అమ్మ అనేక సందర్భాలలో చెప్పింది. “మిమ్ముల నందరిని నేనే కని మీమీ తల్లులకు పెంపుడిచ్చాను” అని. అమ్మ మరో సందర్భంలో చెప్పింది “మీరందరూ నా ఒడిలోనే ఉన్నారు ఈ ఒడిదాటి ఎవరూ లేరు” అని ఇంకో సందర్భంలో అమ్మ చెప్పింది “ఈ ఒడిలో అందరికి రక్షణే. శిక్షలు ఇక్కడ లేవు” అని. అందుకే అమ్మ అవ్యాజానురాగమూర్తి సోదరుడు శ్రీ లక్కరాజు లాలా చెప్పిన ఒక సంఘటన దీనికి ఎలా సాక్ష్యంగా నిలుస్తుందో చూద్దాం. లాలా గురించి జిల్లెళ్ళమూడిలో అందరికి తెలుసు. ‘అమ్మ’ సువర్ణయుగంలో అమ్మ ఒడిలో అనేక పిల్లిమొగ్గలు వేసిన అదృష్టశాలి. అమ్మ గారాలపట్టీలలో ఒకడు. రామకృష్ణ అన్నయ్య అమ్మకు ఉపకరణం అయితే ఆ అమ్మసేవలో రామకృష్ణ అన్నయ్యకు ఊతంగా నిలబడ్డ “ఊతకర్ర” లాలా. అందరికి ఆత్మీయుడై అందరింట సంచరించిన వ్యక్తి లాలా ఎక్కడ ఉంటే అక్కడ ఉత్సాహంపరవళ్ళు తొక్కుతుంది. బాధలు – బాధ్యతలు, దిగుళ్ళు – వేదనలు దరిచేరటానికి భయపడి పారిపోతాయి. అలా అని లాలా బాధ్యతలేని వ్యక్తికాదు. లాలాకు ఏ బాధ్యత అప్పగించినా అప్పగించిన వారికి నిశ్చింతే. అంతటి కార్యశీలి. ఆ ‘లాలా’ తల్లి శ్రీమతి లక్కరాజు సీతమ్మగారు. అమ్మ అవ్యాజానురాగాన్ని సంపూర్ణంగా పొందిన భాగ్యశాలి. శ్రీ లక్కరాజు హనుమంత రావుగారితో జీవితాన్ని పంచుకుని, పండించుకుని నిండుజీవితాన్ని ఆస్వాదించిన మహాఇల్లాలు. సంపూర్ణ జీవితాన్ని అనుభవించిన అనంతరం కొంత మనః స్థిమితం కోల్పోయింది. భర్తకు కూడా దూరం అయింది.
అది 2000 సంవత్సరము. సీతమ్మగారు లాల దగ్గర బందరులో ఉంటున్నది. ఒకసారి బందరు తీసికొని వెళ్తున్నపుడు సీతమ్మగారు విజయవాడ రైల్వేస్టేషన్లో తప్పిపోయింది. విషయం అయిదుగురు కొడుకులకు తెలిసింది. అందరూ విజయవాడ చేరి తలో దిక్కువెళ్ళి వెతకటం ప్రారంభించారు. తెనాలి స్టేషన్లో విచారిస్తుండగా అక్కడ ఒక షాపు యజమాని తను కొంత మానసిక స్థిమితం లేని ఒక స్త్రీని చూశాను అని చెప్పాడు. ఆమె బాగా ఉన్నవారిలాగానే కనిపించిందని, తనకు బాగా ఆకలిగా ఉన్నదని ఏమైనా తినటానికి పెట్టమని జాలిగా అడిగిందని, తను డబ్బులు ఇవ్వమన్నానని, ఆమె తన దగ్గర డబ్బులు లేవన్నది అని, తాను ఏదో తినటానికి ఇచ్చాను అని ఇలా ఎన్నో విషయాలు చెప్పాడు. ఒక మాజీ సైనికుడిగా పార్థు ఈ పౌర సమాజ సామాజిక బాధ్యతారాహిత్యాన్ని ఈసడించుకున్నాడు. మరలా విజయవాడ చేరారు. విజయవాడ మొత్తం గాలించారు. చాలా చోట్ల ఆరాలు తెలిసినాయి. రాజమండ్రిలో చూశామన్నారు కొందరు. ఆశగా చేరారు. కాని నిరాశే ఎదురయింది. రెండు రోజులైనా సీతమ్మగారి ఆచూకి కనిపెట్టలేకపోయినారు. ఏమి చేయాలో పాలుపోక నిశ్చేష్టులైనారు.
బరువెక్కిన హృదయంతో పార్థు హైద్రాబాదు ఆల్వార్ లోని తన ఇంటికి ఫోన్ చేశాడు. అంతే సంభ్రమాశ్చర్యాలలో మునిగితేలాడు. తల్లి ఆల్వాల్లో తన ఇంటికి క్షేమంగా చేరింది అన్నవార్త తన శ్రవణేంద్రియాలకు అమృతప్రాయమైంది. వెంటనే బయలుదేరి అన్నదమ్ము లందరు ఆల్వాల్ చేరారు. జరిగిన విషయం అక్కడి వారు చెప్పారు. ఈ రోజు ఉదయం పార్థు స్నేహితుడు ఒకరు అటుగా వెళ్తూ అల్వాల్లో ఒక అరుగు మీద సీతమ్మ గారిని చూశాడట. అతను సీతమ్మగారి దగ్గరకు వెళ్ళి “అమ్మగారు ఇంటికి వెళదాం పదండి” అన్నాడట. సీతమ్మగారు అందుకు అంగీకరించలేదట. తనను ‘జిల్లెళ్ళమూడి అమ్మ’ అక్కడ కూర్చోమన్నదని, పార్థు వచ్చేవరకు ఎక్కడకు వెళ్ళవద్దన్నదని అన్నదట. అతనికి సీతమ్మగారి మానసిక పరిస్థితి మీద అవగాహన కలిగి ఉండటంతో సీతమ్మగారికి నచ్చ చెప్పటానికి ప్రయత్నించాడు” అమ్మగారు. పార్థుగారు మిమ్ములను తీసికొని రమ్మనమని నన్ను పంపించారు”. అని చెప్పాడట. సీతమ్మగారు వెంటనే అతనిని అనుసరించింది. ఇంట్లో అందరి ఆనందానికి అవధులు లేవు. అమ్మ కరుణకు చేతులెత్తి నమస్కరించారు. అమ్మ రక్షించే విధానానికి అచ్చెరువొందారు. అమ్మ అవ్యాజాను రాగానికి మంత్రముగ్ధులైనారు. ఈ విషయాన్ని వివరిస్తూ ‘లాల’ అమ్మకు చేతులెత్తి నమస్కరించారు.
ఈ సందర్భంలో దీనికి పూర్వరంగంగా ఒక ఘట్టం నా స్మృతిపథంలో కదిలింది. రామకృష్ణ అన్నయ్య వ్రాసిన ఒక సంపాదకీయం నామనస్సులో మెదిలింది.
1972 సెప్టెంబరు 29వ తేదీన రాత్రి సోదరి శ్రీమతి సక్కుబాయి అమ్మను తమ కారులో ప్రయాణం చేయమని అర్థించింది. అమ్మ అంగీకరించింది. చిరంజీవులు లాలు, పార్థులను కూడా అమ్మ తన వెంట రమ్మన్నది.
ప్రయాణం ఎక్కడకో ? ఎందుకో ! మాకెవరికి తెలియదు. బాపట్ల చేరిన తర్వాత చిరంజీవి రవిని కూడా రమ్మన్నది.
కారు అక్కడ నుండి ఎటువెళ్ళాలని ప్రశ్న వచ్చింది. అమ్మ తటస్థంగానే కూర్చొన్నది. కారు రేపల్లె దారికి మళ్ళింది. గగనతలం మేఘావృతమై చల్లనిగాలివీస్తూ “ప్రయాణం సమ్మోహనకరంగా ఉన్నది. అమ్మ కబుర్లు చెబుతుంటే మాలో ఎవరికీ కాలమూ దూరమూ గమనంలో లేవు.
భట్టిప్రోలు వచ్చింది. ఇక లాల, పార్థుల సంతోషానికి హద్దులు లేవు. కారణం అది వాళ్ళ జన్మస్థలం. అమ్మ వారి గ్రామానికి వచ్చింది. నిత్యమూ, ఎందరో సంపన్నులూ లబ్ధప్రతిష్ఠలూ, ఉన్నతోద్యోగులూ వచ్చి వారి పట్టణాలను అమ్మ పాదరజస్సుతో పావనం చెయ్యమనీ, వారి గృహాలను అమ్మ ఆగమనంతో జ్యోతిర్మయం చేయమనీ ప్రాధేయపడుతుంటే ఎక్కడకూ కాలుకదపటానికి యిష్టపడని అమ్మ ఆనాడు అయాచితంగా తమ గ్రామం వచ్చింది. అది ఎవరిని ఆనందంతో పులక లెత్తించదు ? ఎవరిని పారవశ్యంలో ముంచెత్తదు ? అయినా వారు అమ్మను “మా యింటికిరా అమ్మా!” అని ఆహ్వానించలేకపోయారు.
కాని అర్థించకుండానే వారింటికి కారును పోనివ్వమంది అమ్మ. క్షణాలలో కారు వారింటి ముందు కొబ్బరి చెట్ల నీడల చీకట్లో ఆగింది. వారిద్దరు సోదరులూ, ఒక్క గంతులో యింటిలోకి దూకారు. నిద్రిస్తున్న తల్లిదండ్రులను లేపారు.
వారు హఠాత్తుగా మేల్కొన్నారు. వారు విన్నది నిజమో కలయో అర్థం కాలేదు. కాని క్షణాలలోనే అమ్మ వారి ఎదుటికి వచ్చి నిలుచున్నది. పూర్ణకుంభాలూ లేవు సరికదా, గృహస్తులు ఎదురు వెళ్ళి కాళ్ళు కడిగి అయినా ఆహ్వానించటానికి వ్యవధి నివ్వకుండా అమ్మ సరాసరి లోపలికి వచ్చింది. విశ్వ సమ్మోహనమయిన ప్రశాంత సుందరరూపం ! కనులలో వాత్సల్యపు చల్లదనం.
ఆ గృహిణి అమ్మ పాదద్వయాన్ని తన రెండు చేతులా బంధించి ఉన్మాదినిలా కేకలు వేస్తూ “అమ్మా ! యీ దీనురాలిపై దయ ఉన్నదని నిరూపించటానికి వచ్చావా? ఇవ్వాళ సాయంకాలం నుండీ ఎంతగానో బాధపడుతున్నాను. అమ్మకు నాపై దయతప్పిందని, అదికాదని చెప్పటానికి నీవే స్వయంగా వచ్చావా ? ఎంత కరుణామయివి అమ్మా!” అంటుంటే అక్షరాలు కన్నీటిలో కరిగిపోయాయి.
కొద్ది క్షణాలు కూర్చుని అమ్మ లేచి యింటిలోకి వెళ్ళింది. ఇల్లు నాలుగు మూలలా చూచింది. వంట యింట్లోకి వెళ్ళింది. అక్కడ పచ్చడి జాడీలు మూతలు తీసి వాటిని రుచి చూచింది. ఆ గృహిణి అమ్మకు ఏమి నివేదించాలో తెలియక అయోమయంగా అమ్మ వెంట క్రొత్త యింట్లో తిరిగినట్లు తిరుగుతున్నది. అమ్మ ఆ గదిలో ఒక మూలకు వెళ్ళి అక్కడ గిన్నె అడుగున మిగిలిన అన్నం తీసుకుని ఒకగిన్నెలోని మెంతి మజ్జిగ తీసుకుని రెంటినీ కలుపుకుని ఆకలిగొన్న దానివలె తింటుంటే ఆ గృహిణి గుండె పగిలేటట్లుగా దుఃఖించింది. అమ్మ ఆ మజ్జిగన్నం తన వెంట వచ్చిన మా అందరికీ, తదితరులకూ ప్రసాదించింది.
“పేదలపైన నీ అపారమయిన ప్రేమను పుస్తకాల్లో చదవి విస్తుపోతున్న మాకు ప్రత్యక్షం చేస్తున్నావా అమ్మా! అని ఆ గృహిణి గద్గద కంఠంతో విలపిస్తూ అమ్మకు నమస్కరించుకున్నది.
ఆ అదృష్టవతియైన గృహిణి శ్రీమతి లక్కరాజు సీతమ్మ. అక్కడ నుండి బయలుదేరాము. అక్కడకు రెండు మైళ్ళ దూరంలో ఉన్న పెదపులివర్రు పోదామన్నది అమ్మ. అక్కడ ఎంతో అనారోగ్యంతో బాధపడ్తున్న సోదరి జానకిని తన వాత్సల్యవారాశిలో ముంచెత్తి ఆశీర్వదించింది అమ్మ.
ఇంటికి తిరిగి రాగానే అమ్మను అడిగాను “అమ్మా! పిలువకుండానే వాళ్ళ యిళ్ళకు వెళ్ళావేమమ్మా !’ అని.
“వాళ్ళ రమ్మని పిలిచేదేమున్నది ? వాళ్ళ బాధే నన్ను పిలిచింది. బాధకంటే వేరే పిలుపేమున్నది?” అన్నది. అమ్మ అవ్యాజానురాగమూర్తి.
ఈ రోజు ఈ రక్షణ కోసమే ఆనాడు అమ్మ సీతమ్మగారిని అలా అనుగ్రహించిందా? ఏమో ఆనాడు ద్రౌపది పరివారాన్ని దూర్వాసుడి ఆగ్రహజ్వాలల నుంచి రక్షించటానికి పరమాత్మ స్వయంగా అరుదెంచి ద్రౌపది అక్షయపాత్రలో మెతుకు సృష్టించి తాను తిని తద్వారా దుర్వాసుడికి అతని శిష్యబృందానికి క్షుద్బాధను తీర్చిన ఘట్టం ఉన్నది కదా ! భగవంతుడి రక్షణ వ్యూహం మనకు అంతుబట్టని రహస్యం.