సో.శ్రీ ఆంజనేయప్రసాద్ గారు అమ్మలో ఐక్యమైనారనే వార్త దిగ్భ్రాంతి కలిగించింది. వారితో మా అనుబంధము 50 ఏళ్ళు. మాజేటి గురవయ్య హైస్కూలులో వారు పనిచేయునపుడు మా అన్నగారు జగన్నాథరావుగారు ప్రధానోపాధ్యాయులు. ఆ రోజుల్లో నేను తరచు పాఠశాలకు వెళ్ళుతూ వారిని కలుసుకునే వాడిని. నేను పూర్వవిద్యార్థి సంఘ అధ్యక్షునిగా ఉన్నపుడు వారు నాకు ఎంతగానో సహాయసహకారాల్ని అందించారు.
తరువాత ‘అమ్మ’తో అనుబంధం ఏర్పడిన తర్వాత మా ఇరువురి ఆత్మీయత మరీ బలపడింది. అమ్మ ఆలయప్రవేశానంతరము గుంటూరులో మేము ప్రేమార్చన కార్యక్రమములు నిర్వహించాము. వారు మా వెన్నంటి ఉండి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తదుపరి గుంటూరులో మాతృశ్రీ అధ్యయన పరిషత్ ఏర్పాటు చేయటంలో ప్రముఖపాత్ర వహించారు. శ్రీరామరాజు కృష్ణమూర్తి గారి భవనంలో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమములతో పాటు అమ్మ తత్త్వ ప్రచారము చేసేవారు. గుంటూరులో ‘అమ్మ ఆలయ నిర్మాణం’ చేయవలెనని వారు ఎంతగానో శ్రమించారు, కానీ వారి కోరిక సాకారం కాలేదు.
1995లో నా షష్ట్యబ్దిపూర్తి ఉత్సవాన్ని శ్రీ విశ్వయోగి విశ్వంజీ గారి సన్నిధిలో నిర్వహించారు; ఒక ‘అభినందన సంచిక’ను ప్రచురించి వైభవంగా కార్యక్రమాల్ని నిర్వహించారు.
ప్రతి సంవత్సరము గుంటూరు కాళీ పీఠంలోనూ, హైదరాబాదు ప్రత్యంగిరా మందిరంలోనూ మా నాన్నగారి పేర పురస్కార ప్రదాన కార్యక్రమాల్లో నాకు కుడిభుజంగా నిలిచేవారు. ఒకసారి మా స్వగృహంలో శ్రీ కుర్తాళం పీఠాధిపతులకు పాదపూజ నిర్వహించుకోవడంలో దగ్గరుండి స్వయంగా సహకరించారు. 2018లో నా ‘సహస్ర చంద్రదర్శన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు. అడుగడుగునా ఆత్మీయసోదరునిగ నాకు తోడునీడగా నిలిచిన శ్రీ పి.యస్.ఆర్. గారికిదే అశ్రునివాళి. తనలో ఐక్యం చేసుకున్న అమ్మ శ్రీ చరణాలకు శత సహస్రాధిక వందనములు.
శ్రీ హైమవతీదేవి ప్రార్థన
మాతృశ్రీ ప్రతిరూప దివ్యవిభవాం మాధుర్యవాగ్వైభవాం
కల్లోలాన్విత సర్వసోదర మనస్సౌజన్య శాంతిప్రదాం
సంగీతప్రియ సాహితీప్రియ మహద్గీర్వాణ వాణీప్రియాం
దేవీం హైమవతీశ్వరీం హృదిభజే కారుణ్యవారాన్నిధిం
– శ్రీ పి.యస్.ఆర్