(గత సంచిక తరువాయి)
జిల్లెళ్ళమూడి అమ్మ విద్యా, వైద్య, ఆరోగ్య, రంగాలకి అమ్మ పరమాద్భుతమైన దారి చూపించింది. ఆ దారిలో మనం వెళ్ళకుండా మనం గురువులని మార్చేసుకుంటూ ఉంటాం. ఇవాళిది కాదు, ఇవాళిది కాదు అనుకుంటూ కాదు. సర్వ గురువులూ ఒక్కటే, ఒక్క స్థాయికి చెందిన వారంతా. సత్యసాయిబాబావారు చెప్పింది అదే! ఎందుకంటే మే 9, 1962న అమ్మ దర్శనం అయింది. ఒక్క నెల తరువాత జూన్, 9, 1962 సత్యసాయి బాబా వారిని దర్శించాను. అంతే కేవలం ఒక్క నెల తేడా, ఇద్దరూ దగ్గరికి తీసుకున్నారు. ఇద్దరిలో నేను ఉండగలిగాను.
ఇది జన్మాంతరమైన విశేషంగా నేను భావన చేస్తూ, ఈ మహాత్ముల చరిత్రలలో దాగిన పరమ గుహ్యమైన విషయాలున్నాయి. వీటిని ఇవాళ రమణ మహర్షి గురించి ఏమైనా చెప్పండి అనగానే ఆయన ఎవరితోనూ మాట్లాడలేదంటారు.
ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడితే లోకానికి ఉపయోగిస్తుందో, అది మాత్రమే మాట్లాడారు. ఏది చెప్పాలో నిష్కర్షగా చెప్పారు.
“పీఠాధిపతిని అయినప్పటికీ ప్రదోష పూజలు, నిత్యకర్మలు, ఆచారాలు, వ్యవహారాలు, విహారాలు మాకున్నాయి. సంచారాలూ ఉన్నాయి. రమణ మహర్షి నిత్యసుఖి, వీటన్నింటినీ, దాటిన అతివర్ణాశ్రమి,’ అన్నవారు కంచి మహాస్వామి వారు.
ఇక, అరవిందులు తత్త్వ దర్శనం చేశారు. ఆగస్టు 15న స్వాతంత్య్రం రావాలి అని ధ్యానంలో కూర్చున్నారు. వచ్చిందా? రాలేదా? వచ్చింది.
శృంగేరిలో చంద్రశేఖర భారతీస్వామి వారు ఒక రోజు ప్రదోష పూజ చేసుకుంటుంటే కుంకుమ నిండుకుంటున్నది, అంటే కుంకుమ అయిపోతున్నది. చుట్టూ వాళ్ళు భయపడిపోయారు. స్వామివారేమో ట్రాన్స్ లో ఉన్నారు. వారు పూజ చేసుకుంటున్నారు. కుంకుమ అయిపోతున్నది. ఇక కొన్ని గ్రాములు దాంట్లో ఉన్నదనగా కుడిచేయి దాని మీద తట్టారు. తట్టగానే ఎంత ఖర్చయిందో అంత వస్తే వీళ్ళు అంతా ఆయన మహిమగా ఆయన ముందు చెప్పబోయారు. అప్పుడు “మనందరమూ, ఇటువంటి కార్యకలాపాలలో మునిగి రాత్రిపూట నిద్రపోతున్న సమయంలో జగజ్జనని మళ్ళీ మనకి రేపటికల్లా ఎంత కావాలో, ఎంత ఖర్చయిందో, దానిని ప్రతి రోజు నింపుతున్నదే. దానిని గురించి ఆలోచించుకోండి. అదే జరిగినప్పుడు ఇది జరగదా” అన్నారు చంద్రశేఖర భారతీస్వామివారు.
ఇక సరే, రమణ మహర్షి చెప్పనక్కర్లేదు. అంతటా, అన్నిటా, ఆత్మను దర్శనం చేయ్. నీవు అసలు ఆత్మవే. అని ఆయన బోధించారు.
అమ్మ చెప్పింది కూడా అంతే. ఇవన్నీ చెప్పింది. వీటన్నింటిలో ఉన్న విషయాలని, నిగూఢమైన విషయాలన్నిటినీ మనకి తెలియచేస్తూ, మురికివాడలో, బెస్త కాలనీల్లో, ఏ తుఫాను వచ్చినా, ఏ విధమైన ప్రకృతి వైపరీత్యాలు జరిగినా, అమ్మ నడుం కట్టి వెళ్ళింది. తన వెంట వేలమందిని నడిపించుకున్నది ఆమె.
ఒక ఎడిటర్, “అమ్మా నీ గురించి పేపర్లలో రోజూ రాస్తానమ్మా, నా చేతిలో ఉంది “పేపర్ అంటే,” ఏ పేపరు చదివి నీవు నా దగ్గరికి వచ్చావు నాన్నా” అన్నది.
ప్రచారం కాదు. ప్రసారం మాత్రమే కావాలని బోధించిన అమ్మని మనం ఎలా మర్చిపోతాం? కాబట్టి ఆమె చూపిన మార్గము, చూపిన దారి, అది విశిష్టమైన దారి, అందరమూ గృహస్థాశ్రమంలో ఉంటూ, ఇది ఇచ్చే సుఖాలని అందుకుంటూనే, ఆనంద తారక స్థితికి వెళ్ళటానికి ఏమేం చెయ్యాలో, దానము, ధర్మము, త్యాగము, ప్రేమ, సేవ, వీటన్నింటినీ ఒక్కచోట కూర్చి మనకి నేర్పిందామె. ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళి చందాలడగలేదు. కావలసినవన్నీ అవే ఏర్పడతాయి. అందుకనే, నత్యసాయి బాబా వారు ఒకమాటన్నారు, “మీకు సంకల్పశుద్ధి ఉన్నట్లయితే, సంకల్పం సిద్ధిస్తుంది. అదే, శుద్ధి లేనప్పుడు సిద్ధి లేదు. శుద్ధి, సిద్ధి లేనప్పుడు మీరు సిద్ధం కాలేరు. ఈ మూడూ కానప్పుడు జీవిత పరమార్థం మీకు బహుదూరంగా వెళ్ళి పోతుంది. ఆలోచనలని పవిత్రీకరించండి.” ఇది ఒక అద్భుతమైన ఉపదేశం.
కాబట్టి వీళ్ళందరినీ అర్థం చేసుకున్నప్పుడు, దారులు భిన్నంగా కనిపిస్తున్నప్పటికీ, ఎక్కడా వైరుధ్యం లేదు. అమ్మ ఏమన్నా కొత్తగా చెప్పిందా? కొత్తదారి చూపిందా? ఉపనిషత్తుల్లో చెప్పినదాన్ని ఆ భాషలో చెప్పకుండా, దాని సారం తీసి చేతిలో పెట్టింది. దాన్ని మనం అందుకోగలిగితే చాలు. ఒక అద్భుతమైన గోశాల ఈ మధ్య కట్టారు. ఆనాడు గోశాల ఉండేది. చిన్న పూరిపాకలో ఉండేది. గోసేవ సర్వదేవతల యొక్క సేవగా భావించాలి. సర్వ దేవతలు గోదేహంలో ఉంటారు అని మన భారతీయ సనాతన ధర్మం చెప్తున్నది కాబట్టి, అంతమంది దేవతల్ని మనం పూజించలేం కాబట్టి.. గోవుని సేవించండి. గోశాల! చాలా అధునాతమైనది. బహుసుందరమైనది. కానీ తలకుమించిన వెయ్యి గోవులు, మూడు వేల గోవులు పెట్టుకోలేదు. 54 గోవులకి పరిమితం చేసుకుని, ఆ గోమాతలకి, ఏ టైంకి ఏది ఇస్తే అవి చక్కగా, హాయిగా ఉంటాయ్యో, దానికి తగిన ఏర్పాట్లు చేసి, గోశాల కట్టబడింది.
- (సశేషం)
(శ్రీ వి.యస్.ఆర్.మూర్తి గారి గ్రంథం ‘అంఆ తత్త్వదర్శనమ్’ నుండి గ్రహించబడినది.)