1. Home
  2. Articles
  3. Mother of All
  4. ఆంగ్లభాషపై అమ్మకు అవగాహన

ఆంగ్లభాషపై అమ్మకు అవగాహన

A V R Subramanyam
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 9
Month : April
Issue Number : 2
Year : 2010

‘చదువు సంధ్యలు లేని తల్లి

 చదువు సంధ్యలు చెప్పు తల్లి’

– అని గానం చేస్తూ శ్రీరాజుబావగారు ఒక అలౌకిక సత్యాన్ని ఆవిష్కరించారు. ఇక్కడ మొదటి పంక్తిలో ‘చదువు సంధ్యలు’ అంటే లౌకిక విద్య పదార్థం వైపు పరుగులు తీయించే విద్య, పొట్టకూటికోసం సముపార్జించే విద్య, ఎండమావులను చూపి భ్రమింప చేసే విద్య.

రెండవ పంక్తిలో ‘చదువు సంధ్యలు’ అంటే మానవుని, మాధవునిగ ఉద్ధరించే విద్య, సత్య సందర్శనం చేయించి, తరింపచేసే విద్య, పరమార్థాన్ని బోధించి అమృతత్వాన్ని అనుగ్రహించే వేదవిద్య అని అర్థం.

మనం చదువుకునే ఆంగ్లం, గణితం, సైన్సు… అమ్మ చదువుకోలేదు. ఆ మాటకు వస్తే అక్షరరూపిణి అమ్మకు అక్షరాభ్యాసమే కాలేదు. అమ్మకు గురువు స్వీయ అనుభవమే. అనుభవసారమే శాస్త్రము; శాస్త్రరూపమే అమ్మ. కనుకనే అమ్మ జ్ఞానస్వరూపిణి. అమ్మ వద్ద ఏ విషయాన్ని ప్రస్తావించినా అమ్మకు అన్నీ తెలిసే ఉంటాయి. సర్వం తానైన తల్లి. ఒక సందర్భంలో అమ్మ అన్నది “నువ్వు ఎంత లోతుకు తీసుకువెడితే, నేను అంతదూరం వస్తా” అని. కానీ మనదగ్గర ఆ దమ్ము లేదు. మనుషులు మాటల వరకే పరిమితం; అమ్మ మహత్తత్త్వ స్వరూపం. అందుకు ఉదాహరణగా నా అనుభవాల నేపథ్యంలో ‘ఆంగ్లభాష పై అమ్మకు గల అవగాహన’ను నా శక్తి మేర వివరిస్తాను.

1970లో నేను తొలిసారిగా జిల్లెళ్ళమూడి వచ్చాను. నాటి సాయంకాలం ఆరుబయట చిన్న మంచం మీద అమ్మ ఆసీన అయింది. సో॥ కోన సత్యనారాయణ మూర్తి (హోమియో డాక్టర్ సత్యం అన్నయ్య) తో చర్చిస్తోంది. ‘నక్స్’ వేసుకోమని అన్నయ్య చెపుతూంటే, ‘పల్సటిల్లా’ వేస్తే మంచిదేమో అని అమ్మ సలహా ఇచ్చింది. అపుడు మా సంభాషణ ఇలా సాగింది.

నేను : అమ్మ! నువ్వు డాక్టర్కి సలహా ఇస్తావేమిటి? కనుకనే An old patient is better than a young doctor- అని అన్నారు.

అమ్మ: old patient అంటే ఏమిటి నాన్నా? patient old అనా? రోగం old. అనా? రోగం old అయితే Chronic అని అంటారు కదా?

నా దగ్గర సమాధానం లేదు. అమ్మ చెప్పింది నిజం. అది ఒక సందిగ్ధ వాక్యం. Old అనే Adjective రోగానికి వర్తిస్తుంది కానీ patientకి కాదు. అక్కడ రోగి వృద్ధుడు అనే అర్థం సరిపోదు. దీర్ఘకాల రోగపీడితుడు (Chronic disease) అంటే సరిపోతుంది. Prof. N. Krishna Swamy గారు ఇటువంటి ambiguous sentence కి ఒక చక్కని ఉదాహరణని అందించారు : ‘Last week Mohan went to his native place to sell his land along with his wife

మరొక ఉదాహరణ. అమ్మ మంచం మీద Gordon Westerlund వ్రాసిన పుస్తకం ‘Garden of Flowers’ ఉంది. దానిని అమ్మ నాచేతికి ఇచ్చి చదవమంది. అప్పుడు మా సంభాషణ ఇలా సాగింది.

నేను : Garden of Flowers

అమ్మ : flowers అంటే ఏమిటి?

నేను : flower అంటే పూవు – ఏకవచనం;

flowers అంటే పూలు – బహువచనం

అమ్మ : రకరకాల పూలు అనటానికి ఏమని అంటారు?

నేను : Different kinds of flowers.

అమ్మ: ఒకే రకమైన పూలను చేర్చి flowers అని అంటారు అని అనుకుంటున్నాను.

ఆ సమయంలో అమ్మ మాట నాకు అర్థం కాలేదు. 20 ఏళ్ళ తర్వాత Regional Institute of English, Bangalore 3 Encyclopaedia Britannicaలో (Vol.9; Page 482).

Flower: As popularly used, the term is especially applicable when part or all of this structure is distinctive in colour and form అని ఉన్నది. మరియు నేడు Googleలో Dictionary.com, An asle.com service లో:

Flower. In the popular sense, the bloom or blossom of a plant, the showy portion, usually of a different color, shape and texture from the foliage అని ఉన్నది. ఎంతో ఆశ్చర్యపోయాను. నా అజ్ఞానం సహస్రముఖాల దర్శనం ఇచ్చింది..

ఇంకొక సందర్భం. సుమారు 50 ఏళ్ళ క్రిందట సంభాషణ.

సోదరులు పన్నాల రాధాకృష్ణ శర్మగారు అమ్మా! ‘Darwin’s Theory of Evolution అంటే ఏమిటి?

అమ్మ : ఏమున్నది, నాన్నా!

Involution Evolution

ఈ సంభాషణ నాకు తెలిసి 38 ఏళ్ళు దాటింది. దాని అర్థం మాత్రం తెలియదు. Longman Dictionary లో కూడా లభ్యం కాలేదు. కావున ఉత్సుకతతో ఇటీవల Internet లో తెలుసుకున్నాను:

The universe alternates between evolution and involution, Evolution is the manifested state, and involution is the latent state. Thus the universe goes through a cycle of creation, preservation and dissolution. The cycle is repeated through eternity.

Involution అనేది అవ్యక్తమైన స్థితి, (evolution) అనేది వ్యక్తమైనది. Involution నిర్గుణం అని అంటే, Evolution సగుణం అవుతుంది. దీనినే శ్రీ దక్షిణామూర్తి స్తోత్రంలో శంకరాచార్యులు ‘బీజస్యాంతరివాంకురోజగదిదం ‘ (విత్తనంలో వృక్షము సూక్ష్మరూపంలో ఉన్నట్లు ఈ జగత్తు ఉన్నది) అని వివరించారు. Involution నిర్వికల్పం, Evolution సంకల్పం. ఇక్కడే సాంప్రదాయ వేదాంతానికి అమ్మ తత్వానికి కొంచెం భేదం కన్పిస్తుంది నాకు. ‘తత్ సృష్ట్యాతదేవాను ప్రావిశత్’ (దైవం సృష్టిని చేసి అందే ప్రవేశించెను) అని వేదం వివరిస్తోంది. అమ్మ ఒక అడుగు ముందుకు వేసి “దైవం సృష్టిని చేయడం కాదు, నాన్నా! సృష్టే దైవం” అని ప్రవచించింది. ఒకటి అనేకమైంది కనుక Involutionకి Evolutionకి తత్త్వతః తేడా లేదు. సాగరం Involution అయితే సాగర కెరటం  Evolution.

‘Involution లోనిదే Evolution’ అని అమ్మ అన్న వేళ (కరార విందేన పదార విందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం) అవ్యక్తమధురమైన మోహన రూపంతో, అందం అమాయకత్వంల సుమధుర కలయికగా, సృష్టి రచనా వైచిత్ర్యాన్ని శైశవ చేష్టలతో మాయతెరలతో మరుగున పరుస్తూ, మురిపిస్తూ “సృష్టికి అకారణమే కారణం” అనే అమ్మ వాక్యానికి దర్పణం పడుతూ బాలముకుందస్వామి దర్శనం ఇస్తారు.

వేరొక ఉదాహరణ. 1974 సం.లో పూజ్య సోదరులు డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారు నరసాపురం, పాలకొల్లు పట్టణాలలో మాతృశ్రీ అధ్యయన పరిషత్లను ప్రారంభించే సంకల్పంతో సంసిద్ధులౌతున్నారు. వారికి తోడుగా నన్ను ఎన్నుకొన్నారు. అది మా ప్రయాణానికి ముందు రోజు సాయం సమయం. వెలుపల వరడాలో సంధ్యావందనం జరుగుతోంది. లోపలిగదిలో అమ్మ, నేను మాత్రమే ఉన్నాము. కొన్ని క్షణాలు జీవితంలో మళ్ళీ మళ్ళీ రావు. కనుకనే విలువకట్టలేనిది కాలం అని అంటారు విజ్ఞులు. అపుడు మా సంభాషణ ఇలా సాగింది.

అమ్మ : I am going to Narsapur

నేను When?

Tomorrow

నేను : Why ?

అమ్మ : Study Circle.

‘I will be going to Narsapur tomorrow-‘ అని అనటానికి ‘1 am going to Narsapur tomorrow’ అని అన్నది అమ్మ. Future Continuous tenseలో ‘Will be + verb+ing form వస్తుంది కానీ ‘am going’ అని Present continuous Tense వాడింది అమ్మ. అమ్మకి English grammar తెలియదు కదా అని సరిపెట్టుకున్నాను. ఒక వ్యక్తిని లేక ఒక అంశాన్ని అర్థం చేసుకోవడం కంటె అపార్థం చేసుకోవడం తేలిక. ఇది సర్వులకు సాధారణమైన విషయం. అవతారమూర్తుల విషయంలో సార్వకాలిక సత్యం.

18 సం.ల తర్వాత C.I.E.F.L., Hyderabadలో P.G.D.T.E. చేస్తున్నపుడు తెల్సింది. The present continuous tense is used to talk about future plans and arrangements అని. నిజం ఏమంటే Future Tense ఆంగ్లభాషలో లేదు. నమ్మండి. నా అజ్ఞానానికి సిగ్గుపడ్డాను. శిరస్సు వంచీ అమ్మ. విరాట్ స్వరూపానికి అంజలి ఘటించాను. మన అల్పత్వం అమ్మ అనల్పత్వాన్ని గుర్తించడానికి ఎంతో సాయం చేస్తుంది. –

ఈ సందర్భంలో ఒక ప్రధానమైన అంతర్లీనమైన అంశాన్ని గుర్తించాలి. అమ్మ శారీరకంగా జిల్లెళ్ళమూడిలోనే ఉన్నది. ‘I am going to Narsapur’ లో “ఎవరు? అంతటా ఉన్న అమ్మ. మనం జగన్మాత రథచక్రాలు. అనిర్వచనీయమైన అమ్మ ఆశీర్వచనం, బలం మనకి ఎప్పుడూ ఉన్నాయి. బహు జనహితాయ ఏదైనా ఒక పనిని త్రికరణశుద్ధిగా సంకల్పిస్తే దేవుడు తప్పక చేయూత నిస్తాడు. కానీ జిల్లెళ్ళమూడిలో అంతేకాదు; అమ్మ మనల్ని ఎత్తుకుని విజయపథంలో ముందుకు సాగుతుంది.

చివరగా చిన్న ఉదాహరణని అవధరించండి. Last, but not the least. 1971లో నా B. Sc పట్టాను అమ్మ చేతికి అందించాను. అమ్మ దానిని తాకితే నాకు శుభం కలుగుతుందని నా విశ్వాసం. పట్టా అంతా ఆంగ్లభాషలో ముద్రించబడింది. (Part 1 : English and Sanskrit, Part 2: Maths, Physics and Chemistry) దానిని చూసిన వెంటనే అమ్మ, “నాన్నా! నువ్వు B.Sc B.A. అనుకున్నాను రా” అన్నది. అమ్మ మహత్సకల్పం నేను భాషావేత్తను కావాలనేమో! 20 ఏళ్ళు Maths / Science ఉపాధ్యాయునిగ పని చేశాను. ఆ మధ్యకాలంలో M.A. (English), P.G.D.T.E. (C.I.E.F.L) చదివి 16 ఏళ్ళు English Lecturer గా పనిచేశాను. ఈ సందర్భాన్ని వివరించే ముందు మీ ముందు మరి రెండు సన్నివేశాల్ని ఉంచాలి.

1 – అమ్మ ఒకసారి శ్రీ శంకరాచార్య విరచిత ‘సౌందర్యలహరి’ గ్రంథాన్ని తీసికొని ఒక శ్లోకాన్ని చూపి, “చూడు, నాన్న! ఈ శ్లోకం ఎంత బాగున్నదో!” అన్నది. నేను ఆ వైపు చూడలేదు. ‘నువ్వే సౌందర్యలహరి. అంతకంటే నువ్వే బాగున్నావు’ – అన్నాను. “మీరు నా బిడ్డలే కాదు, నా అవయవాలు” అనే జగన్మాత అమ్మ ఆప్తవాక్యం కంటే సౌందర్యం ఎక్కడ ఉంటుంది? కారుణ్యరసైకరూప, అద్వైత తత్త్వామృత ప్రభా భాసమాన పవిత్రగాత్రి అయిన అమ్మ దివ్యమంగళ స్వరూపమే జగత్కళ్యాణ కారకం, విశ్వశాంతి ప్రదాయకం. అదే రమణీయమూ, మనోహరమూ.

II – కంచి కామకోటి పీఠాధిపతులు, నడిచే దైవం, శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారిని దర్శించుకునే నిమిత్తం నేను కంచి సమీపంలోని కలవై గ్రామానికి వెళ్ళాను. ఆ సమయంలో ఒక పండితుడు వచ్చి సుమారు 1200 పేజీల గ్రంథాన్ని స్వామీజీకి అందించి ఒక సందేహాన్ని వెలిబుచ్చారు. స్వామీజీ క్షణకాలం కాగితాలు అటు ఇటు త్రిప్పి ఒక పుటలో ఒక మామిడాకును ఉంచి తిరిగి ఆ గ్రంధాన్ని ఆ పండితునికి అందించారు. ఆయన ప్రశ్నకు సమాధానం ఆ పేజీలో ఉంది. వారు పరమానందభరితులై స్వామీజీకి నమస్కరించి సెలవు తీసుకున్నారు.

ఏతా వాతా చెప్పుకోదగిన మాట ఏమిటంటే మనిషికి జ్ఞానం కలగాలంటే ఎక్కడైనా వినాలి, ఏదైనా చదవాలి; అర్థం చేసుకోవాలి. కానీ అమ్మ వంటి అవతారమూర్తులకు ఆ అవసరం లేదు. జ్ఞానస్వరూపమే తాను. కనుకనే మన ఆవేదనలూ, సందేహాలూ అమ్మకు నివేదించనవసరం లేదు. వారి సన్నిధిలో ఏదైనా ఒక గ్రంథం పేరును ఉటంకిస్తే అందలి సారాన్ని ఇట్టే వివరించగలరు. పాఠశాలల్లో, కళాశాలల్లో, ఇతరత్రా పలు సందర్భాల్లో శ్రమకోర్చి గంటలకొద్దీ ఉపన్యాసాలు ఇస్తారు. కొందరు కరతాళధ్వనులు చేస్తారు; కొందరికి బోధపడుతుంది; కొందరిని అయోమయంలో పడేస్తాయి. అమ్మ ఉపన్యాసాలు ఇవ్వదు; ఆ అవసరం లేదు. అమ్మ ప్రశ్నిస్తేనే సమాధానం ఇస్తుంది. తానుగా ఒక సందేశాన్ని ఇవ్వదలచుకుంటే తనకు మాటలతో, కాగితం కలంతో – నిమిత్తం లేదు. సూటిగా జ్ఞానప్రసారం చేస్తుంది. దానినే ‘జ్ఞానభిక్ష’ అని అంటాం. అమ్మ దివ్యసన్నిధిలో ప్రశ్నించకుండానే పలువురి సందేహాలు నివృత్తి అవుతాయి. ఇది నిన్నా, నేడూ, రేపూ సత్యమే. అందలి రహస్యాన్ని శాస్త్రజ్ఞులు ఇలా వివరించారు:

  1. Knowledge is only perception (గ్రహించబడేదే జ్ఞానం) Socrates
  2. Knowledge is not a transferable commodity and Communication not a Conveyance – E.Von. Glasersfeld.

(జ్ఞానం అనేది ఒకచోట నుండి మరొక చోటకి రవాణా చేసే సరుకు కాదు; బోధనం వాహనమూ కాదు)

అమ్మను స్మరించుకోవటం నిగమాగమసారాన్ని ఆస్వాదించడం; అమ్మ మంగళస్వరూపాన్ని రెండు కళ్ళతో దర్శించుకోవడం ఉప నయనం (జ్ఞాననేత్రం)తో అనుభవంలో గీతాసారాన్ని అవగతం చేసుకోవడం;

అమ్మ శ్రీచరణార్చనయే శ్రీచక్రార్చన; సత్యజ్ఞానానందప్రాప్తి. కావున ‘జ్ఞానంబు అమ్మనుచు – ఆ అమ్మ మనదనుచు

జీవేమ శరదశ్శతం…..

నందామ శరదశ్శతం… 

మోదామ శరదశ్శతం…’

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!