ఉపాసన అనగా సమీపమునకు చేర్చుట అని అర్థం. ఆత్మ దగ్గరకు చేర్చడమే ఆత్మోపాసన. ఎవరిని దగ్గర చేర్చాలి? మనస్సును, మనస్సును ఆత్మ సమీపమునకు చేరుతుంది. భృకుటిలో మనస్సును నిల్పి శ్వాసను గమనించినట్లయితే, సహస్రారంలో ఇది లగ్నమౌతుంది. దీనిని ఆత్మోపాసన లేక బ్రహోపాసన అని పిలువవచ్చును. అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మనై వున్నాను. అనగా అన్ని నేనులు నేనైన నేను. అంతటా తనలో నున్న నేనుగా గ్రహించడమే. దీనిని అక్షర పరబ్రహ్మయైన ఓంకారముతో కూడా జరుపవచ్చును. అకార ఉకారములతో కలిపి “మ్”కారంతో అంతము చేస్తే శబ్దబ్రహ్మము దాని పరాకాష్ట అయిన నిశ్శబ్దములో అనగా పరాకాశములో లయించును. ఇది ప్రాణాయాన సమయములో జరుగటం విశేషం.
ఒకసారి మా తాతగారైన రుద్రవరపు ముక్తేశ్వరరావ్ గారు రాంభొట్లవారిపాలెంలో ఉపాధ్యాయుడుగా పని చేస్తూ ఎండాకాలము మధ్యాహ్న సమయములో వారి ఇంట్లో భోజనం చేసి మంచం మీద పడుకున్నారు. ఒకసారిగా తను లేచి భార్యను పిలిచి బజారులో పోతున్న ఒక నలుగురిని లోపలకు రమ్మనమని పిలువమన్నారు. తను ఆమెను పిలిచి ఒక చాప మంచం పక్కగా వేయమన్నారు. చాప ఆమె వేసింది. ఇంతలో పిల్చిన ఆ నలుగురు లోపలకువచ్చి ఏమండి మాస్టరుగారు మమ్మలను పిలిచారట. ఎందుకు ? అని అడిగారు దానికి ఆయన వారిని తనను నలుగురు పట్టి చాపమీద పడుకోబెట్టబని ఆజ్ఞాపించినట్లుగా కోరారు. అట్లాగే వారు ఆయనను మంచం మీద నుండి ఎత్తి చాపపై పడుకోపెట్టారు. ఆయన వరుసగా మూడుసార్లు ఓంకారం చేస్తూ చివరకు తన ప్రాణమును అనంత ఆకాశంలోకి వదిలారు. ఈ చోద్యం చూస్తున్నవారంతా ఈ పరమాత్మ చర్యకు విస్తుపోయారు. ఒకసారి నేను హైద్రాబాదు నుండి బస్సులో బయలుదేరినప్పుడు అక్కడున్న సోదరులందరూ అమ్మకు వారి వారి నమస్కారములు చెప్పమని కోరారు. నేను జిల్లెళ్ళమూడి వెళ్ళి ఈ విషయం అమ్మతో ప్రస్తావించగా అమ్మ అవి అన్నీ ఎప్పుడో చేరాయి నీవే లేటుగా వచ్చావు అని అన్నారు. అంటే వారు సంకల్పించినప్పుడు అన్నీ తానైన అమ్మకు అవి చేరాయి అనటంలో అంతటాయున్న నేను సంకల్పించినప్పుడే నాకు చేరాయి. అనగా అన్ని సంకల్పాలు వాడివే కనుక సంకల్పమే భగవంతుడు భగవంతుడెవరో కాదు “నేనే” అని గ్రహించడమే ఆత్మోపాసన అవుతుంది.
మరియొకసారి మహన్యాసపూర్వక రుద్రాభిషేకము చేస్తున్నప్పుడు సాక్షాత్తు రుద్రుడు తనే అనేభావంతో లేక అనుభూతితో అభిషేకం చేస్తే ఆ ఋక్కుల శబ్దంతో ఏకీకరణ చెందిన మనస్సు ఆ అభిషేకం ఆకారుడు, నిరాకారుడు అయిన శివునికే కాక సాక్షాత్తు తన శిరోభాగమునకు చేసినట్లుగా చల్లగా చన్నీటితో తలమీద స్నానం చేసినట్లుగా నాకు అనుభూతి కల్గింది. దానికి కారణం తన మనస్సును ఆ శబ్ద తరంగాలతో ఏకీకరణ గావించడమే ఆ మనో ఏకీకరణకు అంత శక్తి ఉన్నది. ఇది నా స్వానుభవం. రుద్రుడు అన్యుడు కాడు. సాక్షాత్తు తనే అనగా “అన్ని నేనులు నేనైన నేను”. అమ్మ “నాకు అది తప్ప నాకేమీ కనిపించడం లేదు నాన్నా” అంటుంది. అన్నప్పుడు అమ్మ – “అది వేరుగా వున్నట్లే అమ్మే అదైతే వేరే కనిపించేది ఏదీ లేదు. ప్రసంగవశాన అమ్మ అంది “లడ్డు కావటం కంటే లడ్డు తినటంలోనే ఆనందం వున్నది” అని అంటే అమ్మ ఒకటిగా వుంటూ రెండుగా అవటం అంటే సృష్టి, స్థితి, లయకారిణిగా వుంటూనే తాను సృష్టిగా వుండటమే భగవత్ లీల. నేను నేనుగా వుంటూ అన్ని నేనులుగా వుండటమే సృష్టి రహస్యం. ఎప్పుడైతే సృష్టి వున్నదో అప్పుడే ద్వంద్వాలు వుంటాయి. అందుకే ద్వంద్వాలూ బ్రహ్మమే. మనస్సు బ్రహ్మమే, ప్రాణం బ్రహ్మమే అని తెలుసుకోవడమే బ్రహ్మోపాసన.