(గత సంచిక తరువాయి) జిల్లెళ్ళమూడి అమ్మకి గురుత్వం వహిద్దామని ఒకామె ఒక ప్రయత్నం చేసి ఆమెని పిలిచింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు కాసేపు. ఈ గురుత్వం వహిద్దామనుకున్న ఆమెకి, అమ్మలో కనిపిస్తున్న అమాయకమైన, ఆ స్వచ్ఛమైన ముఖ మండలాన్ని చూస్తూ, ఈమెకింకా గురుస్థానమివ్వాలీ, జ్ఞానం పంచి పెట్టాలి అని ఆమె అనుకుంది. కాని మాటల సందర్భం అయిపోయే సమయానికి, ఆ గురువు గారే అమ్మని గురువుగా స్వీకరించింది. అంటే, అమ్మకి ఈ లోకంలోకి వచ్చి తెలుసుకోవల్సింది లేదు, తెలియ చెప్పవలసింది మాత్రం చాలా ఉంది. అమ్మ సంపూర్ణంగా, తన 62 సంవత్సరాల భూలోక సంచారంలో చెప్పనిది లేదు. అది మానవత్వ స్థాయిలోనూ ఉంది, శాస్త్ర స్థాయిలోనూ ఉంది, అతి పరిమితమైన స్థాయిలో ఉంది, చాలా ఉంది. చాలా మర్మంగా ఉంది, శాస్త్రంలో నించి వచ్చిన అనేక పార్శ్వాలను తడిమి, తడిమి, ఏకవాక్యంలో అద్భుతమైన బోధ చేసింది. అమ్మ చేసిన బోధ, నిజానికి అసలు బోధ. మనస్సు అటూ, ఇటూ వెళ్ళకుండా, కదలకుండా, అచలమైన, మహాస్థితిలో నిలబెట్టి, ప్రాపంచికమైన స్థాయి నించి, పారమార్థిక స్థాయికి, జీవుల్ని తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేసింది. నిజమే. ఎవరికి చేసింది. ఎట్లా చేసింది? అంటే, ఇవాళ, సమకాలీన ప్రపంచాన్ని కూడా మనం గమనించినట్లయితే, ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళాలంటే, ఆయనకి సన్నిహితు లైన వాళ్ళు చెప్తే మనకి గురుదర్శనం అవుతుంది. లేకపోతే కాదు. అమ్మ 24 గంటలూ, ఒక మంచం మీద కూర్చొని, సమస్త ప్రపంచానికి తన జీవితాన్ని, పరచి, తెరచి ఉంచింది. ఎవరైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఏదైనా అడగచ్చు, ఏమైనా పొందచ్చు, వీటన్నింటికీ ఆమె తన్ను తాను ఓపెన్ చేసుకుంది. ఎవరు? ఒక గృహిణి! ఆమెకు కొన్ని పరిమితు లుంటాయి. అయినా అన్నింటినీ దాటింది. సంప్రదాయ విరుద్ధం చెయ్యలేదు. సంప్రదాయంలో దాగిన ఒక యదార్థ స్థితిని బట్ట బయలు చేసింది. సంప్రదాయ మంటే మడికట్టు కోవడం, శుచిగా ఉండటం, ఎవర్నీ దగ్గరకు రానివ్వకపోవడం ఇది కాదు. “నాన్నా! సంప్రదాయ మంటే, మహర్షులు, మహాత్ములు, మేధావులు, ఒక తరం నించి మనకందించిన విజ్ఞాన సంపదని, మానవీయం చేయ్. ఇంకా కులము, మతము, అనే భావనలతోనే ఉన్నట్లయితే ఈ జాతి పురోగమించేది ఎట్లా?” అనే భావనలో ఆమె తన ఒడిని ఆశ్రయం చేసింది. ఆ ఒళ్ళో ఎవరైనా సేద తీరవచ్చు. అది మాతృస్పర్శ, లాలన. మిగతా వాళ్ళంతా సేవ చేయించారు. ఆమె సేవ చేసింది. ఒక అజ్ఞాని, ఏ రకమైన సంస్కారం లేనివాడు. అమ్మ ఒళ్ళోకొచ్చి పడుకోవచ్చు. అలాగే చాలా చక్కగా తయారై వచ్చిన ఏ వ్యక్తినైతే ఎట్లా చూసిందో, ముష్టివాళ్ళని కూడా అలాగే చూసింది.
అమ్మ మనకి చూపిన మార్గంలో మొట్టమొదటిదేమిటంటే, నీవు బయట కనిపిస్తున్న భౌతిక స్థాయిని బట్టి ఎవర్నీ నిర్ణయించకు. అవధూత లుంటారు. వాళ్ళు మనలాగా ఉండరు. వాళ్ళు ఎలా ఉండాలనుకుంటారో అలా ఉంటారు.
అమందానందము విమలధామమై
వర్తమానవర్తిత అవ్యధాకారకమై
ధూమ, కామరహిత ధ్యాన
ధారణాతీతచారణమై
తమోరహిత తపో తత్త్వతారకమై
నిలచునీ జగతి అవధూత !
నిర్మల, నిశ్చల సచ్చరిత !!
ఈ ప్రపంచంలోకి నిశ్చలులై, నిర్మలులై ఒక అద్భుతమైన జీవితాన్ని గడుపుతారు అవధూతలు. అంటే ఏమీ పట్టని వారు అని అర్థం. ఏమీ పట్టించుకోనివారు అని అర్థం. దేనినీ అంటించుకోరు. దేనికీ అంటి ఉండరు. అటువంటి ఆ స్థాయిని అమ్మ సాధించి, అంటే అమ్మ వచ్చిందే అట్లా వచ్చింది, దాన్ని డిమోన్ట్ చేసింది.
తర్వాత, అమ్మ దగ్గరకు వచ్చిన వాళ్ళు చెయ్యవలసిన మొట్టమొదటి పని ఏమిటంటే అన్నం తినాలి. అన్నం తిని, తర్వాత వచ్చి మాట్లాడమనేది మరి ఆ రోజుల్లో అంటే సుమారు ఒక 60 ఏళ్ళ క్రితం, చరిత్రను వెనక్కి తిరిగి చూస్తే, రోజుకి 10 నుంచి 15 వేల మంది అమ్మ దగ్గరికి వచ్చేవాళ్ళు ఆ కుగ్రామానికి. అందరికీ అన్న దొరికేది. ‘అమ్మా, అన్నం పెడుతున్నావు, ఎంత మందికో నీవు సేవ చేస్తున్నావు అంటే, ఆమె ఎంత నిరాడంబరంగా, నిర్మమంగా ఒక మాట అన్నదంటే, “నేనేం పెడుతున్నాను నాన్నా, ఎవరి ముద్ద వారు తిని వెడుతున్నారు” అని. చూశారా, ఇవాళ రూ.5/- చందాకి ప్రపంచంలో పాపులారిటీ కోసం, ప్రచారం కోసం పాకులాడే అధమ స్థాయిలోకి నెమ్మదిగా జాతి దిగజారిపోతున్న వేళలివి. అమ్మవంటి వారినుండి స్ఫూర్తి పొందటానికి వాళ్ళు ఎలా జీవించారో తెలుసుకుంటే చాలు. మనం అమ్మలం కాలేము. కాని అమ్మ వలే జీవించడానికి ప్రయత్నం చేయచ్చు.
ఇంతకీ, ఇంత మందిని గురించి మనం చెప్తూ ఉన్నప్పుడు ఈ మార్గాలన్నీ ప్రత్యేకమైన మార్గాలా, ఎవరి మార్గం వారిదా అంటే, వైరుధ్యం లేదు, వైవిధ్యంగా ఉన్నాయి. ఒకదాని కొకటి విరుద్ధం కాదు, ఘర్షణ లేదు. వైవిధ్య సుందరంగా ఉన్నాయి. నువ్వు ఏ మార్గంలో వెళ్ళినా గమ్యం ఒకటే. ఈ గమ్యం అనేది ఎంత దూరంలో ఉంటుంది అని ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే, నా అనుభవంలో, నా అధ్యయనంలో, దర్శనంలో గమ్యం దూరంగా ఉండదు. గమ్యం మనకు ఒక మిల్లీమీటరు దూరంలో ఉంటుంది. దాన్ని పట్టుకునే ఒడుపు తెలియాలి. గమ్యం ఎక్కడో కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉండదు. గమ్యం మన ముందున్నది. లక్ష్యం మనయందున్నది. మన యందున్న లక్ష్యాన్ని ఆధారం చేసుకుని మన గమ్యాన్ని మనం వెంట వెంటనే పట్టుకుంటూ వెళ్ళాలి. అమ్మ, ఆ గమ్యాన్ని మన జీవన గమనంగా మార్చింది. ఇది, ఒకటైతే, ఆశ్రమాలు, వాళ్ళ వాళ్ళ పేరు మీద ఉంటున్నాయి. ఫలానావారి ఆశ్రమం అని! ఈ ప్రపంచంలో, ఏ రకమైన అటాచ్మెంట్ లేకుండా ఉన్న ఆశ్రమాలు నా దృష్టిలో రెండున్నాయి.
సర్వ ప్రపంచానికి చెందిన ప్రశాంతి నిలయం ఒకటైతే, ఒక కరణంగారి భార్య, ఒక అనసూయ, జిల్లెళ్ళమూడి అమ్మై, తాను ఉండగానే తన ఇంటిని “అందరిల్లు”గా ప్రకటించింది. ఆమె తాను ఉంటున్న ఇంటిని తన బిడ్డలకివ్వలేదు. ‘అందరిల్లు’ అన్నది. మీరు, నేను, ఎవరైనా ఉండవచ్చు, ఎవడైనా అన్నం తినవచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఇది మనం ఊహించలేని ఒక విషయం. కలిగిన ప్రతివాడూ, అంటే డబ్బున్న ప్రతివాడూ, నలిగిన వాణ్ణి కాచుకోవాలి అని చెప్పింది. ఇది చాలా ప్రధానం. అన్నవితరణ ఎందుకు ప్రారంభించింది? ఇవేళ, అన్నదానం చేయని సంస్థే లేదు. ప్రతి సంస్థ, సుమారు 40 నుంచి 50 పర్సంటు వారికొచ్చే ఆదాయంలో అన్న వితరణకి ఖర్చు పెడుతున్నారు. ఇవ్వాళ, ఆ లోటు ఏమీ లేదు. ప్రతి వాళ్ళు చేస్తున్నారు. దీనికి శ్రీకారం చుట్టినది ఎవరు అంటే, జిల్లెళ్ళమూడి అమ్మ. ఆ అన్న వితరణ ఏదో మామూలుగా ఉండదు. పరమాద్భుతంగా ఉంటుంది. ఆమె ఏమంటుందంటే ఆకలిగొన్న వాడికి వేదాంతం చెప్పవద్దు. గతించిన కాల వైభవాన్ని వాడిముందు చెప్పకండి. ముందు, వాడి ఆకలి తీరి కడుపు నిండిన తర్వాత వాడి మనసు నింపండి, మంచి మాటలతో! అప్పుడు ఈ మాటలు ఇంకుతాయ్. ఎక్కుతాయ్. అంతే తప్ప, ఆకలిగా ఉన్నా సరే నేను చెప్పే ఉపన్యాసం విను అంటే మనం వింటూ, శోష వచ్చి పడిపోతాం. వచ్చేది ఏమీ ఉండదు. అర్థమయ్యేది కూడా ఏమీ ఉండదు.
(శ్రీ వి.యస్.ఆర్.మూర్తి గారి గ్రంథం అంఆ తత్త్వదర్శనమ్ నుండి గ్రహించబడినది.)