శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్ గారు మా కుటుంబానికి 1960 నుంచి బాగా సన్నిహితులు, ఆత్మీయులు. తొలుత అమ్మ సన్నిధిలో కలుసుకునే వాళ్ళం. నేను, మా బాబాయి శ్రీరామమూర్తి కలసి హిందూకాలేజిలో చదువుకుంటున్న రోజుల్లో సోదరులు శ్రీ పి.యన్.ఆర్. శ్రీ బ్రహ్మాండం సుబ్బారావు అన్నయ్యతో కలిసి వచ్చి మమ్మల్ని తరచు కలుసుకునే వారు.
అమ్మ సన్నిధిలో అంజనేయులు అన్నయ్య మేము కలిసి మెలసి పూజల్లో ఉత్సవాల్లో సభల్లో సమావేశాల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో అన్నింట్లో ఉత్సాహంగా పాల్గొనేవాళ్ళం. ముఖ్యంగా అనసూయా వ్రతాచరణలో అర్థవంతంగా, భావగాంభీర్యంతో, పూర్తిగా లీనమై హృదయంగమంగా చదివేవారు, ప్రేక్షకులను ముగ్ధుల్ని చేసేవారు. వ్రతం అంతా ఒక ఎత్తు, కథాశ్రవణం ఒక ఎత్తు.
అమ్మ అనుగ్రహం వలన వారి మదిలో కలిగిన సత్సంకల్పంతో శ్రీ నాన్నగారి ఆరాధనోత్సవం నాడు ధాన్యాభిషేక మహోత్సవానికి శ్రీకారం చుట్టారు. నేడు ఆ కార్యక్రమం విస్తరించి ఏటా నిర్విఘ్నంగా నిర్వహింప బడుతూ అన్నపూర్ణాలయ నిర్వహణకి ఒక మూలస్తంభంగా నిలిచింది.
‘మాతృశ్రీ’, ‘విశ్వజనని’ మాసపత్రికల సంపాద కీయాలను స్వీయ పాండిత్యగరిమతో, భక్తి ప్రపత్తులతో, సాధికారికంగా వ్రాసి పాఠకుల మనస్సులను అలరించారు. మొదట్లో ‘అమ్మ జన్మదినోత్సవ ప్రత్యేక సంచిక’లు వెలుగులోకి రావటానికి కారణం తెరవెనుక బ్రహ్మాండం సుబ్బారావు అన్నయ్య, పి.యస్.ఆర్. అన్నయ్యల కృషి గణనీయమైనది. ముందుగా సుబ్బారావు అన్నయ్యతోనూ, తర్వాత రవి అన్నయ్యతోనూ, క్రమేణ అమ్మ కుటుంబసభ్యులలో ఒకరై ఆత్మీయతానుబంధాన్ని పెంచుకున్నారు. చివరి వరకు రవి అన్నయ్య సలహా సంప్రదింపులు లేకుండా ఏ పనీ చేయలేదు.
‘Mother of All’ పత్రికలో అమ్మసేవకై తపించి, తరించిన భాగవతోత్తములు మాన్యసోదరీ సోదరుల అనుభవాలను, ఆరాధనను కళ్ళకి కట్టినట్లు, సవిస్తరంగా వివరిస్తూ ‘ధన్యజీవుల’నే శీర్షికను ప్రారంభించి ఒక్క చేత్తో పుంఖానుపుంఖాలుగా శ్రీ పి.యస్.ఆర్. అన్నయ్య వ్యాసాలు వ్రాసిన తీరు ఆదర్శప్రాయం, చిరస్మరణీయం.
అమ్మతో తమకు గల అపూర్వ అనుభవాలను భావితరాల లబ్ధికోసం గ్రంథస్థం చేసే సోదరీ సోదరుల గ్రంథాలనూ, అమ్మ దివ్యతత్వ ప్రచారానికి ప్రసారానికి కంకణం కట్టుకున్న రచన ఎవరిదైనా సరే తక్షణం ఆ గ్రంథాలపై సొంతరచనలు మాదిరి దృష్టి పెట్టి ప్రచురించడంలో పి.యస్.ఆర్. అన్నయ్య కృషిపరంగా ఆయనకు ఆయనే సాటి.
వారి జ్యేష్ఠకుమారుడు ప్రేమకుమార్, సహధర్మచారిణి శ్రీమతి గిరిబాల గారల మరణానంతరం ఎంతో బాధను దిగమ్రింగి నిలదొక్కుకుని మునుపటి సేవాతత్పరతతో అమ్మ సేవకు అంకితం కావటం వారి విశిష్ట వ్యక్తిత్వానికి ఒక మేటి ఉదాహరణ.
వారికి ఆసన్నకాలం సమీపిస్తున్నదని తెలిసి తన జవసత్వాలు క్షీణిస్తున్నా లక్ష్యపెట్టక మొక్కవోని దీక్షతో సో. శ్రీరావూరి ప్రసాద్కి, శ్రీమతి వసుంధర అక్కయ్యకు తాను సంకల్పించిన భాగవత సమ్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించటం మరపురానిది, అమూల్యము.
కొందరు జనాభా లెక్కల జాబితాలోనే కనిపిస్తారు. పి.యస్.ఆర్. అన్నయ్య వంటి వారు పరమపదాన్ని చేరుకున్నా వారి అసంఖ్యాక రచనల్లో, అకుంఠితమైన సేవల్లో అమరులై ఉంటారు; యువతకు మార్గదర్శనం చేస్తూనే ఉంటారు; ప్రేమ-త్యాగం అనే పదాలకు మరోపేరుగా హృదయాంతరాళాల్లో జ్ఞప్తికి వస్తూనే ఉంటారు.
అమ్మ అనుంగుబిడ్డ, బహుముఖప్రజ్ఞాశాలి, నిగర్వి, అజాతశత్రువు అయిన ఆత్మీయ సోదరుడు ఆంజనేయులు అన్నయ్యకి ఇదే అశ్రునివాళి.