1. Home
  2. Articles
  3. Viswajanani
  4. ఆత్మీయ నివాళి

ఆత్మీయ నివాళి

Bhattiprolu Lakshmi Suguna
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : December
Issue Number : 12
Year : 2013

సుమారు మూడు దశాబ్దాల కాలం జిల్లెళ్ళమూడి లోని మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా తమ సేవలు అందించిన శ్రీ ఐ. హనుమబాబుగారు 11.6.2013న అమ్మలో ఐక్యం చెందారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సంతాపసభలో మాస్టారి వ్యక్తిత్వాన్ని వారి సేవా తత్పరతను, అమ్మపట్ల వారికున్న అచంచల భక్తి విశ్వాసాలను గూర్చి శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ గారు, శ్రీరావూరి ప్రసాద్ గారు, శ్రీ నాదెండ్ల లక్ష్మణరావుగారు, డాక్టర్ జయంతి చక్రవర్తి వంటి పెద్దలు ప్రస్తావించారు.

అన్నపూర్ణాలయం ప్రస్తావన వచ్చినప్పుడుల్లా అమ్మ “వచ్చినవారికి ఆదరణంగా అన్నం పెట్టండి” అని చెబుతూ ఉండేది. అమ్మ మాటను వేదవాక్కుగా భావించి ఎన్నో దశాబ్దాల కాలం అన్నపూర్ణాలయంలో ఆప్యాయంగా పలుకరిస్తూ అందరినీ ఆదరించి అన్నం పెట్టడమే కాదు, ఎంతో బాధ్యతగా నాది అనుకొని పనిచేసిన వ్యక్తి భాగ్యమ్మక్కయ్య. విసుగు విరామం అనేది ఎరుగని వ్యక్తి ఆమె.

ముందుగా భాగ్యమ్మక్కయ్య జిల్లెళ్ళమూడి రావడం, ఆమె వెంట జిల్లెళ్ళమూడి వచ్చిన శ్రీ హనుమబాబుగారు ‘అమ్మను దర్శించి, అమ్మ వాత్సల్యామృతాన్ని చవి చూసి ఒక నిర్ణయానికి వచ్చారు. అమ్మ దగ్గర ఉండి సేవ చేసుకోవాలని. ఆ తరువాత జిల్లెళ్ళమూడినే తన నివాస కేంద్రంగా మార్చుకున్నారు. వారు ఒక వంక రేటూరు జిల్లా పరిషత్ హైస్కూలులో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తూ మరో వంక అన్నపూర్ణాలయంలో సేవలందిస్తూ వచ్చారు. 1977లో అమ్మ శ్రీ హనుమబాబుగారి దంపతులకు అన్నపూర్ణాలయం బాధ్యత పూర్తిగా అప్పగించింది. అమ్మ పట్ల అచంచల విశ్వాసంతో, అనన్య భక్తితో వీరు అమ్మకు ఎంతో ఇష్టమైన అన్నపూర్ణాలయ బాధ్యతను అసిధారవ్రతంగా నిర్వహించుకుటూవచ్చారు. 1980 లో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా చేరి, తమ పూర్తి సమయాన్ని అమ్మ సేవకే వినియోగించి, తమ జీవితాన్ని సార్ధకం చేసుకున్న ధన్యజీవులు శ్రీ హనుమబాబుగారు.

1992 నుంచి శ్రీ కొండముది రామకృష్ణన్నయ్య మాస్టారికి ఆలయాల బాధ్యతను అప్పగించారు. ఆనాటి నుండి 

ఎన్నో సంవత్సరాలు ఆలయాల్లో జరిగే పూజా కార్యక్రమాలను, లక్ష నామార్చనలను, ధనుర్మాసంలో తిరుప్పావై చదవడం మొదలుగా ఎన్నో విషయాలను ఎంతో సమర్థవంతంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించి “అర్చక” పదానికే వన్నె తెచ్చిన వ్యక్తి శ్రీ హను మబాబుగారు. అంతేకాక కోటి నామ పారాయణలో, ధాన్యాభిషేకంలో అమ్మ జన్మదినోత్సవం నాడు జరిగే అనసూయావ్రతం ఏర్పాట్లలో గాని, అమ్మ నామ సప్తాహాలలో గాని ప్రధాన భూమిక శ్రీ హనుమబాబు గారిది. తమ అనారోగ్యం కూడా లెక్కచేయక ఈ కార్యక్రమాలను చేయడం హనుమబాబు గారికే చెల్లింది.

ధాన్యాభిషేకానికి ముందుగా ఎంతో దూరప్రాంతాలకు కూడా వెళ్లి, ధనాన్ని సేకరించి తెచ్చి, ఆర్థికంగా తమ వంతు సహకారాన్ని అందించిన సేవాతత్పరులు మాస్టారు. అనేక గ్రామాల్లో, అనేక సందర్భాల్లో అమ్మ నామ సంకీర్తన ఏర్పాటు చేసి, అమ్మను గూర్చి అందరికీ తెలియజేస్తూ, అమ్మ తత్త్వప్రచార భాగంలో ప్రధానపాత్ర వహించారు మాస్టారు. అమ్మ చెప్పినట్లుగా కర్తవ్యమే దైవంగా భావించిన మాస్టారు కళాశాలలో అధ్యాపక వృత్తిని ఎంతో నిబద్ధతతో నిర్వహించి, కళాశాల పట్ల, విద్యార్థుల పట్ల వున్న మమకారంతో పదవీ విరమణ తర్వాత కూడ చివరి వరకు పాఠాలు చెప్పిన ఉత్తమ అధ్యాపకులు. అన్నింటిని మించి అనేక ఉత్సవాలలో అమ్మకు కిరీటధారణ చేసే అవకాశాన్ని పొందిన అదృష్టవంతులు మాస్టారు. అమ్మ పట్ల అచంచలమైన భక్తి, సేవాతత్పరత, కార్యనిర్వహణ సామర్థ్యం కలిగిన శ్రీ హనుమబాబుగారు సార్థక నామధేయులు. వారు భౌతికంగా లేకపోయినా అనేక కార్యక్రమాలలో అంతా తామే అయి వ్యవహరించడం వలన ఎప్పుడూ మన స్మృతిపథంలోనే ఉంటారు.

“సుగతిపథం” నిర్మాణానికి ఎంతో చొరవ చూపడమే గాక, జిల్లెళ్ళమూడిలోగాని, మరి ఏ ఊరిలోనైన అమ్మ బిడ్డలైన సోదరీసోదరులెందరికో అంతిమ సంస్కారాలను నిర్వికారంగా, నిశ్చలంగా చేయించిన వ్యక్తి శ్రీ హనుమబాబుగారు.

సాధారణంగా ఎవరైనా మరోజన్మవద్దు అనే అనుకుంటారు. కాని అమ్మ సేవ చేసుకోవడం కోసమే తాను మళ్లీ పుట్టాలని కోరుకుంటూ అమ్మ సేవలోనే తమ బ్రతుకును పండించుకున్న శ్రీ హనుమబాబుగారికి ఆత్మీయ నివాళి సమర్పిస్తూ……

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!