1. Home
  2. Articles
  3. Viswajanani
  4. ఆదర్శగృహిణి – అమ్మ

ఆదర్శగృహిణి – అమ్మ

Bhattiprolu Lakshmi Suguna
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 11
Month : May
Issue Number : 10
Year : 2012

‘నా జీవితమే సందేశం’ అని చెప్పిన అమ్మ వైవాహిక జీవితాన్ని పరిశీలిస్తే, వివాహవ్యవస్థలో కనుమరుగైపోతున్న విలువలను పరిరక్షించడం కోసం, వైవాహిక బంధంలో ఉన్న పరమార్థాన్ని బోధించడం కోసమే అమ్మ వివాహం చేసుకున్నదనిపిస్తుంది.

‘సాధ్యమైనదే సాధన’ అని చెప్పిన అమ్మ వివాహాన్నే ఒక సాధనగా తీసుకున్నదేమో అనిపిస్తుంది. తాను అసాధారణ స్థితిలో ఉన్నప్పటికీ సాధారణ వ్యక్తులవలెనే వివాహం చేసుకున్నది. ఇల్లాలుగా, కోడలుగా, తల్లిగా అనేక భూమికల్లో తన కర్తవ్యాన్ని ఎంతో సహనంతో నిర్వర్తించింది.

గృహస్థాశ్రమ ధర్మరక్షణకు కేంద్రబిందువు గృహిణి. అందుకే మన సంప్రదాయంలో వివాహం చేసుకుని భర్త ఇంట అడుగు పెట్టిన స్త్రీకి సహధర్మచారిణి అనే పేరు వచ్చింది. గృహస్థాశ్రమంలో స్త్రీ ఇల్లాలుగా, అర్థాంగిగా, సహధర్మచారిణిగా, సఖిగా, భార్యగా కర్తవ్యాన్ని నిర్వహిస్తూ తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటుంది. అమ్మ గృహిణీ ధర్మాలను నిర్వచించడమే గాక తాను ఆచరించి ఆదర్శగృహిణిగా లోకానికి ఆరాధ్య అయింది. లోకంలో ఆదర్శగృహిణి అంటే భర్తనే దైవంగా భావిస్తూ, భర్త భావాన్ని తెలుసుకుని ప్రవర్తిస్తూ ఆ సేవలో తరించడం. ఇది ఒక మార్గం. కానీ అమ్మ ఆదర్శం ఆ పరిధిలోనే ఆగిపోక ఒక ఉన్నత లక్ష్యం వైపుగా సాగింది. ‘పాతివ్రత్యానికి చరమదశ భర్త భార్యను అమ్మా అని పిలవడం’ అన్నది అమ్మ వాక్యం. ఇది విన్నవాళ్లను ఆశ్చర్యచకితులను చేయవచ్చు. ఆచరణ సాధ్యమా అన్పించవచ్చు. కానీ అమ్మ అన్నింటికీ సరే మంత్రాన్ని పాటిస్తాను అని సరే మంత్రాన్ని జపించి నాన్నగారిని అనుసరించి తన విశ్వమాతృత్వ నేపధ్యంగా ఆచరణ సాధ్యమే అని నిరూపించింది.

అమ్మ సరే మంత్రాన్ని ప్రతిపాదించడంలో గృహిణులందరికీ ఒక సాధనా క్రమాన్ని ప్రబోధించడమే లక్ష్యంగా కన్పిస్తుంది. ప్రతి గృహిణి ముందు సరే అనడం మొదలు పెడితే కొంతకాలానికి మనస్సుకు సరే అన్పిస్తుంది. ఆలా అన్పించడం వలన క్రమంగా భర్త ఇష్టానిష్టాలే తనవిగా అవుతాయి. ఆ క్రమంలో అద్వైత భావన కల్గి అభేద స్థితికి దారితీస్తుంది. గృహిణులందరికీ ఈ స్థితిని ప్రసాదించడానికే ఆచరణాత్మకమయిన ప్రబోధం కోసం అమ్మ వైవాహిక జీవితాన్ని ఆరంభించింది.

మానవ మనస్తత్వాలలో ఉన్న తేడాలను గమనించిగానీ, లేక కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా గానీ, అమ్మలోని ప్రత్యేకత గుర్తించినందువల్లగానీ వివాహ విషయంలో అమ్మ తాతగారు చిదంబరరావుగారు అమ్మలో ‘చూడగా చూడగా అగ్నిగుండంలో దూకబోతున్నట్లుగా ఉన్నదమ్మా’ అన్నారు. అప్పుడు అమ్మ ‘ఒక చోట ఉంటే గదా దూకడానికి. నా బాటే నిప్పుల బాట. ఆ బాటలో నడక సాగించబోతున్నాను. ఆరని అగ్నిగుండంలో పడి తీరని వ్యధలో చిక్కి తియ్యగా అనుభవిస్తూ సరే మంత్రంతో జీవించాలి’ అన్నది. మరొకసారి అమ్మ మీద ఉన్న ఆత్మీయతతో కోరి కష్టాలు వరిస్తుందనే భయంతో ‘నీకీ పెళ్ళి ఎందుకమ్మా’ అని తాతగారు అడిగితే ‘లోకంలో ఉన్న కష్టాలన్నింటినీ భరిస్తూ సంసార జీవనం ఎలా సాగించాలో లోకానికి నేర్పడం కోసమేననీ, అన్ని అనుభవిస్తూ ఏదీ మనసుకు అంటకుండా ఉండడం సాధ్యమేనని నిరూపించడానికే’నని చెప్పింది. చెప్పినట్లుగానే జీవితంలో సుఖదుఃఖాల ఉభయపార్శ్వాలనూ చవి చూసింది. ఎవరు ఎట్లా తనను చూసినా, తన పట్ల ఎలా ప్రవర్తించినా భూదేవంత సహనాన్ని ప్రదర్శించింది.

ఉన్నతమైన శిఖరాలు ఉన్నచోటనే లోతైన లోయలూ ఉంటాయి. వెలుగులు వెదజల్లే దీపం చుట్టూ క్రీనీడలు తప్పనట్లు లోకానికి ఆనందాన్ని పంచి ఇచ్చే అమ్మ జీవితంలో కూడ బాధా పరిష్వంగాలు తప్పలేదు. నిత్యసమరంలా సాగిన ఆ సంఘటనలలో అమ్మ జీవితపు లోతుపాతులను తెలుసుకున్న శ్రీ మన్నవ బుచ్చిరాజు శర్మగారు (రాజు బావ) అమ్మను సహనదేవతగా ఆరాధించారు. ‘బాధలే భగవంతుడని, సహనమనే దేవతను ఆరాధించాలంటే బాధలనే పూజాద్రవ్యాలు కావాలి’ అని చెప్పిన అమ్మ ఎన్నో బాధలనే పూజాద్రవ్యాలతో సహనదేవతను ఆరాధించింది.

‘హృదయమున బడబానలము

మౌళిమీదను మంచుకుండలు

ఏలనో అవనీమతల్లీ – పాడుటకు నోరాడదమ్మా

 అమ్మ కథే అవనిగాథా -అవనే అనసూయమ్మ కాదా’ అంటూ అమ్మకు అవనికి అభేదాన్ని వర్ణించారు బుచ్చిరాజు శర్మగారు. విరుద్ధరస సంగమంలా సాగిన అమ్మ జీవితాన్ని చూసి విభ్రమానికి లోనై (వింతైన ఇతి హాసం – పెనుగాలిలో దీప నివాసం’ అని వ్రాసిన ఈ పాట సహనదేవత సహనానికే పరీక్ష ఎదురయిన ఉద్వేగభరిత సన్నివేశాలను స్మరింపచేస్తుంది. ఎన్ని అగ్నిపరీక్షలు ఎదురయినా అమ్మ మాత్రం నిర్వికారంగా నిర్వికల్పంగానే ఉన్నది. ‘సర్వకాల సర్వావస్థల యందు సమానమైన స్థితిలో ఉండడమే సమాధి’ అని చెప్పిన అమ్మ తాను ఆ స్థితిలోనే ఉండేది.

 అమ్మ జీవితంలోని కొన్ని ఘట్టాలను పరిశీలిస్తే ‘కులధర్మపత్నీ ధర్మాలలో ‘క్షమయాధరిత్రీ’ అన్న మాట గుర్తుకు వస్తుంది. ‘తనకంటూ ఏ ఇష్టాలు లేకుండా ఒకరి ఇష్టాన్ని తన ఇష్టంగా చేసికొనడమే సహనమని’ చెప్పి ఆచరించి చూపింది అమ్మ. అంతేకాదు వైవాహిక జీవితంలో కష్టాలు ఎదురయితే అవి నీ సహనానికి శిక్షణగా భావించు. నీవు పసిబిడ్డను సాకేటప్పుడు బాలకృష్ణుడనే దృష్టితో చూడు. ఆ దృక్పథంతోనే పెంచు. ఆ విధంగా గృహస్థ జీవితమంతా అనితరమైన, విశుద్ధమైన సాధనగా మారుతుంది అని ప్రబోధించింది. ‘సంసారంలో ఉండి సాధన చేయడం కోటలో ఉండి యుద్ధం చేయడం అనీ చేసేదంతా భగవత్సేవే అనుకుంటే సంసారం ఆధ్యాత్మిక చింతనకడ్డుకాదనీ వివాహాన్నే తరణోపాయంగా చూపింది..

దీనికి ఉదాహరణగా అత్రిమహర్షి భార్య అనసూయకథను తీసుకోవచ్చు. ఆమె తన పాతివ్రత్య ప్రభావంతో త్రిమూర్తులనే పసిబిడ్డలుగా చేసి లాలించింది. అంతేకాదు పది సంవత్సరాలు అనావృష్టితో తపించిన లోకంలో గంగానదిని ప్రవహింప చేసింది. కందమూలాదులను సృష్టించి దుర్భిక్షంతో బాధపడుతున్న లోకాన్ని కాపాడిన మహాసాధ్వి. దేవకార్య నిమిత్తమై పదిరాత్రులను ఒకే రాత్రిగా మార్చగలిగిన మహా మహిమాన్విత’. అలాగే సుమతి భర్త ప్రాణాలు దక్కించుకోవడం కోసం పాతివ్రత్య మహిమతో సూర్యగమనాన్నే ఆపివేసింది. ఈ విధంగా విభిన్న మార్గాలు, విభిన్న మనస్తత్వాలు కలిగిన ఎందరో పతివ్రతలు పతివ్రతాంగనాభీష్ట ఫలదాయిని అయిన జగన్మాత అనుగ్రహంతో ఎన్నో అద్భుత శక్తులు పొంది అసాధ్యాలను సుసాధ్యాలుగా చేసి తమకంటూ ఒక ప్రత్యేక చరిత్రను సృష్టించుకున్నారు. మరి అటువంటి వారు పురాణాలకే పరిమితమా! వాస్తవ జగత్తులో ఎక్కడయినా, ఎవరయినా ఉన్నారా అని పరిశీలిస్తే ప్రత్యక్ష నిదర్శనంగా, అమ్మ కన్పిస్తుంది. ఏ విషయం ప్రబోధించాలన్నా మనలో ఒకరిగా మనతో పాటు ఉంటే గాని మనం అర్థం చేసుకోలేం.అందుకనే పతివ్రత అంటే ఇలా ఉంటుంది అని లోకానికి దర్శింపచేయడం కోసమే ఆ పరాశక్తి అమ్మగా భూమిపై అవతరించింది. అమ్మ జీవితంలో పంచభూతాలను స్వాధీనం చేసుకున్న సంఘటనలు అనేకం కన్పిస్తాయి. పాతివ్రత్యపు పరాకాష్ఠ స్థితి అమ్మలో గమనించవచ్చు.

సనాతనంగా వస్తున్న కొన్ని ధర్మాలపట్ల సంప్రదాయాలపట్ల నేడు చాలా మంది చిన్నచూపు. అవన్నీ చాదస్తానికి ప్రతీకలుగా భావిస్తారు. అలాంటి వాటిలో ముఖ్యంగా పాతివ్రత్యం ఒకటి. ఈనాటి మహిళలు భర్తను జీవితంలో అవసరమైన ముఖ్య స్నేహితునిగా చూస్తున్నారే తప్ప దైవస్వరూపంగా పూజించడం అంటే వింతగా చూస్తారు. కానీ ఏవిషయాన్నయినా లోతుగా ఆలోచిస్తే అందులోని ఔన్నత్యం అవగతమవుతుంది. అమ్మ జీవితాన్ని పరిశీలిస్తే – నేటి మహిళాలోకానికి పాతివ్రత్యం అంటే ఏమిటో ఆచరించి చూపడానికే అమ్మ వివాహం చేసుకున్నట్లుగా కన్పిస్తుంది. సంసార యజ్ఞాన్ని సంరక్షించేది గృహిణే. కుటుంబంలో గృహిణి స్థానం తల్లి వేరు లాంటిది. ఆ తల్లి వేరే లేకపోతే ఎన్ని ఆకులు, ఎన్ని కొమ్మలు ఉన్నా ఆ చెట్టుకు ఉనికి ఉండదు. వివాహం అంటేనే భిన్న వ్యక్తులు, భిన్న పరిస్థితులు, భిన్న అభిరుచులు, అలవాట్లతో కలిసి జీవించాలి. దీనికి ఎంతో సహనం, సర్దుబాటు మనస్తత్వం కావాలి. భార్యాభర్తల మధ్య సమన్వయ ధోరణికావాలి. సమన్వయం లేకపోతే సంఘర్షణ తప్పదు అందుకే అమ్మ భావం తెలుసుకుని ప్రవర్తించమని బోధిస్తూ సరే మంత్రాన్ని జపించి భర్తను ఎలా అనుసరించవచ్చో ఆచరణాత్మకంగా ప్రబోధించింది.

అమ్మ దృష్టిలో భర్త అంటే భగవంతుడే. అందుకే పెండ్లి అనే పదాన్ని ‘ఒక పెన్నిధి అండన చేరడమే పెండ్లి’ అనీ ‘పెనిమిటే పెన్నిధి, అనీ, ‘పెన్నిధంటే దైవసన్నిధి’ అని నిర్వచించింది. ఒక సోదరి ‘భర్తే దైవం’ అంటారుగా అమ్మా అంటే, అనుకోవాల్సింది ఏమున్నదమ్మా కాకపోతేగా! అనుకోవడం అంటే ఏదో తెచ్చిపెట్టుకున్నట్లుగానే ఉంటుంది అన్నది అమ్మ. అమ్మమాటలన్నీ అమ్మ అనుభవంలోంచి వచ్చినవే. భర్తే దైవం అనడమే కాదు నాన్నగారినే దైవంగా ఆరాధించింది. ఒకసారి అమ్మ ఏదో ఆలోచిస్తూ ఉన్నట్లు కన్పిస్తే ఒక సోదరుడు పరధ్యాసగా ఉన్నావేంటమ్మా’ అంటే ‘పరధ్యాసకాదునాన్నా ! పతిధ్యాస’ అని చమత్కరించిన అమ్మకు నాన్నగారి ధ్యాసే ధ్యానం. అందుకే ఆయన పాదాల చప్పుడు నిరంతరం అమ్మ మనస్సులో మెదులుతూ ఉండేది. నాన్నగారు వచ్చినట్లున్నారు చూడండి అని అమ్మ అన్న మరుక్షణంలో నాన్నగారు అక్కడికి వచ్చేవారు. నీకెట్లా తెలుసమ్మా అంటే మరచిపోతేగా ఎపుడూ ఆ ధ్యాస ఉంటూనే ఉంటుంది అనేది అమ్మ.

‘నాజీవితమే సందేశం’ అని చెప్పిన అమ్మజీవితం ఆదర్శానికీ, ఆచరణకూ మధ్య సమన్వయాన్ని అందిస్తూ మనకు దర్పణమై నిలుస్తోంది. ఒక ఆదర్శం ఎదురుగా ఉన్నప్పుడు మనిషి ప్రవర్తనలో పరివర్తన వచ్చే అవకాశం ఎంతో ఉంటుంది. ‘అద్వైతం సుఖదుఃఖయోః’ అన్న దాంపత్య ధర్మం రక్షింపబడాలన్నా మన ఆర్ష సంప్రదాయం ఏం ఉద్దేశించిందో అటువంటి ఆదర్శ సమాజం ఏర్పడ్డాలన్నా అమ్మ జీవితమే మనకు ఆదర్శం. అమ్మ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని అదే ఒరవడిలో ముందుకు సాగితే అమ్మ ఏ పరమార్థాన్ని బోధించడం కోసం వివాహం చేసుకున్నదో ఆ ప్రయోజనం నెరవేరుతుంది.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!