యం జగన్నాథం,
మాతృశ్రీ ఓరియంటల్ కాలేజి పూర్వ విద్యార్థి
“అర్థం తెలియని మహావాక్యం కూడా మన వాక్యమే” అంటారు ‘అమ్మ’. అట్టి మహావాక్యాలలో “అహం బ్రహ్మాస్మి” అన్న వాక్యానికి ‘అమ్మ’ రైలులో కలసిన తాతగారితో జరిపిన సంభాషణా సారాంశము:
‘బాలవాక్యం బ్రహ్మవాక్యం’ అన్నారు పెద్దలు. బాలవాక్యం బ్రహ్మవాక్యం అంటే ‘భ్రాంతిలేని వాక్యమే బ్రహ్మవాక్యం’ ‘భ్రాంతి లేనివాడు బ్రహ్మ’ అంటున్నారు.
అందరినీ రక్షించేవాడు ఒక్కడే. ఆపదలను కలిగించేది, ఆపదల నుండి రక్షించేది ఒక్కడే. మనిషికి దెబ్బతగిలించినవాడు, పోయినాడని భ్రమ కలిగించేవాడు తిరిగి లేవదీసేవాడు ఒక్కడే. ఆ ఒక్కడే ‘పరబ్రహ్మ’.
బ్రహ్మతత్వం అనగా అహం అంటే నేను, బ్రహ్మను నేను అంటే బ్రహ్మ అయిన నేను. నేనుగానే ఉన్న నేను. అహం బ్రహ్మాస్మి. నేను నీవుగా ఉన్న నేను. అహంకార బ్రహ్మ. నేను నీవుగా ఉన్న నేను అంటే రెండుగా ఉన్న స్థితి అహంకార బ్రహ్మ. ఇక్కడా బ్రహ్మ తత్వం పోలేదు. నేను నేనుగానే ఉన్న నేను అనే స్థితి అహం బ్రహ్మాస్మి.
‘భ్రాంతి లేనిదే బ్రహ్మ’ కాని లోకంలో అందరు భ్రాంతి పోవాలని చెప్పే వారే కాని “భ్రాంతి లేనివాడు బ్రహ్మ’ అని చెప్పలేదు. మరి భ్రాంతి దేనితో పోతుంది. సమయం వచ్చినపుడు భ్రాంతి భ్రాంతి చేతనే పోతుంది. వజ్రం వజ్రంతోనే కోయబడినట్లుగా.
‘రజ్జు సర్ప భ్రాంతి’ అంటే తాడును చూచి పామనుకోవడం అని లోకోక్తి కాని ‘అమ్మ’ మాటలలో పామును చూచి తాడు అనుకోవడం కూడా భ్రమ అనేది రెండు వైపులా కలిగించ వచ్చు కదా? లోకంలో చాలా మంది గురువులు ఇలా చెబుతారు. “ఈ ప్రపంచం అనేది ఒక విధమయినది అయితేమనం వేరొక విధంగా చూస్తున్నాము” అని. ఇది ఎప్పుడూ ఉండేవికావట; లేనిదట, లేనిదానిని ఉన్నదను కోవటం. స్వప్నం మాదిరి. చీకట్లో తాడుందనుకోండి దాని మెలికలు చూసిపాము అని భ్రమపడటం. చీకటిభ్రమలాంటిది. దీపం తీస్తే చీకటి పోతుంది. జ్ఞానం దీపం లాంటిది అని అమ్మ వివరణ. ఇంకా ‘భ్రమ అనేది తాడు, పాము రెండూ తెలిసిన వాడికేగా కలుగుతుంది. అచ్చంగా తాడు తెలిసినాలేదు. అచ్చంగా పాముతెలిసినాలేదు. పసిపిల్ల వానిముందుకు పాము వచ్చిందనుకోండి వాడు పామును పట్టుకొని ఆడుకుంటాడు. వాడే తాడు పట్టుకొని ఆడుకుంటాడు. ఏమీ తెలియని వాడనుకుందామా? వస్తువు కనబడితే చేత్తో పట్టుకోవడం తెలుసు. అది ఎటు పోతుంటే అటు పారాడటం తెలుసు. కరుస్తుంది. అపాయం అని మాత్రం తెలియదు. అప్పుడు వాడికి తెలివి ఉన్నట్లా? లేనట్లా? పెద్దవారిలో కూడా కొన్ని జంతువుల ఉపయోగము వాటి లక్షణ స్వభావముల గురించి తెలియని వారున్నారు. వారికిభయం కాని భ్రాంతి కాని లేదు. తెలియని తనంతో అంటే జ్ఞానము లేని (లేదా కలగని) పిల్లవాడు పామును చూచి తాడనుకొన్నట్లు మన మధ్య మహాత్ములు సంచరిస్తున్నా, మనము వారిని సామాన్యావసరాలను కోరుకుంటున్నాము. జీవన క్రీడలో ఏది తాడో, ఏది పామో తెలుసుకుని సంచరించగలిగితే మనముకూడా
“భ్రాంతి అంటే మమకారం”
భ్రమ అంటే ఊహించడం. అది ఎట్లా అంటే తాడును చూచి పామను కోవడం అంటారే అది భ్రమయేగా! భ్రమ అంటే ఊహించటమా! లేక మాయ అని అర్థం కూడా వస్తుందా! తాడునందు పామును ఆరోపించినట్లుగా జగత్తు సత్యమను కొంటున్నారు. ‘బ్రహ్మయే సత్యం కాని జగత్తు మిధ్య” అను వాక్యాన్ని ఆధారం చేసికొని అంటున్నారు. రెంటికి ఒకదానికొకటి సంబంధమున్నదల్లా అవినాభావ సంబంధం అంటారు.
పైన చెప్పిన రజ్జువును సర్పంగా చూచించి నా భావం. భయపడ్డది నా భావం. దీపం తెచ్చింది నా భావం. కాదనుకొన్నది నా భావం. నా భావం సర్వం నా భావం. అంటే అంతా ఆ భావంలోనిదే. ఆ భావమే భావానికాధారమైనది. భావాభావ సహితమే. ఈ ప్రభావమంతా దీనికి రహితం లేదు అంతా సహితమే అందుకే ‘అవినాభావ సంబంధం’ అంటే అని నా బావసంబంధం ‘అవి’ అంటే కనబడేవి. నా భావం అంటే కనబడే వాటిని ఊహించేది. ఊహ బట్టి సంబంధం. ఏదయినా తాను చూచేదాన్ని బట్టి కనబడుతుంది. ఈ భావమేదయితే ఉన్నదో అదే బ్రహ్మ కావున నేనే బ్రహ్మ. ‘అహం బ్రహ్మాస్మి’.
(జీవిత మహోదధిలో తరంగాల నుండి)