(గత సంచిక తరువాయి)
కాలేజ్ కట్టి 50 ఏళ్ళు ఐపోయింది. అన్నపూర్ణాలయం 1958, అది ఐపోయింది. అమ్మ తన శరీరాన్ని వదిలిపెట్టిన తరువాత, దానిని ఆలయ ప్రవేశము, అనంతోత్సవము అని చేస్తాం. ఆ ఆలయ ప్రవేశము చేసింది కనుక అక్కడ అమ్మకి గుడి ఉన్నది. అమ్మ గుడికి పక్కన, ఇందాక చెప్పిన హైమాలయం ఉన్నది. హైమాలయము అమ్మ యొక్క శక్తి స్వరూపం. అమ్మ ఆలయం ప్రేమాలయం. ప్రేమా కావాలి, ప్రపంచంలో బ్రతకటానికి ‘శక్తి’ కావాలి. ఎవరెవరి అనుభవాలు వాళ్ళవి. ఆ అనుభవించిన వాళ్ళు చెప్తున్నప్పుడు వాటిని మనం నమ్మాలి. కనుక అక్కడికి ఎంతో మంది మేధావులు, వచ్చి సేవ చేశారు. చేస్తున్నారు. ఎంత మంది కమిటెడ్ గా తమ తమ కుటుంబాలను, స్థావరం చేసుకొని, ఆశ్రమం నడపటంలో తమ కార్యకలాపాలు చేస్తున్నారు. జిల్లెళ్ళమూడి ఆశ్రమం, ఆశ్రమం మాత్రమే కాదు. మరి ఏమిటి అంటే జ్ఞానులకి కూడా అది ఆశ్రయమే. అందరూ అక్కడకు చేరవలసి ఉన్నది కాబట్టి ఇవాళ అంతా వస్తున్నారు, వెళు తున్నారు. ఆ రోజుల్లో అమ్మ ఉండగా వచ్చి, అక్కడ సెటిల్ అయిన వాళ్ళున్నారు. విదేశీయులు వాళ్ళ దేశానికి వెళ్ళి ‘మదర్ ఆఫ్ ఆల్’ అనే పుస్తకం వ్రాశారు.
60 ఏళ్ళకు ఒక ఉత్సవం, 70 ఏళ్ళకు ఒక ఉత్సవం, 100 ఏళ్ళకు ఒక ఉత్సవం చేస్తాం. అమ్మ ఈ ప్రపంచంలోకి వచ్చి 100 ఏళ్ళయింది. భగవన్నామ స్మరణ చేద్దాం. భగవత్ చింతన చేద్దాం. భగవత్ భావనతో జీవిద్దాం. మన శరీరానికి జ్వరం వస్తే మన మెక్కడున్నామో మనకి తెలుస్తుంది. అలాగే ఈ ప్రపంచంలో కూడా ఇటువంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు, మనం ఎంత పాపభారాన్ని ఈ భూమాత మీద వదిలి పెడుతున్నామో, ఎంత అనాచారంతో బ్రతుకుతున్నామో, ఎంత అహంకారంతో ప్రవర్తిలుతున్నామో, ఎంత అమానుషంగా మనం జీవిస్తున్నామో, మనల్ని మనం విశ్లేషించుకోవాలి. జీవితమంతా నేనే, నేనే, నేనే అన్నవాడికి, నువ్వు, నీ క్షణాలు ఎన్నో తెలియని ఒక పరిస్థితి ఇవ్వాళ ఏర్పడిందే. ఇంత అనిశ్చితమైన స్థితిని ప్రకృతి కల్పించి మనకి బోధ చేస్తున్నది. ఇవాళ కరోనాను ఒక మహా గురువుగా మనం స్వీకరించినట్లయితే, మనలో అహంకార, మమకారాలు సన్నగిల్లుతాయ్, అహంకారం పోవాలి. మమకారం పట్టుతప్పకుండా ఉండాలి. “అహం మమత్వా శిథిలాయమానే” అన్నారు శంకర భగవత్పాదులు. ఇవన్నీ ఇవాళ తల్చుకునే ఒక మహాయోగాన్ని అమ్మ మనకి కల్పించింది. అమ్మ శతజయంతి ఉత్సవాల ఈ సమయంలో అమ్మ గురించి ఈ తరానికి చాలా తక్కువ మందికి తెలుసు. కాని మహాత్ములని, మహర్షులని, అవతార మూర్తులని మనము మరచిపోరాదు. అది మహాపాపం. వారిని తలచుకోవాలి. వారి దివ్య మహాస్మృతికి ప్రతి రోజూ ప్రాంజలి ఘటించాలి. ఇవ్వాళ ఉపనిషత్తులకి నమస్కారం చేస్తున్నాం. వేదానికి నమస్కారం చేస్తున్నాం. బ్రహ్మ సూత్రాలకు నమస్కారం చేస్తున్నాం. భగవద్గీతకి నమస్కారం చేస్తున్నాం. అలాగే శ్రీరామ, శ్రీకృష్ణాది అవతారాలు, అవతార మూర్తులు, వీళ్ళందరినీ ఎట్లా తలచుకుంటున్నామో, ఒక కరణం గారి భార్యగా ఉన్న, ఒక సాధారణ గృహిణి, అసామాన్యమైన స్థాయిలో, శ్రీలలితగా, రాజరాజేశ్వరిగా, ఆరాధింపబడే స్థాయికి ఎలా వెళ్ళగలిగింది అంటే, నా భావన ఒక్కటే.! ఆమె ఈ ప్రపంచాన్ని ఆరాధించింది. ఆమె ఈ ప్రపంచాన్ని ప్రేమించింది. ఆమె ఈ ప్రపంచాన్ని లాలించింది. పాలించింది. కనుకనే ఈ ప్రపంచమంతా ఆమెను ఈ రోజున ఆరాధిస్తున్నది. జీవుడు ఎట్లాగైతే దైవాన్ని ఆరాధిస్తాడో, దైవం కూడా జీవుణ్ణి ఆదరిస్తాడు.
‘స్వామీ మీ కోసం 20 వేల మంది భక్తులు మీ దర్శనం కోసం ఎదురు చూస్తున్నార’ని వార్త లోపల చెప్పగానే, సత్యసాయి ఒక మాటన్నారు. ‘ఏమీ నేను రోజూ వాళ్ళకు దర్శనం ఇవ్వటానికి వెళ్తున్నానని మీరనుకుంటున్నారా? వారిని దర్శించటానికి నేను రోజూ బయలుదేరి వెళ్తున్నానన్నారు.
చూశారా! ఆ సద్గురువు యొక్క స్థాయి. ఆ మాటలు చెప్పే విశ్లేషణ. వారు ప్రకటించే రీతి – రివల్యూషన్ అంటాం. ఇవి ఆధ్యాత్మికమైన ప్రకంపనలు కావు. ప్రసారాలు! ఇవన్నీ అనుగ్రహ కిరణాలు. వీటన్నింటినీ మనం సమన్వయం చేసుకుంటూ, సాయి ప్రేరణ ఛానల్ ఈవేళ, మొదటి బుధవారం అనేది నిర్ణయమైందీ కాని, అది అమ్మ కళ్యాణోత్సవం అవుతుందని కానీ, అది మే నెలలో 5వ తారీకు 5వ నెల, ఐదవ సంవత్సరమవుతుందని ఎవరూ నిర్ణయించింది కాదు. ఏది జరిగినా ప్రావిడెన్షియల్ గా జరుగుతుంది. ‘ఈవేళ, సాయిప్రేరణ సంకల్పించిన, ఈ కార్యక్రమానికి మాతృశ్రీ జిల్లెళ్ళమూడి అమ్మ దివ్య అనుగ్రహం మహామృత వృష్టివలె అందరిపై వర్షించుగాక! ఈ జగత్తుని అమ్మ ఈ కోవిడ్ నుంచి బయట పడేసి మళ్ళీ సామాన్య జనజీవనం ‘సహజ జీవనం సాగేట్లుగా అనుగ్రహించుగాక’ అని అమ్మని ప్రార్థిస్తూ, సంకల్ప శక్తులన్నిటికీ ప్రణమిల్లుతూ అందరికీ శుభకామనలు తెలియచేస్తూ, మంగళా శాసనం చేస్తూ…