనకి రోజూ దొరుకుతుందని, అన్నపూర్ణాలయాన్ని ప్రారంభిస్తే, ఆ అన్నపూర్ణాలయంలో అన్నం తినని వాళ్ళు లేరు. అక్కడ అన్నం తిన్నవాడు ఎన్ని సిద్ధులు సంపాదించుకున్నాడో, లెక్కపెడితే, అవి లెక్కకు అందేవి కావు. చిక్కేవి కావు. మహాజ్ఞానులంతా వచ్చి అక్కడ అన్నం తిన్నారు. కారణం, పసందైన భోజనం ఉంటుందని కాదు. విందు భోజనం దొరుకుతుందని కాదు. అమ్మ ఏం పెట్టేది అంటే, చింతకాయ పచ్చడి, చారు, మజ్జిగ. ఏముంది దాంట్లో! అనుకుంటాం. అసలు ఉన్నదంతా దాంట్లోనే. ఆ రసవాహిని దానియందున్నది.
ఈ మధ్య అన్నపూర్ణాలయం మళ్ళీ ఒక పరమాద్భుతమైన భవనంగా మారినప్పుడు, నేనక్కడ ఉన్నప్పుడు, అమెరికాలో ఉన్న ఒకామె నాకు ఫోన్ చేసి, “బాగుంది. ఆ రోజుల్లో దొరికే ఆ మూడు ఇప్పుడిక్కడ దొరుకుతయ్యా” అని అడిగింది. అట్లా దొరకవేమోగాని, అన్నీ దొరుకుతాయి అంటే, అసలు ఆ రుచే వేరు. కారణం, ఆ రుచి దాని వెనుక అమ్మ ‘దయ’ ఉంది. అమ్మ కరుణారసముంది. అమ్మ ప్రేమ ఉంది. “ఈ ప్రపంచంలో ఆకలితో ఒక వ్యక్తి జిల్లెళ్ళమూడి ప్రాంగణంలోకి ప్రవేశిస్తే, వాడి ఆకలి తీర్చకపోతే ఆ రోజు నేను కన్నీరు కారుస్తాను నాన్నా” అన్నది అమ్మ. దాని వెనుక పరమ రమణీయమైన ఆదరణ ఉండాలి. ప్రేమ ఉండాలి. ఎవరొస్తారు? ఎవరు చెయ్యి చాపుతారు అన్నపు ముద్దకి? ఆకలైనవాడే! అవసరం ఉన్నవాడే! వాణ్ణి దగ్గరకు తీసుకోండి” అని చెప్పింది అమ్మ.
ఆమెకి 50వ పుట్టిన రోజు వచ్చింది. అప్పటికే అమ్మకి భక్తులు, శిష్యులు వేలకి వేలమంది ఉన్నారు. ఎవరిని పిలిచినా వచ్చేస్తారు. వీళ్ళందరూ వెళ్ళి అమ్మ నడిగారు. “అమ్మా, మీకు 50 ఏళ్ళు వచ్చాయి, ఏం చేద్దాం” అని. “ఏం లేదు నాన్నా! ఒక లక్ష మంది ఏక పంక్తిలో భోజనం చేస్తే చూడాలని ఉంది” అన్నది. జిల్లెళ్ళమూడిలో ఉన్నవే వంద ఇళ్ళు. వంద ఇళ్ళ వాళు ఎ వచ్చినా 400 మంది అవుతారు. అమ్మేమో ఒక లక్ష మంది అన్నది. అందరికీ అనుమానం వచ్చింది. అమ్మేమిటి ఇట్లా అన్నది. మనం లక్ష మందికి పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, అమ్మ దయుంటే పెడతాము. కాని వచ్చేవాళ్ళు ఎవరు? అని. ప్రొద్దుట్నించీ సాయంకాలం వరకూ అమ్మ సంకల్పం ప్రకారం ఆ పొలాల్లో పందిళ్ళు వేస్తే, లక్షా, ఇరవై ఎనిమిది వేల మంది ఏకపంక్తిని భోజనం చేసిన ఒక అపూర్వ ఘట్టమది. దీనిని ఏమనాలి? మహిమ అందామా? ఇంత మందికి ఆకలి ఉందనుకుందామా, లేదూ, అమ్మ దగ్గర అన్నం తింటే, తల్లుల్ని పోగొట్టుకున్న ఆ బిడ్డలకి, మళ్ళీ ప్రేమ దొరుకుతుందని వచ్చిన వాళ్ళున్నారా, వయస్సు మలగి ఇక వెళ్ళిపోతున్న టైములో ఈ కడసారి ముద్దలు తిందామని వచ్చిన వాళ్ళు ఉన్నారా అంటే, అందరూ ఉన్నారు. వీళ్ళందరినీ సమాదరించింది. కాని, తన సంకల్ప శక్తి చూడండి. లక్షా 28 వేల మంది ఏకపంక్తిలో భోజనం చేయటమంటే అది మామూలు విషయం కాదు. ఇప్పటికీ, ఎప్పటికీ అది చాలా గొప్ప విషయం. ఐతే, అమ్మ దగ్గరకు ఎవరెవరు, ఎలాంటి వారు వచ్చారు? అందరూ వచ్చారు. పామరులొచ్చారు, పండితు లొచ్చారు, సినిమాల వాళ్ళొచ్చారు, కష్టమున్న వాళ్ళొచ్చారు. నష్టపోయిన వాళ్ళున్నారు, బాగా సంపాదించుకున్న వాళ్ళూ వచ్చారు. వీళ్ళన్నింటి కంటే ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళంతా వచ్చారు.
(శ్రీ వి. యస్. ఆర్. మూర్తి గారి గ్రంథం ‘అంఆ తత్త్వదర్శనమ్’ నుండి గ్రహించబడినది.)