“ధన్యా స్తే భవ దీక్షణ క్షణ గతేః పాత్రీకృతాః స్వీకృతాః”
– ఈశ్వరానుగ్రహానికి పాత్రులై తనవారుగా భగవంతునిచే స్వీకరింపబడినవారు ధన్యులు – అని శ్రీ శంకరులు విస్పష్టంగా ప్రకటించారు. అట్టివారు రెండు విధాలుగా కనిపిస్తారు. మొదటి తెగవారిని దైవం తనంతట తానుగా వెతుక్కుంటూ వచ్చి పవిత్రమూర్తులను ఉద్ధరిస్తే, రెండవ తెగవారు ఈశ్వరానుగ్రహం కోరి తపిస్తూ అంచెలంచెలుగా ఎదిగి పరమపదభాగ్యాన్ని పొందుతారు.
కాగా, మొదటి కోవకు చెందిన ఆదర్శ గృహిణి శ్రీమతి సుశీల అక్కయ్య. ఆమె శ్రీ కొండముది రామ్మూర్తి గారి ధర్మపత్ని. శ్రీరామ్మూర్తి గారు అందరింటి సభ్యులందరికీ సుపరిచితులే; ఆయన శ్రీ విశ్వజననీ పరిషత్ స్థానిక కార్యదరిగా చిరకాలం సమర్థవంతమైన సేవలనందించారు కనుక.
1962లో ఆ దంపతులు మద్రాసులో ఉండేవారు. అక్కయ్య అమ్మను గురించి విన్నారు కానీ అతఃపూర్వం దర్శించి యుండలేదు. రామ్మూర్తి గారు 1957-58 ప్రాంతంనుండీ జిల్లెళ్ళమూడి వచ్చి వెడుతుండే వారు. అమ్మ మద్రాసు పర్యటనకు వెళ్ళిన సమయంలో – ఒకనాడు నేరుగా అమ్మ తనంతట తాను వారింటికి వచ్చింది. ఆమె ఆనందానికి, ఆశ్చర్యానికి హద్దులు లేవు. “స్నానం చేస్తాను” అన్నది అమ్మ స్వతంత్రంగా. వారుంటున్న ఇల్లు చిన్నది; కానీ, వారి పెద్ద మనస్సును చూచి అమ్మ వచ్చింది. అమ్మ స్నానం కాగానే ఆ దంపతులు తృప్తిగా అమ్మను పూజించుకున్నారు. తదుపరి అమ్మ జన్మదినోత్సవం, దసరా పూజలు వంటి ఉత్సవాల్లో వచ్చి అమ్మ దర్శనం చేసుకునేది అక్కయ్య.
అట్టి సందర్భంలో ఒకనాడు కొందరు సోదరీలు అమ్మ సన్నిధిలో ‘సంకల్ప మేమిటో, అమ్మా!’ అనే పాట పాడారుట. అప్పుడు అమ్మ ‘నాకు ఇప్పుడు ఏమీ సంకల్పం లేదు’ అన్నదిట. ‘సకల జీవాళిని తరింప చేయాలి, ఉద్ధరించాలి’ అని సంకల్పించుకుని అవతరించిన తర్వాత ఇక అమ్మకి వేరొక సంకల్పం ఏముంటుంది? సుశీల అక్కయ్య జిల్లెళ్ళమూడి వెళ్ళినపుడల్లా ఆమెను అమ్మ ఎప్పుడూ ఒక ప్రశ్న వేసేది – “అబ్బాయి (నీభర్త) ఎప్పుడు Retire అవుతాడు? అని. ‘ఎందుకమ్మా?’ అని ఆమె అడిగింది. “ఇక్కడ ఒక పది రూపాయలు ఉంటే, దాన్ని సక్రమంగా వినియోగించాలి. అందుకని వాడు ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను” అని తన మదిలో మాటను బయట పెట్టింది.
Retire అయిన తర్వాత అమ్మ మాటను వేదవాక్యంగా శిరసావహించి శ్రీరామ్మూర్తి గారు సుమారు ఎనిమిది సంవత్సరాలు SVJP కార్యాలయంలో కార్యదర్శిగా ఉత్తమ సేవలనందించారు.
అసలు ముక్క – మరొకటి. శ్రీమతి సుశీలక్కయ్య ఇల్లు, పిల్లలను చూసుకుంటూ ఉంది. ఆ . సందర్భాన్ని పురస్కరించుకుని అమ్మ “నువ్వు ఇల్లు చూసుకుంటున్నావు కాబట్టి వాడు (నీభర్త) ఇక్కడ ఉండగలుగుతున్నాడు”. అనేది. అది ఆమెకి మహదవకాశం, జగన్మాతృ మహదాశీర్వచనం కదా!
వాస్తవం ఏమంటే – ‘సహధర్మ చారిణి’ అంటే భౌతికంగా భర్తను ఆశ్రయించి తోడుగా, నీడగా ఉండటం; అంతకు మించిన పరమధర్మం వేరొకటి ఉంది. భౌతికంగా భర్తకు దూరంగా ఉంటున్నా – భర్త ఆశయాలకు, విలువలకు, ధర్మాచరణకు త్రికరణ శుద్ధిగా దన్నుగా నిలిస్తూ జీవించడం. సీతాదేవి త్రికరణశు ద్ధిగా శ్రీరామచంద్ర మూర్తిని ఉపవసిస్తే, ఊర్మిళా సాధ్వి లక్ష్మణస్వామిని ఉపాసించింది. రెండూ మహనీయ పాతివ్రత్య ధర్మాలే, ఆర్యనారీ శ్రేష్ఠతమ స్వభావాలే. ఈ సద్గుణ సౌశీల్యాన్ని సుశీలక్కయ్య నుంచి నేర్చుకోవాల్సిందే. పోతన గారు ఉద్బోధించిన ‘నీ పాదకమల సేవ’ అనే భాగవత తత్వానికి అ అసలు సిసలైన అర్థం ఇదే.
ఆ భార్యాభర్తల చక్కని సంస్కారం – సేవాతత్పరత చూసి ముగ్ధురాలై అమ్మ స్వయంగా వారింటికి వెళ్ళింది. అట్టి సద్గుణరాశి, ఆదర్శ గృహిణి శ్రీమతి కొండముది సుశీలక్కయ్య 29-07-2023న అమ్మలో ఐక్యమైంది.
ఆత్మీయ సోదరికి ఇదే సాశ్రునివాళి.
– సంపాదక మండలి
(రచన : ఎ.వి.అర్.సుబ్రహ్మణ్యం)