ఆత్మీయ సోదరులు శ్రీ పి.యస్.ఆర్.గారితో నా అనుబంధం రమారమి 60 సంవత్సరముల నాటిది. నా విద్యార్థి దశలోనే వారితో పరిచయం ఏర్పడినది. ఆనాటి “అందరింటి” ఆవరణ ఒక సమష్టి కుటుంబ వాతావరణంలో కళకళలాడేది. మానవమాత్రులే కాక అన్యప్రాణులు కూడా అమ్మతో విశేషానుభూతి పొంది సంచరించేవి. దైనందిన కార్యక్రమాలలో వాటి పాత్రకూడా ఆసక్తి కరంగా ఉండేది. ఆ సహజమైన పవిత్ర వాతావరణంలో ఎవరు అడుగిడినా అంతులేని ఆనందం, అనుబంధం ఏర్పడేది.
శ్రీ పి.యస్.ఆర్. గారితో అత్యంత ఆత్మీయానుబంధం అమ్మ ప్రేరణతో ఏర్పడినదని నేను నమ్ముతున్నాను. నాన్నగారింట్లో వారొక కుటుంబ సభ్యునిగా మెదిలారు. 1968లో హైమ అక్కయ్య భౌతికంగా దూరమైన సంఘటన నా జీవితంలో మొదటి అత్యంత విషాదకరమైన ఘట్టం. ఆ సమయంలో శ్రీ పి.యస్.ఆర్.గారిని అమ్మ నాకు తోడు జేసింది. మేము కలిసి శ్రీ రమణాశ్రమం, అరవిందాశ్రమం, ఏర్పేడు శ్రీ వ్యాసాశ్రమం వెళ్ళాము. ఆ సమయంలో వారి సౌహార్ధపూరిత సంభాషణలు నాలో ధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని, కొంత ఉపశమనాన్ని కలిగించాయి. శ్రీ పి.యస్.ఆర్. గారు నా గుణగణాలు, నా మంచి చెడులు, స్థితిగతులతో నిమిత్తం లేకుండా నన్ను నన్నుగా ఆదరించి, అక్కున జేర్చుకొని అభిమానించారు. అమ్మ చెప్పిన “తృప్తే ముక్తి” అన్న వాక్యానికి నిలువెత్తు నిదర్శనం పి.యస్.ఆర్. గారు.
శ్రీ పి.యస్.ఆర్. గారి పూర్వీకులు ప్రసిద్ధి చెందిన పండితులు, కవులు. వారి తాతగారు నరసింహ కవి, తండ్రి పురుషోత్తమరాయ కవి, అవధాని. వారి సోదరులు శ్రీ ప్రసాదరాయకులపతిగారు (ప్రస్తుతం కుర్తాళం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు) ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పండితులు, మంత్రశాస్త్ర వేత్తలు. సహజంగానే శ్రీ పి.యస్.ఆర్.గారికి సాహిత్యానురక్తి, పాండితీ ప్రకర్ష కలిగినవి.
1960 లో అమ్మపాద సన్నిధిలో శ్రీ ప్రసాదరాయ కులపతిగారు కొన్ని గ్రంథాలు ఆవిష్కరణ చేశారు. ఆనాటి సభలో అందరికంటే చిన్నవాడైన శ్రీ పి.యస్.ఆర్. గారిపై అమ్మ దృష్టి పడింది. అమ్మ కోరిక మేరకు వారు తన రచనలను వినిపించారు. ఆ క్షణంలోనే వారిపై అమ్మ అనుగ్రహం కలిగి “ఈస్థాన కవి”గా ప్రకటించింది.
వారు అమ్మ జీవితచరిత్రను వేలాదిసార్లు పారాయణ చేయటమే కాక వందలాదిమందిచేత అనసూయావ్రతం చేయించారు. అమ్మ సూచనమేరకు కార్యనిర్వహణ సభ్యుడై సాహితీరంగంలోనే కాక సంస్థ పురోభివృద్ధికి తమవంతు కృషిచేశారు. “ధాన్యాభిషేకం” అను ప్రక్రియ వారికి అమ్మ ఇచ్చిన ప్రేరణ. అందుకు అనుగుణంగా నాన్నగారి ఆరాధనోత్సవం రోజున ధాన్యాభిషేకం నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొంటున్న అనేకమంది అమ్మ అనుగ్రహ పాత్రులు అవుతూ అమ్మ ప్రసాద వితరణకు, సంస్థ ఆర్థిక స్వావలంబనకు తోడ్పడుతున్నారు.
శ్రీ పి.యస్.ఆర్.గారు అమ్మను గూర్చి ఎన్నో వచన గేయాలు, వ్యాసాలు, పద్యాలు, పాటలు వ్రాసి అనేక పుస్తకాలు ప్రచురించారు. వారు వ్రాసి చదివిన వచన గేయాలు 1960-70 దశకంలో వచ్చిన అనేకమంది సోదరీసోదరులకు గొప్ప అనుభూతిగా మిగిలేవి. రచన ఎవరిదైనా శ్రీ పి.యస్.ఆర్. గారు చదివితేనే ఆ రచన రక్తి కట్టినట్లుగా గోచరించేది. అమ్మ స్పృహతో జీవితాన్ని గడుపుతున్నవారికి, అమ్మని భౌతికంగా చూడనివారికి వారి రచనలు స్ఫూర్తినిచ్చి ప్రభావితం చేసేవి. మేమిరువురం ఎన్నో మధురాతి మధురమైన సంఘటనలలో, సన్నివేశాలలో అమ్మతో కలిసి గడిపాము. అమ్మ అందుబాటులో లేనప్పుడు, విశ్రాంతి సమయాలలో శ్రీ పి.యస్.ఆర్.గారు తమ రచనలతో పాటుగా ప్రఖ్యాతిగాంచిన ప్రబంధకవుల కావ్యాలను చదివి వినిపించేవారు. “దేవుని గెలుపు” లాంటి ఛందోబద్ధం కాని వచన గేయాలు ఆయన చదువుతుంటే నాకు చాలా ఆసక్తి కలిగించేవి. శ్రీ పి.యస్.ఆర్.గారు “నీకు నచ్చిన, నీవు మెచ్చిన కవితా గుచ్ఛాన్ని నీకిచ్చుకుంటా” అంటూ “ఆనందనందనం” అనే పేరుతో అమ్మపై వ్రాసిన వచన కవితలు స్నేహపురస్సరంగా నాకు అంకితం ఇచ్చారు.
అమ్మను అత్యంత నిష్ఠతో సేవించి తరించిన పునీతులైన, భావితరాలకు స్ఫూర్తిదాతలైన ఎందరి గురించో “ధన్యజీవులు” అనే శీర్షికన ప్రచురించారు. వారి రచనలలో ‘విశ్వజనని జీవేశ్వర వైభవం’, ‘ఆనందలహరి’, ‘అనసూయేశ్వర కల్యాణం’, ‘విశ్వజననీ వీక్షణం’, ‘ఆదర్శమూర్తి-ఆచరణ స్ఫూర్తి
– జిల్లెళ్ళమూడి అమ్మ’, ‘అమ్మతో బంధాలు అనుబంధాలు’, ‘రాధాప్రణయ వల్లరి’, ‘శ్రీనాథ విజయం’ బహుళ జనాదరణ పొందినవి.
వారు వేలాది సాహిత్య సభలలో పాల్గొని, మన రాష్ట్రములోనేకాక దేశ వ్యాప్తంగా ఉన్న ఆంధ్ర ప్రజానీకానికి విప్లవకవిగా ప్రసిద్ధి చెందారు.
అమ్మ భౌతికంగా కనుమరుగవడానికి నిర్ణయించుకున్న వేళ ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని సూచనలను చేసింది. 1985 జూన్ 9వ తేదీ సాయంత్రం తన సమకాలీన చరిత్రను కలుపుకొని ఒక పారాయణ గ్రంథాన్ని వ్రాయగలిగితే వ్రాయమని సూచన చేసింది. అమ్మ సంకల్పానుసారం “ఆదర్శమూర్తి ఆచరణ స్ఫూర్తి” అనే గ్రంథాన్ని మనకు అందించారు.
అమ్మపట్ల అచంచల విశ్వాసంతో పాటు అందరింటి సోదరీసోదరులందరితో వారికి అత్యంత ఆత్మీయానుబంధం ఉంది. శ్రీ సుబ్బారావు అన్నయ్య అనారోగ్య కారణంగా శస్త్ర చికిత్స (operation) నిమిత్తం హాస్పిటల్ లో ఉన్నప్పుడు శ్రీ పి.యస్.ఆర్.. గారు వారికి భౌతికమైన సేవలు (even bedside assistance & care) అందించారు. ఇదే విధంగా జిల్లెళ్ళమూడి సోదరీసోదరులలో ఎవరైనా అనారోగ్య కారణంగా హస్పిటల్లో చికిత్స పొందుతున్నప్పుడు వారు బహుముఖంగా సేవలందించేవారు.
శ్రీ పి.యస్.ఆర్. గారు అమ్మను అనుక్షణం ఆరాధిస్తూ జీవితాన్ని అమ్మకు అంకితం చేసిన వారు. వారు ఈ విధంగా కోరుకున్నారు : “నిన్ను చూస్తూ, నీ మాటలు వింటూ, నిన్ను గూర్చి వ్రాసిన పాటలు వింటూ, నన్ను నేను మరచిపోతూ, నీ వాత్సల్య వర్షంలో తడిసిపోతూ, నీ ప్రేమ రసాంబుధిలో ఈతలు కొడుతూ, నీ కారుణ్య వీక్షణలో కరిగిపోతూ, నీ సేవలో నేను అంతిమ శ్వాస వదలాలని అర్థించాను”.
వారి చివరి క్షణాలలో కూడా అమ్మ ‘విశ్వజనని మాసపత్రిక’ని చూస్తూ, ధాన్యాభిషేక నిర్వహణ గురించి తన పిల్లలతో ముచ్చటించారు. అమ్మకు నన్ను స్వయంగా, తన పక్షాన నివేదన ఇవ్వమని మరో రెండు కోరికలు కోరారు. వారి కోరికలను తీర్చే అవకాశం, అనుగ్రహం ఇవ్వాలని అమ్మను ప్రార్థిస్తున్నాను.