జూన్ నెల 11,2023 రెండవ ఆదివారం జిల్లెళ్ళమూడిలో చండీ సప్తశతి పారాయణం, రాహుకాలంలో ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి 6 వరకు సోదరీ సోదరులు అమ్మను మహాకాళిగా, మహాలక్ష్మిగా, మహా సరస్వతిగా భావించి రకరకాల పూలతో పూజించి నివేదనలు చేసి ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమం బహుళ ఆదరణ పొందింది. ఈ రాహుకాల చండీపారాయణ ద్వారా అనేక శుభాలు జరుగుతాయని సప్తశతిలో వివరించబడింది.
యా దేవీ సర్వ భూతేషు క్షుధా రూపేణ సంస్థితాI
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః॥
చండీపారాయణ రోజునే పేదలకు, ఆకలిగొన్నవారికి జిల్లెళ్ళమూడిలోనే కాక ఇతర ప్రదేశాలలోకూడా ప్రసాదవితరణ జరిగింది..
శ్రీ విఠాల రామచంద్రమూర్తి గారు, మరి కొందరు సోదరులు అందించిన విరాళాలతో దాదాపు 30 కిలోల పులిహోర ( హరిద్రాన్నం) పొట్లాలు సిద్ధం చేయించి సోదరుడు త్రయంబకం, కాలేజీ విద్యార్థుల ద్వారా బాపట్లలో పంచటం జరిగింది.
సాధారణంగా ప్రసాదం పంచడం ఒక గంటలో అయిపోతుంది. అది ఆ సోదరుడి అనుభవం.
బాపట్ల వెళ్ళి ప్రసాదం పంచడం మొదలు పెట్టగానే ఒక అరగంటలోపల దాదాపు ముప్పాతిక వంతు ప్రసాదం వితరణ అయిపోయింది. ఇక పావువంతు మాత్రమే మిగిలింది.
అరగంటకు పైగా వేచి ఉన్నా ఆ మిగతా ప్రసాదం తీసుకునేందుకు ఎవరూ రాలేదు. తిరుగు ముఖం పట్టే సమయానికి ఒక పది పదిహేను మంది పేద కూలీలు ప్రసాదం కోసం వచ్చారు. వాళ్ళు ప్రొద్దున నుండీ ఏ ఆహారమూ తీసుకోలేదట. వాళ్ళు ఆవు రావురుమని మృష్టాన్న భోజనంలా కడుపునిండా తిని అమ్మకు నమస్కరించుకున్నారు.
ఇది చూచిన త్రయంబకం సోదరుడు, కాలేజీ విద్యార్థులు అమ్మ ప్రసాదం ఇంతసేపూ మిగిలి ఉన్నది ఈ ఆకలిగొన్న వారికోసమే అని గుర్తించి సంతృప్తిగా తిరిగి వచ్చి ఈ అనుభవం వివరించారు. ఎక్కడ ఆకలి బాధ ఉన్నదో అక్కడ ప్రత్యక్షమై వారి ఆకలి తీర్చే అన్నపూర్ణ మన అమ్మ.