నిండు విగ్రహం, గంభీర కంఠధ్వని, ఆశు కవితాధార, నిరంకుశ సభాసంచాలన, ధిషణ, సంప్రదాయ వక్తృత్వ ధోరణి… పైకి కనిపించే మూర్తిమత్వం శ్రీ పి.యస్. ఆర్!
అమ్మయెడ అంతులేని భక్తి, గౌరవం, ఆరాధన త్రివేణిగా ప్రవహించే కవితాతపస్సు, శ్రీ విశ్వజననీ పరిషత్ పట్ల నిబద్ధత, విశ్వాసం లోపల వెలుపల ఒకే రీతి సాగే ఉఛ్వాస, నిశ్వాసలు!
అంతరంగం నవ్యనవనీతం.. అగ్గిరవ్వలు వెదజల్లే బహిరంగం… నిష్కర్ష నిశ్చిత భావప్రకటన జమిలిగా సాగే వైఖరి… ఇవన్నీ పి.యస్. ఆర్. బహుపార్శ్వాలు. జీవితం సృష్టించిన అఘాతాలను, ఆటుపోట్లను, సవాళ్ళను ఎదుర్కొంటూ జీవనం సాగించిన యదార్థవాది. విద్యాపరిషత్ పరంగా ఆయనది కర్మనిష్ఠ! 14 సంవత్సరాల నా పరిచయం, అనుబంధం ప్రత్యేకం.
వయస్సు రీత్యా ఉన్న ఎడం చాలా పెద్దది. అయినా, అడపాదడపా ఆయనపై నేను సంధించిన చమత్కార తూణీరాలు ఆయనను గులాబి రేకలై తాకేవి. మనోల్లాస పులకిత పుంఖితమై శోభిల్లేవి. వైవిధ్య భావప్రకటనలే తప్ప, వైరుధ్యం లేని చర్చలు. ఏకాభిప్రాయమో, ఆమోదప్రమోదమో తప్ప ఏనాడూ అవి కలహాన్ని ఆహ్వానించలేదు.
భార్యా వియోగంతో వైక్లబ్యానికిలోనై సభలకు దూరంగా ఉంటున్న సందర్భంలో నేను గుంటూరులో ఉండటం జరిగింది. పరామర్శకై ఆయనను కలిసినప్పుడు “మీరు నైరాశ్యంలో కూరుకుపోరాదు, ఊరకే కాలాన్ని చెల్లగొట్టకూడదు. ఈరోజు సాయంత్రం రామసాయీ మందిరంలో సభ ఉన్నది. మీరు సభా నిర్వహణ చేయండి” అంటుండగానే ‘ఇది అమ్మ ఆజ్ఞ! శిరసావహిస్తాను’ అంటూ నాటి సభా సంచాలన నిర్వహణ సమర్థంగా నిర్వహించారు.
మొన్నటికి మొన్న కళాశాల స్వర్ణోత్సవాల సందర్భంగా కలుసుకున్నప్పుడు ‘మీలో అలసట, తొట్రుపాటు కనిపిస్తున్నయి. ఎక్కువ శ్రమ పడకండి…’ అన్నప్పుడు ‘నాకు అక్కర లేనంత పెన్షన్ వస్తున్నది. వసుంధర అక్కయ్యకు కనకాభిషేకం చేయాలని గాఢంగా ఉన్నది. మీరు వీలు చేసుకుని రండి. ఇంకోమాట! మార్చి నెల దాటి ఉండనని ఒక మిత్రుడు చెప్పాడు. నమ్ముతున్నాను. నిర్భయంగా ఉన్నాను.’ అన్నారు దృఢంగా!
జ్యోతిష్యం నిజమైన మరొక సందర్భం, పి.యస్. ఆర్. నిష్క్రమణ. అమ్మ హృదయాస్థానంలో వెలుగుతున్న కవితాదిత్యుడు పి.యస్.ఆర్. అమ్మ శత జయంతి ఉత్సవాలలో పి.యస్.ఆర్. లేని లోటు గాఢమైనది. పూడ్చలేనిది.
శ్రీ లీలా మయ మందహాస సుషమారేఖా విలాసమ్ములో
కైలాసంబగు నర్కమండలి కళాకళ్యాణముల్ దీర్చి కే
శ్రీ లావణ్యవిహారులై వెలయు సుశ్రీమాతయున్ నాన్న ది
వ్యాలోకమ్ముల లోక సంతతికి నిత్యంబిచ్చు సన్మంగళమ్.
– శ్రీ పి.యస్.ఆర్