1. Home
  2. Articles
  3. Viswajanani
  4. ఆచంట అన్నపూర్ణ అక్కయ్య

ఆచంట అన్నపూర్ణ అక్కయ్య

A V R Subramanyam
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 11
Month : March
Issue Number : 8
Year : 2012

నరసాపురం డాక్టర్ ఆచంట కేశవరావుగారి సహధర్మచారిణి సోదరి అచంట అన్నపూర్ణ. అక్కయ్య సార్ధక నామధేయురాలు. తనకున్నంతలో కలో, గంజో వచ్చిన వారికి ఆదరణగా పెట్టుకునే ఏ ఇల్లు అయినా జిల్లెళ్ళమూడే. ఆమె మధురమాతృమూర్తి అమ్మకి ప్రతిరూపమే.

అన్నపూర్ణ అక్కయ్య 31.10.11 తేదీన తన పార్థివదేహాన్ని పరిత్యజించి పరమపావని అమ్మలో ఐక్యమైంది. 

అక్కయ్య మూర్తిమత్వాన్ని తలచుకుంటే సహజప్రేమ, పెంచిన ప్రేమ, సుమంగళి అనే మూడు భావాలు కళ్ళముంద కదలాడుతాయి. కొంచెం వివరిస్తాను.

  1. సహజ ప్రేమ : డాక్టర్ కేశవరావుగారు శ్రీరామనవమినాడు, అన్నపూర్ణ అక్కయ్య వినాయకచవితి నాడు జన్మించారు. అమ్మను దర్శించినంతనే ఆపదుద్ధారిణిగా అనన్యశరణ్యగా స్థిరాభిప్రాయానికి వచ్చారు. ప్రతి ఏటా శ్రీరామనవమి నాడు కోదండ రామునిగా అమ్మను అర్చించారు ఆ పుణ్యదంపతులు.

అమ్మను దర్శింపక ముందు కాలంలో తరచు జ్వరం, తలనొప్పి వస్తూండేవి అక్కయ్యకు. కలకత్తా, హైదరాబాదు, మద్రాసు వంటి మహానగరాల్లో ప్రముఖ వైద్యులకు చూపించారు. కానీ ఫలితం లేకపోయింది. జిల్లెళ్ళమూడి వచ్చినపుడు అమ్మ అక్కయ్యను లాలనగా దగ్గరకు తీసుకొని తల నిమురుతూ, “అమ్మా ! జ్వరం ఇంకా వస్తోందా? తలనొప్పి ఉంటోందా ?” అని కుశలప్రశ్నలు వేసేది. ఆశ్చర్యం. ఆ రుగ్మత ఎవరికీ చెప్పకుండా ఎప్పుడో పలాయనం చిత్తగించింది. వారి ఆశ్చర్యానికి, ఆనందానికి అవధులు లేవు. మహిమలు అనేవి విశ్వాసాన్ని ధృఢతరం చేసే సంఘటనలు.

వాత్సల్యయాత్రలో భాగంగా అమ్మ నరసాపురం వెళ్ళి మూడు నిద్రలు చేసింది; లాంచీపై, ప్రయాణించి గోదావరీ నదీమతల్లిని లాలించింది; పుట్టింటికి వెళ్ళినట్లు కొంగుపట్టి పసుపు కుంకుమ, చీరె – చలిమిడి …. వగైరా సారెను ఆప్యాయంగా స్వీకరించింది. ఆ సమయంలో అమ్మతో పాటు అందరికన్నులూ అర్హమైనాయి. ఆ దంపతులకు తన హృదయంలో ఒక సుస్థిరస్థానాన్ని ఇచ్చి  బిడ్డలు లేని లోటు తీర్చింది. జగజ్జనని కే జననీ జనకులు అనే భావాన్ని ప్రోది చేసింది.

 

డా॥కేశవరావు దంపతులకు కడుపున పుట్టిన బిడ్డలు లేరు. ‘అపుత్రస్య గతి ర్నాస్తి’ అంటూ సంతానం లేకపోవటం శాపం అని సంప్రదాయం ఘోషిస్తోంది. కానీ నా దృష్టిలో బిడ్డలు లేనివారంతా దైవానికి ప్రతినిధులు. వారికి స్వపర భేదం లేదు. తోడబుట్టిన అక్కగారి పిల్లలు, తోటి కోడలు గారి పిల్లలు . సరే సరి ఇరుగు పొరుగు పిల్లల్నీ ‘అంతేకాదు వైద్యం కోసం భర్తను సంప్రదించే అనేకుల్ని సుబ్బి, వెంకి, గోపి, రామకృష్ణుడు, బుల్లి, కానీ, టింగు, గూనపులి, గణపతి, గడిబిడి వంటి ముద్దుపేర్లతో పిలుస్తూ కంటికి కనిపించే వారిని కన్నబిడ్డలుగా ఆదరించేది అన్నపూర్ణ అక్కయ్య. ఉదయం ఇంత ఆవకాయ అన్నం కలిపి పిల్లల్ని చుట్టూ చేర్చుకుని ఆప్యాయంగా అన్నం ముద్దల్ని నోటికి అందించేది. ఇది నిజంగా అక్షరాలా అమ్మ ప్రేమ తత్త్వమే. తనకి జ్వరం వచ్చి, తగ్గి కులాసాగా ఉన్న తర్వాత పిల్లలందరికీ నూతన వస్త్రాలను పెట్టుకుని ఆనందించేది.

దీపావళి పండుగనాడు వేలాది రూపాయిలు వెచ్చించి బాణసంచా కాల్చగా పిల్లల కళ్ళలో ఆనందహేలను చూసి తన మది పాలకడలివలె ఉప్పొంగి పోయేది. ఇదంతా వారి మాతృమూర్తి నరసమ్మ మామ్మగారి శిక్షణ, చేతి చలువ, మంచితనం. నరసమ్మ మామ్మగారు మరిడమ్మ తాతమ్మని తలపింపచేస్తుంది. మూర్తీభవించిన సేవాభావం ఆమె; అదే ప్రతిఫలాపేక్షలేని ప్రేమ.

బిడ్డలున్న వారంతా స్వార్థపరులు. వారి పిల్లలే వారి లోకం; మనుమలు, మునిమనుమలు ముక్కుతాళ్ళు. సర్వత్రా పరివ్యాప్తమైన మమకారం మాధవత్వం కనుక అందుకు ఒక ప్రతిబింబంగా భాసిస్తుంది అక్కయ్య. ఇక్కడే అమ్మకీ మనకీ 5 మధ్య వ్యత్యాసం స్పష్టంగా గోచరిస్తుంది. “మిమ్మల్ని నేనే కన్నాను” అనే అమ్మ అలౌకిక మాతృత్వ వైభవం ముందు సకలసృష్టి సాగిలపడి అంజలి ఘటిస్తోంది..

  1. పెంచిన ప్రేమ : వసుంధరక్కయ్య, భాగ్యం అక్కయ్య, హనుమబాబుగారు… పదిమందితో కలివిడిగా తిరిగే మనస్తత్వం అక్కయ్యది. సోదరి శ్రీమతి బ్రహ్మాండం కీల. శేషును వియ్యపురాలు అనీ, నన్ను అల్లుడే మేనల్లుడు అని అన్నా పెంపుడు బిడ్డలా చూసేది. ఈ సందర్భంలో ఒక ముఖ్యాంశాన్ని ప్రస్తావించాలి. సోదరి శ్రీమతి ఎక్కిరాల రాణీసంయుక్త వ్యాస్ అమ్మ సన్నిధిలో “ఎవరు కన్నారెవరు పెంచారు?” గోపాలబాలుని నవనీతచోరుని ఎవరు కన్నారెవరు పెంచారు? గీతాన్ని శ్రావ్యంగా గానం చేసేది. ఆ పాట వింటూంటే అమ్మ హృదయం ఎంతగానో స్పందించేది; మరల మరల పాడమని కోరేది; తన్మయత్వంతో చేది అమ్మ అవతార ధర్మసూక్ష్మం ఈ పాటలో ఉంది. కృష్ణుడు యశోదా తనయుడే కాదు, దేవకీ సుతుడు కూడా. ఎవరు కన్నారు, ఎవరు పెంచారు. ప్రశ్నించడంలో కన్న ప్రేమ, పెంచిన ప్రేమ ఔన్నత్యాన్ని చాటడం ప్రస్ఫుటంగా కన్పిస్తోంది. చరాచర భేదరహితంగా సకలసృష్టిని కన్న తల్లి అమ్మ. లోకంలో కని, పెంచే (కనిపించే) తల్లులంతా పెంపుడు తల్లులే. ‘మీరంతా నా బిడ్డలే కాదు, నా అవయవాలు’ అనే అమ్మ వాక్యం ఈ సత్యాన్ని వేనోళ్ళ చాటుతుంది. మరొక మాట. శిశువు మాతృగర్భంలో ఉన్నపుడే మాతా శిశువుల అభిన్నత్వం. బొడ్డు కోయగానే వారి జీవితం, ఊపిరి, వ్యక్తిత్వం వేర్వేరే. అమ్మకు ఉన్న విశ్వజననీతత్వం, సర్వాత్మనాభావన – సత్యం; అమ్మ స్వయంగా వెల్లడించే వరకు మరుగునపడే ఉంది. కడుపులో ఉన్నా, కళ్ళముందు పెరుగుతున్నా, కనుమరుగైనా అసలైన తల్లీ – బిడ్డలూ అభిన్నమే.
  2. సుమంగళి : సుమారు 60 సంవత్సరాలు పై బడిన సుదీర్ఘ సుఖమయ దాంపత్యజీవితం గడిపింది అన్నపూర్ణ అక్కయ్య. వంట మనిషి, పరిచారకులు ఎందరున్నా భర్త అవసరాల్ని స్వయంగా చూసేది, లోపాల్ని గుండెల్లో దాచుకునేది. ఊపిరివిడిచే వరకు సేవలు అందించి, సతీధర్మాన్ని నిర్వహించి కడసారి వీడ్కోలు పలికింది. అది సహధర్మచారిణికి ఆత్మహత్యాసదృశ అగ్ని కీల. 

డాక్టర్ అన్నయ్య ఆశయసిద్ధికోసం శ్రమించింది, నెరవేర్చింది. జిల్లెళ్ళమూడిలో వేదపాఠశాల స్థాపనకు రూ.75,000/-లు, సుగతిపధ భవన నిర్మాణానికి లక్షరూపాయలు విరాళాలను అందించింది.

ఈ సందర్భంలో ఒక విలక్షణ విశిష్ట సత్యాన్ని గురించి చర్చించాలి. భర్త కంటే ముందుగా భార్య తనువు చాలించటం పసుపు కుంకుమలతో పోవటం అనీ… ముత్తయిదువగా పోవటం అనీ అది ఒక వరమనీ, పురాకృత పుణ్యఫలం అనీ స్త్రీ భావించటం లోక సహజం. ఈ దృష్టితోనే వసుంధర అక్కయ్య అమ్మతో, ‘అమ్మా ! నీ చేతులమీదుగా నేను దాటిపోవాలి’ అని విన్నవించుకున్నది, అట్టి మహాప్రస్థానమే తనకు మహాప్రసాదం అని తలపోసింది. కానీ అందుకు విరుద్ధంగా అమ్మ,” సతీ ధర్మం ఏమంటే- ఏలోటూ రాకుండా భర్తకు కడవరకు స్వయంగా పరిచర్యలు చేసి వీడ్కోలు పలకాలి. అంతేకానీ తాను ముందుగా దాటి పోవాలనుకోవటం బాధ్యతారాహిత్యం, స్వార్థం” అన్నది. ‘సుమంగళి’ అని సంఘం మామూలుగా ఇచ్చేయోగ్యతాపత్ర సాధికారతని “నిలదీసింది. అనుస్యూతంగా సంప్రదాయబద్ధంగా వచ్చే ఒక అపోహని నిర్మూలించింది. అమ్మ మాత్రమే ఈ శుద్ధసత్వభావనని ప్రప్రధమంగా చాటి చెప్పింది. తత్త్వతః

అదే సతీసహగమనం. మహిళాహృదయం ఈ అపూర్వ సత్యప్రకటనా స్పర్శ కే నొచ్చుకోవచ్చు, కర్ణకఠోరం అంటూ ఎదురు తిరగవచ్చు. Customs die hard. నిజం ఎప్పుడూ నిష్ఠురంగానే ఉంటుంది. ఇది సత్యస్వరూపిణి అమ్మ అతిలోక మహోదాత్త పరమోత్కృష్ట పాతివ్రత్య సారం. అంతేకాదు. మరొక కోణంలో “భర్త అంటే శరీరం కాదు, భావన’ అని పతివ్రతాశిరోమణి అమ్మ మాత్రమే ఉద్ఘాటించింది.

అమ్మవాక్యాన్ని అవగాహన చేసికోవాలంటే ఒక జీవితకాలం సరిపోదు; ఆచరణలో పెట్టాలంటే వేయి జీవిత కాలాలు కూడా సరిపోవు. అమ్మ చెప్పేది సత్యం, చేసేది ధర్మం. అంతే. నాన్నగార్ని ఆలయప్రవేశం చేయించిన తర్వాత వస్తువు లేని నీడ (Shadow without substance) లా జీవించింది. శ్రీ అనసూయేశ్వర ఆలయంలో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలూ, శ్రీ అంబికా సహస్రనామ పూర్వక పూజలూ… మొదలైన పద్ధతుల్ని ప్రవేశపెట్టి మార్గదర్శనం చేయించింది. సమయం వచ్చినప్పుడు తన అశేష సంతానాన్ని ప్రక్కన పెట్టి ఆనందంగా వెళ్ళి నాన్నగారి సరసన సుప్రతిష్ఠిత అయింది.

ఇక్కడ మనం గమనించాల్సిన మరొక విశేషాంశం ఉన్నది. సహజ సహనమూర్తి అయిన అమ్మకి భరించలేని స్థితి ఒకటి ఉన్నది. “నేను ఉండి, నువ్వు లేకపోతే ఆ బాధను భరించలేను, నాన్నా!” అన్నది ఒక సోదరునితో. కడుపు శోకం నిర్భరం, అనిర్వచ్యం. కాగా అవసరమైతే అమ్మ బిడ్డను వదులుకుంటుంది, భర్తను కాదు. బిడ్డ తన ఆస్తి, రక్తం, శరీరభాగం. భర్త తన ఊపిరి, సర్వస్వం. నాన్నగారు లేని అమ్మ లేనే లేదు ఎప్పుడూ. ఐదేండ్ల ప్రాయం లోనే తన పతిదేవులెవరో శ్రీ లక్ష్మణాచార్యులుగార్కి అమ్మ స్పష్టం చేసింది. అదే అర్ధనారీశ్వర తత్వం.

ఈ పారమార్థిక దృష్టితో చూస్తే సహోదరి అన్నపూర్ణ సుమంగళియే. “సర్వాన్నీ అనుభవిస్తూ సర్వాన్నీ విడిచి పెట్టేది వివాహం” అనే అమ్మ మహావాక్యానికి సాకారరూపం అన్నపూర్ణ అక్కయ్య.

ఆ మధురమమకారాకృతికి, త్యాగనిరతికి ఇదే నా కృతజ్ఞతా ప్రపూర్ణ బాష్పాంజలి.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!