వేయికళ్ళతో ఎదురుచూస్తున్న అపురూపమైన చారిత్రాత్మక సన్నివేశం ఆవిష్కృతమయింది. 1923 మార్చి 28 వ తేదీన “జగజ్జననికే జననీ జనకులైన” మన్నవ సీతాపతి శర్మ, రంగమ్మ దంపతుల గర్భవాసాన అనసూయ నామధేయురాలై, అమ్మ జననమందింది. 99 సంవత్సరాలు నిండి, నూరవ సంవత్సరంలోకి అడుగిడుతున్న “అవతారమూర్తి అమ్మ” జన్మదిన వేడుకలు అమ్మ జన్మస్థలమైన మన్నవ గ్రామంలోనే ప్రారంభం కావటం అమ్మ దివ్యసంకల్పం. 2022 మార్చి 28 వ తేదీ ఉదయమే జిల్లెళ్లమూడిలో వాత్సల్యాలయ ప్రాంగణంలో 100 జేగంటల ఘంటారవంతో అమ్మ జన్మదినోత్సవం ప్రారంభమయింది.
మన్నవలోని అమ్మ ఆలయంలో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ చుండి నవీన్ శర్మ మరియు వేదపండితులు శ్రీ మురికిపూడి సందీప్ శర్మ గారి అధ్వర్యంలో జరిగింది. తదనంతరం మన్నవ గ్రామ వాస్తవ్యులైన శ్రీ మన్నవ రంగనాథ గౌతమ్ భార్య శ్రీమతి విమలక్కయ్య, అమ్మ సోదరుడైన రాఘవరావు మావయ్య పుత్రిక శ్రీమతి స్వాతి, తదితరులు చక్కగా అలంకరింపబడిన వేదికమీద అమ్మకు లలితా సహస్రనామ, ఖడ్గమాల, అష్టోత్తరశత నామాలతో పూజ నిర్వహించారు. అనేకమంది మన్నవ గ్రామస్తులు, జిల్లెళ్ళమూడి మరియు ఇతర ప్రాంతాలనుండి కూడా వచ్చిన భక్తులతో ప్రాంగణమంతా కళకళ లాడింది. శ్రీ మన్నవ రంగనాథ గౌతమ్ గారి ఆవరణలో ఆహూతులందరికీ విందు, గ్రామస్తులందరికీ అమ్మ ప్రసాదం అందజేయటం జరిగింది. జిల్లెళ్లమూడిలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ కొనసాగింది. తరువాత ప్రతి సోమవారం జరిగే లలితా లక్షనామపారాయణ అనంతరం అమ్మకు మల్లెపూలతో అర్చన జరిగింది. ఆవరణలోని సోదరీ సోదరులందరూ పాల్గొన్నారు.
విశాఖలో అమ్మ పుట్టిన రోజు
విశాఖపట్నం అమ్మమందిరంలో మార్చి 28వ తేదీ ఉదయం 10గం.కు ఆంగ్ల సంవత్సర కాలమానం ప్రకారం అమ్మ పుట్టిన రోజు వేడుకలు వైభవంగా జరిగాయి. “అమ్మ శత జయంతి సంవత్సర శుభారంభా”న్ని పురస్కరించుకొని, మాతృశ్రీ అధ్యయన పరిషత్ ‘అనసూయా వ్రతం’ నిర్వహించింది. విశాఖ- పరిసర ప్రాంతాల సోదరీ సోదరులు, మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల పూర్వ విద్యార్థులు విశేష సంఖ్యలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు అమ్మకు పట్టువస్త్రాలు సమర్పించి, సామూహిక లలితా సహస్ర పారాయణం చేశారు.
అనుగ్రహ పురస్కారం
ఈ సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల పూర్వాధ్యక్షులు శ్రీ విఠాల రామచంద్ర మూర్తిగారి సూచన మేరకు పూర్వ విద్యార్థులు శ్రీమతి కుసుమా చక్రవర్తి గారికి “అమ్మ అనుగ్రహ పురస్కారం” ప్రదానం చేశారు. శ్రీవిశ్వజననీ పరిషత్ పూర్వాధ్యక్షులు శ్రీ బొప్పూడి రామబ్రహ్మంగారి అధ్యక్షతలో జరిగిన ఈ సభలో ఆంధ్రవిశ్వ విద్యాలయం తెలుగు శాఖ విశ్రాంత అధ్యక్షులు ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
విశాఖ ఎస్పీ శ్రీ బొడ్డేపల్లి కృష్ణారావుగారు, ఆంధ్ర విశ్వవిద్యాలయ ఫార్మా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీ కిలారి ఈశ్వరకుమార్ గారు, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్. కవిరాయని కామేశ్వర రావుగారు, విశాఖ అచీవర్ జూనియర్ కళాశాల డైరెక్టర్ శ్రీ ఏ. సహదేవ ప్రసాద్ గారు ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు. ‘విశ్వజనని’ సంపాదకులు శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తిగారు తమ సందేశాన్ని ఆడియో ద్వారా అందించారు. శ్రీమతి కుసుమా చక్రవర్తి గారి వ్యక్తిత్వ విశేషాలనూ, సేవా తత్పరతనూ, అమ్మ పట్ల గల అచంచల భక్తినీ, విద్యార్థుల పట్ల కుసుమక్కయ్యగారికున్న సాటిలేని వాత్సల్యాన్ని వక్తలందరూ ప్రస్తుతించారు.
శ్రీమతి కుసుమా చక్రవర్తిగారికి నూతన వస్త్రాలతో, శాలువలతో పూల దండలతో, సన్మాన పత్రంతో, జ్ఞాపికతో పూర్వ విద్యార్థి సమితి పక్షాన రూ.10,116/- పారితోషికంతో ఈ పురస్కార ప్రదాన కార్యక్రమం వైభవంగా జరిగింది. పూర్వ విద్యార్థులు సర్వశ్రీ పొట్నూరి కృష్ణ, ఎం. భాస్కరరావు, ఎం.జగన్నాథం, ఎం.ఉమా మహేశ్వర రావు ప్రభృతులు ఈ కార్యక్రమాన్ని సర్వాంగ సుందరంగా నిర్వహించారు. తమకు జరిగిన సత్కారానికి శ్రీమతి కుసుమా చక్రవర్తిగారు సముచిత రీతిలో కృతజ్ఞతలు తెలిపారు సర అమ్మ మహాప్రసాదం (విందుభోజనం) తో కార్యక్రమం ముగిసింది.
– పూర్వవిద్యార్థి సమితి