1. Home
  2. Articles
  3. Viswajanani
  4. ఆకలి బాధ

ఆకలి బాధ

N Krishnamacharyulu
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 15
Month : December
Issue Number : 5
Year : 2015

“కోటి విద్యలు కూటి కొరకే” అనే సామెతను వినని వారుండరు. నిద్రలేవగానే, దినమూ, ప్రతియింటా భుక్తి కిగాను జరిగే తాపత్రయము, హడావిడి, మనందరి అనుభూతి. కాని, యీదైనందిన కార్యము సర్వసామాన్య మైనందున దీనిలోని ప్రయాస మన ఆలోచనకే స్ఫురించదు. “తినగ తినగ వేము తియ్యనుండు” అనే వేమన సూక్తి అనుభవయోగ్యమైన సూత్రము.

తినడము, చాలామందికి, వొక నియమిత చర్య మాత్రమే. ఆకలంటే తెలియని వారికి, ఆకలిబాధ తెలియడం కష్టము. తిండిలేక, “అన్నమో రామచంద్రా” అని విలపిస్తూ, పస్తులు చేసి, దేహము క్రుంగి, కృశించి, శల్యావస్థ యైనపుడు, ఆకలియొక్క వేదన రక్తములో మంటయై, జ్వాలయై మనిషిని నిమిష నిమిషమూ దహించుకు పోతుంది. ఆకలి మానవత్వాన్నే నశింప చేస్తుంది. నిరాశ, నిస్పృహతో కూడిన అతని హృదయము రాయిగా మారుతుంది. అతడు సంఘ ద్రోహిగాఅవుతాడు. అన్నమే అతని దేవుడు; దాన్ని పొందటమే అతని గమ్యము. తోటి మానవులు తిరస్కారము, పరిహాసాలే అతనికి లభించే పారితోషకము. మానవునికి వీనికంటె ఆశింపదగని స్థితి వేరుండబోదు.

‘డొక్కనిండితే రెక్క లాడుతవి’ అని చెప్పడం కద్దు. ” కాని, డొక్కకూ మనసుకూ కూడా అవినాభావ సంబంధం కనబడుతుంది. ఆకలిగొన్న వానికి ఆధ్యాత్మిక చింతన ఏవగింపు కలిగిస్తుంది. అందుకే, అన్న లేనివానికి ఆధ్యాత్మిక విషయాలు ఉపన్యసించడం కంటే గొప్ప హింస వుండబోదని వివేకానందులు అంటారు. “అన్నాయనమః ” “అన్నం బ్రహ్మ” అని, మన పూర్వీకుల దివ్య సూక్తులు. అన్నమే మానవుని మనుగడకు ఆధారము, అతని ప్రాణాధారము. అన్నము భగవత్స్వరూపమని విశ్వసించి భక్తి తో సేవించేవాడు తన మనో మాలిన్యాన్ని త్వరితంగా తుడిచివేయ గలుగుతాడు, అంతటా భగవత్స్వరూపమును చూడగల శక్తి అతనికి ప్రాప్తిస్తుంది.

అమ్మ తన్ను చూడవచ్చిన వారిని భోంచేయమని పదేపదే చెప్పడంలో ఆంతర్యం ఏమిటీ? వీరిలో యే కొద్దిమందో ఆకలిగొన్న వారుండవచ్చు కాని, ఆకలి బాధగొన్నవారు వొక్కరూ కనిపించరు. ‘మేము తిని వచ్చినా మమ్మా’ అంటే, “ప్రసాదంగా నన్నా కొంచెము స్వీకరించు నాన్నా” అని బలాత్కరించడము యెందుకు అని నాకు సందేహం కలిగింది. మందబుద్ధినైన నాకు దీనికి జవాబు తెలసుకోడం కొంచెము ప్రయాసగనే కనపడింది. కారణం, నేను యెవరి అమ్మనూ కాను; మాతృత్వములోని మార్దవము, దయ, కరుణ, నాకు యేకోశానా లేదు. వీటిని కృత్రిమంగా తెచ్చుకొన్నా, అట్టే నిలువవు.

తల్లి పిల్లి, యిల్లిల్లూ తిరిగి, శోధించి, తెచ్చిన ఆహారాన్ని తన పిల్లల ముందు వేసి, అవి తింటూ వుండగా తన క్షుడ్బాధ తీరినట్లు సంతృప్తితో దూరంగా కూర్చున్న దృశ్యము నా మనస్సుకు గోచరించింది. గువ్వలు ధాన్యపు గింజిలను, పిల్లలు నోళ్ళలో నొక్కుతున్నాయి. బిచ్చగత్తె తనకు లభించిన బొక్కెడు అన్నమును వీవున కరుచుకొన్న చంటివానికి పెట్టుతూంది… అమ్మ అంటే యిలా వుండాలి కాబోలు అనుకొన్నాను. మరి అమ్మలగన్న యమ్మయో?

విశ్వమాతయైన అమ్మకు మనమందరము చంటిపిల్లలము. ‘అమ్మ కడుపు చూచు, యిల్లాలు జేబును’ అన్నట్లు. అమ్మదృష్టిలో మనకు యెప్పుడు ఆకలి బాధయే. మనము కడుపునిండా తిన్నపుడే ఆమెకు సంతృప్తి, ఆనందము. ఇక, మనము ప్రసాదమనే భావముతో అమ్మ పెట్టిన అన్నమును తినగలిగామా, మన జీవితము ధన్యమవుతుంది. అమ్మ యొక్క మాతృత్వానికి పరిపూర్ణత కలుగజేసిన వారమవుతాము.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!