సర్వాంతర్యామి, సర్వవ్యాపి, సర్వసాక్షి అయిన ఆత్మను తెలుసుకోవాలంటే ఏమి చెయ్యాలి. ఆత్మభావంతో తెలుసుకోవచ్చునా ? భావం మనస్సును ఆలంబన చేసుకొని వుంటుంది. మనస్సు చంచలమైనది. అటువంటి మనస్సును మన అధ్యయనంలో తెచ్చుకోవాలి అని అంటారు. మన ఆధీనం చేసుకోవటం అంటే మనస్సును ఏకీకృతం చేసి సమాధి స్థితిని పొందితే మనస్సు కట్టుబడినట్లే. అప్పుడు భావం నిలబడుతుంది. ఆ భావంతో ఆత్మ భావం సంస్థిత కావటానికి వీలుంటుంది. “భావంబునేనై ఆ భావంబు నీవై భావాభావ మిళితమౌ నీ సందేశంబు నే పాడనా” అంటారు రాజు. భావము నేను కావాలి. ఆ భావము నీవు కావాలి. అంటే నీవు నా నుండి వేరు కావాలి. అది మిళితమైతే నీవు నేను కావాలి. అదే భావాభావ మిళితము. అప్పుడేమవుతుంది. అప్పుడు నీవు నేను కలిసి నేనౌతుంది. అది, వాడు, నీవు, నేను అనే దాంట్లో ప్రతిదానిని నేను కలిస్తే అది నేనౌతుంది. వాడు నేనౌతుంది. నీవు నేనౌతుంది. నేను నేనౌతుంది. అప్పుడు నేను నేనైన నేను. అన్ని నేనులు నేనైన నేను అవుతుంది. అది అమ్మ ప్రబోధం.
సర్వాంతర్యామి. సర్వవ్యాపి. సర్వసాక్షి అయిన ఆత్మ నేనైతే ఎట్లా వుంటుంది. ఎట్లా ? సృష్టిలో అన్ని జీవజాలములోను అంతర్లీనంగా వుండేది నేను. అది లేకుండా జీవజాలము వుండదు. జీవంలో కూడా నేను వుంటుంది కనుక సర్వంలోనూ అంతర్యామిగా నేను వుంటుంది. పంచభూతాలు అయిన గాలి ఎట్లా వ్యాప్తమైందో అట్లాగే ఆత్మ కూడా సర్వవ్యాప్తమైనది. ఆత్మ స్వరూపమైన నేను సర్వవ్యాపినిగానే వుంటుంది. అదే ఆత్మ అయిన నేను. అన్నింటికీ అంతటా సాక్షి కూడా అయి వుంటుంది. అంటే నేను సర్వసాక్షిగానూ వున్నట్లే. ఇదంతా ఇప్పుడు నేనైతే ఎట్లా వుంటుంది. అప్పుడు చెప్పటానికి ఏమీ వుండదు (Inexpressible). దానికి కారణం తానే ఆత్మ కాబట్టి. పరమాత్మ కాబట్టి, పరబ్రహ్మ కాబట్టి, అదే ఆత్మ సంస్థితా. ఆత్మను తెలుసుకోవటం జ్ఞానం. తెలుసుకునేవాడు జ్ఞాని. ఆత్మ తెలియబడేది కాదు. ఆత్మే తాను కావల్సిందే. అదే ఆత్మానుభవం.